ఒకరికి ఒకరు

okariki-okaru-lead

అనగనగా ఓ కామేశ్వరరావు.. రైల్లో కాశీ వెళ్తూ దారిలో ఓ చోట సుబ్బలక్ష్మి ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఓ రెండు రోజులు వాళ్ళిద్దరూ కలిసి ఓ అడవిలో గడపాల్సి వస్తుంది..అంతే అనుకోకుండా విడిపోవాల్సి వస్తుంది. సుబ్బలక్ష్మి అమెరికాలో ఉంటుందన్న విషయం తప్ప ఆమె గురించి మరే వివరాలూ తెలియవు కామేశ్వర రావుకి. చివరికి వాళ్ళిద్దరూ కలుసుకున్నారా, లేదా? అన్నదే ‘ఒకరికి ఒకరు’ సినిమా. నాయికా నాయకుల పేర్లు, కాశీ ప్రయాణం చూసి ‘ఇదేదో అరవయ్యో పడిలో ఉన్నవాళ్ళ కథ’ అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే, సదరు కామేశ్వర రావు, సుబ్బలక్ష్మి ఇరవైలలో ఉన్నవాళ్ళే. అసలు కథ అంతా వాళ్ల పేర్లవెనుకే ఉంది.

కెమెరామన్ రసూల్ ఎల్లోర్ ను దర్శకుడి గా పరిచయం చేస్తూ ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై ‘జెమిని’ కిరణ్ నిర్మించిన ‘ఒకరికి ఒకరు’ 2003 లో విడుదలైంది. కామేశ్వరరావు గా తెలుగు, తమిళ నటుడు శ్రీరామ్ (తెలుగు వాడే, తమిళంలో ‘శ్రీకాంత్’ పేరుతొ నటిస్తున్నాడు) సుబ్బలక్ష్మి గా ఉత్తరాది నటి ఆర్తి చాబ్రియా నటించారు. రసూల్ దర్శకత్వం తో పాటు, కీరవాణి సంగీతం, కోన వెంకట్ మాటలు, సునీల్, రాజా ల ఫోటోగ్రఫీ ఈ సినిమా ను ‘చూడదగ్గ సినిమా’ చేశాయి. కామేశ్వరరావు బాలసారె తో (బారసాల అని వాడుక) కథ ప్రారంభం అవుతుంది. నాయకుడే తన కథను చెబుతూ ఉంటాడు.

చచ్చి స్వర్గాన ఉన్నతన భర్త పేరునే మనవడికి పెట్టాలని పట్టుబట్టిన బామ్మమల్లీశ్వరి (రాధాకుమారి) తన కొడుకు, కోడలిచేత (తనికెళ్ళ భరణి, హేమ) చంటి కుర్రాడికి ‘కామేశ్వర రావు’ అని పేరుపెట్టించడం సినిమా ఓపెనింగ్ సీన్. తరువాతి సీన్లలో కామేశ్వర రావు కుటుంబం, అతని స్నేహితుల పరిచయం ఉంటుంది. మనవాడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడం తో అసలు కథ మొదలవుతుంది. మనవడు ఇంజనీరింగ్ పాస్ ఐతే కాశీ తీసుకెళ్తానని బామ్మ మొక్కుకుంటుంది, తులసి చెట్టు దగ్గర నిరాహార దీక్ష చేసి మరీ తన పట్టు సాధించుకుంటుంది. కామేశం స్నేహితుడు పుచ్చు(విజయ్) కూడా వీళ్ళతో చేరతాడు.

ఈ మనవళ్ళనిద్దరిని గదమాయిస్తూ, రైల్లో అందరిని పలకరిస్తూ బామ్మగారు చేసే హడావిడి తో కథ నడుస్తూ ఉండగా, ఓ స్టేషన్ లో రైలు ఆగడం, అక్కడ ఓ అమ్మాయిని చూసి -మమూలుగా అమ్మాయిలకి ఆమడ దూరంలో ఉండే- కామేశ్వర రావు తొలిచూపులోనే మనసు పారేసుకోడం జరుగుతాయి. కట్ చేస్తే, తుఫాన్.. ఓ అడవిలో రైలు ఆగిపోతుంది. స్టేషన్ లో అమ్మాయి అక్కడ కనిపించడంతో ఎగిరి గంతేసిన కామేశం, తన పేరు ఆ అమ్మాయికి నచ్చదేమో అనే భయంతో తనని ‘రాహుల్’ అని పరిచయం చేసుకుంటాడు. ఇతను వెంటబడడం నచ్చని ఆ అమ్మాయి తన అసలు పేరు ‘స్వప్న రావు’ అని చెప్పకుండా తన నాయనమ్మ పేరైన సుబ్బలక్ష్మే తనపేరని చెబుతుంది.

