Menu

కొత్త దర్శకుడితో కొత్త పరిచయం

మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ చేరుకున్నాను.ఫోన్ లో మళ్ళీ ఆఫీస్ అడ్రస్ అడగాల్సొచ్చింది. ఒకటో సారి. రెండో సారి మూడో సారి. అదే గొంతు విసుగులేకుండా ఓపిగ్గా డైరెక్షన్స్ చెబుతుంటే…’కొత్తగా విజయాన్ని దక్కించుకున్న ఒక నూతన సినీదర్శకుడు ఇంకా సాధారణంగా ఉన్నాడంటే అసాధారణమే’ అనిపించింది. ఆఫీస్ లోపలికి అడుగుపెట్టాను. అప్పుడే కొత్తగా ఏర్పాటుచేసుకుంటున్న పార్టిషన్లు ఇంకా పని జరుగుతున్నట్లుగా సంకేతాలందించాయి. ఆదివారం కాబట్టి వర్కర్లు పని చెయ్యడానికి రాలేదేమోగానీ, లేకుంటే the office would have been bustling with work of setting up the place…a new place for new achiever in Telugu film industry.

రిసెప్షన్లో ఎవరూ లేరు. లోపల కొన్ని గొంతులు వినపడుతున్నాయి. కొంత ఇబ్బందిగా అనిపిస్తుండగానే గదిలో అడుగుపెట్టాను.’సాయి కిరణ్!!’ అంటూ నేను నీళ్ళు నమిలేసరికీ పాతిక ముప్పై సంవత్సరాల యువకుడొకరు “హలో మహేష్” అంటూ చెయ్యి కలిపాడు. పరిచయాల తర్వాత, “ప్లీస్ ఓ రెండు నిమిషాలు వెయిట్ చెయ్యగలరా!” అంటూ పక్కనున్న వ్యక్తితో నన్ను పక్కగదిలో కూర్చోబెట్టమని పురమాయించాడు. రెండు నిమిషాలకన్నా ముందే వచ్చి, “చెప్పండి మహేష్ గారు. ఏదో స్టోరీ డిస్కషన్ నడుస్తుంటేనూ…” అంటూ ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు చూసాను, ఏదో కాలేజో యూనివర్సిటీ క్యాంపస్ లోనో కనిపించే ఒక సాధారణ విద్యార్థిలాంటి యువకుడ్ని. తెలివైన ముఖం. తెలివిని కప్పిపుచ్చే అమాయకపు కళ్ళద్దాలు. ఆ కళ్ళద్దాలమాటున దాక్కునీ దాక్కోలేకున్న విజయగర్వంతో కాకుండా విజయానందంతో మెరిసేకళ్ళు. తన పేరు సాయి కిరణ్ అడివి. ఈ మధ్య చిన్న సినిమాగా రిలీజై పెద్ద సినిమా స్థాయిలో నడుస్తున్న ‘వినాయకుడు’ సినిమా దర్శకుడు.

‘నవతరంగం’ వెంకట్, ‘ఈ సినిమా దర్శకుడితో ఇంటర్వ్యూ చేస్తావా?’ అని అడిగితే ‘ఇంతవరకూ సినిమానే చూడ్లేదు చూసింతర్వాత చెబుతా’ అన్నాను.అయితే శుక్రవారం ఈ సినిమా చూసింతర్వాత ఈ దర్శకుడ్ని ఖచ్చితంగా కలుసుకోవాలి అనిపించింది. ప్రస్తుతకాలంలో తెలుగు సినిమా విపరీతపోకడలతో విసిగి కనీసం మనుషుల గురించి సినిమాలొస్తే చాలనుకునే స్థితికి చేరుకున్నాను. ఆ కోణంలో వినాయకుడు మనుషుల గురించి సినిమానేకాక ఒక విభిన్నమైన మనిషిని ప్రధానపాత్రధారిగా చేసుకుని హైదరాబాద్ కార్పొరేట్ రంగ జీవనశైలి అనే పార్శ్వాన్ని అపహాస్యంగానో లేక over simplified గానో కాకుండా కొంత అవగాహతో తెరకెక్కించిన సినిమాగా నాకు నచ్చింది.అందుకే ఈ దర్శకుడిని పరిచయం చేసుకోవాలనే కోరిక కలిగింది.

