Menu

కొత్త దర్శకుడితో కొత్త పరిచయం -ముఖాముఖి

మొదటి భాగం కోసం ఇక్కడ నొక్కండి.

అప్పటిదాకా దాదాపు చాలారొజుల తరువాత కలిసిన స్నేహితుల్లాగా మాట్లాడేసుకున్న తరువాత, ‘వినాయకుడు’ సినిమా విషయం చర్చకు రాగానే ఆ సినిమా నాకు in parts మాత్రం నచ్చిందన్న నిజం గుర్తుకొచ్చింది. ఈ సారి కొంత “ఫ్రొఫెషనలిజం” చూపిద్ధామని ఒట్టుపెట్టుకున్నాను.ప్రశ్నలేతప్ప చర్చలొద్దని నిర్ణయించుకున్నాను. కానీ ప్రశ్నలడుగుతున్నంతసేపూ ఆత్మారాముడు స్వగతంగా ఏదో ఒకటి వాగుతూనే వుంటే వాడి మాటల్తో కలిపి ఈ ఇంటర్వ్యూ ఇలా తయారయ్యింది…

నేను (నే): ‘వినాయకుడు’… అసలీ టైటిల్ ఎలా వచ్చింది?
సాయి కిరణ్ (సాకి): ఈ టైటిల్లో వింతేమీ లేదు అందరికీ తెలిసిన పేరే. అన్ని స్థాయిల్లోని ప్రజలూ వాడే పదమే. నిజానికి గణేష్, గణపతి అనే పేర్లకన్నా వినాయకుడు అంటేనే కొంత ‘నిండుతనం’ ఉందనిపిస్తుంది. ఈ టైటిల్ సజెస్ట్ చేసినప్పుడు పరిశ్రమలో చాలా మంది “వైబ్రేషన్ లేదు” అన్నారు. ఆ వైబ్రేషనేమిటో! అదెక్కడుంటుందో!! తెలీదుగానీ, నా కథకు తగ్గట్టుగా ప్రేక్షకులకు సులభంగా రిజిస్టర్ అయ్యేలా వుంటుందని అదే ఖాయం చెసాను.
(స్వగతం (స్వ): వైబ్రేషనా! సినిమా పేర్లలోకూడా ఈ మధ్యకాలంలో వైబ్రేషన్ ఆశిస్తున్నారా పరిశ్రమ జనాలు? అయినా కథలో పట్టు కథనంలో వైవిధ్యం లేకుండా సినిమా తీసేసి టైటిల్ లో వైబ్రేషనొచ్చినా, పేరే “వైబ్రేషన్” అని పెట్టినా ప్రేక్షకులు చూసేస్తారా!)

నే: అయినా మీకు ఒక లావుపాటి యువకుడ్ని పెట్టి మొదటి సినిమా తియ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఇండస్త్రీ గ్రామర్ కి విరుద్ధం కదా!
సాకి: నాకు నేను రాసుకున్న కథ నచ్చింది. ఆ కథతో ప్రతిమనిషీ identify చేసుకోగలడు అనే నమ్మకం కలిగింది. ఇండస్ట్రీ గ్రామర్,రూల్స్ లాంటివి నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా నాకు నచ్చిన కథ, నేను స్పందించిన కథ అందరి అనుభవంలోకీ రాగల కథ సినిమాగా తియ్యడం. అదే నేను చేసాను. బహుశా పరిశ్రమకు కొత్తకావడం అలాగే శేఖర్ కమ్ముల వంటి free spirited దర్శకుడితో పనిచెయ్యడం వలన అదే సరైన విధానమనుకుని ప్రొసీడ్ అయ్యాను.
(స్వ: రైటే!!! అయినా ప్రస్తుతం పరిశ్రకు గ్రామరెక్కడిదీ? నిజానికి సృజనాత్మకత అంటే గ్రామర్ని తుంగలోతొక్కి మనసుకు నచ్చినట్టు, మనుషులకు నచ్చేట్టు, మనసులకు హత్తుకునేట్లు తియ్యడమే, follow your heart my dear Kiran… bravo!)

