Menu

వహ్..శేఖర్ కమ్ముల, సలాం.

ఇదేదో ముస్లిం అబ్బాయి,హిందు అమ్మయి ప్రేమకధ ని తీసినందుకు చెప్తున్నది కాదు.ఒక ముస్లిం ప్రేక్షకుడి గా చెప్తున్నానని కూడా అనుకోవద్దు…ఆవకాయ బిర్యాని చూసినాక.. రాత్రంతా…పిచ్చపాటి…మా దోస్తుల మధ్య జరిగిన చర్చ ని ఇక్కడ రాస్తున్నాను.

వహ్..శేఖర్ కమ్ముల, సలాం.

ఇలా ఎందుకంటున్నా నంటే, ట్రూలీ,డీప్లీ,మాడ్లీ సినిమా దర్శకుడు కావాలన్నది..నా కల.

మూడుసంవత్సరాల క్రితం ఒక కొత్త నిర్మాత “ఇతర మతస్థురాలైన అమ్మాయిని పెళ్ళాడి,అష్టకష్టాలు పడి ఏలాగోలా తనతో పాటు దుబాయ్ తీసుకెళ్ళిన ఓ ముస్లిం అబ్బాయి కథని సినిమాగా తీస్తారా,” అని ఒక ఒక నిర్మాత వస్తే నేను, నా ఫ్రెండ్ ఆ నిర్మాతకు తెలుగు సినిమా కి కధా, పాత్రల విషయం లొ కొన్ని హద్దులు, పరిమితులు , ఫార్మాట్ లు ఉన్నాయని, అవి లేకపొతే కమర్షియల్ సినిమా విజయం సాధించలేదని..వేరే మాకధ ఒకటి చెప్పడం,అతనుతన కధ అయితేనే ఫైనాన్స్ చేస్తానని వెళ్ళిపోవడం జరిగింది.

తెలుగు సినిమా ప్రపంచంలో,
కొన్ని ప్రాంతాలు
కొన్ని వర్గాలు
కొన్ని కులాలు
కొన్ని వృత్తులు
వెండితెరకు అంటరానివి అయిపోయినవి…ఏప్పుడో……
వాటిని
ముమైత్ ఖాన్ బొడ్డు చూపించిననంత క్లోజప్లో కాకపొయినా కనీసం…దూరం నుంచి లాంగ్ షాట్ లోనైనా ఏ కెమరా లెన్సూ స్పృశించదు. అలాంటి సినిమాలను ఐమాక్సుల,మల్టిప్లెక్స్ల తెరలమీదికి రావు.రానివ్వరు. అటువంటి సినిమాలు తీసే దర్శకులు అప్పుడప్పుడూ ఒంటరిపొరాటాలు చేస్తూనే ఉన్నారు.

ఒకప్పుడు బాపు, విశ్వనాథ్, వంశీ లాంటి వారు మన పల్లెటూరి హీరోలను తెరకెక్కించారు. అప్పుడప్పుడూ నారాయణమూర్తి కూడా పల్లెటూరి హీరోలను మరో రకంగా తెరకెక్కిస్తున్నారు.అటువంటి తరుణం లో,సాధారణ జీవితాలను తెరకెక్కించి కమర్షియల్ గా విజయం సాధిస్తూన్న దర్శకుడు నిర్మాతగా మారి, తెలుగు మాతృభాష కాని ఒక దర్శకునిచేత సజీవ గ్రామీణ జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసినందుకు -మూలాలు పల్లెల్లో ఉన్న వ్యక్తులుగా-శేఖర్ కు మా సలాం.

—————————————————————–

మా పనుల మీద తిరిగే సందర్భాలలో ఈ సినిమా దర్శకుడు అనిష్ కురువిల్లని,ఆయన వర్క్ డెడికేషన్ ని కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ స్టూడియలలో చూస్తూ వస్తున్నాం. ఆయన అందమైన కుర్రాడిగా ఉన్నప్పుడు నుంచి,చిన్న వయసులోనే చాల పెద్దవయసు మనిషిగా మారిపొవడం కూడ చూస్తూ వస్తున్నాం.

