Menu

మా అబ్బాయి సినిమాకెళ్ళాడు!!

నూనూగు మీసాలవాడు
నూరు పైసలైనా సంపాదించనివాడు
గుడ్డ తోరణాలకీ,
గులాబీ దండలకీ వందలకొద్దీ వెచ్చించి-
మా అబ్బాయి సినిమాకెళ్ళాడు!

నాయకుడు-నవరసాలకూ న్యాయం చేశాడా!
చిన్నవత్తి వెలిగించినంత చెణుకుతో-
హాస్యం చిచ్చుబుడ్డిలా ఎగసి-
నవ్వుల వెలుగుపూలు చిందాయా?
పెదవి వణుకున దు:ఖం,
కంటి కొసలన క్రౌర్యం,
తడిదేరిన మోవిపై మోహం
ప్రతీకాత్మకంగా మెరిసాయా?
మాట విరుపుతో మాత్సర్యం,
చెయ్యి తిరిగిన గయ్యాళితనం
జనహితమైన ధీరత్వం
మచ్చుకైనా లేని కౄరత్వం,
వెరసి మానవ సంబంధాల ఔన్నత్యం-

ఇవ్వేమీ కావు వాడికి సినిమా అంటే!
అక్కడ ఆంగికం లేకున్నా
ఆడేవాడు మనోడైతే చాలు
నవరసాలూ నట్టేట్లో కలిపినా-
కులగొంగడి కూటికి
కారతాయి చొంగలు!
తరతరాలుగా పాతుకున్న
కులపితామహ, కులరత్న, కులపౌత్రులకు
జేజేలు కొట్టేందుకు నవతరాలుగా పాదుకున్న
బావల, తమ్ముల,మరుదుల,
అల్లుళ్ళకు హారతులద్దేందుకు-
మా అబ్బాయి సినిమాకెళ్ళాడు!

ఈ మానసిక మరగుజ్జుతనం
కొత్త అర్హత ఇప్పుడిక్కడ!
కులశాలలుగా లుకలుకలాడుతున్న కళాశాలల్లో
సి బ్యాచ్, కె బ్యాచ్, ఆర్ బ్యాచ్,
బి బ్యాచ్ లుగా విస్తరిస్తున్న
ఆధునిక అంటరానితనాల మధ్య,
తాతముత్తాతల పేర్లు గుర్తుండని వాళ్ళంతా
పురాతన రాజవంశాల బూజుకిరీటాలు
కుల కూటముల పేర్లుగా
పెట్టుకుని మురుసుకుంటూ-

ఓటు పడవల గాలికి, తెర
చాపను వాడుకునే లౌక్యంతో
నటకుల తిలకులే జెండాపై కపిరాజుగా ఎగరేసే
ప్రజా ప్రతినిధుల ఆదర్శంగా
మా అబ్బాయి సినిమాకెళ్ళాడు!

హింసారస పర్ంలో మనసు గిజగిజలాడినా-
భలే ’కమ్మ-కమ్మ’గా ఉందని లొట్టలేసెందుకూ-
మా ’బాలకృష్ణుడు’ సినిమాకెళ్ళాడు!

ఒక్క పండూ లేక ఈటుబోయిన తోట-
ఫలవంతమైన వందో రోజుని భ్రమించేలా ’కాపు’
కాసేందుకు-
మా ’చిరంజీవి’ సినిమాకెళ్ళాడు!

ఏం చేస్తాడు పాపం వాడైనా
మానవీయ బంధాలు లేని మహానగరాలలో
’ఫలానా కదూ’ అనే కనీస గుర్తింపైనా లేనివాడు!
మందార మకరంద మాధుర్యములు గ్రోలో-
కడిమిచెట్టు కమ్మదనాల సోలో-
మనసురేకు విరియకుండా-
అటూ ఇటూ కాని ఆంగ్లమాధ్యమాల-
గిడిసబారిన వాడు!

