Menu

సావిత్రి స్మృతిలో

నిన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో “మహానటి సావిత్రి” అన్న పుస్తకం కొన్నాము, రెండొందల రూపాయలు పెట్టి. సావిత్రిని గురించి రకరకాల వ్యక్తులు రాసిన రకరకాల వ్యాసాల సంకలనం. సంకలనకర్త – హెచ్.రమేష్‍బాబు. పుస్తకం ఒక్కోపేజీ చదువుతూ ఉంటే, మనసంతా అదోలాగా అయిపోయింది. అదేపనిగా చదివితే కళ్ళలోంచి నీళ్ళొస్తాయేమో అన్న అనుమానం కొద్దీ అనేక విరామాల మధ్య చదివాను పుస్తకాన్ని. సావిత్రి జీవితంలోని విషాదాల ప్రస్తావన అన్ని వ్యాసాల్లోనూ ఉండటమే దీనికి కారణం. అయితే, ఈ సందర్భంలోనే డిసెంబర్ 26 సావిత్రి వర్థంతి అని చదివాను. ఆ మధ్య ఆరో తేదీన సావిత్రి గారి జయంతనుకుంటా, టీవీలో ఆవిడపై ప్రోగ్రాం ఏదో వస్తూ ఉంటే గుడ్లప్పగించి, వేరే ఛానెల్ మార్చకని హుకూం జారీ చేసి మరీ చూశాను. పాటలు, దృశ్యాల మధ్యలో వినిపిస్తున్న గొంతు కాస్త ఎక్కడ్నుంచో వచ్చినట్లు వస్తూ ఉంటే, ఛానెల్ వారి ట్రాన్స్మిషన్ ను విసుకున్నాను. తరువాత కొన్ని సెకన్లకి అర్థమైంది, అది సావిత్రి రికార్డెడ్ వాయిస్ అని. ఆ మధ్యోరోజు “నా హృదయంలో నిదురించే చెలి” పాట వస్తూ ఉంటే చూసి సావిత్రిని తలుచుకున్నాను. ఇలా ఇన్ని సార్లు ఆవిడని తలుచుకోడం ఓ ఎత్తు, ఈ పుస్తకం వల్ల ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆవిడని తలుచుకోడం ఓ ఎత్తు. అందుకే, ఆ తలపులలోనే ఈ టపా.

ఎంతమంది ఎన్నిసార్లు ఆవిడ నటనని గురించి చెప్పారో! ఎంత మంది ఎన్నిసార్లు ఆవిడ నటనలో జీవించింది కానీ జీవితంలో నటించలేకపోయిందని బాధపడ్డారో! ఎంత మంది ఆవిడ ఉదార హృదయాన్ని పొగిడారో. వీరిలో గొప్ప గొప్పవారు మొదలుకుని, నా బోటి లాస్ట్ జనరేషన్ అమాయకపు అభిమానుల దాకా వందలమంది ఉన్నారు. నా వరకూ ఐతే, నవతరంగంలో నా మొదటి వ్యాసం సావిత్రి గారిపైనే. నవతరంగం మొదటి సంవత్సరంలో నా చివరి వ్యాసం కూడా ఆవిడ గురించే కావడం విచిత్రంగా అనిపిస్తోంది నాకు ఇప్పుడు. ఈ మధ్యలో మాయాబజార్ లో “అహనాపెళ్లంట” పాట లో సావిత్రి హావభావాలు చూడమని ఎన్నిసార్లు ఎంతమందితో అని ఉన్నానో. అన్న మనిషి దగ్గరే ఒక్కోసారి మళ్ళీ అనేసి, నన్ను వాళ్ళు పిచ్చిదానిలా చూస్తే, వెధవ నవ్వు నవ్విన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిది రాస్తూ ఉంటే కూడా నాకు ఆ నవ్వు మొహమే కనిపిస్తోంది మరి.

ఈ పుస్తకం నిండా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు-ఆవిడవి. ఎంత బాగున్నాయో. నిండుగా ఉందావిడ. మనిషి అంత లావుగా ఉంటే, ఈ కాలంలో ఎలా హీరోయినయ్యేదో నాకు అనుమానం కానీ, సావిత్రి ఎలా ఉన్నా జనం చూసేస్తారని మళ్ళీ నమ్మకం ఓ పక్క. అరే, లిప్తపాటులో ఎన్ని మాటలు పలుకుతాయి, పెదాలు కదలకుండానే! కళ్ళు మాట్లాడతాయని తెలుసుకానీ, ఇలా గలగలమని నవ్వగలవనీ, బాధపడగలవని గానీ, జాలిపడగలవని గానీ, అప్పుడప్పుడు అరుదుగా కోపం కూడా తెచ్చుకోగలవని గానీ నాకు సావిత్రిని చూసేదాకా తెలియలేదు. సావిత్రి సినిమా చూడని దురదృష్టవంతులకి ఆ కాస్త అదృష్టం కూడా లేదు. నా తరానికి ఏదో చూడగలిగే అదృష్టం అన్నా కలిగింది.

సినిమాకి సంబంధించిన పరిశోధనలు చేసేవారు కాస్త సావిత్రి గురించిన వారి పరిశోధనలను ఆన్లైన్లో పెడితే, అందరికీ, ముఖ్యంగా భావితరాలవారికి చాలా ఉపయోగపడుతుంది. ఒక్కోమనిషికీ ఒక్కో చరిత్ర ఉంటుంది. అందులో ఎంతమంది చరిత్రలు పదుగురికీ ఉపయోగపడతాయో నేను చెప్పలేనుగానీ అలా ఉపయోగపడే వారి జాబితాలో సావిత్రి పేరు ఉంటుంది, ఖచ్చితంగా. ఈ పుస్తకంలో లాగా ప్రస్తుతం జీవించి ఉన్న సినీ ప్రముఖుల్లో సావిత్రి గారితో అనుబంధం ఉన్నవారిని సంప్రదించి వారితో ఆవిడకున్న అనుబంధాన్ని గురించి వారి మాటల్లో చెప్పించుకుని ఓ సంకలనం చేయాలన్న ఆలోచన ఎవరికీ రాలేదంటే వింతగా ఉంది. సరే, ఇలాంటి విషయాలతో నాకాట్టే పరిచయంలేదు కానీ, అయినా కూడా ఏదో జరిగితే బాగుండు అన్న ఆశ, ఓ అభిమానిగా.

మొదట్లో రాయాల్సినా చివర్లో రాస్తున్న గమనిక: నేను సావిత్రి అభిమానిని అని ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అందుకని ఆవిడ్ని తలుచుకుంటున్నాను. మీరు అభిమానులు కావాలని లేదు. కానంత మాత్రాన మిమ్మల్ని నేనేమీ అనడంలేదని గమనించగలరు. అలాగే, తక్కిన నటీనటుల్ని నేనీ వ్యాసంలో ఎక్కడా ఏమీ ప్రస్తావించలేదు కనుక, పోలికలు మొదలుపెట్టకండని మనవి. పెట్టుకున్నా, ఈ వ్యాసాన్ని దానికి వేదిక చేయకండి.

13 Comments
  1. అరిపిరాల December 27, 2008 /
  2. Sreenivas Paruchuri December 27, 2008 /
  3. Sowmya December 28, 2008 /
    • kalyan January 14, 2009 /
  4. parimalam December 28, 2008 /
  5. vinay April 14, 2009 /