Menu

రబ్నే బనాదీ “సిల్లీ” జోడీ (నా ‘వ్యూ’)

నిన్ననే ‘రబ్నే బనాదీ జోడీ’ ఈ సినిమా చూసాను. నవతరంగంలో సమీక్ష చదివిన తరువాత కూడా ప్రజకు సినిమాలు చూడ్డం మానెయ్యరనడానికి నేనే ఒక ఉదాహరణ. ‘అహనాపెళ్ళంట’ సినిమాలో నూతన్ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ తో “ప్రేమరా కృష్ణా..ప్రేమ” అనే డైలాగ్ టైపులో “సినిమాల మీద ప్రేమరా కన్నా ప్రేమ” అనుకోవాలేమో! యష్ చోప్రా నిర్మాణం, ఆదిత్య చోప్రా తృతీయ చిత్రం పైగా షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం చూడకపోతే ఎట్లా!? చూసేసాను. అలా అనడంకన్నా, ‘భరించాను’ అనడం బెటరేమో.

ప్రేమించినవాళ్ళ ముఖంలో భగవంతుడు (రబ్) కనిపిస్తాడని, భగవంతుడే జంటల్ని సృష్టిస్తాడనే రెండు రొమాంటిక్ ఐడియాలని గాట్టిగా పట్టుకుని…ఫీల్ గుడ్ సినిమా ఒకటి వ్యయప్రయాసలకోర్చి తీసేసారు. హీరోయిన్ కు కాబోయే భర్త, పెళ్ళిమంటపానికి వస్తూవస్తూ బస్సు ప్రమాదంలో చనిపోవడం. తండ్రికి హార్ట్ అటాక్. అక్కడే తేరగావున్న ‘పంజాబ్ పవర్’ సిన్సియర్ ఉద్యోగి షారుఖ్ ఖాన్ తో అమ్మాయి హడావుడి పెళ్ళి. హీరోయిన్ తండ్రి అంత్యక్రియలతో సినిమాను మొదలెట్టేసి, భగవంతుడు నిర్ణయించిన జంట(జోడీ) గా ఈ “కాకిముక్కూ దొండపండును” దర్శకుడు మనకు పరిచయం చేస్తాడు.అప్పుడే ఈ సినిమా క్లైమాక్సేమిటో మనకు తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయిన క్లైమాక్సుకు కథ ఎలా చేరిందో మిగతా రెండుగంటలూ తిక్కతిక్కగా చెప్పడానికి కాకలు తీరిన దర్శకుడు పడిన పాట్లు ప్రేక్షకులు భరించాల్సిందే.

Not so good looking హీరో సురీందర్ సహానీ (షారుఖ్) పక్కన తాని(జీ) పాత్రలో ఫ్రెష్ ఫేస్ (అనుష్క శర్మ)ను పెట్టడం వరకూ దర్శకుడు ప్రత్యేకశ్రద్ధ వహించాడని చెప్పుకోవచ్చు. అదే శ్రద్ధ, గుండేలుపిండేసే స్కోప్ గల క్లాసిక్ కథావస్తువును ట్రీట్ చేసిన విధానంలో పెట్టుంటే సినిమా కనీసం చూడదగ్గదిగా తయారయ్యేదేమో. వ్యక్తిగత విషాదాల్లోంచీ ఉద్భవించిన ఈ పెళ్ళితో ‘తాని’ సంతోషంగా ఉండకపోవడం అర్థం చేసుకోదగ్గ పరిణామం. ప్రేమించే శక్తిని ఆ సమయానికి కోల్పోవడం సహానుభూతి చూపదగ్గ విషయం. ఆ సమయంలో సురీందర్ చూపే అతి మంచితనం హృద్యంగానే ఉంటుంది. కానీ వీరి మధ్యనున్న సమస్యను తీర్చడానికి దర్శకుడు ఎంచుకున్న “రాజ్ అవతార” ప్రదర్శనతో సినిమాలో ఉన్న nobility తీవ్రంగా దెబ్బతిని ‘రబ్నే బనాదీ “సిల్లీ” జోడీ’ గా తయారయ్యింది.

మిత్రుడు బాబ్బీ (వినయ్ పాఠక్) హెయిర్ కట్ సహాయంతో సురీందర్ సహానీ విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన ‘రాజ్’ గా మారడం హాస్యాస్పదమైతే, ఆ తరువాత వచ్చే రాజ్- తానీ ల స్నేహం, ప్రేమ యష్ చోప్రా సినిమా జిలుగులు,మరికొన్ని అర్థవంతమైన డైలాగులూ లేకుండా ఉంటే అత్యంత నేలబారుగా తయారయ్యేది. బోరింగ్ సురీందర్ కన్నా, మోడ్రన్ పిచ్చోడు ‘రాజ్’, పవిత్రమైన ‘తానీ’కి నచ్చడం కథరీత్యా అర్థం చేసుకోదగ్గ పరిణామమే అయినా,(ఒక్క పాట మినహా) దానికి తగ్గ convincing reasons ఇవ్వడంలో దర్శకుడు ఘోరంగా విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఇక్కడే ‘మనసుకు హత్తుకునే’ అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. పైగా బెస్ట్ డాన్సింగ్ జోడీ కాంపిటీషన్ నేపధ్యంలో రాజ్-తానీ ల ప్రేమ బలపడటాన్ని చూపించిన తీరు హాస్యదృశ్యాలుగా తయారవ్వడంతో అవసరమైన లోతు తగ్గి, తేలిపోయినట్లయ్యాయి.చివర్లో “అవును” – “కాదు”, “వస్తాను” – “రాను” అన్న టైపులో సాగే తానీ డైలమా చికాకు తెప్పిస్తుందేతప్ప ఆ పాత్రపై సానుభూతిని కలిగించదు. బలవత్తరమైన ప్రేమసంఘర్షణలో ఉన్న పాత్రపై ప్రేక్షకుడికి సానుభూతి కలగకపోతే ప్రేమకథ పండేనా?

నటీనటుల విషయంలో షారుఖ్ సురీందర్ గా తనవంతు ప్రయత్నం చేసినా, రాజ్ పాత్రలో విసుగు తెప్పించాడు. కొత్తమ్మాయి అనుష్కా శర్మ అందంగా, బాగుంది. డ్యాన్సుకూడా బాగా చెయ్యగలగటం, బైక్ సీన్ మినహా మిగిలిన సీన్లలో తన పరిమితమైన నటనతో ఆకట్టుకుంటుంది. హీరో స్నేహితుడిగా వినయ్ పాఠక్ మంచి మార్కులు కొట్టేస్తాడు.

బలమైన కథని బలహీనపరిచిన స్క్రీన్ ప్లే దర్శకత్వాలకి ఈ చిత్రం ఒక ఉదాహరణ. ఒకసారి చూడచ్చు.

7 Comments
  1. శంకర్ December 25, 2008 /
  2. Sudhakar December 25, 2008 /
  3. గిరి December 27, 2008 /
  4. సుజాత December 29, 2008 /
  5. vinay April 15, 2009 /
  6. su July 25, 2009 /