నే: అవునూ మీరు కథ హ్యాపీడేస్ కంటే ముందు రాసుకున్నారు కదా, అప్పటికి మీ సినిమా హీరో ‘కృష్ణుడు’ పరిశ్రమకు రాలేదు. అలాంటప్పుడు ఈ భారీకాయం పాత్రలో ఎవర్ని ఊహించుకుని రాసారు?
సాకి: కథ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అని మనసులో లేరు. కానీ ఒక స్థాయిలో ఈ సినిమా తియ్యగలనా లేదా అనే పరిస్థితొచ్చినప్పుడు, నాకు నచ్చిన ఈ స్క్రిప్ట్ ని కనీసం HD-Video లో తీసేసి DVD గానైనా అమ్ముదామని డిసైడ్ అయ్యాను. ఆ సమయంలో నా మిత్రుడు అభిజిత్ అగర్వాల్ ను ఈ పాత్రకు అనుకున్నాను. కానీ అదే సమయంలో సరైన నిర్మాత దొరకడం హ్యాపీడేస్ టైం లో కృష్ణుడిని కలవడం అలా జరిగిపోయాయి. అటూఇటూ కలిపి ఇదొక క్రేజీ కాంబినేషన్లాగా తయారయ్యింది.
(స్వ: ఓహ్! ఈయనకూడా HD-DVD ఆలోచన చేసాడన్నమాట. నవతరంగం ప్రజలూ… మన ఆలోచనలు కరెక్టే! ఇక మనం తయారవ్వాల్సిందే…సినిమా తీసెయ్యాల్సిందే.)

సాయి కిరణ్

సాయి కిరణ్

నే: అవును. హ్యాపీడేస్ తో సోనియా కూడా చాలా పాప్యులర్ అయ్యింది. మీరు కావాలని ఈ కాంబినేషన్ అనుకున్నారా లేక అదీ మీ స్క్రిప్టే నిర్ణయించిందా?
సాకి: వినాయకుడు సినిమాలో హీరోయిన్ ఒక Independent working women. ఆ పాత్రకు కావలసిన లక్షణాలు సోనియాలో వున్నాయి. పైగా తను కార్పొరేట్ రంగంలో కొన్నాళ్ళు పనిచేసింది కూడా. తనను ఈ పాత్రకు ఎంచుకునేప్పుడు తన కెపాసిటీతో పాటూ కాంబినేషనూ కమర్షియల్ గా వర్కౌట్ ఆవుతుందనే నమ్మకం I had at the back of my mind.
(స్వ: అవ్వాకావాలి బువ్వాకావాలి అని అడక్కూడదంటారు. కానీ, అవ్వాబువ్వా రెండూ దొరికితే అంతకంటేనా! పాత్రకు సరిపోయే నటి దాంతోపాటూ క్రేజీకాంబినేషన్ దొరికితే అంతకన్నా ఏంకావాలి.)

నే: డస్కీ సోనియా పక్కన ఫెయిర్ కాంప్లెక్షన్ వున్న పూనమ్ కౌర్ ని పెడితే ప్రేక్షకులు కొంత తికమకకు లోనవుతారని మీకు అనిపించలేదా?
సాకి: ఈ కాంబినేషన్ ని ఇలాక్కూడా చూడొచ్చని నేను అనుకోలేదు. నాకు కథా పరంగా కావలసింది ఒక గంభీరంగా ఉండి self respect కలిగిన అమ్మాయి, తన స్నేహితురాలిగా హీరోయిన్ కు  కొంత వ్యతిరేకంగా, చలాకీగా ఉండే పాత్ర. పాత్రల పరంగా వీరివి రెండు విభిన్నధృవాలు. ఆ స్నేహితురాలి పాత్రకు పూనమ్ సూటవుతుందనుకున్నాము తీసుకున్నాము. తన స్కిన్ కలర్ వలన ప్రేక్షకులు తికమక పడే అవకాశమే లేదు. పాత్రల పరంగా వారి వారి identity వారికుంది. నిజానికి పూనమ్ పాత్ర తన జీవితానికి దగ్గరగానూ, సోనియా పాత్ర తన జీవితంలో ఒక భాగంగానూ అనిపిస్తాయి. They are partly like that personally.
(స్వ: వార్నీ…  అంటే అది ప్రేక్షకులు పడే తికమక కాదు నా సొంత పైత్యమన్న మాట! ఇలా కాదుగానీ మరికొంచెం సీరియస్ ప్రశ్నలెయ్యాలి )

