Menu

స్వర్ణకమలం – రెండో భాగం

ఇదివరలో రాసిన వ్యాసానికి కొనసాగింపని చెప్పలేను కానీ, ఇది కూడా స్వర్ణకమలం గురించి నా అభిప్రాయాలను పంచుకునే వ్యాసమే. కానీ, సంగీత-సాహిత్యాల గురించి మాత్రమే సుమా! నవతరంగం లో సినిమాలోని ఈ భాగాల గురించి వ్యాసాలు చాలా తక్కువ వస్తాయి, ఎందుకో గానీ. సరే, ఈ పిడకల వేట ఆపేస్తే, సినిమా పరంగా చూస్తే ఈ సినిమా ఎంత అద్భుతమో, సంగీతం పరంగా కూడా అంతే. 20 ఏళ్ళైనా కూడా “ఆకాశం లో ఆశల హరివిల్లు” అనగానే “స్వర్ణకమలం” అని చెప్పలేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. కనీసం, నాకు తెలిసినంతలో తెలుగువారిలో అలా చెప్పలేని వారిని చూడలేదు నేను. బొత్తిగా తెలుగు సినిమాలూ చూడనివారూ, పాటలూ వినని వారిలో తప్ప. విషయానికొస్తే – సంగీతం ఇళయరాజ, సాహిత్యం – సిరివెన్నెల సీతారామ శాస్త్రి. పైగా విశ్వనాథ్ సినిమా అంటే, ఇక చెప్పాలా సంగీతం గురించీ, సాహిత్యం గురించీ!!

1. ఆత్మాత్వం… : ఈ పాట శంచరాచార్య విరచితం అని ఈ వ్యాసం రాయడం మొదలుపెట్టేదాకా తెలియలేదు నాకు. ఈ శ్లోకం సాహిత్యం, దాని భావం ఇక్కడ దొరుకుతాయి. నటరాజస్వామిని పూజించడానికి ఈ శ్లోకం నాట్యకారులు వాడతారేమో మరి, అది నాకు తెలీదు కానీ, ఈ చిత్రంలో దాన్ని చాలా అనువుగా వాడుకున్నారు. ఇది శివపూజలా ఉంది కానీ, పూర్తిగా నాట్యం గురించని కాదు కదా, అందుకని నాట్యాచార్యులు ఈ శ్లోకాన్ని నటరాజస్వామి అర్చనకి వాడతారా? అన్నది నా సందేహం. ఇది ఈ ట్యూన్ లో మామూలుగా పాడతారా? ఇళయరాజా స్వరరచన చేశారా? అన్నది నాకు తెలీదు కానీ, వింటూ ఉంటే స్వతాహాగా లేని భక్తి భావం కూడా కలుగుతుంది. ముఖ్యంగా – ఆ “సంచారహ్ పదయో” అనడం వింటున్నప్పుడైతే అదోరకం తన్మయత్వం కలిగింది నాకు.

2. చేరి యశోదకు: అన్నమాచార్య కీర్తన. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం, చాలా రోజుల దాకా అర్థం కూడా తెలీకపోయినా కూడా. అర్థం తెలీకుండా పాట నచ్చిందంటే కారణం చాలా వరకు సంగీతమే అయి ఉండాలి కదా మరి. :) పాట సాహిత్యం, అర్థం ఇక్కడ దొరుకుతాయి.

3. నటరాజనే: భానుప్రియ స్టేజిపై నాట్యం చేసే సన్నివేశంలో వచ్చే పాట. ఆ పాడిన మనిషి వల్లో లేక వచ్చే సంగీతం వల్లో కానీ, నాకేమిటో నాలోనే ఏదో నాట్యం జరుగుతున్న భావన కలిగింది ఈ పాటలో జోరుగా వినిపిస్తున్న “తకధిమి” లు వింటూ ఉంటే. వెటకారం కాదు. అంత శక్తి ఉంది ఆ పాటలో అని చెప్పడం మాత్రమే ఇది.

