Menu

‘ఇది’ సినిమా కాకూడదు

గత వారం ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో ఒక వార్త చూశాను. అది చదివిన తర్వాత ఎందుకో ’నవతరంగాని’ నా మనసులో మాట రాసి గుండె బరువు దింపుకోవాలనిపించింది.

అదేంటంటే – బొంబాయిలోని తాజ్ హోటల్లో ఆటవిక ఉగ్రవాదుల నాలుగురోజుల ’విలయతాండవం’ ముగిసిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ వచ్చి తాజ్ హోటల్ ని సందర్శించారు- జరిగిన నష్టం గురించి తెలుసుకునేందుకు. ఆయనతోపాటు సినీ నటుడైన ఆయన కొడుకు రితేష్ దేశ్ ముఖ్ కూడా వచ్చాడు. అదే సమయంలో వాళ్లతో ఉన్న మరో వ్యక్తి ’రాం గోపాల్ వర్మ’.

అది చదవగాన నాలుగు రోజుల ఉత్కం తర్వాత ’హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంటున్న నాకు గొంతులోఏదో అడ్డం పడి ఊపిరాడనట్టైంది. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి అటువంటి ప్రదేశానికి వచ్చాడంటే “ఊరక రారు మాహాత్ములు…” అన్న భావనే కలుగుతుంది ఎవరికైనా. మరో క్రైం సినిమాకు ప్లాటు. ఎవరైనా ఈ రెండింటికీ సంబంధం ఈ విధంగానే చూస్తారు. అది సహజం కూడా. అయితే తను ఆ ఉద్దేశంతో రాలేదని వర్మ చెప్పాడని అందులో రాశారు.

’ఏ చరిత్ర చూసినా ఏమున్ని గర్వకారణం?’ అని శ్రీ శ్రీ అన్నట్టుగా ’ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం?’ క్రైం, వయొలెన్స్, సెక్స్, చవకబారు హాస్యం ఇవేకదా.

ఎవరు ఎన్ని చెప్పినా – ’సినిమా అనేది ఒక బలమైన మీడియం. అది మనుషుల మీద, తద్వారా సమాజం మీద తప్పనిసరిగా తనదైన ప్రభావం కొంత చూపిస్తుంది. ఇది అక్షరసత్యం.

’సినిమాలు’ చూసి ఎవరు చెడిపోతారు? అని వాదుంచడం తేలికే. అటువంటి వాళ్ళందరికీ నాదిక్కటే విజ్ఞప్తి. చిన్నపిల్లలు సినిమాలు చూసి ఎంతగా ప్రభావితమవుతారో ఎప్పుడైనా ఆలోచించారా? మనం పెద్దవాళ్ళం అంటే సినిమాని సినిమా దృష్టితోనే చూస్తాం. కానీ వాళ్ళు అలా చూడరు. అది సినిమా అన్న స్పృహ ఉన్నా, అంతర్లీనంగా తెరమీద చూపించే ప్రతి హింస, సెక్స్, వయొలెన్స్, బూతు జోకులు, డైలాగులు వాళ్ళ సబ్ కాన్షన్ మైండ్ లోకి వెళ్ళిపోతాయి. అది తప్పా, ఒప్పా అని ఆలోచించే విచక్షణా జ్ఞానం ఆ వయసులో వాళ్ళకుండదు. వాటిల్లోని సన్నివేశాల్ని డైలాగుల్ని అనుకరించటానికి ప్రయత్నిస్తారు. క్రైం మోతాదు ఎక్కువున్న సినిమాలు చూసి కొద్దో, గొప్పో ఆ ప్రవృత్తి గల వాళ్ళు ’ఓహో! ఇలా కూడా చేయొచ్చనన్నమాట’ అనుకుంటారు. ఏ సైకాలజిస్టును అడిగిన పిల్లల్లో ఇవి సర్వసాధారణమైన లక్షణాలని చెప్తారు.

