Menu

Saas Bahu aur sensex (2008)

గత కొన్ని వారాలుగా ఈ సినిమా చూద్దామని అనుకుంటూ వాయిదా వేస్తూ చివరకు చూడగలిగాను. ఇన్నాళ్ళకి మన సినిమా-మన కథ తో తీసిన నిఖార్సైన భారతీయ సినిమా చూశాను అన్న తృప్తి కలిగింది. ఇందులో పాత్రలన్నీ దైనందిన జీవితం లో మీకు ఎదురయ్యేవే. చాలా పాత్రలూ, కావాల్సినంత వైవిధ్యం, ప్రేక్షకుడిని అయోమయంలోకి నెట్టడానికి కావాల్సినంత అవకాశం. అయినా కూడా, కథా కథనానలలో ఉన్న పట్టువల్ల ఈ సినిమా చూడటం ఓ మంచి అనుభవం. ఇటీవలి కాలంలో నేను ఇంతగా ఇష్టపడ్డ సినిమా మరోటి లేదనుకుంటా. “హమ్మయ్య! మన సినిమాలోనూ సరుకుంది!” అన్న నమ్మకం ఎంత ఆనందాన్నిస్తుందో!

కథ: బినితా సేన్ (కిరణ్ ఖేర్), నిత్యా సేన్ తల్లీ కూతుళ్ళు. కలకత్తా నుండి ముంబై చేరతారు. తండ్రి నుండి తల్లి విడిపోయి, తామిలా ముంబై వలస రావడాన్ని నిత్య అంగీకరించలేకపోతుంది. రితేష్ వీరుండే కాలనీలోనే ఉండే యువకుడు. అతనికి ఈ కుటుంబంతో స్నేహం ఏర్పడుతుంది. కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ ఉండే కాలనీ ఆడవాళ్ళతో వినిత కి కూడా స్నేహం ఏర్పడుతుంది. సంపాదన కోసం వినిత ఓ నర్సరీ స్కూల్లో టీచర్ గానూ, నిత్య రితేష్ పనిచేసే కాల్ సెంటర్ లోనూ చేరతారు. వినిత తన తండ్రి ఎప్పుడో కొన్న షేర్లను అమ్మడానికి ఫిరోజ్ సేత్నా(ఫిరోజ్ షేక్) ని సంప్రదిస్తుంది. ఆ విధంగా తను స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుంటూ ఉంటే ఆమె స్నేహితులు ఈమె ఫిరోజ్ తో ఏదో వ్యవహారం నడుపుతోందని అపోహ పడతారు. ఒకరోజు ఆమెని ఫాలో అయి, అసలు కథ తెలుసుకుని వారు కూడా సాస్ బహూ సీరియళ్ళు మాని స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారు. ఇక వారి అనుభవాలు, నిత్య-రితేష్-కీర్తి ల మధ్య నడిచే స్నేహాలు, ప్రేమలూ, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు – ఇవన్నీ కథని కొనసాగిస్తాయి.

నాకు సంబంధించినంతవరకు ఇటీవలి కాలంలో వచ్చిన బాలీవుడ్ సినిమాల్లోకెల్లా ఉత్తమమైన సినిమా ఇది (నేను చూసిన వాటిలో). ఇన్నాళ్ళకి, నేను కథలన్నవి మనలోంచి రావాలి, మన జీవితాల్లోంచి రావాలి – ఎందుకు మనవారు అస్తమానం ఏవో విదేశీ సినిమాలు తీసుకుని వాటిని భారతీయతకు అనుగుణంగా మలిచి తృప్తి పడతారు అని వాపోతూ ఉండేదాన్ని నాలో నేనే. ఇప్పుడీ కథ నాలో ఆ బాధని చాలా వరకు తగ్గించింది. కథలో చక్కని హాస్యం ఉంది, మలుపులు ఉన్నాయి, కథనం లో మంచి పట్టు ఉంది. వ్యంగ్యం, ప్రేమ, ద్వేషం, మోసం, బాధ, స్నేహం – ఒకటేమిటీ? అన్ని రకాల భావాలూ ఉన్నాయి. ఇంతకంటే ఏమి కావాలి మన సినిమాకి? ప్రధానంగా సెన్సెక్స్ లో మహిళల ఆసక్తి చుట్టూ తిరిగినా కూడా ఈ సినిమా లో ఎంటర్టైనర్ ఎలిమెంట్ పుష్కలంగా ఉంది.

ఫరూక్ షేక్ ని చాలారోజుల తరువాత చూడటం హాయిగా ఉండింది. అద్భుతమైన నటన. ఆ ముఖ కవళికలూ, ఆ చిరాకు చూపే విధానం, అతను పలికిన వాక్యాలూ, పలికే విధానం – ఫరూక్ షేక్ ఎందుకు తరుచుగా సినిమాల్లో కనిపించడో అసలు! ఫరూక్ షేక్, అతని సహాయకుడు, కిరణ్ ఖేర్ – ముగ్గురి మధ్యా ఉండే టైమింగ్ అమోఘం. వీరి డైలాగులు కూడా చాలా చోట్ల నవ్వులు పూయించాయి. తాతా-మనవరాళ్ళ మధ్య సెన్సెక్స్ గురించి నడిచే సంభాషణలు, కాలనీ వాతావరణం, ఒక్కో కుటుంబం కథని మలిచిన తీరు, తల్లీ-కూతుళ్ళ మధ్య సంబంధం, కాల్ సెంటర్ లో జీవితం – అన్నీ సహజత్వానికి అతి దగ్గర్లో ఉన్నాయి. సినిమా కాస్త ఆశావహంగా ముగిసింది కానీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఆ క్లైమాక్స్ చూడటం మాత్రం నాకు కాస్త కొత్తగా అనిపించింది. సెన్సెక్స్ ఐదంకెల్లో ఎగబాకడం ఇదంతా ఇప్పుడు కష్టం కదా…. చివర్లో ఈ సినిమాని సందేశాత్మకం చేసేసారు. బహుశా, ఈ సందేశాన్ని ఇంతకంటే బాగా ఎవరూ చెప్పలేరేమో, అది వేరే విషయం. కిరణ్ ఖేర్, ఫరూక్ షేక్, రితేష్ పాత్రధారి అంకుర్ ఖన్నా ల నటన నాకు అందరికంటే బాగా నచ్చింది. కానీ, ఈ సినిమాలో పాత్రలన్నీ ఆ పాత్రధారులకి బాగా కుదిరాయి.

మొత్తానికైతే, here is a promising director. నేనైతే ఈవిడ మిగితా సినిమాల కోసం ఎదురుచూస్తాను. పేరే కాదు, ఈ సినిమా కూడా బాగుంటుంది. తప్పక చూడండి.

వివరాలు:
దర్శకురాలు: Shona Urvashi
తారాగణం: కిరణ్ ఖేర్, ఫరూఖ్ షేఖ్, అంకుర్ ఖన్నా, లిలెట్ దూబే, తనుశ్రీ దత్తా తదితరులు.
ఈ సినిమా వెబ్సైటు ఇక్కడ.

One Response