Menu

శుభోదయం

కళాతపస్వి సృజనాత్మకతను చాటిచెప్పే మరో చిత్రరాజం ‘శుభోదయం’

నేను డిగ్రీకి వచ్చేదాకా సినిమాలు పెద్దగా చూళ్ళేదు. కాబట్టి అంతకు ముందు వచ్చిన ఎన్నో మంచి సినిమాలను నేను చూళ్లేకపోయాను. కాబట్టి, తీరిక దొరికినప్పుడల్లా ఒక్కో మంచి సినిమాను చూడడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యనే K.విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘శుభోదయం’ అనే సినిమా చూసాను. ఆ సినిమాలోని ఎన్నో విషయాలు నన్నాకట్టుకున్నాయి. ఆ సినిమా అంత ఆహ్లాదంగా అనిపించడానికి, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ చూసి విసిగిపోవడం కూడా మరో కారణం కావచ్చు. ఏమైతేనేం.. ఆ సినిమా చూడడం వల్ల ఒక చక్కటి అనుభూతికి లోనయ్యాను. అదే నన్ను ఈ సమీక్ష వ్రాయడానికి పురికొల్పింది. ఒక మామూలు ప్రేక్షకురాలిగా నేను గమనించిన, నాకు నచ్చిన అంశాలు చెప్తాను.

‘కళాతపస్వి’ కాశీనాథుని విశ్వనాథ్ గారి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగువారి మనసుల్లో కలకాలం నిలిచిపోయే ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను మనకందించారు విశ్వనాధ్ గారు. సీడీ పైన ఆయన పేరు చూడగానే వెంటనే తీసుకొచ్చాను సినిమా చూడ్డానికి. సినిమా వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమా 1980 లో ‘శ్రీరామ్ ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై నిర్మించబడింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విశ్వనాధ్ గారు, మాటలు జంధ్యాల గారు, సంగీతం KV మహదేవన్ గారు, సాహిత్యం వేటూరి గారు అందించారు. పాటలన్నీ బాలు గారు, సుశీల గారు పాడారు.

భగవద్గీతలోని “కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన.. మాకర్మ ఫలహేతుర్భూహు మాతే సంవోస్త్వ కర్మణే..” అనే శ్లోకం తో సినిమా మొదలవుతుంది. అంటే.. ఈ అనంత సృష్టిలో పిపీలికాది బ్రహ్మపర్యంతం ప్రతీ ప్రాణీ తమ కర్మని నిర్వహించడానికే సృష్టింపబడింది. చీమలు పగలనకా రాత్రనకా ఎంతో శ్రమించి తమ ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. తేనెటీగలు దివారాత్రాలు కష్టించి మధురమైన తేనెని తయారుచేసుకుంటాయి. ఈ క్రిమికీటకాల నుండి క్రూరజంతువుల దాకా పశుపక్ష్యాదులన్నీ తమ విద్యుక్త ధర్మాన్ని సర్వకాల సర్వావస్థలయందునూ త్రికరణశుద్ధిగా నిర్వర్తిస్తూనే ఉంటాయి. సర్వోత్కృష్టమైన జన్మనెత్తిన మానవుడికి కొన్ని విద్యుక్త ధర్మాలున్నాయి. అందుకే కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన.. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆ కర్మలను నిర్వర్తించడం అతని విధి, భాద్యత అన్నమాట. తమోగుణమైన సోమరితనంలో తన కర్మనీ, ధర్మాన్ని నిర్వహించని మానవుడు మానవుడే కాదు. పురుగు కంటే, సూక్ష్మ క్రిమి కంటే హేయమైన జీవి అనిపించుకోబడతాడు అనే విషయాన్ని 5000 సంవత్సరాల క్రితం ఈ జాతికి గీత బోధించింది. ఇదే వాక్యాలతో ఈ సినిమా మొదలవుతుంది. ఇదే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా.