నే: కృష్ణుడు – సత్యా కృష్ణన్ మధ్య అక్కాతమ్ముళ్ళ సెంటిమెంట్ పెట్టారు. కానీ, దానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇచ్చినట్లు కపడదే!
సాకి: సెంటిమెంట్ “పండించడం” నాకు రాదు. తమ్ముణ్ణి అవమానిస్తే ఊరుకోక గొడవపెట్టుకునే అక్కగా లిఫ్ట్ సీన్, తమ్ముడు బాధలో ఉంటే ఓదార్చే అక్కగా వర్షం సీన్, తమ్ముడు బాధకు కారణమైన సోనియాను తన తమ్ముడికి దూరంగా ఉండమనే హాస్పిటల్ సీన్ ఈ మూడు చాలు వారి మధ్యనున్న బంధాన్ని చూపించడానికి అనిపించింది. భారీ డైలాగులూ, ఏడుపులూ, ఓదార్చుకోవడాలూ, నిజజీవితంలోని సంబంధాల్లో ఉండనట్లే, నా సినిమాలో ఇలాంటివి ఈ ఇద్దరి మధ్యా ఉండవు. వాళ్ళిద్దరూ అక్కా-తమ్ముళ్ళు అంతే! ఆ ఒక్క బంధం చాలు సెంటిమెంట్ అనుకోవడానికి. ఇలాంటి సంబంఢాల్ని పనిగట్టుకుని పండించాలని నేను అనుకోలేదు.
(స్వ: ఇలా తెలుగు సినిమా సెంటిమెంటుని పునర్నిర్వచించేస్తే ఎట్టాకుదురుద్దీ!! సెంటిమెంటుకు స్కోపుంటే పిండుకోవాలిగానీ, నిజజీవితంలో ఇలా ఉండవంటే ఎలాగా? హేమిటో సాయికిరణ్ ఇంకా ఎదగాలి.)

సాయి కిరణ్ తో నేను

సాయి కిరణ్ తో నేను

నే: సెంటిమెంట్ సరే…సోనియా- రాజీవ్ మధ్య సంబంధం తెగిపోవడానికి గల కారణం కూడా మరీ అంత కన్విన్సింగా కూడా లేదుకదా!
సాకి: ఈ విషయం నాతో కొందరు అన్నారు కూడాను, అంత మంచి కుర్రాడు. మంచి ఉద్యోగం. ఇద్దరికీ స్నేహంకూడా కుదిరింది. అలాంటప్పుడు కేవలం పోలీసులకు లంచం ఇచ్చాడని సంబంధం మానుకోవడమా అని. కానీ ఈ సినిమా చూసిన కొంత మంది అమ్మాయిలకు ఈ పాయింట్ నచ్చింది. ఇక్కడ మనం చూడాల్సింది రాజీవ్ ఇచ్చిన లంచం గురించి కాదు. సోనియాని వ్యభిచారిగా ట్రీట్ చేసిన పోలీస్ ఇంస్పెక్టర్ కి లంచ మివ్వడం ద్వారా రాజీవ్ సోనియాను prostitute అని ఒప్పుకున్నట్లయ్యింది. ఆత్మగౌరవం వున్న సోనియాకు ఈ విషయం నచ్చలేదు. అవమానంగా ఫీల్ అయ్యింది. ఇలాంటి వ్యక్తి భర్తగా ఒద్దనుకుంది. ఈ విషయాన్ని మనం రాజీవ్ సొనియాకి పనికొస్తాడా అనికాకుండా, సోనియాకి ఆ ఘటన వలన ఏమనిపించింది అనేది ముఖ్యం.

నే: నిజమే! పైగా ఈవ్ టీజర్లకు బుద్దిచెప్పి కృష్ణుడు హీరోగా నిలబడతాడుకదా..!
సాకి: అవును సోనియాకి ఆ కంపేరిజన్ అవసరం.