నవతరంగం గురించి పరిచయం చేసిన తరువాత సాయికిరణ్ ని అభినందిస్తూ అసంకల్పితంగా ‘congratulation on the success of VINAYAKUDU. I liked the film in parts’ అని చెప్పేసి కొంత ఇబ్బందిపడ్డాను. అసలే మొదటి పరిచయం. అతని మొదటి సినిమా. పైగా విజయవంతమైన సినిమా. దాని గురించి నేను ‘అక్కడక్కడా మాత్రం నచ్చింది’ అని ఆరిందాలా అనేస్తే ఎలా రియాక్టవుతాడా అని అనేసినతరువాతగానీ నాకు తట్టలేదు. కానీ కిరణ్ హుందాగా “నిజమేనండీ there is lot of scope for improvement. నేనుకూడా వినాయకుడు సినిమా,సినిమా తియ్యడం నేర్చుకునే ప్రక్రియలో భాగంగానే తీసినట్లే లెఖ్ఖ” అన్నాడు.అప్పుడనిపించింది నా ఎదురుగా ఉన్నది ఏదో లక్కీగా హిట్ కొట్టిన బాపతు కాదు అని. సినిమాని నేర్చుకోవాలి అనే కోరికున్న దర్శకులు పరిశ్రమలో చాలా కొద్ది మందే ఉంటారు. మిగతావాళ్ళు కేవలం సినిమా ‘తీసిపడేస్తుంటారంతే!’ ఆ కొద్దిమందిలో బహుశా ఇతనొకడు.

సినిమాని నెర్చుకుందామనే ఈ వ్యక్తి నేపధ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని దానిగురించే కొంత ఆరాతీసాను. కిరణ్ తండ్రి గారు ‘పిల్లలు మార్చిన చల్లని రాజ్యం’ వంటి పుస్తకాలు రాసిన అడివి కనకరాజు గారు. తల్లి అడివి సుబ్బరత్నం గారుకూడా రచయిత్రే. స్వతహాగా బాల్యం నుంచీ పుస్తకాలతొ పరిచయమున్న వ్యక్తి. స్కూలు కాలేజిలు హైదరాబాద్ అనే కూపంలో కాకుండా కాకినాడ, గుంటూరు, వైజాగ్ లాంటి పట్టణాల్లో చేసారు. అంటే కొంత కథా జ్ఞానం,మరికొంత విస్తారమైన జీవితాన్ని అర్థం చేసుకున్న సాధారణ వ్యక్తన్నమాట.

ఈ నేపధ్యం నుంచీ సినీపరిశ్రమ దారెలా పట్టారన్నది తరువాత ఉదయించిన ప్రశ్న. “చిన్నప్పటి నుంచీ నేను చదువులో పెద్ద అఛీవర్ని కాను. మిగతా పిల్లల్తో పోల్చి నా సమర్ధతను వెలకట్టేప్పుడు కొంత చిన్నతనంగా అనిపించినా, జీవితంలో నేను నాదైన రంగంలో విజయవంతంగా నిలబడి చూపిస్తాను అనే కసిరగిలేది. నాకు తెలిసిందల్లా కథ చెప్పడం. అందుకు సినీరంగంకన్నా మంచి అవకాశం మరెక్కడా దక్కదనే నిర్ణయానికొచ్చాను” అని సమాధానం వచ్చింది. ‘ఈ జీవితాన్ని నిర్దేశించే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు?’ అన్నదానికి సమాధానంగా “డిగ్రీ చదవక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదేమాట మా నాన్నగారికి చెబితే ముందు డిగ్రీ పూర్తిచెయ్ తరువాత వెళ్దువుగానీ అన్నారు. అప్పుడే జీవితంలో మొదటి సారిగా సినిమాకోసం Bcom డిగ్రీ పూర్తిచెయ్యడానికి శ్రమపడి చదివాను. సినిమాకోసం చదువన్నమాట!” అని కిరణ్ కొంత nostalgic గ్గా అనే సరికీ నా మనసు చమ్మగిల్లింది. సినిమాని ఒక జీవితగమ్యంగా చేసుకున్న ఒక నవయువకుడు కళ్ళముందు కదిలాడు. కళ్ళకెదురుగా అది సాధించిన యువకుడు కనిపించాడు.

