Menu

ఓ మై గాడ్ !!

సినిమా ఎలా ఉంది? ఏమౌంతుంది అనేది ఓ క్షణం ప్రక్కన పెడితే ఈ దర్శకుడు నాకు ఓ కోణంలో భలే నచ్చాడు. సాధారణంగా దర్శకులు కొద్దిగా తెలివిని ఉపయోగించి తమ సినిమాలో ఏదైతే చెప్తున్నామో ఆ విషయాన్ని సింబలైజ్ చేస్తూ టైటిల్స్ పెడుతూంటారు. అయితే ఈ దర్శకుడు మరింత ముందుకెళ్ళి ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుడుకి (మనకు) కలిగే ఫీలింగ్ ని కూడా ఊహించుకుని దానికి తగ్గట్టుగా’ ఓ మై గాడ్’ అనే టైటిల్ ని పెట్టాడు. గ్రేట్ కదా.

ఇంతకీ ఈ కథలో ఎవరు ఓ మైగాడ్ అంటారు..ఎవరు అనిపిస్తారు. అంటే గాడ్ (అంటే దేముడే) ఒకానొక సిట్యువేషన్ లో అలా ఓ మైగాడ్ అంటాడు. అలా అనిపించేది రాజేంద్ర(వినయ్ పాఠక్)కి. వాస్తవానికి రాజేంద్ర పెద్ద ఆశలు కల ఓ చిన్న సేల్స్ మెన్. అలాగే అతను ధీరూభయ్ అంబానీ కి పిచ్చ ఫాన్.ఆయనలా విలువలు వదలకుండా ఎదగాలని కలలు కంటూ..వాటిని సఫలం చేసుకునేందుకు ఓ మల్టి మార్కిటింగ్ నెట్ వర్క్ కంపెనీలో అందర్ని మెంబర్స్ గా చేర్చించి ఎదగాలని తిరుగుతూంటాడు. అయితే ఆ స్కీమ్ అనుకున్నంత ఈజీగా వర్కవుట్ కాదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడులా తిరిగే అతని వల్ల అతని భార్య సమన్ (దివ్య దత్తా) కూడా ఇబ్బంది పడుతూంటుంది.

అయితే ఎంతసేపు డబ్బు ..డబ్బు అని తిరిగుతూ చివరకు పిల్లలు కూడా వద్దనుకునే అతన్ని ఎలాగైనా సేవ్ చెయ్యమని దేముడ్ని మొక్కుతూంటుంది.(ఏం ఆవిడే మగుడ్ని బాగు చేయటానికి ప్రయత్నించవచ్చు కదా అని అడగొద్దు…ఆవిడ టీవీల్లో పాత సినిమాలు చాలా చూసి చూసి కష్టాలు కలిగితే దేముడ్నే ప్రార్ధించాలని నమ్మి అలా డిసైడ్ ఉండవచ్చు). ఇక ఈవిడ మొర ఆలకించిన దేముడు(సౌరభ్ శుక్లా) రంగంలోకి దూకుతాడు(మళ్ళీ బ్రూస్ ఆల్మైటీ అన్పిస్తోందా..మర్చిపోండి). ఆయన బొద్దుగా బడ్డూలా ఉండి బట్టతలని నిమురుకుంటూ ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటూ మన హీరోకి సాయం చేద్దామనుకుంటాడు. ఆ క్రమంలో ముందుగా ఓ లాటిరీ వ్యక్తిలా వచ్చి ఫలానా టిక్కెట్ కొనమని నెంబర్ చూపి మరీ అడుగుతాడు. మనవాడు ఫలానా నెంబర్ అని నువ్వే చెపుతున్నావంటే …ఏదో మతలబు ఉందని కొనడు. ఆ తర్వాత గేంబ్లర్ గా,ఇన్వెస్టర్ గా,పోలీస్ గా రకరకాల గెటప్స్ లో వచ్చి బ్రతిమాలి డబ్బు అంటకడదామని చూస్తాడు.

రాజేంద్ర నిజాయితీగా వచ్చే డబ్బు తప్ప మరేదీ ముట్టనని తప్పుకుంటూంటాడు. ఇలా చేసి చేసి విసుగొచ్చిన దేముడు…అతని సూటుకేస్ లో ఉన్న బ్రోచర్స్ స్ధానంలో డబ్బు వచ్చేటట్లు మాయచేస్తాడు. సరిగ్గా అదే సమయంలో రాజేంద్ర పనిచేసే కంపెనీ ప్రక్కన ఉన్న బ్యాంక్ లో దొంగతనం జరుగుతుంది. అప్పుడు అనుమానం ఇతనిపై వస్తుంది. అప్పుడు ఏం జరిగింది..డబ్బుని రాజేంద్ర ఏక్సెప్ట్ చేసాడా..దేముడు ఏమయ్యాడు…అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