నే: అంకిత పాత్రకూడా హీరోని సోనియా కళ్ళలో హీరోని చెయ్యడానికి ఉపయోగించారు.
సాకి: అంకిత పాత్రలాంటి వాళ్ళు కార్పొరేట్ రంగం లో ఉంటారు. తమ అవరాలకి మనుషుల్ని వాడుకోవడం. అవసరమైతే వాడుకోబడటానికి సిద్ధపడటం సాధారణంగా జరిగే విషయం. కానీ ఇక్కడ రెండు విధాలుగా అంకిత పాత్ర హీరో ని ‘హీరో’గా ని చేస్తుంది. “I care a damn about the society” అని అంకిత అంటే కృష్ణుడి moral values కి వ్యతిరేకంగావున్నా, “నువ్వు నాకు నచ్చలేదు” అంటాడేగానీ దాన్నొక moral issue లాగా చూడడు. అలాగే, అంకిత వెళ్ళిపోతూ “నా నుంచీ ఏమీ ఆశించకుండా సహాయం చేసిన ఒకేఒక్క మగాడివి నువ్వు. నిన్ను జీవితాంతం మర్చిపోను” అని చెప్పి, సోనియాకళ్ళలో హీరోని అమాతమైన ఎత్తులో నిలిపింది.
(స్వ: ఇంకానయం నేను తెరమీద అంకిత కనపడగానే ఒక ఐటం సాంగ్ ఖచ్చితంగా ఉంటుందనుకున్నాను. దర్శకుడు పాత్రల్ని ఎలివేట్ చెయ్యడం గురించి చెబుతున్నాడేగానీ, ప్రేక్షకుల్ని “ఎలివేట్” చేసే అవకాశాన్ని ఒదులుకున్నాడని తెలుసుకోడే! పాపం ఇండస్ట్రీలో ఎలా బతుకుతాడో ఏమిటో.)

నే: కానీ హీరో పాత్ర మరీ చిన్నపిల్లాడిలా, కళ్ళు మూసుకుంటే రంగులు కనపడతాయి అని చెప్పడం. quote – unquote కు చేసే సౌజ్ఞను “what is this” అనడం.premarital sex గురించి చర్చల్లో అలా అడిగెయ్యడం అవసరం అంటారా?
సాకి: మన హీరో హైదరాబాదొచ్చేది ‘రాజోలు’ నుంచీ. పైగా అమాయకుడు సిటీ పోకడలు తెలీనివాడు. అందుకే, కొన్ని సీన్లు అది చెప్పడానికి కావాలి.కాకపోతే నిజంగా మనం కళ్ళుమూసుకుంటే కనిపించే రంగునిబట్టి state of mind తెలుస్తుంది అనేది ఒక పాప్యులర్ నమ్మకం. దానికి కొంత scientific reasoning కూడా ఉందని చదివాను. బాగా అనిపించింది సినిమాలో పెట్టాను. (వెంఠనే కళ్ళు మూసుకుని కళ్ళు తెరచి) ఇప్పుడు నాకు yellow – orange mix గా ఒక కలర్ కనపడింది దానర్థం ఏమిటో తేలీదు! (అంటూ నవ్వేసాడు).

నే: మరి “quote – unquote”?
సాకి: ఓ అదా! అది నిజంగా నా జీవితంలో జరిగింది. చాలా మంది ఇంగ్లీషు చదువుకున్నోళ్ళు అలవోకగా రెండు చేతుల్లోని వేళ్ళూ మాట్లాడుతూ మాట్లాడుతూ గాల్లో కొటేషన్లు పెడుతూ ఉంటారు. నాలాంటి సామాన్యులకి అది అర్థం కాదు. నేనొకసారి అన్నపూర్ణాస్టూడియోస్ సుప్రియ గారితో మాట్లాడుతూ వుంటే ఆవిడ మాట్లాడుతూ  చాలా సార్లు ఆ సౌజ్ఞ చేసారు. అప్పుడే నేనూ “what is this?” అని అడుగుదామనుకుని ఎందుకులే అని మానేసాను. ఆ తరువాత తెలిసింది, సంభాషణల్లో ఎదైనా emphasize చెయ్యడానుకో లేక ఏదైనా technical term వాడుతున్నప్పుడో అలా గాల్లో కొటేషన్లు పెడతారని. వింతగా అనిపించి నా హీరో చేత అడిగించేసాను.