‘మరి మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? హైదరాబాద్ వచ్చినప్పటినుండీ మీ పరిశ్రమ అనుభవాలేమిటి?’ అని ప్రశ్నలడిగాను.”చాలా మందిలాగే రాంగోపాల్ వర్మ ‘శివ’ తో నాలో సినిమా కోరిక తలెత్తితే ‘రంగీలా’ చూసింతర్వాత ఈ సినిమా లాంటిది నేనూ తియ్యగలననే నమ్మకం వచ్చింది. అదే సమయంలో అంటే 1997 ప్రాంతంలో నేను హైదరాబాద్ వచ్చి రాంగోపాల్ వర్మ గారిని కలిసి ఆయన దగ్గర పనిచెయ్యాలనుకున్నాను. కానీ అప్పుడది కుదరలేదు. ఆ తరువాత 1998లో మా అమ్మగారు మరణించడంతో ఒక సంవత్సరంపాటూ సినిమాకు దూరంగా ఉన్నాను. 1999 లో మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికీ పరిస్థితిలో చాలా మార్పులొచ్చాయి. అప్పుడే ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా తీసిన నాగేష్ కుక్కునూర్ దగ్గరైతే నేను కొంతైనా నేర్చుకోగలననిపించి ఆయన దగ్గర చేరుదామనుకున్నా. కానీ,ఆయన కొన్నాళ్ళపాటూ US వెళ్ళిపోయారు. ఇప్పుడెలా? అని నిరాశ చెందే సమయంలో డెక్కన్ క్రానికల్లో ‘డాలర్ డ్రీమ్స్’ సినిమా చేసిన శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ చదివాను. ఈ దర్శకుడిదగ్గరైతే బాగుంటుందనిపించి ఆయన్ని కలుసుకున్నాను. మొదటి పరిచయంలో “నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలనుకుంటున్నానండీ” అంటే “No… we shall work together” అన్నారు. ఆ ఒక్క మాటతో శేఖర్ తో పనిచెయ్యాలని డిసైడ్ అయ్యాను”.

‘అంటే…ఆనంద్ సినిమాతో మీ కెరీర్ మొదలయ్యిందన్నమాట’…అంటూ నేను excite అయిపోతుంటే కిరణ్ చల్లగా “ఆనంద్ సినిమా అనుకున్న సమయంకన్నా కొంత ఆలస్యంగా మొదయ్యింది. అప్పుడు మళ్ళీ నేను రాసుకున్న స్కిప్టులు పట్టుకుని కొన్ని ప్రయత్నాలు చేసాను. ఆ సమయంలో ఒక డాక్యుమెంటరీకూడా తీసాను” అని మరో కోణాన్ని ముందుంచాడు. ‘డాక్యుమెంటరీనా!’ అని కొంత ఆ(హా)శ్చర్యంగా అడిగేసాను. “నేను సినిమా ప్రయత్నాల్లో ఉండగా కె.కె.రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు మాకొక డాక్యుమెంటరీ కావాలి అది తీసిపెడితే దాన్నిబట్టి సినిమా సంగతి తరువాత ఆలోచిద్ధాం అన్నారు. అప్పుడు ఆ సంస్థ కోసం తీసిన డాక్యుమెంటరీ “Flash in the Darkness” ఈ ఫిల్మ్ అమెరికా మరియూ ఇతర దేశాలలో ప్రదర్శనల్లో అభినందనలు అందుకుంది.పరిశ్రమలో చాలా మంది ఫీచర్ ఫిల్మ్ కనా డాక్యుమెంటరీ సులభంగా తియ్యొచ్చని ఎందుకనుకుంటారో నాకు అర్థం కాని విషయం. నాకైతే డాక్యుమెంటరీ తియ్యడం కష్టం అనిపిస్తుంది. ఉన్నకథని పాత్రలతో నటింపజెయ్యడం కన్నా, నిజాన్ని హత్తుకునేలా చెప్పడం ఎంతైనా కష్టమే కదా!” అని కిరణ్ నన్ను ప్రశ్నించే సరికీ అసలే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొచ్చిన నాకు ఒక వీశెమంత గర్వం అనిపించింది. ‘నిజమే నిజమే’ అనడంతప్ప మరో మాట చెప్పలేకపోయాను.