ఇక శెఖర్ కమ్ములని అభిమానించటం, ప్రేమించడం సినీ ప్రేమికులందరకీ తెలిసిందే గా. అలా మాకందరికీ ప్రియమైన శేఖర్, అవినాష్ దర్శకుడిగా ఆవకాయ బిర్యాని సినిమ షూటింగ్ ప్రారంభం అని తెలియగానే, అది తొందరగా..ఎప్పుడు పూర్తవుతుందా అని ఏదురు చూడడం ప్రారంభించాము. ఆవకాయ బిర్యాని టైటిలే చక్కగా ఉందనిపించింది.అదే రోజు, “రేయ్ మీకో స్పెషల్ డిష్ తినిపిస్తాను రాండిరా” అని జో గాడు పిలిచి “బిర్యాని లో ఆవకాయని ఎప్పుడు తినలేదుగా,ట్రై చేద్దామా?”అని పంజగుట్ట నుండి బిర్యాని పార్సెల్ తీసుకొచ్చి ఆవకాయ కలుపుకొని చప్పరిస్తు తిన్నాం. క్రియేటివిటి బాగ తలకెక్కితే అంతే…అని మమ్మల్ని చూసిన చాలా మంది అంటుంటారు లెండి. 🙂

ఇక వర్కింగ్ స్టిల్ల్స్ చూస్తూ,సినిమ పాటలు విడుదలయ్యక ట్రైలర్స్ చూస్తూ,సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తుండగా మొత్తాని కి ఏలాగోలా ఒక్క రోజు ఐమాక్స్ లో ప్రీమియర్ షో చూసే అవకాశం వచ్చింది.కాని అదే రోజు రాత్రి వేరే పనిలో ఉండి నేను వెళ్ళలేక పోయాను.

అదే రొజు అర్థరాత్రి ప్రీమియర్ షో చూసిన ఫ్రెండ్స్ సినిమా అస్సలు బాగోలేదని ఫోను.అదేంటి, శేఖర్ అనీష్ లు వ్యక్తిగతంగా మరియు ప్రొఫేషనల్స్ గా నచ్చారు. వర్కింగ్ స్టిల్ల్స్ బాగ నచ్చేసాయి. పాటలు నచ్చాయి.పొస్టర్స్ నచ్చాయి.సినిమా నచ్చక పోవడమా?

సినిమ విడులైన రొజు సాయంత్రానికి మౌత్ టాక్- ఆవకాయ బిర్యాని ఫ్లాప్ అంటా…అని. రెండో రోజు నించి దినపత్రికల్లో ఫ్లాప్ అని….

మరోవైపు

అగ్ర హీరోల పరమ చెత్త సినిమాలను, ఫ్యామిలీ స్టొరీల ముసుగులో కొంతమంది హీరో ల సాఫ్ట్ పార్న్ సినిమాలను ’ఆహా ఒహూ సూపర్’ అంటూ పొట్టకూటికొసం,నాలుక బానిసత్వం తో అబద్దాల డబ్బా వాయించే టీ.వి యాంకర్లు సైతం ఆవకాయ బిర్యాని చెత్త అని.

శేఖర్ కమ్ముల బ్యానర్ లో ఇలాంటి సినిమా ని అస్సలు ఊహించలేదు అని ప్రచారం. అయినా సరే ఈ సినిమా చూడాల్సిందే అని మేము ఐదుగురం సినిమా చూడాలని ఐమాక్స్ కు వెళ్ళాం. టికెట్టు కొంటుంటే  పక్కనున్న ఒక నాగరిక ప్రేక్షకుడు “….బేకార్ సినిమా, దోస్తానా మస్తుగుంది” అన్నాడు. మేమాయన్ని చూస్తూ ఒక వెర్రి నవ్వు నవ్వాము. ఆయనకేం అర్థమయిందో మా చేతిలో ఆవకాయ బిర్యానీ టికెట్లు చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వాడు.

మొత్తానికి సినిమా చూసాము. నాకు నచ్చింది.

ఇది హిందు ముస్లిం కధ కాక పొయినా నచ్చేది.ఎందుకంటే ఈ సినిమా దర్శక నిర్మాతల ఆశయం నాకు నచ్చింది కాబట్టి.

—————————————————————–

ప్రపంచములో ఏ దేశం సినిమా చూసిన కొంచమైనా ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి.కాని ఇప్పటివరకు మన తెలుగు సినిమాల్లో మనం చూసిన/మనకి చూపిన పల్లెటూర్లు ఎక్కువ శాతం తమిళ గ్రామాలే. తమిళ సినిమాలు డబ్బింగ్ చేసుకోవడంలోనో రీమేక్ లు చెయ్యడంలోనో బిజీ అయిపోయిన మన సినిమా వాళ్ళు మన గ్రామాల దృష్టి పెట్టడంలో మర్చిపోయారు. దాంతో ఎప్పుడైనా మన గ్రామీణ జీవితం తెరపై కనిపిస్తుందా అనే అనుమానం రానంతగా మనం మర్చిపోయిన తరుణంలో ఇంతకాలానికి, ఇదిగో ఇది ఇండియా లో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం లో ఒక ఊరి వాతావరణంఅని ప్రపంచానికి చూపించుకోడానికి ఒక చక్కని సినిమా దొరికింది.

