Menu

రబ్నే బనాదీ జోడి

హెచ్చరిక: ఇది స్పాయిలర్ భూయిష్ఠ సమీక్ష

యశ్ రాజ్ చిత్రాలలో పాత్రలు, సంభాషణలు, పరిసరాలు ఔచిత్యానికి దూరంగా ఉండడం సర్వసామాన్యం. రాజుల మహరాజుల వైభోగాలన్నీ అందుబాటులో ఉండి బ్రతుకీడుస్తున్న వారి కష్టనష్టాలు వారి కథలకు ఆటపట్టులు. ఐదేళ్ళ పిల్లాడికైనా మనదేశం కాదని తెలిసిపోయే విధంగా ఉండే విదేశ ప్రదేశాలలో తీసేసిన ఘట్టాలని మన దేశానివని నమ్మించే ప్రయత్నాలు వారికి వెన్నతో పెట్టిన విద్యలు. ఇలాంటి పేరు గడించినా, పూర్వపు పోకడలకు భిన్నంగా ఉండాలనే ఉబలాటంతో, సామాన్యుణ్ణి మూలపురుషుడుగా చూపిస్తూ కథ నడపగలమని చూపించడానికి కసితో వారు పుట్టించిన ఓ అసమాన్య సామాన్యుడే సూరిందర్ సయాని. సామాన్యుడు అనడం కన్నా ఓ పాటి నమునాఅనిపించే పాత్ర అది. కాకపోతే, షారుఖ్ ఇప్పటి దాక ఇలాంటి పాత్ర పోషించలేదు, ఈ మధ్య కాలంలో ఇంతగా నవ్వించలేదు కాబట్టి వారి ఎత్తు బాగానే పారింది.

పెళ్ళికని వెళ్ళి పదహారణాల పంజాబి కుందనపు కన్యక అయిన పెళ్ళికూతురు అందచందాలు, చలాకీ ఆటపాటలు చూసి ముచ్చట పడతాడు మన సూరి. ఇంతలో అనుకోని దుర్ఘటన ఒకటి సంభవించడం వలన ఆ పడచు అతడి పెళ్ళామవుతుంది. పెళ్ళయిన కొద్ది సమయానికే ఆమె ప్రేమ పొందటం అసాధ్యమని సూరికి అవగతమవుతుంది, కాని ఒంటరి బ్రతుకుకి అలవాటు పడి దొరికిన సహవాసమే చాలనుకునేవాడికి ఇంతకన్నా మహాప్రసాదమేముంటుంది? ప్రేమ పంచలేక పోయినా, పడకగదిలోకి రాకపోయినా, మిగతా విషయాలలో పతిసేవలకి లోటురానీయని భార్య దొరకడమే వరమనుకుని ఆనందంగా సమయం గడిపేస్తుంటాడు సూరి. కాని తాను మొదట్లో చూసి ముచ్చటపడ్డ పిల్లని తన భార్యలో మళ్ళీ చూడాలని ఉబలాటపడుతూంటాడు. ఆ పిల్లే తనని ప్రేమించాలని కలలు కంటాడు. చివరకి ఆమె ప్రేమకి పాత్రుడవుతాడా లేదా అనేది తెలిపుతుంది మిగదా కథ.

ఇంతవరకూ బానే ఉంది, బానే ఏంటి? మాహబాగా ఉంది చూస్తున్నంత సేపూ ఆహా ఓహో అనిపించేలా ఉంది కదూ? నిజమే, చిక్కల్లా తర్వాతే వచ్చి పడింది. కథకి ఇంత చక్కటి పునాది వేసి, ఆశలు రేపి, చివరకి నిరత్సాహం మిగల్చాడు దర్శకుడు. కారణాలంటారా, నాకు మటుకు మూడు లోపాల వలన కలిగిందీ నిరత్సాహం.

మొదటిది, సూరిని రాజ్ లా మర్చడం. మొహమాటస్తుడు, ఇతరులతో సరిగ్గా మాట్లాడలేని వాడు, నూతనపోకడలను పట్టించుకుని పాటించే విషయంలో ఎక్కడో పాతాళంలో ఉన్నవాడు కేవలం బట్టలు, జుట్టు దువ్వుకునే తీరు మార్చుకోవడంతోనే కొత్త మనిషిలా తయారవడం, కొంత తడబడుతున్నా అత్యాధునిక పోజులకి పోతలా తయారవడం మింగుడుపడదు. రాజ్ కూల్ కాదు నిజమే, లేనిది ఉన్నట్టు చూపడానికి కష్టపడుతున్నాడు నిజమే, కాని అతడు సూరి నుండి ఊడిపడ్డాడంటే సమంజసంగా అనిపించదు. కనీసం మార్పు నెమ్మదిగా వచ్చినట్టుగా చూపించినా బావుండేది, అంతే కాని బట్టలు, జుట్టు మారిన మరుక్షణమే కొత్త వాడిలే అయిపోవడమేమి చిత్రం?

రెండవది, సూరి భార్య తాని ప్రేమ విషయం. తాని రాజ్ తో ప్రేమలో పడడం ఒక రోజులో జరగినది కాదు. అతనితో తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉండడం వల్ల మెల్లమెల్లగా బలపడిన ప్రేమ అది. సూరి తన ఆశలు అసలు అర్ధం చేసుకోలేడని, ప్రేమికుడిని, తండ్రిని కోల్పోయిన తనకి ఊరట కలిగించలేడని, తనలోని పూర్వపు చలాకితనానికి సాటి రాడని తెలిసిన నిజంలోంచి పుట్టిన ప్రేమ అది. అలాంటిది ఒక్కరోజు రెప్పపాటులో (అక్షరాలా కళ్ళుమూసి తెరుచుకునే లోపుగా) ఆమె మనసు మార్చుకోవడం చిత్రమే. ఇలాంటి మార్పుని ఎలా తెరకెక్కించవచ్చో చూడాలంటే సంజయ్ లీల భంసాలి తీసిన హమ్ దిల్ దే చుకే సనమ్ చూస్తే తెలుస్తుంది.