నే: మరి premarital sex చర్చ!?!
సాకి: ఓ అదా..అది నా జీవిత అనుభవం కాదుగానీ. ఒక సింపుల్ ఫిలాసఫీ ఏంటంటే, ఎవరైనా అతితెలివిగా వాదిస్తుంటే మనం సూటిగా వాదించడం మెదలెడితే వాళ్ళు ఇరుక్కుపోతారు. ఆ సీన్లో అదే చూపించాలనుకున్నాను. అంత తెలివిగా values గురించి స్వతంత్ర్యాన్ని గురించి వాదిస్తున్న సోనియా, “అయితే నువ్వు చేస్తావా?” అన్న కృష్ణుడి అమాయపు ప్రశ్నకు సమాధానం చెప్పలేక విసుక్కొని వెళ్ళిపోతుంది,

నే: అక్కడ కొంచెం obscene గా తయారవుతుందేమో అనుకున్నాను.
సాకి: అలా అనిపించిందా?

నే: లేదు లేదు. అయ్యేదే కానీ కృష్ణుడి అమాయకత్వంతో ఆ ప్రమాదం నుంచీ బయటపడింది. It was a good scene.
సాకి: దాంక్యూ!

నే: కానీ, బాస్ పాత్రా, బాస్ భార్య పాత్రా మరీ తేలిపోయినట్లున్నాయి.
సాకి: అలా అనిపించిందా? బాస్ పాత్ర చేసింది నిర్మాత ప్రేమ్ కుమార్ పాత్రా గారు. మొదట్లో కేవలం ఒక సీన్ కోసం అనుకున్నాం. కానీ, ముఖంలో ఏఫీలింగ్ లేని బాస్ పాత్ర కొంచెం కామిక్ రిలీఫ్ గా ఉంటుంది. అదీగాక చాలా సీన్లు ఆఫీసులో ఉంటే బాస్ లేకుండా ఉంటే బాగోదని కొంచెం నిడివి పెంచడమయ్యింది.ఇక ఆఖరి సీన్లో  కనిపించే బాస్ భార్యగా ‘తులసి’ చాలా కాలం తర్వాత నటించారు. ఆఖరి సీన్లోని ప్రాముఖ్యత హీరోకు హీరోయిన్లు ప్రపోజ్ చెయ్యడం. అక్కడ వేరే పాత్రలకు importance ఇస్తే ఎలా అని, అలా చెయ్యాల్సి వచ్చింది.

నే: హ్మ్మ్ అవునూ మీ సినిమాకు సెన్సారు వాళ్ళు U సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? రెండు మందు సీన్లు ఒక రొమాంటిక్ సీనూ ఉందికదా!
సాకి: ఏం చూపించాము అనేదానికన్నా, ఎందుకు చూపించాము.సిట్యుయేషన్ ప్రకారం ఆ సీన్ అవరమా కాదా అనేవి సెన్సార్ వాళ్ళు పరిగణలోకి తీసుకునే విషయాలు. వాటి ప్రకారం చూస్తే ఆ సీన్లేమీ పెద్ద అభ్యంతరకరం కావే? రొమాంటిక్ సీన్ కూడా పెద్ద ఇబ్బందికరమైన సన్నివేశం కాదే?