దౌర్భగ్యం యేమిటంటే చాలా వరకు తెలుగు సినిమాలు మన మూలాల్ని మర్చిపోయాయి. సినిమాలన్నీ ఆధునిక లైఫ్ స్టైల్స్ తో నిండిపోతున్నాయి.

పల్లెలు ఏవరిక్కవాలి, బడుగు జీవితాలు ఎవరిక్కవాలి….
వారి ఆనందాలు ఆనందాలే కాదు…
వారి ప్రేమలు ప్రేమ కధలే..కాదు..

ఏమో మరి మేమింకా పల్లెటూరి వాళ్ళమేమో మాకు మటుకు బిర్యానీ చాల బాగా నచ్చింది. అయితే ఈ సినిమా కొంతమందికి ఎందుకు నచ్చలేదంటే….

  • హీరొయిన్ పాత్ర హిందూ, హీరో పాత్ర ముస్లిం కావడం.ఆ లవ్ స్టొరీ ని అస్సలు ఊహించలేకపోయుండొచ్చు.(బొంబాయి సినిమా చూస్తుంటే ముస్లింలు కొంతమంది ఎలా ఫీల్ అయ్యారో అలా ఇప్పుడు కొంతమంది హిందువులు అస్సలు జీర్ణించుకోలేకపోయుండొచ్చు.)
  • ఒక ఆటో వాడి స్టోరి ఎవడికి కావాలి? ఎందుకంటే టికెట్ల ధరలు బాగా పెరిగిన ప్రస్తుత తరుణం లో కాస్తో కూస్తో ఎక్కువగామొదట ధియేటర్ కి వచ్చేది  కాలేజి స్టూడెంట్స్.ఈ ప్రేక్షకులు ఈ సినిమాలోని ఏ పాత్రలోనూ తమని తాము ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశమే లేదు.కనీసం పాత్రల్లో కాకపొయినా లొకషన్స్ లో కూడా ఎవరు తమని తాము ఐడెంటిఫై చేసుకొలేరు-కారణం- మనమెవరిమో ఎక్కడ్నంచొచ్చామో మనం మర్చిపోయి చాలా రోజులయిందిగా!
  • “క్యామెడీ ఎక్కడండీ సినిమాలో….ఏదో మాకుండే బాధలు మర్చిపోవడానికి మేము సినిమా చూడ్డానికి వస్తే మళ్ళీ మా బాధలే మాకు చూపెడ్తే ఎలా” పేద ముస్లిమ్ వాడో, నిరుపేదా బ్రాహ్మణుడో ఎవరి కథైనా మాకు ఫర్వాలేదు. కానీ మాకు సినిమాలో కామెడీ ఉండాల్సిందే.”
  • వేర్ ఈజ్ ది ఐటం సాంగ్?  పల్లెటూరు వాతావరణం. అసలే నగ్నంగా క్యాబరే డ్యాన్స్లు చేపించిన చరిత్ర కలిగిన మన పల్లెటూర్ల గురించి సినిమా తీస్తూ “బావాలూ….”, లేదా “మావలూ….” అంటూ ఒక ఐటం సాంగైనా లేకుండా ఇది కూడా ఒక సినిమానేనా?
  • ఇక హీరోయిన డిగ్రీ చదివి హైదరాబాదు కి దగ్గరలో ఉన్న వూరికి రావడం ఏంటి? ఏంచక్కా అమ్మనాన్నలతో గొడవపడి హైద్రాబాదుకి వచ్చి ఏ కంప్యూటర్ కోర్సో చదివి అక్కడొకడిని ప్రేమించి విదేశాల్లో డ్రీమ్ సీక్వెన్స్ లో డ్యూయెట్ లు పాడాలనుకోవాలని అనుకొవాలి గాని, పల్లెటూరికి వచ్చి, మంచి ఆవకాయ పరిశ్రమ పెట్టుకొవాలి మంచి హోటల్ ప్రారంభించాలి….అని సిల్లీ ఆశయాలు…నాన్సెన్స్. అంత కాదంటే ఇంట్లోనే కోళ్ళ పెంపకం, పాలు పితకడం, పిడకలు వేయడం లాంటివి చేపించి క్యామెడీగా చూపెట్టుంటే హాయిగా నవ్వుకునేవాళ్ళము కదా – పల్లెటూరోల్ల రోజువారి జీవితాలు చూసి.