రైల్వే ట్రాక్ పాడవ్వడంతో వీళ్ళిద్దరూ, బామ్మ, పుచ్చు, స్వప్న తాతయ్య (బాలయ్య) కలిసి అడవిలో ఉండే ఓ రిటైర్డ్ ఆంగ్లో ఇండియన్ ఆఫీసర్ ఇంట్లో నాలుగైదు రోజులు ఉండాల్సి వస్తుంది. ఓ రాత్రి అడవిలో తప్పిపోయి ఒంటరిగా గడుపుతారు కూడా. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా, దానిని వ్యక్తం చేసుకునే లోగానే విడిపోవాల్సి వస్తుంది. ఇది సినిమా మొదటి సగం. తన ఇంజనీరింగ్ డిగ్రీ సాయంతో అమెరికాలో ఉద్యోగం సంపాదించుకున్న కామేశ్వర రావు, అక్కడ సుబ్బలక్ష్మి ని వెతికే ప్రయత్నాలు, మరోపక్క అమెరికా లో స్వప్న రాహుల్ ని వెతకడం కోసం ఇండియా వచ్చి వెళ్ళడం, పెద్ద వాళ్లు చేస్తున్న తన పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం వంటి సీన్లతో రెండో సగం నడుస్తుంది. నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళిద్దరూ కలుసుకోవడమే సినిమా ముగింపు.

ఈ సినిమా లో మొదట చెప్పుకోవాల్సింది ఫోటోగ్రఫీ. దర్శకుడు స్వతహాగా కెమెరామాన్ కావడం తో సినిమా ని దృశ్య కావ్యం గా తీర్చిదిద్దాడు. ‘వెళ్ళిపోతే ఎలా..’ పాట చిత్రీకరణ ఒక్కటి చాలు, దర్శకుడి అభిరుచి తెలుసుకోడానికి. అలాగే ‘నాదిర్ దిన..’ పాట చిత్రీకరణ కుడా. అడవి సన్నివేశాల చిత్రీకరణ చాల ఆహ్లాదంగా ఉంటుంది. ఇక సంగీతం..కీరవాణి ‘అద్భుతమైన’ సంగీతం అందించిన సినిమాలలో ఇది ఒకటి. పాటలతో పాటు, నేపధ్య సంగీతమూ అందంగా కుదిరింది. సీతారామశాస్త్రి, చంద్రబోస్ లు పాటలకి ‘తెలుగు’ సాహిత్యం అందించారు. ఒక్క ‘ఎక్కడున్నావమ్మా..’ పాటలో మాత్రం అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వినిపిస్తాయి. చంద్రబోస్ 33 ఇంటిపేర్లతో రాసిన ఈ పాట ఓ ప్రయోగం.
‘నువ్వే నా శ్వాస..’ ‘ఘాటు ఘాటు ప్రేమ..’ ‘అల్లో నేరేల్లో..’ పాటలు కూడా వేటికవే ప్రత్యేకం. ‘అల్లో నేరేల్లో..’ పాటలో హీరో మాసిన గడ్డం కంటిన్యుటి దెబ్బ తినడం ఎడిటింగ్ శాఖలో జరిగిన పొరబాటు. బస్ లో ప్రయాణిస్తున్న హీరో గడ్డం కాసేపు మాసి, కాసేపు క్లీన్ షేవ్, మళ్ళి మాసి కనిపిస్తుంది. సినిమా రెండో సగంలో బిగి సడలినట్టు అనిపిస్తుంది. కొంతవరకు ఎడిటింగ్ లోపమే. క్లీన్ కామెడీ ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్లలో ఒకటి. ఎక్కడ అశ్లీలం, అసభ్యత కనిపించవు, వినిపించవు. ‘మరచెంబు’ సీన్ లో ‘శంకరాభరణం,’ అడవి సీన్ లలో మరో రెండు మూడు సినిమాలు గుర్తొచ్చినా అవేవీ ఈ సినిమాని ఎంజాయ్ చేయడానికి అడ్డంకి కాదు.

బామ్మ గా సీనియర్ నటి రాధాకుమారి, హీరో తండ్రి గా తనికెళ్ళ మంచి నటనని ప్రదర్శించారు. కొడుక్కి తన ప్రేమకథ చెప్పే సీన్ లో భరణి నటన గుర్తుండిపోతుంది. అలాగే, అమెరికా నుంచి కామేశ్వరరావు ఫోన్ చేసే సన్నివేశం కూడా. అమ్మాయిలకి సైట్ కొట్టి ఎదురుదెబ్బలు తినే ‘పుచ్చు’ పాత్రలో విజయ్ నటననీ మర్చిపోలేము. అమెరికా లో కామేశ్వర రావు ఫ్రెండ్స్ గా చేసిన కుర్రాళ్ళు సినిమా రెండో సగంలో హాస్యాన్ని అందించారు. ఇక శ్రీరామ్ అమాయకమైన కామేశ్వర రావు పాత్రలో ఒదిగిపోయాడు. ఇతనికి సంగీత దర్శకుడు శ్రీ చెప్పిన డబ్బింగ్ బాగా కుదిరింది. హీరోయిన్ పాత్రకి గాయని సునీత గాత్రం అందించింది. చలాకీ అమ్మాయి గా, సిన్సియర్ ప్రేమికురాలిగా ఆర్తి నటన బాగుంది, తెలుగు అమ్మాయి ఐతే ఇంకా బాగుండేది కదా అనిపించినప్పటికీ.