నే: అరే! అంతగా ఆలోచించకండి. ఈ మధ్య ఫ్యామిలీ సినిమాలంటూ వచ్చే సినిమాలలో చూపించే హింసా శృంగారంతో పోలిస్తే మీ సినిమాలో వున్నది వెయ్యోవంతుకూడా కాదు. నాకు తెలిసి మందుకొట్టే సీన్లుంటే సెన్సారువాళ్ళు కనీసం U/A సర్టిఫికెట్ ఇస్తారని. అందుకే అడిగాను. అయినా లావుపాటి హీరోని పెట్టుకుని  ఆ పాత్రని హింసించి హాస్యాన్ని సృష్టించే ప్రయత్నం చెయ్యకపోవడమే ఒక పెద్ద అఛీవ్మెంట్. కానీ పార్టీలో సోనియా కృష్ణుడిని అవమాన పరిచే సీన్ కాస్త వోవర్ అనిపించింది.
సాకి: అక్కడకూడా నా ఉద్దశం హీరొని అవమానించాలని కాదు. లావుగున్నావని అపహాస్యం చెయ్యడానికి కాదు. ఈ పార్టీ సీన్ ఆఖర్న వచ్చే పార్టీ సీన్ కి contrast అన్నమాట. ఈ పార్టీలో నలుగురి మధ్యనా అవమానించిన సోనియా ఆఖర్న దాదాపు వందమందున్న పార్టీలో మోకాళ్ళమీద కూర్చుని నన్ను పెళ్ళిచేసుకోమని అడగటమే కదా కథంతా! అలాంటప్పుడు ఆ సీన్ అత్యంత కీలకం కదా?
(స్వ: అవునూ …తొమ్మిది వర్షన్లు రాసుకున్నోడు ఇవన్నీ ఆలోచించే రాసుకునుంటాడుకదా! మరీ ఈ శల్య పరీక్షలు అవసరమా? అయినా, ఈ ప్రశ్నలు అడిగితేనేకదా సమాధానాలున్నాయని తెలిసేది. లేకపోతే ఎవరు అడిగేవాళ్ళు సాయికిరణ్ ఎక్కడ సమాధానం చెప్పేవాడు. నేర్చుకోవాలంటే ఆ మాత్రం తప్పుదు మరి)

నేను: ఏది ఏమైనా మీ సినిమా మల్టిప్లెక్స్ చిన్న సినిమాగా రిలీజై ఇప్పుడు మంచి హిట్ సినిమాగా నిబడింది. congratulations.
సాయి కిరణ్: Thank you. నేనుకూడా మల్టీప్లెక్స్ సినిమానే అనుకున్నాగానీ పాలకొల్లు, తణుకు లాంటి చిన్నచిన్న పట్టణాలలోకూడా మంచి కలెక్షన్లతో ఈ సినిమా నడుస్తోంది. అంటే అందర ప్రేక్షకులూ ఈ సినిమాని ఆదరించినట్లే అనిపిస్తోంది.

నేను: Best of luck for you from Navatarangam.com.

సాయి కిరణ్: ధ్యాంక్యూ!

(స్వగతం: హమ్మయ్య ఒక ఇంటర్వ్యూ అయ్యింది. ప్రజలు కనీసం ఇంటర్వ్యూ లాంటి ప్రయత్నమన్నా అయ్యిందనుకుంటే చాలు.లేదూ కనీసం సాయి కిరణ్ తో పరిచయం కలిగిందనుకుంటే చాలేమో!)

29 Comments
 1. raghu December 17, 2008 /
 2. Aruna Pappu December 17, 2008 /
 3. Madhura vaani December 17, 2008 /
 4. Vijayavardhan December 17, 2008 /
 5. శరత్ December 17, 2008 /
 6. ఉమాశంకర్ December 17, 2008 /
 7. a2zdreams.com December 17, 2008 /
 8. sahiti December 17, 2008 /
 9. cbrao December 17, 2008 /
 10. సైఫ్ అలి గొరే.. December 17, 2008 /
 11. సైఫ్ అలి గొరే.. December 17, 2008 /
 12. సైఫ్ అలి గొరే.. December 17, 2008 /
 13. surya December 18, 2008 /
 14. Aravind December 18, 2008 /
 15. Satya Shyam KJ December 18, 2008 /
 16. Satya Shyam KJ December 18, 2008 /
 17. sahiti December 18, 2008 /
 18. విష్ణు December 18, 2008 /
 19. Suresh Kumar Digumarthi December 19, 2008 /
 20. srinivas goud December 19, 2008 /
 21. Reddy Ganta January 8, 2009 /
 22. కొత్తపాళీ March 1, 2009 /