‘ఐతే ఆ తరువాత ఆనంద్ మొదలయ్యింది’ అంటూ నేను కొనసాగిస్తే, కిరణ్ అందుకుని “అవును అనంద్ సినిమాతో నాకు ఒక పూర్తిస్థాయి సినిమాతో అనుబంధం ఏర్పడింది. As a Film maker you have social responsibility అనినమ్మే శేఖర్ కమ్ములలాంటి దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. శేఖర్ యూనిట్లో దర్శకత్వం డిపార్ట్మెంట్ కేవలం ఆ ఒక్క డిపార్టుమెంటుకే పరిమితం కాదు. సాధారణంగా చేసే స్క్రిప్టు, షాట్ డివిజన్, యాక్టర్స్ కి explain చెయ్యడం, పోస్ట్ ప్రొడక్షన్లో పనిచెయ్యడంతో పాటూ సినిమా ప్రమోషన్, పబ్లిసిటీ, ఈవెంట్ మ్యానేజ్మెంట్ లాంటి అన్ని విభాగాల్లో పనిచెయ్యాలి. That was a great learning experience. ఆనంద్ సినిమా ప్రమోషన్ కోసం వైజాగ్ లో రోడ్లో నిలబడి టికెట్లమ్మాను. ఆ effort తరువాత దాదాపు 80% ఓపనింగ్స్ తో సినిమా ప్రారంభమై కలెక్షన్లు నిలబడింతర్వాత కలిగిన ఆనందం కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే మాత్రం వచ్చేది కాదు. సినిమా తియ్యడం నేర్చుకోవడంతో పాటూ సగం సృజనాత్మకతా మరో సగం వ్యాపారం కలగలిపిన ఈ పరిశ్రమలో మరిన్ని విషయాలు నేర్చుకునే అవకాశం శేఖర్ కల్పించారు.ఆయన మొదట్లో అన్న ‘working together’ అన్న మాటకు అర్థం అప్పటికి తెలిసొచ్చింది.”

“ఆ అనుభవం మీకు వినాయకుడు సినిమాకెలా ఉపయొగపడింది?” అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ “రిలయెన్స్ నుంచీ బిగ్ ఎఫ్.ఎమ్ వరకూ ఈ స్థాయిలో కార్పొరేట్ లింకేజుల్ని స్థాపించగలిగిన చిన్న చిత్రం ఇదే. రిలీజ్ విషయంలో సరైన ప్లానింగ్, ఆసక్తి గొలిపే ప్రమోషన్లు, వైవిధ్యమైన పబ్లిసిటీ,ధియేటర్లలో కలెక్షన్ల వివరాలు కనుక్కోవడం, రిలీజ్ తర్వాత క్రియేటివ్ మరియూ బిజినెస్ పరమైన సమస్యలుంటే వాటినీ అర్థం చేసుకుని సరైన సమయంలో స్పందించడం ఇవన్నీ సినిమా తియ్యడంతో పాటూ సమాన ప్రాముఖ్యతని కలిగిన విషయాలు. ఒకప్పుడు నిర్మాత ఇవన్నీ చూసుకునేవాళ్ళు కానీ, సినిమా దర్శకుడిగా ఆ సినిమాకు సంబంధించిన జయాపజయాలలో భాగస్వామిగా, సృజనాత్మక వ్యక్తిగా దర్శకుడి బాధ్యత అత్యంత కీలకం. ‘నిర్మాతకు లాభం రాకపోయినా కనీసం నష్టం రాకుండా చేసే కనీస బాధ్యత దర్శకుడిది’ అని శేఖర్ కమ్ముల చెప్పేవారు. అందుకే కేవలం సినిమా తీసామా,వెళ్ళామా అని కాకుండా మనవంతుగా సినిమాని ఎంతవరకూ సృజనాత్మకంగా మరియూ వ్యాపారాత్మకంగా నిలిపామా అనేవి కూడా చాలా ముఖ్యం. ఈవిధంగా వినాయకుడు సినిమాకు ఆనంద్, హ్యాపీడేస్ అనుభవాలు ఉపయోగపడ్డాయి. శేఖర్ కమ్ముల మార్గదర్శకత్వం ఉపయోగడ్డాయి.