మన సినిమాలో కథానాయకుడు చంద్రం (చంద్రమోహన్) ఏ పనీ చేయకుండా, చాలా హాయిగా జీవితం సాగిపోవాలని కోరుకొనే యువకుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతే.. సొంత కొడుకులా చంద్రాన్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్దులు చెప్పించిన అన్నయ్య (సాక్షి రంగారావు), తల్లి కంటే మిన్నగా చూసుకునే వదిన (అన్నపూర్ణ), వాళ్ళకో కొడుకు ఉంటారు. ఒక బట్టల షాపులో గుమస్తాగా పని చేసే మధ్యతరగతి అన్నయ్య ఇల్లు నడుపుతుంటే, చక్కగా తిని తిరుగుతూ ఉంటాడు మన చంద్రం. కష్టపడి ఉద్యోగం చేయాలంటే బద్ధకం. ఉద్యోగాల వేట అని ఇంట్లో చెప్పి సినిమాలకీ, పార్కులకీ తిరిగి కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ‘రాయైతేనేమిరా దేవుడూ.. హాయిగా ఉంటాడు జీవుడూ..’ అంటూ దేవుడు ఏ పనీ లేకుండా హాయిగా చల్లగా ఉంటాడు అని పాట కూడా పాడతాడు. అలా కష్టపడకుండా సుఖంగా జీవించాలన్నదే అతని ఆశయం. అనుకోకుండా ఒక రోజు ఒక కోటీశ్వరుడి కూతురి పెళ్ళికి వెళతాడు. ఆ కోటీశ్వరుడికి మరో పెళ్లి కాని కూతురు ఉందనీ, ఇద్దరికీ చెరిసగం ఆస్తి వస్తుందనీ తెలుసుకుంటాడు. చిలక జోస్యం వాడు కూడా ఓసారి చెప్తాడు స్త్రీ వల్ల ధన లాభం అని. ఇక అప్పటి నుంచి మన చంద్రం కలల లోకంలో విహరిస్తూ ఉంటాడు. ఇంతకీ కల ఏంటనుకున్నారూ.. పొద్దున్నే బద్దకంగా లేవడం, పనివాళ్ళు రకరకాల ఫలహారాలు అందించడం, మళ్ళీ విశ్రాంతి, మళ్లీ, భోజనం, మధ్య మధ్యలో భార్యతో కాలక్షేపం, మళ్ళీ విశ్రాంతి.. ఇలా జీవితం సాగిపోతున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు.

తన పథకంలో భాగంగా ఒకరోజు రాధాకృష్ణుల మందిరంలో కోటీశ్వరుడి కూతురైన మన కథానాయిక గీత (సులక్షణ) తో పరిచయం చేసుకుంటాడు చంద్రం. ఆ సందర్భంలోనే “గంధము పుయ్యరుగా.. పన్నీరు గంధము పుయ్యరుగా..” అనే మధురమైన పాట వస్తుంది. చంద్రం తను ఎంతో గొప్ప వ్యక్తిత్వంమున్నవాడిలాగా కోతలు కోసి ఎలాగో ఆ అమ్మాయి వాళ్ల ఆఫీసులోనే ఉద్యోగం సంపాదిస్తాడు. హీరోయిన్ వాళ్ళ సొంత ఆఫీసులోనే ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తనకంటూ ఒక విలక్షణమైన వ్యక్తిత్వం, మానవతా విలువలు, సేవాతత్పరత, స్థిర చిత్తం, ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించే అమ్మాయి. హీరోయిన్ పాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందంటే.. ఈసినిమా అయిపోయాక కూడా మన మనసుల్లో మెదులుతూ ఉంటుంది. అసలు ఆ అమ్మాయిని నేను చూడడం ఈ సినిమాలోనే మొదటిసారి. ఎంత చక్కగా ఉందో.. నాకెంతగానో నచ్చింది. సినిమాలో ఆ అమ్మాయి గాత్రం, కట్టు, బొట్టు, నవ్వు, నడక, వ్యక్తిత్వం మనల్ని కట్టిపడేస్తాయి. అసలు ఆ అమ్మాయి నటన గురించి, భావ వ్యక్తీకరణ గురించి మరో సమీక్ష వ్రాయచ్చు. అంతగా ఆకట్టుకుంటుంది.

మొత్తానికి ఈ అమ్మాయిని ప్రేమలో పడేసేందుకు మన చంద్రం వాళ్ళింట్లోనే ఔట్ హౌస్ లో అద్దెకు దిగుతాడు. “కంచికి పోతావా కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా..” అనే మరో అద్భుతమైన మెలోడీ ఉంటుంది. ఈ పాటలోనే వాళ్ల మనసుల్లో ప్రేమ మొలకెత్తుతుంది. ఆ అమ్మాయి తన ప్రేమను వాళ్ల నాన్నగారి ముందు చంద్రానికి వ్యక్తపరిచే సన్నివేశం ఆ అమ్మాయి వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. మొత్తానికి చంద్రం కల నెరవేరిందని మురిసిపోతాడు. కానీ, పెళ్లి కాగానే ఈ ఆస్తి మనది కాదు, మన సొంత బ్రతుకు మనం బ్రతకాలి అని గీత చంద్రం చేత వేరు కాపురం పెట్టిస్తుంది ఒక చిన్న ఇంట్లో. కోటీశ్వరుడికి అల్లుడయ్యి బాగా సుఖపడదామనుకున్న చంద్రానికి చుక్కెదురవుతుంది. ఒక సన్నివేశంలో అతన్ని బుజ్జగిస్తూ “ఆ చింత నీకేలరా” అనే మరో అద్భుతమైన పాట కూడా పాడుతుంది హీరోయిన్.

కొన్నాళ్ళకి చంద్రం అసంతృప్తిని గ్రహించిన మామగారు ఇద్దరు అల్లుళ్ళకీ ఆస్తి పంచి ఇస్తాడు. తరువాత కొన్ని రోజులకి ఒక ఆశ్రమం నుంచి సన్యాసులు వస్తారు. గురువుగారైన స్వామీజీ (చారుహాసన్) మానవత్వం గురించి చెప్పి, కాన్సర్ బాధితుల కోసం ఆసుపత్రి నిర్మించేందుకు విరాళాలు అడుగుతారు. కాన్సర్ కారణంగా మరణించిన తన తల్లి గుర్తొచ్చి.. గురువు గారి మాటలకు స్పందించి.. తన యావదాస్తినీ ఆ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చేస్తుంది గీత. భార్య చేసిన పనికి కోపంతో రుద్రుడైపోతాడు చంద్రం. నిండు చూలాలైన ఆమెతో పోట్లాడి, భార్యాబిడ్డల భారం మోయాల్సి వస్తుందన్న భయంతో.. ఎవరికీ చెప్పకుండా ఇల్లొదిలి వెళ్ళిపోతాడు. సన్యాసుల జీవితం ఏ పనీ లేకుండా హాయిగా సాగుతుంది.. అందరూ చక్కగా విందు భోజనాలకి పిలుస్తారనుకొని.. సుఖంగా జీవించాలని చారుహాసన్ ఆశ్రమానికి వెళ్తాడు. కానీ, కొద్దికాలంలోనే సన్యాసి జీవితం కూడా కష్టంతో కూడుకున్న పని అని అర్ధమౌతుంది. ఈ లోగా గీత కొడుకుతో సహా ఆశ్రమానికి వస్తుంది. అందరూ కలిసి చంద్రం తన భాధ్యతని గుర్తించేలా చేస్తారు. అతను మారి భార్యాబిడ్డల్ని స్వీకరించడంతో సినిమా ముగుస్తుంది.

ఈ సినిమా దర్శకత్వం ఎలా ఉంటుందంటే.. ఏ ఒక్క సన్నివేశం కూడా ఇలా కాకుండా వేరేలాగా ఉండాల్సిందని కానీ, ఈ సన్నివేశం అనవసరంగా ఉందని కానీ అనిపించదు. ప్రతి ఒక్కరి పాత్ర సినిమాకి ఒక విలువని తీసుకొస్తుంది. ప్రతీ ఫ్రేమ్ లోనూ దర్శకుడి ప్రతిభ కనిపించడమంటే ఏంటో.. ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలను సోమరితనంతో విస్మరించరాదు అనే సందేశాన్ని మనసుకి హత్తుకునేలాగా చూపారు. కామెడీ ప్రత్యేకంగా ఉండదు కానీ, చాలా సన్నివేశాల్లో జంధ్యాల గారి మాటలు, చంద్రమోహన్ నటన కావలసినంత నవ్వుని తెప్పిస్తాయి. ఈ రోజుల్లో వచ్చే ఏ సినిమా కథయినా రెండు లైన్లలో చెప్పేయచ్చు. కానీ, ఈ ‘శుభోదయం’ సినిమాలో ఎన్నో అంశాలు మనసును సూటిగా తాకే విధంగా ఉంటాయి. సినిమా చిత్రీకరించిన ప్రదేశాలు అన్నీ కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ని కలిగిస్తాయి. ఇక KV మహదేవన్ గారి సంగీతం ఎంత మధురంగా ఉంటుందో చెప్పనక్కరలేదు. వేటూరి గారి కలం నుంచి తెలుగు తేనె జాలువారింది ఈ సినిమా పాటల్లో. అసలు పాటలు వచ్చాయి, వెళ్ళాయి అని మనం గుర్తించము. అంతగా కథనంలో విలీనమై సాగుతాయి పాటలు. స్థూలంగా చెప్పాలంటే, చక్కటి కథనంతో, వినసొంపైన పాటలతో, కళ్ళకూ, మనసుకూ కూడా.. సంతోషాన్ని కలిగించే సినిమా ఈ ‘శుభోదయం’. ప్రతీ ఒక్కరూ తమ తమ కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తే అందరి జీవితాల్లోనూ శుభోదయమే.. అని ఈ సినిమా మనకి చెప్తుంది.

చివరగా ఒక మాట.. ఈ సినిమా హీరోయిన్ ని చూపించకుండా ఉంటే ఈ సమీక్ష అసంపూర్ణమైనట్టే.. (ఫొటోస్ చూడండి)

మధురవాణి

14 Comments
  1. jyothi December 18, 2008 /
  2. Sowmya December 18, 2008 /
  3. raghu December 18, 2008 /
  4. Venkat December 18, 2008 /
  5. మురళి December 18, 2008 /
  6. Venu December 18, 2008 /
  7. srinivas December 18, 2008 /
  8. Madhura vaani December 18, 2008 /
  9. pappu December 19, 2008 /
  10. శ్రీ లక్ష్మీ కళ December 22, 2008 /