….ఇలా ఎవరి తెలుగు సినిమా లెక్కలు వాళ్ళు వేసుకునివుండొచ్చు.

—————————————————————–

గ్లోబలైజేషన్ లో అమ్మను “అమ్మా” అనేందుకు సిగ్గుపడుతూ ఎవరైన వింటే పరువుపొతుందని “మమ్మీ” అని పిలుచుకునే వారికి హెచ్.ఎం రెడ్డి, బి.ఎన్.రెడ్డి, ఎల్వి.ప్రసాద్,కేవి.రెడ్డి మొదలగు వారిలా మనసుతో ఆలోచించి తీస్తే సినిమాలు నచ్చవు.

సంపాదించిన డబ్బుతో కాసేపు హాయిగా విదేశి బ్రాండేడ్ దుస్తులు వేసుకుని,సెంటులు పూసుకుని,విదేశికోక్ తాగుతూ, విదేశి పదార్ధాలు తింటూ ఏదో కాస్త ఏంజాయ్ చెయ్యడానికి, తొడ మస్తీ చెయ్యడానికి ఒక సినిమాని చూద్దామని వస్తే,ఇదేంటి,ఈ ఊర్లేమిటి,ఈ బాధలేమిటి?ఆవూరి మొహం నచ్చకే కదా, అందరం సిటిలకు,నగరాలకు,విదేశాలకు పారిపొతున్నది అని ప్రేక్షకులు ఆలోచిస్తున్న వరకూ, సమస్యలు గుర్తించకుండా మర్చిపోదాం అని అనుకునేంతవరకూ, కుల, మత ,ప్రాంతీయ, భేదాలతో నిండిన మెదళ్ళతో సినిమాలు చూసే చదువుకున్న మూర్ఖులు ప్రేక్షకులయినంతవరకూ మనకు మంచి సినిమాలు వచ్చే ఆస్కారం లేనట్టే.

—————————————————————–

ఏది ఏమైనా కాని చాలా చాలా కాలానికి తెలుగు సినిమలో మళ్ళీ తెలంగాణ (అంటే ప్రత్యేక తెలంగాణ వాదపు చర్చ దృష్టి తో కాదు) ఊరి పేరు వినిపించింది.వెనక బడ్డ తెలంగాణ లో ఓ మైనారిటి పాత్రని హీరో చెయ్యడం ఈ చిత్ర దర్శకనిర్మాతల గొప్పతనమే. ఆ విధంగా ఈతరం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కామన్ సెన్స్ తో పాటు “గట్స్” ఉన్న దర్శకుడు/నిర్మాత శేఖర్ కమ్ముల అని రుచి చూపింది ఆవకాయ బిర్యానీ.

అందుకే…శేఖర్ గారిని కలిస్తే ఓ రెండుముక్కలు చెప్పాలి.లేకపొతే మంచి స్వదేశి మనసుతో అలోచించి ఇలాగే సినిమాలు తీస్తే ఉన్న నాలుగు డబ్బులు కూడ పొతాయి. కాబట్టి “అయ్యా, శేఖర్ కమ్ములా,విదేశాలలో చదువుకొని ఉద్యోగం చేసి, సిటిలో ఉండే మీరు ఇలా గాంధి గారి సినిమాలు చూపిస్తే ఆధునిక హిపొక్రైటిక్ ప్రెక్షకులు మీ భావాల్ని జీర్ణం చేసుకొలేరు.కాబట్టి బ్రాండేడ్ దుస్తులు ధరించి తెంగ్లీష్లో మాట్లాడుతూ విలాసవంతమైన నగర జీవితాలు జీవించే వారి జల్సా కధలు తియ్యండి .

ఫైనల్ గా చెప్పేదేంటంటే…

ఆవకాయ బిర్యని మాకు నచ్చింది.

అంతే.

అనీష్ కురువిల్లా,శేఖర్ కమ్ముల లతో పాటు ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ మరియు ఈ సినిమా నిర్మాణం సహకరించిన ఆ ఊరివారికందరికీ మా కృతజ్ఞతలు.

మా దృష్టి లో తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక ’నవతరంగం’.

7 Comments
  1. sujata December 1, 2008 /
  2. శ్రీ December 1, 2008 /
  3. సైఫ్ అలీ గొరే.. December 1, 2008 /
  4. KONETI GOPINATH December 2, 2008 /
  5. శంకర్ December 2, 2008 /