మూడవది, సూరి కనుమరుగవడం. కథకి పునాది పడగానే, సూరి భార్య మనసు ఎలా నెగ్గుకొస్తాడా అని చూడాలనిపిస్తుంది. అతడు తన ప్రేమని ఎలా తెలుపాలో తెలియక సతమతమవుతుంటే జాలి, నవ్వు ఒకే సారి వస్తాయి, అతడు నెగ్గుతూంటే చూడాలిపించేలా చేస్తాయి. మరి మనకి దొరికేదేమిటి? హుళక్కి! సూరిని వెనక్కి నెట్టేసి రాజ్ తో కథని నడిపిస్తాడు దర్శకుడు. సూరి తన భార్యకే కాదు ప్రేక్షకులకి కూడా దూరమవడం చిత్రమే.

ఇవి కాక, తాని రాజ్ తన భర్తేనని గుర్తించకపోవడం, కథ కాలమానం సరిగా కుదిరినట్టుగా అనిపించకపోవడం లోపాలుగా అనిపిస్తాయి. కాలమానం విషయం ఎందుకంటే, కొంచెం తరచి చూస్తే కథంతా కొన్ని వారాల నిడివిలో నడిచినట్టు తెలుస్తుంది, అంత కొద్ది గడువు లోనే తాని విషాదంలోంచి బయటపడి ప్రేమలో పడడం అసంమంజసం కదూ?

వీటిని పక్కన పెడితే, మెచ్చుకోదగ్గ విషయాలు చిత్రంలో కొన్ని ఉన్నాయి. సూరి స్నేహితుడు బాబి ఖోస్లా మాటల మూటలు, రాజ్ కురిపంచే నవ్వుల జల్లులు, తాని ఆటపాటలు కథను ఆహ్లాదకరంగానే ముందుకు నడుపుతాయి.

బాణీలు గొప్పగా లేకపోయినా పాటల చిత్రీకరణ మాత్రం కళ్ళు మిరుముట్లుగొలిపే విధంగా ఉంది. డాన్స్ పె ఛాన్స్ మార్లే పాట తాని (అనుష్క) కోసం చూడచ్చు, ఆడుతున్నప్పుడు ఆమె ముఖంలో చిందే నువ్వులు, ఆనందపు వెల్లువలు చూసితీరాలి. పాత చిత్రాల పాటల చిత్రీకరణానుకరణ, పెట్టిన డబ్బుకి సరిపడే డాబు ఉన్నపాట ఫిర్మిలేంగే చెల్తే చెల్తే – కాని ఇందులో కొత్త విషయమేదీ లేదు, దాంతో ఇదివరకు చూసిన పాటల మూసలో పడి పాత చింతాకాయలా అనిపించింది, యశ్ రాజ్ చిత్రాలలో పుటుక్కుమంటే ఊడిపడే తారామణులు కూడ పాటకు కొత్త తళుకులేమీ తీసుకురాలేదు. తూఝ్ మే రబ్ దిఖ్తా హై పాట వినడానికే బావుంది, చూస్తూంటే సరిగా తెరకెక్కలేదనిపించింది.

నటన విషయాని కోస్తే, షారుఖ్ కి హాస్యరస పాత్రలుతో చెడుగు డాడేస్తాడనడానికి ఈ చిత్రం మరొక ఉదాహరణ. బాబి ఖోస్లాలాగ వినయ్ పాఠక్ కూడ అదరగొట్టేసాడు. చూడ చక్కని అనుష్క నటన. నృత్యాలు కూడ బాగనే ఉన్నాయి. ఇక చిత్రంలో చెప్పుకోదగ్గ పాత్రలేవీ లేవు. చివరగా, గంటన్నర పైన సాగే రెండవ భాగం కన్నా కొసమెరుపుగా పేర్లు పడేటప్పుడు సూరి సంభాషణలు హాస్యరసాన్ని చిందించాయి. అందరూ నవ్వుకుంటూ హాలు బయటపడేలా చేసాయి.

ముగించే ముందు నాలుగు ముక్కల్లో చెప్పాలంటే, ఆదిత్య ఛోప్రా వచ్చి…

కం. నిచ్చెనిదే స్వర్గానికి తెచ్చితినోయ్ చూడమంటు తెర చూపంగా

అచ్చెరువొందిన సుజనులు వచ్చిరి తచ్చన తెలియక పరువిడి వడిగా

కం. మురిపెము ముచ్చట మీరగ బిరబిర మూగిన జనమిక బిమ్మిటిగొనగా

అరచేతిలోని స్వర్గము తెరకెక్కదనే నిజమ్ము తెలిసెను తొరగా

–గిరి లంక

15 Comments
 1. శంకర్ December 13, 2008 /
 2. andhramass December 14, 2008 /
 3. venkat December 14, 2008 /
 4. saif ali gorey December 14, 2008 /
 5. ravi December 14, 2008 /
 6. sasank December 15, 2008 /
 7. గిరి December 15, 2008 /
 8. kemo December 15, 2008 /
 9. kemo December 15, 2008 /
 10. VENKAT December 16, 2008 /
 11. Surya December 16, 2008 /
 12. Surya December 16, 2008 /