‘ఓహ్ మీరు హ్యాపీడేస్ కు కూడా పనిచేసారు కదా!’ అనంటే, “అవును. ఆనంద్ తరువాత సొంతంగా సినిమా తియ్యాలని స్క్రిప్ట్ రెడీ చేసుకుని రామోజీ ఫిల్మ్ సిటీ మరియూ జీ ఫిల్మ్ వాళ్ళను అప్రోచ్ అయ్యాను కానీ అవేవీ వర్కౌట్ అవ్వలేదు. అప్పుడే ‘ఆ నలుగురు’ నిర్మాతైన ప్రేమ్ కుమార్ గారిని కలిసాను.ఆయన నాతో సినిమా తియ్యడానికి సుముఖంగా ఉన్నా బడ్జెట్ సమకూర్చే ప్రయత్నాల్లో ఉండగానే శేఖర్ గారు ‘హ్యాపీడేస్’ మొదలెట్టారు. శేఖర్ గారి నిర్మాణ సంస్థలో పనిచెయ్యడమంటే ఫ్యామిలీతో కలిసి పనిచేసినట్లే అందుకే ఆ సినిమాకీ పనిచేసాను. అప్పటికి వినాయకుడు స్క్రిప్ట్ పక్కాగా రాసుకున్నాను.

ఈ చర్చప్పుడు నవతరంగం కోసం స్క్రిప్టు వీలైతే అడగమని వెంకట్ చెప్పడం గుర్తొచ్చింది. వెంఠనే ‘మీరు మొత్తం స్క్రిప్టు రాసుకునే సినిమా తియ్యడానికి తయారయ్యారా’ అని సందేహంగా అడిగాను. విషయం ఏమిటంటే, మన పరిశ్రమలో బౌండ్ స్క్రిప్టులతో షూటింగుకువెళ్ళే సినిమాలు చాలా తక్కువ అందుకే ఆ సందేహం. అప్పుడు కిరణ్ “స్క్రిప్టు లేకుండా ఎలాగండీ! వినాయకుడు స్క్రిప్టు దాదాపు 9 వర్షన్స్ రాశాన్నేను” అన్నారు. అదే తడవుగా, ‘ఐతే కనీసం మొదటి వర్షన్ ఫైనల్ వర్షన్ మా నవతరంగంకివ్వండి ఔత్సాహిక సినీదర్శకులకు పనికొస్తుంది’ అని అడిగేశా. “ఓ తప్పకుండా” అని కిరణ్ ప్రామిస్ కూడా చేసేశారు.

‘అయితే హ్యాపీడేస్ సమయం నుంచీ వినాయకుడు మీ మనసులో రూపు దిద్దుకున్నాడన్నమాట!’ అంటూ నేను వినాయకుడు సినిమా గురించి కొన్ని ప్రశ్నలు సంధించడం మొదలెట్టాను…. (వినాయకుడు సినిమాపై దర్శకుడు సాయికిరణ్ తో ముఖాముఖి తరువాయి భాగంలో)

17 Comments
 1. shree December 15, 2008 /
 2. Satya Shyam KJ December 15, 2008 /
 3. ఉమాశంకర్ December 15, 2008 /
 4. Madhu December 15, 2008 /
 5. Vijay December 15, 2008 /
 6. శంకర్ December 15, 2008 /
 7. Madhura vaani December 16, 2008 /
 8. meenakshi December 16, 2008 /
 9. రాఘవ December 16, 2008 /
 10. చదువరి December 16, 2008 /
 11. Reddy Ganta January 8, 2009 /
 12. naidu April 6, 2009 /
 13. Vasudeva Rao Rayapati September 10, 2009 /
 14. rayraj September 10, 2009 /