హీరో, హీరోయిన్ ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించిన విధానమే కథలో పెద్ద మైనస్. సుబ్బలక్ష్మి అడవిలో తప్పిపోయిన రాత్రి తన ఫోటో వెనుక తన అసలు పేరు, అడ్రస్ రాసి కామేశ్వర రావు చూడకుండా అతని పర్స్ లో పెడుతుంది. అదే పర్స్ వాడుతున్నప్పటికీ రెండేళ్ళ తర్వాత కూడా కామేశ్వర రావు ఆ పర్స్ చూడడు. కథకి కీలకమైన ఈ పాయింట్ చాలా అసహజంగా అనిపించింది. ఈ పాయింట్ విషయంలో మరికొంచెం శ్రద్ధ వహించి ఉంటే మరింత బాగుండేది.

చివరిగా ఒక్క విషయం. ఈ సినిమా చూసి, తెలుగు తెరకి ఓ మంచి దర్శకుడు దొరికాడని చాలా సంతోష పడ్డా. ఐతే రసూల్ ఆ తర్వాత తీసిన ‘భగీరధ’ ‘సంగమం’ సినిమాలు నిరాశ పరిచాయి. ‘ఒకిరికి ఒకరు’ స్థాయి లో అతని నుంచి మరో సినిమా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నా.

-మురళి

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

12 Comments to “ఒకరికి ఒకరు”

  • అప్పట్లో నాకు ఈ సినిమా తెగ నచ్చేసింది, సంగీతపరంగా ఐతేనేమి, సినిమాటోగ్రఫీ పరంగా ఐతేనేమీ. నాకు అప్పటివరకు కీరవాణి అంటే రాఘవేంద్రరావు సినిమాల సంగీతం టైపు, “బుచుకు-బూచుకు” పాటలే అని ఫీలింగు. హిందీ సినిమా “సుర్” పాటలు అవీ బాగున్నా, “ఆ కీరవాణి ప్రతిభ కన్నా, లక్కీ అలీ influnce ఎక్కువ ఉండుంటుందిలే” అనుకునేదన్ని. ఈ సినిమాతో నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసి నా favorite music director అయిపోయాడు (అప్పట్లో). సినిమటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. ట్రైన్ సీన్స్‌లో రాధాకుమారి నటన ఎంత సహజంగా ఉంటుందో. ఎంతయినా ఆ తరం వేరు మరీ. సినిమా కథనం కూడా హాయిగా ఉంటుంది.

    • hi chetan.keeravanigari talent elantidho telusukovalante devaraagam,mina[release kaledu],jism[hindhi],shubhamuhurtham,mr.pellam lanti cenamallo paatalu vinandi,he is one and only music director for live instrument composer in india.

  • నాకూ నచ్చింది ఈ సినిమా అప్పట్లో! బాగుంటుంది

  • ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాట

  • curate’s egg అంటారే అలా ఉంటుంది ఈ సినిమా నాకు.కధనం ఎత్తుగడ పరంగా వైవిధ్యమైనదే అనటం లొ సందేహం లేదు,కానీ సంఘటనలను ముందుకు కదిలించటంలో రసూల్ ఎల్లోర్ జిడ్డాడతాడు.కధ అమెరికాకు చేరాక సుబ్బలక్ష్మిని వెదకటంలో మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ హాస్యాన్ని పిండడటానికి ఆస్కారమున్నా అప్పటికే గందరగోళం లొ పడ్డ దర్శకుడు అలరించలేకపోయారు,రాధా కుమారి నటన శ్రీరామ్ ఇద్దరూ ఆనాటిఈనాటి తరాల్లోని మెరుగైన నటనను ప్రదర్శించారు.
    ఇక రసూల్ ఎల్లోర్ గారి భగీరధ గురించి ఎంతతక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
    అదేంటో వర్షం తర్వాత శోభన్ రవితేజతో చంటి,ఈ సినిమా తరువాత రసూల్ భగీరధ తీసారు !!!???

