Menu

నవ్వుల (రాజు) బాబు…:)

“నీ జడ పిన్ను నా తలరాతకు పెన్ను
నీ సిగపువ్వు అదేంటమ్మా… ఆ.. బుజబుజరేకుల నవ్వు”

” రాజమండ్రి స్టేషన్లో రైలెక్కి
బొంబాయి స్టేషన్లో దిగుదామా!”
“ఏయ్ ! వాన్ని నేను నలికేత్తాను తల్వాతేమయిందో చెప్పూ”

“చాకిరేవుకాడా నీ సోకు, చూడగానే జిల్లంది నాకు”

ఈ పాటలు వింటుంటే ఎవరు గుర్తొస్తున్నారు??  వెదురు బద్దలా గాలికి ఊగుతున్నట్టుగా అటు ఇటు ఊగుతూ, అమాయకపు నవ్వులతో మనకు కితకితలు పెట్టే నవ్వుల రాజు .. రాజబాబు.  అంతే ఈ పేరు వినగానే మన పెదవులపై చిరునవ్వు ఉదయించక మానదు. అతని నటన కృతకంగా ఉండదు. ఇప్పటిలా చిరాకు, అసహ్యం కలిగించని సున్నితమైన, అమాయకత్వంతో కూడిన  హాస్యం అంటే రాజబాబే.   హాస్య సన్నివేశమైనా, విషాద సన్నివేశమైనా అతనికి కొట్టిన పిండే. మనల్ని నవ్విస్తాడు, అలాగే ఏడిపిస్తాడు కూడా. రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి మహామహులు ఉన్న కాలంలో రాజబాబు తనదంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకున్నాడు. ఆ నవ్వుల రాజు అమరలోకానికేగి  పాతికేళ్లు దాటినా రాజబాబు అని తలుచుకోగానే మన పెదవులపై చిరు దరహాసం మెదలక మానదు. అతని సినిమాల్లోని సన్నివేశాలు, పాటలు గుర్తుకురాకమానవు. ఇది నిజమని రాజబాబు సినిమాలు చూసినవారందరూ ఒప్పుకుంటారు.

రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. పుట్టింది 20 అక్టోబర్ 1936. అతని చదువంతా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. చదివేటప్పుడు ఎక్కువగా నాటకాలు వేసేవాడు.  “కుక్కపిల్ల దొరికింది” , “నాలుగిల్ల చావిడి”, “అల్లూరి సీతారామరాజు” వంటి ఎన్నో నాటకాలు వేశాడు. చెన్నపూరి ఆంధ్ర మహాసభవారి “కథ కంచికి” నాటకంలో వేసిన చిన్న పాత్రను చూసి మెచ్చిన కె.వి.రెడ్డి అతనికి “సత్య హరిష్చంద్ర” లో కాలకౌశికుడి వేషం ఇచ్చారు.

అడ్డాల నారాయణరావుగారి దర్శకత్వంలో, రేలంగి నిర్మాతగా  వచ్చిన “సమాజం” చిత్రంలో ఒక చిన్న వేషంతో సినీరంగ ప్రవేశం చేసాడు రాజబాబుగా మారిన అప్పలరాజు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సర్కార్ ఎక్స్‌ప్రెస్, ఇల్లు- ఇల్లాలు, ఇలా… దర్శకనిర్మాత తొలిసారిగా తీసిన చిత్రం “తాతా-మనవడు” చిత్రంలో రాజబాబు హీరోగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రాజబాబు అంటే తన అమాయకత్వం, పిచ్చి చేష్టలతో నవ్వించేవాడు కాదు కాదు, ఒక సీరియస్  పాత్రను కూడా అవలీలగా పోషించి అందరిని మెప్పించగలడు అని నిరూపించాడు.

రాజబాబు దాదాపు 500 పైన చిత్రాలలో నటించాడు. ఒక్క రమాప్రభతోనే జంటగా 300 సినిమాలు నటించాడని చెప్పుకుంటారు. ఇంకో విశేషం ఉంది. అతను  14 సార్లు ఫిలిం  ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు . అందులో వరుసగా 13 సార్లు గెలుచుకున్నవే. అలా వెలిగిపోతున్న కాలంలో హీరో కంటే ముందుగా రాజబాబునే  నిర్మాతలు బుక్ చేసుకునేవారు అనడంలో అతిశయోక్తి లేదు. రాజబాబు నటించిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు .. తాతా-మనవడు, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు, తాయారమ్మ- బంగారయ్య, తిరుపతి,.. హాస్యనటచక్రవర్తి అని పేరుగాంచినా ఎన్నో చిత్రాలలో నవరసాలు అద్భుతంగా పోషించాడు అని ఎవ్వరైనా ఒప్పుకోకతప్పదు.

రాజబాబు ఎంత సంపాదించినా కూడా తన గతం ఎప్పుడూ మర్చిపోలేదు. ఎన్నో దానధర్మాలు చేసాడు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు నాడు   చిత్రరంగంలో పెద్దలను సన్మానించేవాడు. సాయం చేయడంలో కృష్ణుడు, దాన గుణంలో కర్ణుడు లాంటివాడు అని అతనివల్ల సహాయం పొందినవారు చెప్పుకుంటారు. తన కష్టకాలంలో ఒక పాక  హోటల్లోని స్త్రీ పెట్టిన టిఫిన్స్ గుర్తుంచుకుని ఆమె కొడుకులతో మంచి హోటల్ పెట్టించాడు. బీదవారికి  పెళ్లిల్లు,, చదువులు, అలాగే కోరుకొండలో ఒక కాలేజీ కట్టించిన ధర్మాత్ముడు. సంపాదించిందంతా ఇలా దానధర్మాలకు ఖర్చు చేసి తన భార్యా పిల్లలకు మిగిల్చిందేమీ లేదు.

రాజబాబు భార్య లక్ష్మి అమ్ములు, మహాకవి శ్రీశ్రీ మరదలు. ఇద్దరు అబ్బాయిలు. ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డారు. తమ్ముళ్లు చిట్టిబాబు, అనంత్ హాస్యనటులుగా కొనసాగుతున్నారు.

అంతటి విలక్షణ నటుడు , తాగుడుకు బానిసై, సందేశాత్మక చిత్రాలు తీసి  నష్టపోయి చివరికి తన నలభై ఏడవ ఏట కన్నుమూసాడు. ఈ లోకంలో తన వంతు పాత్రను పోషించి తిరిగిరాని లోకాలకు వెల్లిపోయాడు ఆ నవ్వులరాజు …

–జ్యోతి వలబోజు

5 Comments
  1. Sowmya December 25, 2008 /
  2. Srinivas December 25, 2008 /
  3. శంకర్ December 25, 2008 /
  4. రెండుచింతల భానుప్రసాద్ December 25, 2008 /
  5. vinay April 14, 2009 /