బొంబాయి ఘటనలో నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా జరిగిన నరమేధంలో టెర్రరిస్టుల చేతుల్లో, అగ్ని ప్రమాదంలో రెండు వందల మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. అంతకు రెట్టింపు మంది బుల్లెట్ల తూట్లతో, అగ్ని కీలల మధ్య చిక్కుకుని చావో, బ్రతుకో తెలియని స్థితిలో ఆసుపత్రుల్లో అల్లాడుతున్నారు. జీవితంలో మరెప్పుడూ గుర్తు చేసుకోరాని ’ఘటన’ గా దీన్ని అందరూ భావిస్తున్నారు.

టెర్రరిస్టులు హీరోలు కాదు. వాళ్ళు మన కథానాయకులు కాకూడదు. అది ఒక వినోదంగా తెరపైన చూసి ’ఆనందించే’ దౌర్భాగ్యం పట్టకూడదు. మానిన గాయాల్ని రేపే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదు. అలా చేస్తే మన ముందు తరానికి మనం అందించే ’విషఫలాలు’ అవుతాయవి.

సినిమాలూ తీసే వాళ్ళకు మిగతా అందరు కళాకారుల్లాగే సమాజం పట్ల బాధ్యత ఉంది. దయచేసి ’సినిమా’ అనే ’కళ’ ను ఒక వ్యాపారంగా భావించవద్దు. అది ’వ్యాపారం’గా భావించేవారు తాము ’కళాకారుల’మని ఎలా చెప్పుకుంటారు? గాంధీ పుట్టిన దేశంలో ’గాడ్సే వాదం’ మనకొద్దు.

’సెన్సారు’.అది ఉన్నా లేనట్ట ఉంది. అన్నట్టు నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా ఆకలిగొన్న (సెన్సేషన్ కథనాలకు) మన టి.వి ఛానెల్స్ ప్రసారం చేశాయి. దీన్నంతటినీ టివిలో వీక్షించిన ’హైటెక్’ టెర్రరిస్టులు దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి తమ ’ఎత్తుగడలు’ మార్చుకునే అవకాశముందన చాలామంది భయాలు వ్యక్తం చేశారు. కాబట్టి ఛానెల్స్ అత్యుత్సానిక్కూడా కొంత కళ్ళెం వెయ్యక తప్పదని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇటువంటి పరిస్థుతుల్లో సినిమా వారూ వారి పరిధులు తెలుసుకొని కొంచెం దూరాలోచన చేసి తమకంటూ కొన్ని నియమ నిబంధనలు స్వయంగా విధించుకోవాలి. ’self-censor’ ఏర్పరుచుకోవాలి.

’ఎరుపు’ ను చూస్తే రక్తమే అనుకునే రోజు వచ్చింది. (ఒకప్పుడది విప్లవానికి కూడా సంకేతం – సినిమాల్లో) గులాబీ పువ్వు కూడా ఎరుపే.(మరెన్నో రంగులు కూడా) మీరు చూపించే ఎరుపు, రక్తం కాకుండా గులాబీ పువ్వులా ఉండేటట్టు చూసుకోండి. మనిషి ప్రాణాన్ని తీసేటట్టు కాకుండా, మనిషి ప్రాణాన్ని నిలబెట్టే కథాంశాలతో ఉన్న చిత్రాలు తీయండి. అమ్మ, నాన్న, అక్క,చెల్లి,అన్న, తమ్ముడు అందరూ కలిసి హాయిగా చూడగలిగే కథాంశాలు, చిత్రీకరణ ఎంచుకోండి.

’సినిమా’ అనేది కేవలం రెండు మూడు గంటల వినోదం అని కాకుండా మన సగటు భారతీయులకు అది ఒక జీవనవిధానం (way of life) అని గుర్తెరగండి.

7 Comments
  1. Chetana December 6, 2008 /
  2. Motorolan December 6, 2008 /
  3. మేడేపల్లి శేషు December 8, 2008 /
  4. శ్రీ December 8, 2008 /
  5. saif ali gore December 8, 2008 /