Menu

Oye Lucky! Lucky Oye!

సీ. ఉన్నది, లేనిది, చిన్నది, పెద్దది, సొంతము కాదని చూసుకోడు

మెచ్చిన వస్తువు నచ్చినరీతిన చంకనవేసుకు జారుతాడు

బాకులు కత్తులు పట్టని చోరుడు, మాయలు నేర్చిన మాటకారి

తీయని తేనెల మాయల మాటల మూటలు మోసిన మోసగాడు

ఆ. ఎట్టివారి నైన బుట్టలో పడవేయ

బూటకాల నల్లు ఆటగాడు

రెప్పపాటులోపె తప్పుకు పోతాడు

హుళకి చేసి సొత్తు హొయల లక్కి

దివాకర్ బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన రెండవ చిత్రం ఓయే లక్కీ లక్కీ ఓయే తెర వెలిగించిన మొదటి క్షణం నండి వినూత్నంగానే కనిపిస్తుంది. పట్టుబడ్డ ఒక గజదొంగ దగ్గర దొరికిన సొత్తుని పోలీసులు పేర్చి హక్కుదారులని రప్పించి గుర్తించుకోమనే సన్నివేశంతో మొదలవుతుంది కథ. అటు తరువాత డెభ్భైలలోని చిత్రాలలాంటి పేర్లు పడీ పడగానే, ఆ గజదొంగ పూర్వ వృత్తాంతంలోకి తొంగిచూపు ప్రారంభం. కథనంలో, పాటలలో, పాత్రలను తీర్చిన తీరులో ఇలాంటి చిత్రాన్ని నేను ఈ మధ్య కాలంలో చూసి ఎరుగను. మధ్యలో అక్కడక్కడా కొంత సాగినట్టు అనిపించినా తెరపడే సమయానికి మొత్తం మీద పెట్టిన డబ్బుకి తగ్గ విలువ అందిందిలే అనిపిస్తుంది.

చెప్పుకోవడానికి పెద్దగా కథ లేకపోయినా చూస్తున్నంత సేపు కళ్ళప్పగింతలే. కారణం ఏమిటంటే, కృత్రిమంగా లేని పాత్రల నవ్వు తెప్పించే మాటలు, చేష్టలు. దర్శకుడికి తన కథనం మీద ఉన్న అపారమైన నమ్మకం ప్రతి ఘట్టంలోనూ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. నాకు మటుకు, చేపని గాలం వేసిపట్టిన తరువాత ఎటుపడితే అటు లాగే జాలరి లాగ, తెగ ధీమాతో దర్శకుడు తనదైన పంధాలో కథను నడుపుకుపోతూ, ప్రేక్షకులు నాతో రాకపోతారా అని లాగించాడనిపించింది. దానికి మరో ఉదాహరణ సంభాషణలు, ఇటీవలే విడుదలైన రబ్నే బనాది జోడి లో లాగ పంజాబి మాటలకు ఈ చిత్రంలో చక్కెరపూతలు లేవు. నిజంగా పంజాబీ వాళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అనిపించేలా ఉన్నాయి మాటలు. వాళ్లు మారుతిని మృత్తి అనడం ఇంతకు ముందు విన్నదే కానీ మెర్సిడిస్ ని మెర్సిడీ అంటారని నాకు ఈ చిత్రం చూసాకే తెలిసింది. నవ్వించింది.

పైగా ఒక సన్నివేశం చూపుతూనే, నేపధ్యంలో మరొక చిన్న సన్నివేశాన్ని పొదిగి, ప్రేక్షకులూ, మీలో రెండూ కనిపెట్టి ఆనందించ గలిగే వారు కొందరుంటే ఇది మీ కోసమే నని బహుమానంగా ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. హాలు నుండి బయటకు వచ్చిన తరువాతు కూడ గుర్తుకొచ్చి మళ్ళీ మళ్ళీ నవ్వించిన ఘట్టాలు అవి. మచ్చుకకి రెండు.

ఒకటి లక్కి తన ప్రియురాలిని హోటలుకి కారులో తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి సంభాషణ మీద కెమేరా నిలిచి ఉంటుంది, అదే సమయంలో వెనకాల ఆ కారు పార్కు చేయబడ్డ చోట పార్కింగు విషయమై చిన్న గొడవ ప్రారంభమవుతుంది. ఆ గొడవ మొదలవుతున్నదనగా కెమేరా మనని హోటలులోకి తీసుకుపోతుంది. వెనక గొడవ చిలికి చిలికి గాలి వానలా పెరుగుతూ ఉంటుంది. ఆ గొడవని లక్కీ తో సహా, కెమేరా కూడా పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించదు, కాని లక్కీ బిల్లుకట్టి బయలుదేరే సమయానికి అక్కడ ఓ చిన్న సైజు దొమ్మి ప్రారంభం. పనిపాట లేకుండా తమది కాని పనిలో తలదూర్చి కొట్లాటల దాకా వెళ్ళిపోయే ప్రబుధ్ధులకి మన దేశంలో కొదవలేదు, అలాంటి వారికిది చురక. తెగ నవ్వు తెప్పించే తునక.

రెండు పేరు పొందిన ఘజల్ పాటగాళ్ళు, భజనలు చేసేవాళ్ళు ప్రసిధ్ధి గాంచిన పాటలని పాడుతున్నప్పుడు, ఓ చరణాన్నో లేక చరణంలో పదాన్నో పట్టుకుని రకరకాలు సాగదీసి, పాడి ప్రేక్షకులని పరవశింపజేయడం మనం చూస్తూనే ఉంటాము. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, చిన్నా చితకా పాటగాళ్ళు అదే పధ్ధతి ననుసరిస్తే? కితకితలే మరి. అలాగే, ఒకానొక సన్నివేశంలో హోటలులో మీరాబాయి భజన పాడుతున్న పాటగాడు మధ్యలో గలి, గలి, గలి, గలి అంటూ ఎడతెరపి లేకుండా, ఊపిరి తిప్పుకోకుండా పాడేస్తూ ఉంటే ఘొల్లున నవ్వు రాక మానదు. పైగా, అక్కడ ఉన్న పెద్ద మనిషి వాడిని ఆపమని సంజ్ఞ చేయగానే ఆపేసి, తరువాత మళ్ళీ సరిగ్గా అదే చోటునుండి గలి, గలి, గలి అని మొదలు పెడతాడు కూడా. (ఇలాగే, ఇంకో సీరియస్ సంభాషణ జరుగుతున్నప్పుడు కిషోర్ కుమార్ పాట పాడుతూ పరవశించి పోతున్న గాయకుడు కూడ నాకు తెగ నవ్వు తెప్పించాడు)

చిత్రంలో మరో ప్రత్యేకత పరేష రావల్ త్రిపాత్రాభినయం. లక్కిని ప్రభావితం చేసి పెడత్రోవలోకి నెట్టి స్వార్థంతో వాణ్ణి వాడుకున్న మువ్వురి పాత్రలు ఒకే వ్యక్తిచేత పోషింపజేయడం దర్శకుడి టచ్.

నటులందరూ బాగా చేసినా, అభయ్ డయోల్ మాత్రం అదరకొట్టేసాడు. వీలు దొరికితే తప్పక చూడాల్సిన చిత్రం Oye Lucky! Lucky Oye!

–గిరి లంక

3 Comments
  1. శ్రీ December 27, 2008 /
  2. శంకర్ December 28, 2008 /