  • పాటలు,ఫోటోగ్రఫీ,కొంచెం కామెడీ వరకూ బాగానే నచ్చింది ఈ సినిమా. ఇంతకీ రసూల్ మూడో సినిమా సంగమం సంగతేంటో ఎవరన్నా తెలియజేస్తే బావుంటుంది. ఎక్కడో ఒక రివ్యూ బావుంది అన్నట్టు చదివా అంతే మళ్ళీ ఎవరూ దాని గురించి వ్రాసినట్టు గుర్తులేదు. ఒక్క అల్లో నేరేళ్ళు అన్నపాటలో తప్ప ఇంకెక్కడా నాకు ఆర్తీ చాబ్రియా అమ్మాయిలా అనిపించలేదు ఎందుకనో.
    @రాజేంద్ర కుమార్ దేవరపల్లి
    మీ లిస్టులో ఖతర్నాక్ కూడా కలుపుకోవచ్చు. రణం తర్వాత(ఇది హిట్ అయ్యింది మరి) అమ్మరాజశేఖర్ నుండి జాలువారిన ఆణిముత్యంగా రికార్డులకెక్కింది ఈ చిత్రరాజం.

  • మంచి రివ్యూ. నావీ ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలే. ఇంకొంత బాగా తీసుండొచ్చు. పాటలు దేనికదే. అన్నిట్లోకీ నాకు నచ్చింది ‘అల్ల నేరెళ్లో’ .. ఆ పాట చివరి చరణంలో కీరవాణి గొంతునుండి జాలువారిన ఆర్ద్రత, దానికి శ్రీరాం అభినయం విని, చూసి తీరాలి.

    ‘నాదిన్ దిర్న’ ని యధావిధిగా హిందీ పహేలీలో వాడుకున్నాడు కీరవాణి – ‘ధీరె జల్నా’ అంటూ. నాకైతే తెలుగుదే నచ్చింది.

    @రాజేంద్ర: శోభన్ ‘వర్షం’ కన్నా ముందు మహేష్‌తో ‘బాబీ’ అని ఓ బాంబు వేసున్నాడు :-) కాబట్టి రవితేజతో చంటి అతనికి ద్వితీయ విఘ్నం కాదులెండి.

    @చేతన: అదేంటండీ అలా అనేశారు. ఇప్పట్లో తెలుగులో డొక్కశుద్ధిగల ఒకే ఒక సంగీతదర్శకుడు కీరవాణి. రాఘవేంద్రరావు సినిమాలు అవతల పెట్టినా, ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘క్షణ క్షణం’, ‘క్రిమినల్’, ‘ఆపద్భాంధవుడు’, ‘శుభ సంకల్పం’, ‘మిస్టర్ పెళ్లాం’, ‘మాతృదేవోభవ’ లాంటి సినిమాల్లో బోలెడు మంచి రాగాలల్లాడు కదా.

  • పై వ్యాఖ్యలో పెద్ద అప్పుతచ్చు: యధావిధిగా కాదు, యధాతధంగా :-)

  • @అబ్రకదబ్ర: ‘ఇంకొంచం బాగా తీసి ఉండొచ్చు’ అని నాకు కూడా అనిపించింది. కానీ, మొదటి సినిమా ని ఈ మాత్రంగా తీయగలగడం (కమర్షియల్ ఫార్మాట్ లో) గొప్ప విషయమే కదా అని సరిపెట్టుకున్నా

  • నిజమైన ప్రేమలో కలహాలు ఎందుకొస్తాయి!

    మామూలుగా పెద్దవాళ్ళు ప్రేమ వివాహాలు పెళ్ళైన తరువాత, కలహాలతో విడిపోతుంటాయని అంటుంటారు!నిజానికి ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుంటే ఆ కలహాలు ఎందుకొస్తాయ్! నిజంగా ప్రేమించుకొన్నవారు ఎందుకు అర్తం చేసుకోరు, స్వార్థంలేని ప్రేమలో కలహాలకు స్థానం లేదు, స్వార్థంతో కూడుకొన్న ప్రేమలు పెళ్ళి వరకూ రాకుంటే అసలు మన పెద్దవాళ్ళకు ఆ సందేహాలను దూరం చెయ్యొచని చెప్పవచ్చు.

  • one of the best movie in 2003, Vja Navarang lo release ayindii manchi hit ayindhiii, cinema chala clean gaa unthadii heroine exposing kuda yekkada undaduu, screen lo chala varaku greenary ki importance icharu

    Photography is topnotch

  • murali garu meeru eee movie ni enduku select chesukunnaro naku ardham kaledu only photography and music kosam ayyitey intha vivarana waste for example manirathnam cinemallo photography,music + story,dances,actors everything vuntayi….mimmalni chinnabuchali ani cheppatam ledu meru select chesukunna movie wrong ani chebutunnanu.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories