Menu

స్లమ్ డాగ్ మిలియనీర్

ఒకే ఒక్క ప్రశ్న మిగిలుంది. సరైన జవాబిస్తే చాలు అతని జాతకం మారుతుంది. లేదా…తిరిగి మామూలు జీవితంలోకి ప్రయాణమే! ఇదేనా నీ తుది జవాబు? ఈజ్ దట్ యువర్ ఫైనల్ ఆన్సర్? యే హై తుమ్హారీ ఆఖరీ జవాబ్? భాషేదైనా వీటికి జవాబొకటే; అవును – కాదు. ఇది ఊపిరి బిగపెట్టే సన్నివేశం. వేడెక్కిన వాతావరణం. చూసే వాళ్ళకి ఎంతో ఉత్కంఠ. ఆఖరి ప్రశ్నకి జవాబు అతన్ని కోటీశ్వరుణ్ణి చేయచ్చు. లేదా నిరాశతో నిష్క్రమించేలా చేయచ్చు. ఇంతవరకూ ఒక్క ప్రశ్నా అతను తప్పలేదు. ఇదే ఆఖరి ప్రశ్న. కుర్చీలో ఉన్నతను జవాబిచ్చాడు.

ఇంతకీ ఇన్ని ప్రశ్నలకీ అతనెలా జవాబివ్వ గలిగేడు?

1. అతను మేధావి

2. అతని అదృష్టం

3. అతడు పచ్చి మోసగాడు

4. విధి రాత

ఇవేమీ కాదు. అడిగిన ప్రశ్నలన్నింటీకీ అతనికి జవాబు స్పష్టంగా తెలుసు. ఎలా? చదువు సరిగా లేదు. విజ్ఞానం కాదు. యాదృచ్చికం కాదు. మరి? అతని జీవితం. అదే అతన్ని ఇంత దూరం లాక్కొచ్చింది.

డానీ బోయిల్ దర్శకత్వంలో, సైమన్ బ్యూఫాయ్ స్క్రీన్ ప్లే రచనతో, “హూ వాంట్స్ టు బి ఏ మిలియనీర్” అనే గేమ్ షో ప్రధానాంశంగా ఫాక్స్ పిక్చర్స్ నిర్మించిన “ స్లమ్ డాగ్ మిలియనీర్ “ అనే చిత్రానికిదే కథాంశం. పూర్తిగా ఇండియాలో నిర్మించిన చిత్రమిది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి అనేక అవార్డులు గెల్చుకుంది. ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఈ చిత్రం ఖచ్చితంగా ఉంటుందని సినీ విమర్శకుల అంచనా.

అసలు కథలోకి వస్తే – ముంబై మురికివాడల్లో ఉండే జమాల్ మాలిక్ అనే కుర్రాణ్ణి పోలీసులు ప్రశ్నలతో వేధిస్తూ, హింసిస్తారు. అతనొక పచ్చి మోసగాడనే నేరారోపణ. అతను “కౌన్ బనేగా కరోడ్ పతి?” అనే టీవీ గేమ్ షో లో చిట్ట చివరి వరకూ వస్తాడు. జమాల్ తనెవ్వరినీ మోసం చేయలేదనీ, తనకి జవాబులు తెలుసనీ పదే పదే చెప్తాడు. పోలీసులు నమ్మరు. జవాబులెలా తెలిసాయో వివరిస్తూ అతని జీవితం గురించి చెప్పడం మొదలెడతాడు. ఒక్కో ప్రశ్న జవాబు వెనుకా ఒక్కో సంఘటన ఉంది. బాల్యంతో మొదలై జమాల్ ప్రస్తుత గేమ్ షోలో పాల్గొనడానికి దారితీసిన పరిణామాల వివరణే ” స్లమ్ డాగ్ మిలియనీర్ ” చిత్రం.

హిందూ మత చాందస్సుల చేతిలో తల్లి మరణించడంతో ఒంటరి వాళ్ళవుతారు జమాల్, అతని అన్న సలీం. వారికి లతిక అనే ఇంకో అనాధ బాలిక తోడవుతుంది. జమాల్ కి లతిక అంటే స్నేహం. వీళ్ళని మమమ్ అనే అతను చేరదీస్తాడు. పిల్లల్ని వికలాంగులుగా చేసి, బిచ్చగాళ్ళుగా మార్చి వారిద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. జమాల్ వంతొచ్చేసరికి సలీం తమ్ముడి మీద ప్రేమ వల్ల అక్కణ్ణుండి తప్పించుకొని ఇద్దరూ పారిపోతారు. లతిక అక్కడే ఉండిపోతుంది. ఆగ్రా వెళతారు. తాజమహల్ టూర్ గైడ్ లా జీవితం మొదలెడతారు. అక్కడే సలీం కి దొంగతనం అలవాటవుతుంది. ఊరు మారినా జమాల్ కి లతిక గురించే ఆలోచన. ఎలాగైనా లతికని రక్షించాలన్న ధ్యేయంతో మరలా ముంబై వస్తారు. వేశ్య వాడల్లోకి నెట్ట బడ్డ లతికని రక్షించి తమతో తీసుకెళతారు. ఆ క్రమంలో సలీం మమమ్ ని హత్య చేస్తాడు. మమమ్ ప్రత్యర్థి శత్రువు జావేద్ కీ విషయం తెలిసి సలీంని తన గాంగ్ లో చేర్చుకుంటాడు. యవ్వనంలోకొచ్చిన సలీం లతికని తన దానిగా భావిస్తాడు. అడ్డొచ్చిన జమాల్ ని కాల్చడానిక్కూడా సిద్ధపడతాడు. లతిక జమాల్ ని రక్షించి అక్కడనుండి వెళిపోమంటుంది.

కొంతకాలం తరువాత జమాల్ కాల్ సెంటర్ లో చేరుతాడు. అక్కడ ఇంటర్నెట్ లో సలీం, లతిక గురించి వెతుకుతాడు. ఎలాగో కష్టపడి సలీంని కలుస్తాడు. సలీం జావేద్ కుడి భుజంగా ఉంటూ అండర్ వర్ల్డ్ గాంగ్ లీడర్ గా మారాడని తెలుస్తుంది. అక్కడే లతిక జావేద్ ఇంట్లో అతని ఉంపుడుకత్తె గా ఉంటోందని తెలుస్తుంది. లతికని కలసి తనతో రమ్మంటాడు. రానంటుంది లతిక. తను ప్రతీ రోజూ సాయంత్రం అయిదు కల్లా రైల్వే స్టేషన్ లో లతిక కోసం ఎదురు చూస్తానని చెబుతాడు. జావేద్ ఇంట్లో నుండి తప్పించుకున్న రైల్వ్వ్ స్టేషన్ కొచ్చిన లతికని జమాల్ కళ్ళెదుటే సలీం బలవంతంగా ఎత్తుకుపోతాడు. లతిక టీవీ చూస్తుందని జమాల్ కి తెలుసు. ఆమె కోసం ఈ గేమ్ షోలో పాల్గొంటాడు. జమాల్ మీద జెలసీతో, తప్పు దారి పట్టించి, అతన్ని ఫెయిల్ అయ్యేట్లా చేద్దామని ఆ గేమ్ షో నిర్వహించే అతను ( అనిల్ కపూర్ ) చివరి ప్రశ్నకి కావాలనే తప్పు జవాబు కంప్యూటర్ లో పెడతాడు. జమాల్ ఆఖరి ప్రశ్నకి జవాబిచ్చి, “రెండు కోట్లూ గెలుచుకున్నాడా? కోల్పోయిన ప్రేయసినెలా దక్కించుకున్నాడా?” అన్నదే మిగిలిన కథ.

నటీనటుల వరకూ వస్తే ప్రతీ ఒక్కరూ చాలా బాగా నటించారు. జామాల్ గా దీపక్ పటేల్, గేమ్ షో నిర్వహించే వ్యక్తి గా అనిల్ కపూర్, పోలిసు అధికారిగా ఇర్ఫాన్ ఖాన్, లతికగా ఫ్రీడా పింటో ల నటన చూస్తే నటులు కనిపించరు. పాత్రలు కనిపిస్తాయి. అంతగా పాత్రల్లో లీనమయ్యి నటించారు.

ఓ మోస్తరుగా రాసిన నవల్ని అత్యద్భుతంగా తెరెకెక్కించడంలో దర్శకుని ప్రతిభ ప్రతీ ఫ్రేం లో నూ కనిపిస్తుంది. మెచ్చుకోతగ్గ సైమన్ బ్యూఫోయ్ స్క్రీన్ ప్లే యే ఈ సినిమాకి ఆయువు పట్టు. ఎక్కడా బిగి సడలకుండా మొత్తం చిత్రముంటుంది. ఒక్కో ప్రశ్న జవాబుకీ, తన జీవితంలో జరిగిన సంఘటనలకీ ఉన్న సంబంధాన్ని అద్భుతంగా అల్లారు. ప్రశ్నేలే వరుసలో వచ్చాయో సంఘటనలు కూడా జమాల్ జీవితంలో అదే క్రమంలో జరుగుతాయి. అతని యవ్వనం వరకూ అన్నీ ఓ క్రమంలో ఉండి అతని జీవితాన్ని చూపిస్తాయి. ఇదీ ఈ స్క్రీన్ ప్లే గొప్పతనం. అలాగే పోలీసు అధికారికి జామాల్ నిజాయితీ విషయంలో నమ్మకం కలగడం కూడా లాజికల్ గా ఉంటుంది.

దర్శకత్వమూ, స్క్రీన్ ప్లేల స్థాయిలో మెచ్చుకోదగ్గ సంగీతాన్ని అందించాడు రహమాన్. హాలీవుడ్ స్థాయి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. సన్నివేశాల బిగి ననుసరించి సంగీతం ఉంటుంది. ఎక్కడా వాయిద్యాల హోరు వినిపించదు. ముంబైని ఎంతో పెద్ద లాండ్ స్కేప్ లో చూపిస్తూ ఫొటోగ్రఫీ ఉంది.

ఒక ఇండియన్ రాసిన నవల్ని హాలీవుడ్ సినిమాగా తెరకెక్కించడం ఒకరకంగా పెద్ద సాహసమే! వికాస్ కపూర్ “క్యూ అండ్ ఏ” నవల 2005 లో వచ్చింది. ఈ నవల్ని సినిమాగా తీద్దామని సెలడర్ ఫిల్మ్ మరియు ఫిల్మ్ 4 కంపెనీ వాళ్ళు డానీ బోయిల్ ని దర్శకత్వం వహించమని పిలిచారు. బోయిల్ కీ సినిమా చేయడం ఇష్టం లేకపోయింది. కానీ సైమన్ బ్యూఫోయ్ స్క్రీన్ ప్లే అని తెలిసాక ఒప్పుకున్నాడు. ఈ కథని సినిమాగా మలచడం కోసం సైమన్ బ్యూఫోయ్ ముంబై మురికివాడల్లో అనేక మందిని సంప్రదించాడు. వాళ్ళ తీరుల్ని పరిశీలించి మరీ స్క్రీన్ ప్లే రాసానని చెప్పాడు. అది ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. దర్శకుడు కూడా ప్రతీ చిన్న విషయాన్ని ఎంతో వివరంగా పరిశీలించి మరీ తీసారు. ఉదాహరణకి – జమాల్ అన్న సలీం పాత్రని మూడు దశల్లో ముగ్గురు ( ఇద్దరు పిల్లలు, ఒక కుర్రాడు ) నటించారు. ముగ్గురికీ వయసు మారినా ఒకే రకం ఉంగరాల జుట్టుంటుంది. అందువల్ల పాత్ర వయసు మారి కొత్త నటుడొచ్చాడన్న ఫీలింగ్ కలగదు. ఆ పిల్లాడే ఎదిగాడనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న డిటైల్స్ విషయంలో ఎంతో శ్రద్ధ చూపించారు.

కాకపోతే భారతీయ కథాంశాలు హాలివుడ్ వాళ్ళ బుర్రకెక్కాలంటే సగటు భారతీయ జీవితం ఎక్కదు. అలాగే భారతీయుల విజయాలూ, వారి సక్సస్ కనిపించవు. ఇండియా అంటే మురికి వాడలూ, బిచ్చగాళ్ళూ, రహదారులపై పశువుల స్వేచ్చావిహరణా, మత కల్లోలాలూ ఇవే కనిపిస్తాయి. ఈ సినిమా కూడా వీటికి భిన్నం కాదు. సినిమా అంతా బాగున్నా ఒక్క సన్నివేశం మాత్రం చాలా జుగుప్సాకరంగా, వాంతొచ్చేలా తీసారు.

అమితాబ్ బచ్చన్ మురికివాడల సందర్శనకొస్తే, వొళ్ళంతా మలమూత్రాలతో జమాల్ అమితాబ్ ఆటోగ్రాఫ్ తీసుకోనే సన్నివేశం వెగటు కలిగిస్తుంది. భారతీయుల్ని ఇంతా పరిశుభ్రతీ హీనులుగా చూపించడం మాత్రం ఎంతో అభ్యంతరకరంగా అనిపించింది. ఏ బురదలోనో పడ్డట్లుగా చూపించచ్చు. అలా కాకుండా సినిమా నటుల్ని చూడ్డం కోసం మలమూత్రాల గుంటలో పడడానికి కూడా వెనుకాడరన్నట్లుగా చూపించడం ఏ భారతీయుడూ జీర్ణించుకోలేడు. ఈ సినిమా కనుక ఇండియాలో విడుదలయితే చాలా సంస్థలు అభ్యంతరాలు ఖచ్చింతగా చెబుతాయని నా నమ్మకం. ఇదొక్కటీ మినహాయిస్తే ఒక మంచి సినిమాయిది. ప్రతీ ఒక్కరూ చూడదగ్గ సినిమా.

చివరగా – కొత్త కథల్లేవు. స్క్రిప్ట్స్ లేవంటూ గొంతెత్తరిచే తెలుగు దర్శక నిర్మాతలు ఈ సినిమా చూసి కాస్తయినా తెలుసుకుంటె తెలుగులో మంచి సినిమాలు వస్తాయి. మన దర్శక, నిర్మాతలకీ చదివే గుణం లేదు. రచయితలకి రాయడం తప్ప చదవడం తెలీదు. ముఖ్యంగా తెలుగు సినీ రచయితలు ఈ సినిమా చూస్తే, స్క్రీన్ ప్లే రాయడంలో మెళుకువలు తెలుస్తాయనడంలో సందేహం ఉండదు. ఒక మంచి సినిమా తీయాలంటే ఎంతో కాలం వెచ్చించాలి. వివరాలు సేకరించాలి. మూడు నెలల్లో ముఫ్ఫై వేల రీళ్ళు ప్రేక్షకుల ముందు గుమ్మరించడం అనే పద్ధతికి అలవాటు పడ్డ తెలుగు సినిమావాళ్ళు ఈ సినిమాని చూసి కాస్తయినా తెలుసుకుంటే మంచిది. అప్పుడే మంచి సినిమాలు వచ్చే అవకాశముంది. ఆరోజొస్తుందా లేదా అన్నది కాలమే జవాబు చెప్పాలి.

–సాయి బ్రహ్మానందం గోర్తి

15 Comments
 1. మేడేపల్లి శేషు December 3, 2008 /
 2. కొత్తపాళీ December 10, 2008 /
 3. Sai Brahmanandam Gorti December 10, 2008 /
 4. Sai Brahmanandam Gorti January 12, 2009 /
 5. చందు January 22, 2009 /
 6. Vamshee January 23, 2009 /
  • Sai Brahmanandam Gorti January 23, 2009 /
   • Vamshee January 24, 2009 /
   • చందు January 24, 2009 /
 7. rayraj January 23, 2009 /
   • rayraj January 24, 2009 /
 8. Vamshee January 24, 2009 /
 9. rayraj January 24, 2009 /