నిజానికి ఈ సినిమా కామెడీకి గ్యారెంటీ ఇస్తుందని (ప్రోమేస్,వినయ్ ఫాఠక్) ధియోటర్ లో దూరుతాం. అయితే ఎక్కడ మనం నవ్వుతామో అన్నట్లు కామెడీ అనేది స్క్రిప్టులోకి రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకునే ఈ చిత్రం తయారుచేసాడని చూసాక అర్ధమవుతుంది. అలాగే కథ దేముడు వైపు నుంచా,హీరో పాత్ర వైపు నుంచా అన్నది స్పష్టం చేయడు. దాంతో అదే పెద్ద సమస్య అయి కూర్చుంది. దేముడు వైపు నుంచి అయితే ఆయన ఓ సామాన్యుడుకి సాయం చేయాలనుకోవటం భగం పడటం నవ్వులు కుర్పించేవి. లేదా హీరో వైపు నుంచే అని డిసైడ్ అయితే అతన్ని అంత మంచి వాడిగా పెట్టి ఉండకూడదు. మంచి వాడిని ఇబ్బందిపెడితే …జాలి పుడుతుంది కాని కామిడీ కుదరదు.

అయినా హీరో అసలు నాకు విలువలు కూడిన నిజాయితీ సంపాదన కావాలి అంటూ మొత్తుకుంటూంటే(దేముడు దగ్గర చాలా సీన్లు వేసారు లెండి)ఎందుకని దేముడు డబ్బు ఇస్తాను…ఎంజాయ్ చేసుకో అంటూ తిరుగుతాడో అర్ధంకాదు. అలాగే ఈ సినిమా చూస్తూంటే మన మతాలు ఎందుకు దేముడికి రూపం లేదు అంటాయో స్ఫష్టంగా అర్ధం అవుతుంది. ఎందుకంటే సౌరభ్ శుక్లా లాంటి దేముడ్ని కామిడీకైనా ప్రపంచంలో ఎవరూ భరించలేరు. దాని బదులు సుఖంగా దేముడు లేడు..ఉన్నా ఆయనకు రూపం లేదు అనుకోవటంలో ప్రాణం హాయిగా ఉంటుంది.

అయితే ఈ సినిమాలో నవ్వుకోవటానికి ఏమీ లేవా అంటే…దేముడు డబ్బు ఇస్తుంటే వినయ్ పాఠక్ పారిపోయే సీన్లు నవ్విస్తాయి. అలాగే దేముడు…నాకు మీ అందర్ని చూస్తూంటే డిప్రెషన్ వచ్చి జుట్టు మొత్తం ఊడిపోయింది.ఏం తింటున్నానో రుచి తెలియకండా తెలియటం లేదు. ఎప్పుడూ డిప్రెషన్ లో చిప్స్ తింటున్నా దాంతో ఒళ్ళు వచ్చేస్తోంది అని భాధ పడుతూంటే నవ్వు వస్తుంది. అలాంటి సన్నివేశాలు అక్కడక్కడా బాగానే పండాయి. నటుల్లో వినయ్ పాఠక్,దివ్య దత్తా ఎప్పటిలాగానే బాగా చేసాడు. డైరక్టర్ కూడా మంచి టేస్ట్ ఉన్నవాడేనని షాట్ డివిజన్ బట్టి అర్ధమవుతుంది.సంగీతం సొసో.డైలాగులు బాగున్నాయి. స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరలేదు.

ఇక నాకు ఈ సినిమా చూస్తూంటే చిన్నప్పుడు చదువుకున్న ప్రాప్తం అనే కథ గుర్తుకు వచ్చింది. ఓ దరిద్రుడు రోడ్డుపై వెళ్తూంటే వాడికి సాయిం చేయాలని భగవంతుడు రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఒకసారి డబ్బు మూట ఎదురుగా పడేస్తాడు.అక్కడిదాకా సవ్యంగా వచ్చిన వాడు సరదాగా కళ్ళు మూసకు నడిస్తే ఎలా ఉంటుందని దాన్ని దాటేస్తాడు. అలా వరసగా ఆ సీక్వెన్స్ నడుస్తాయి. ఆ కథనే బేస్ చేసుకున్నాడో ఏమో గానీ…అవకాశం ఉంటే మాత్రం ఈ సినిమాను ఎవాయిడ్ చేయిటం మేలు. కాదంటే ఈ టైటిల్ నే ఒకటికి పదిసార్లు అనుకుంటూ.. నిట్టూరుస్తూ…ధియేటర్ లో కూర్చోవల్సి వస్తుంది.

నటీనటులు: వినయ్ పాఠక్,సౌరభ్ శుక్ల,దివ్య దత్తా,గౌరవ్,హర్ష చయ్యా తదితరులు
సంగీతం: టిటుల్ మరియు బాపీ
కెమారా :అమోల్ రాధోడ్
కథ :రిషి విర్మణి,మనీషా ఓజా,విపుల్ బింజుల,అస్ధిత్ కౌల్,సౌరభ్ శ్రీ వాస్తవ
దర్శకుడు : సౌరభ్ శ్రీ వాస్తవ
నిర్మాణం:జీ లైమ్ లైట్
రిలీజ్ డేట్ :ఐదు డిసెంబర్,2008

7 Comments
  1. అబ్రకదబ్ర December 9, 2008 /
  2. pradeep December 9, 2008 /
  3. Sowmya December 9, 2008 /
  4. vennela December 10, 2008 /
  5. Sowmya December 17, 2008 /