Menu

Oh my god! (2008) – మరో వ్యూ

ఈమధ్యే వస్తున్న బాలీవుడ్ సినిమాలలో కాస్త వైవిధ్య భరితమైన కథలతో మన ముందుకొస్తున్న వాటిలో వినయ్ పాథక్ సినిమాలు ప్రధానమైనవి. కథ పూర్తిగా కొత్తది కాకపోవచ్చు కానీ, ఇతని సినిమాల దర్శకులంతా కూడా వీలైనంత సృజనాత్మకతను కథనంలో చూపిస్తూ ఉండటంతో ఈ సినిమాలు కాస్త భిన్నంగా అనిపిస్తున్నాయి. దస్విదానియాకి పేరు వచ్చినన్ని రోజులు కాలేదు, ఇంతలోపే మరో సినిమా వచ్చేసింది. “ఓ మై గాడ్” కేవలం పందొమ్మిది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుందని ఏదో సైటులో చదివాను. అయినా కూడా, సినిమా అంత హడావుడిగా తీసినట్లు కనిపించలేదు. ఫాంటసీ కథ కనుక అందరికీ నచ్చకపోవచ్చు కానీ, సినిమా మటుకు మంచి టైంపాస్ అనే చెప్పాలి.

కథ: రాజేంద్ర దూబే (వినయ్ పాథక్) ఓ సేల్స్ మాన్. ఇతనికి ఆఫీసుపని కాక స్కీముల ప్రచారం ఎక్కువ. న్యాయమైన మార్గంలో ధీరూభాయ్ అంబానీ అంత గొప్పవాడు కావాలని అతని కోరిక. అతని స్కీముల గోల భరించలేక జనం అతన్ని చూడగానే పారిపోతూ ఉంటారు కానీ, అతను మారడు. అతని భార్యకు కూడా అతని వ్యవహారం చిరాకు కలిగించినా, సర్దుకుపోతూ ఉంటుంది. ఒకానొకరోజు రాజేంద్ర గురించి అతని భార్య దేవునితో మొరపెట్టుకుంటుంది. దానితో దేవుడు వారికి సాయం చేయాలని – ఓసారి లాటరీ టికెట్లు అమ్మే వాడిలా, ఓ సారి పేకాట ఆడేవాడిలా – ఇలా రకరకాలుగా కనబడి అతనికి డబ్బులు ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. రాజేంద్ర మాత్రం ఎక్కడా దొరకడు. ఇలా ఉండగా రాజేంద్ర ఆఫీసు సమయంలో స్కీము ప్రచారం చేసుకుంటున్నాడని ఉద్యోగం ఊడుతుంది. అతను ఓ పెట్టెలో తన స్కీము కాగితాలు పెట్టుకుని బయటపడతాడు. అప్పుడే ఆ భవనంలోని బ్యాంకులో పదికోట్ల దోపిడీ జరుగుతుంది. ఆ పదికోట్లూ రాజేంద్ర పెట్టెలో ఉంటాయి. తరువాతేం జరిగింది, రాజేంద్ర మారాడా? దేవుడి సాయం చివరికి ఎలా రూపాంతరం చెందింది – ఇది మిగితా కథ.

సినిమా అంతా బ్రూస్ ఆల్మైటీ వంటి తరహా చిత్రాలలా సాగుతుంది. సంభాషణల్లో సుమారు హాస్యం కూడా పండింది. వినయ్ పాథక్ ఎప్పటిలాగే సహజంగా నటించాడు. ఎక్కడపడితే అక్కడ స్కీము… అంటూ మొదలుపెడుతూ ఉంటే, అహనాపెళ్ళంట లో నూతన్ ప్రసాద్ – “అయితే మీకు నా ఆటోబయోగ్రఫీ చెప్పాల్సిందే” అన్నప్పుడు అటువైపు వారి మొహం ఎలా ఉంటుందో అలాగే జాలేసింది అతని బాధితులని చూసి. పదికోట్లు బ్యాంకులో మాయమై పాథక్ సూట్కేసు లో ప్రత్యక్ష్యం కావడం చిన్నప్పుడు విన్న “స్వామీ రామా” కథని గుర్తుచేసింది.

సినిమాలో కాస్త గందరగోళం ఉంది అన్న విషయంలో సందేహం లేదు కానీ, సమయం గడిచేకొద్దీ పాథక్ పై ఆశలు పెరుగుతూ పెరుగుతూ, nothing but a very good movie is acceptable అనే స్థాయికి వెళ్ళాయేమో అనిపించింది మళ్ళీ. దేవుడి పాత్రలో సౌరభ్ శుక్లా కూడా చాలా బాగా చేసాడు. పాథక్-శుక్లాల కాంబినేషన్ బాగా కుదిరింది. ఎటొచ్చీ, శుక్లా మేనరిజమ్స్ దస్విదానియాకి చాలా దగ్గర్లో అనిపించాయి కొన్ని చోట్ల. ప్రధానంగా అస్తమానం ఏదో ఒకటి నమిలే దృశ్యాల్లో. శుక్లా వీలైనన్ని మారువేషాలు వేసాడు – అన్నీ బాగా కుదిరాయి. వీరిద్దరి మధ్యా సంభాషణలూ, దేవుని స్వగతాలూ – బాగున్నాయి. పాథక్ అంబానీ బొమ్మ ఎదుట నిలబడి ఫొటో దిగడం వంటి దృశ్యాలు చాలా సహజంగా ఉన్నాయి.

క్లైమాక్స్ కి వచ్చేసరికి కథనం కాస్త బలహీనపడిందనిపించింది. పాథక్ పాత్రలో మార్పు రావడం, కథలో ఉన్న సందేశాన్ని ప్రేక్షకులకి తెలియజేయడం – ఇవి మాత్రమే క్లైమాక్స్ ఉద్దేశ్యాలైతే మాత్రం దానికి ఇతర మార్గాలున్నాయి. అంతవరకూ బానే సాగి ఇక్కడ మాత్రం చప్పబడింది సినిమా. మొత్తానికి ఈ సినిమా దర్శకుడు – సౌరభ్ శ్రీవాస్తవ ఈ క్లయిమాక్స్ గురించి మరి కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే, సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేదేమో అనిపించింది. తప్పక చూడవలసిన సినిమా అని చెప్పలేము కానీ, ఓ సారి చూడొచ్చు.

One Response
  1. Satya Shyam KJ December 23, 2008 /