తొందరపెట్టే భావాల తొలియవ్వనాన
మనసునావిష్కరించగల మాతృభాష
గిట్టుబాటుగా లేదని
కృతకంగా-సంస్కృతాన్ని నేర్చుకుంటున్నవాడు!
కళాకారుడికంటే-
కారుగలవాడే గొప్పవాడనే ఈ సంస్కృతిలో-
ఏ కళా కళ్ళకు వేగుచుక్కవ్వని వాడు!
ఎహ్హే!ఈ……
ఈ రోజుల్లో కవిత్వమెందుకురా బాబూ-
కనకవర్షం కురియాలంటే-
కమ్యూనికేషన్ స్కిల్స్ కదా నేర్వాల్సింది-
అని గాఢంగా నమ్ముతున్నవాడు!

భవిష్యత్తులో-మహా అయితే-
ఇంటింటా ఇంజ’నీరు’ పథకంలో వాడూ ఒక బొట్టు!
కోటి చుక్కల డాట్ కామ్ లలో వాడు ఒక చుక్క!
అంతకుమించి? అంతకుమించి
ఇంకేమీ అవ్వలేక-
నిగర్వంగా నవ్వుతున్న
సచిన్ లా ఎదగలేక-ఒదగలేక-
తెరవీరుల ఆధిపత్యంలో-
తన అస్తిత్వాన్ని వెతుక్కుంటున్నాడు!
ఫలానా వాడిలా ఉన్నావంటే
పండగ చేసుకుంటాడు వాడు!
సాఫ్ట్ వేర్ తల్లివేరుగా జగమంతా
మన జనమే అయినవేళ-
విశ్వనరుడిగా విస్తరించాలి రా,
నీ వివేకమని హెచ్చరిస్తే,
అటజనిన మన వాళ్ళ తానా
బజానాల ప్రత్యక్ష ప్రసారాల్లో
కులగమ పదనిసలు చూపి-
కొంటెగా నవ్వుతాడు!

అరరే!
డప్పులు,చిందులు, గరగలు,కోలాటాలు
కాటిపాపలు, బహురూపులు,
తోలుబొమ్మలు,యక్షగానాలు-
జీవనగలగల కళలెన్నింటినో కాలరాచి,
తొంభైతొమ్మిది మంది అన్నల
ఒక్కో మెతుకూ తిని బ్రతికిన
శకుని మామలా మిగిలింది కదా-ఈ చిత్రసీమ!

దురభిమాన దురంధరులుగా యువతను రెచ్చగొట్టి
కులకురుక్షేత్రాలకు కానుందా చిరునామా?
అందుకే-కళాంధుడిగా మారుతున్న నా బిడ్డకు
ఓ శ్రీశ్రీ పద్యాన్నో,
ఓ గోరటి వెంకన్న పాటనో,
ఓ సినారె గజల్ నో-
మువ్వల చేతికర్రగా తీసుకువెళ్ళాలి నేనివ్వాళ!

వెళతాను-మరి-వాడొచ్చేవేళయింది-
తలుపు తీయాలంటేనే భయం!
కంటి చూపుతో చంపేస్తానంటాడో-
పీక కోస్తానంటాడో-
అమ్మతోడు! అడ్డంగా నరుకుతానంటాడో-
మా అబ్బాయసలే సినిమాకెళ్ళాడు.

(ప్రపంచ తెలుగు రచయితల మహాసభ (విజయవాడ)లో 21-09-2007 న చదివినది)

—పాటిబండ్ల రజని

సేకరణ: ప్రజాసాహితి, మే,2008 సంచిక నుండి, మేడేపల్లి శేషు,

20 Comments
 1. కొత్తపాళీ December 7, 2008 /
 2. wb December 7, 2008 /
 3. Kumar December 7, 2008 /
 4. jyothi December 7, 2008 /
 5. రానారె December 7, 2008 /
 6. శంకర్ December 7, 2008 /
 7. Motorolan December 7, 2008 /
 8. చదువరి December 7, 2008 /
 9. బుర్రి రఘు December 7, 2008 /
 10. యోగేంద్ర December 8, 2008 /
 11. venkat December 8, 2008 /
 12. shree December 8, 2008 /
 13. ప్రపుల్ల చంద్ర December 9, 2008 /
 14. Srinivas December 11, 2008 /
 15. Motorolan December 14, 2008 /
 16. pavan January 1, 2009 /