4. ఘల్లు ఘల్లు ఘల్లు మంటు : పాట మూడ్ కి తగినట్లే ఉంది సంగీతం. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుందే తప్ప…మరో భావన కలగదు. ఈ పాట సాహిత్యంలో నాకు రకరకాల భావాలు తోస్తాయి. “వద్దని ఆపలేరు, ఉరికే ఊహని…హద్దులు దాటరాదు, ఆశల వాహిని” – అనడంలో ఓ పక్క ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉండగానే ఓ పక్క అత్యుత్సాహం వద్దన్న వారింపు ఉంది. “ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు” – అనడంలో కొండంత ధైర్యాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది. “దూకే అలలకు ఏ తాళం వేస్తారూ? కమ్మని కలల పాట ఏ రాగం అంటారు?” , “వలలో ఒదుగునా విహరించే చిరుగాలి….. సెలయేటికి నటనం నేర్పించే గురువేడి” – సంగీతం-నాట్యం అన్నవి ప్రకృతిలోనే ఉన్నాయని సిరివెన్నెల గారు మరోసారి అంటారు. (రుద్రవీణ లో “బ్రతుకున లేని శృతి కలదా..ఎదసడిలోనే లయలేదా?” గుర్తు వచ్చింది నాకు) “లయకే నిలయమై నీ పాదం సాగాలి…” , “నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముందీ?” – ఇందులో హీరోయిన్ లోని నర్తకిని గురించిన passion కనిపిస్తుంది. పాట వింటూ ఉంటే ఈ భావోద్వేగాలని అందరూ అనుభవించగలుగుతున్నారు అంటే, ఇక ఆ సంగీతం గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా!

5. కొత్తగా రెక్కలొచ్చెనా: ఈ పాట హీరోయిన్ తానుగా గజ్జెలు కట్టుకోడం చూసిన హీరో నోటి నుండి వెలువడ్డ “కొత్తగా రెక్కలొచ్చెనా…” తో మొదలౌతుంది. “ఏమిటండీ? గూళ్ళేంటీ? గువ్వలేంటి? కొత్తగా రెక్కలు రావడమేమిటి?” అని ప్రశ్నిస్తే హీరో జవాబిచ్చాక కొనసాగుతుంది. ఆ జవాబు బహుశా ప్రేక్షకులకేమో అని ఇప్పటికీ నా అనుమానం. “కొండదారి మార్చింది..కొంటెవాగు జోరు…కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు”, “వెదురులోకి ఒదిగింది..కుదురులేని గాలి… ఎదురులేక ఎదిగింది..మధురగాన కేళి” – ఈ పాట లోని దాదాపు ప్రతి వాక్యాన్నీ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వర్ణనగా, మన కథానాయిక గురించిన మాటలుగా. సాహిత్యం భాషైతే తెలుగే కానీ, సంగీతం భాష కాదు కదా. ఈ సినిమా పాటలు వింటూ ఉంటే (ఏ సినిమావి విన్నా అనుకోండి) “ఆరే! సంగీతం తెలిసుంటే ఎంత బాగుండేది” అన్న భావన కలుగుతూ ఉంటుంది నాకు ఎప్పుడూ.

6. శివపూజకు: ఈ పాటలో రకరకాల నృత్యాలు చేస్తుంది భానుప్రియ. తెరపై భానుప్రియ టెంపో ప్రకారమే పాటలో సాహిత్యం, సంగీతం కూడా మారుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడూ. అలా ఆలోచిస్తే, ఈ పాటలో రకరకాల సంగీతం, సాహిత్యం ఉన్నట్లన్నమాట :). పాట మొదలైనప్పటి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటలో కూడా మళ్ళీ హీరోయిన్ ని ఉద్దేశించి రాసినట్లే ఉంటుంది కానీ, ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. “పరుగాపక పయనించవె తలపుల నావా..కెరటాలకి తలవంచితే తరగదు త్రోవ” – వంటి వాక్యాలు నాకు అలాగే అనిపిస్తాయి. “తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా..ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా.” వంటి వాక్యాల్లో ఎంతో పవర్ ఉంది. కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఇలాంటి వాక్యాలు ఎప్పుడు విన్నా. ఈ పాట గురించి “మనసిరివెన్నెల” సైట్ లో సిరివెన్నెల గారు అద్భుతంగా రాశారు. కానీ, సైటు పనిచేస్తున్నట్లు లేదు :(

7. అందెలరవమిది: తొలుత గురువుకీ, తరువాత శివుడికి నమస్కరిస్తూ మొదలైన ఈ పాటలో ప్రధానంగా నాట్యం మీదే ఉంటుంది సాహిత్యం అంతా. “అందెల రవమిది పదములదా, అంబరమంటిన హృదయముదా” అన్న వాక్యంలోనే ఈ పాట సారం అంతా ఉందని నాకు అనిపిస్తుంది. ఈ పాట కి ఇచ్చిన సంగీతం లో ఓ పవర్ ఉంది. చాలా సూటిగా వినేవారిలోకి చొచ్చుకుపోగల శక్తి ఉంది ఆ సంగీతంలో. దానికి తోడు తెరపై దాన్ని చూస్తూ ఆ పాటని వింటే పూర్తిగా ఆ భావన ఎక్కేస్తుంది ప్రేక్షకుడిలో. ఒక పాట రూపకల్పన జరిగే తతంగం అంతా ఎంత ఆసక్తికరంగా ఉండిఉంటుందో కదా అన్న కుతూహలం కలుగుతుంది నాకు ఈ పాట చూసిన ప్రతిసారీ. ఈ పాట గురించి కొన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.

8. ఆకాశంలో ఆశల హరివిల్లు: ఈ పాట వ్యక్తిగతంగా నాకు ఎప్పుడో స్కూల్ రోజుల్నుంచీ పిచ్చి ఇష్టం. బహుశా మిగితా పాటల్తో పోలిస్తే కాస్త తేలికైన పదజాలం ఉండటం వల్లో ఏమో గానీ, అప్పట్లో ఇది ఒకటే అర్థమైనట్లు గుర్తు. మిగితావి ఏదో ఆ పదాల సౌందర్యం మాయలో పడి అర్థం తెలుసుకోకుండా ఆనందించినవే. “మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా…వయ్యారి వానజల్లై దిగిరానా..” “పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా” “నా కోసం సురభోగాలే వేచి నిల్చెనుగా” – ఈ పాట మూడ్ ఇలాంటి వాక్యాల్లో తెలుస్తూ ఉంది. దానికి తగ్గట్టే సంగీతం కూడా ఆ మూడ్ ని తెలియజెప్పేలా ఉంటుంది. కాస్త ఊపులో ఉన్నప్పుడు ఒక లాగా, సీనులో వెనుక పాట వినబడకుండా భానుప్రియ అభినయం మాత్రమే కనిపిస్తున్నప్పుడు ఆ అభినయానికి తగ్గ సంగీతం వెనుక వినిపిస్తూ ఉంటుంది. ఇక జానకి గారి సంగతి నేను ప్రత్యేకంగా చెప్పాలా? ఆ పదాల్లోని జోరుని పెదాలపై పలికించడంలో ఆవిడకి ఆవిడే సాటి.

డాన్స్ లో చాలా పాటలు శివుడిపై ఉంటాయా? ఈ సినిమాలో ఓ నాలుగైదు పాటల్లో అన్నా శివుడి ప్రస్తావన ఉంది కదా. అంటే, అది సినిమా నాట్యం గురించి కనుక పాటలన్నీ నటరాజుని నాట్యానికి లింక్ చేస్తూ ఉండాలని పెట్టారా? లేక వేరే ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా? నాకు తెలీదు మరి. ఇంకో విషయం – ఇదివరలో మనసిరివెన్నెల సైట్ లో ఈ సినిమా పాటల గురించి “సిరివెన్నెల” సీతారామశాస్త్రి గారి వ్యాసాలు ఉండేవి. చాలా బాగుండేవి చదవడానికి. అవి ఇప్పుడు ఎక్కడున్నాయో…ఆ సైటు మాత్రం పని చేస్తున్నట్లు లేదు. అసలు ఒక్కోపాట మీద కావాల్సినంత రాసుకోవచ్చు. ఇంతకుముందు కొన్ని బ్లాగుల్లో ఈ పాటల గురించిన వ్యాసాలు కూడా చూశాను కానీ, లంకెలు లేవు నా వద్ద. మొత్తానికి సంగీతమన్నా, సాహిత్యమన్నా, సినిమాగా చూసినా – దీనిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి కెరీర్ లోనూ స్వర్ణకమలం చిత్రం ఓ మైలురాయి అనిపిస్తుంది నాకు. ఇలాంటి సినిమా ఇంకోటి రాదేమో అన్న బెంగ కూడా ఉంది.

14 Comments
 1. నాగమురళి December 15, 2008 /
 2. Sowmya December 15, 2008 /
 3. Aruna December 15, 2008 /
 4. రామ December 18, 2008 /
 5. Sri December 19, 2008 /
 6. Harita December 30, 2008 /
 7. sriram velamuri January 10, 2009 /
 8. Ramana Murthy March 17, 2009 /
 9. ఆకునూరి మురళీకృష్ణ March 29, 2009 /
 10. బ్లాగరి January 28, 2010 /
 11. బ్లాగరి January 28, 2010 /
 12. టి.యస్.కళాధర్ శర్మ January 30, 2010 /
 13. pavan santhosh March 22, 2016 /