Menu

నేనింతే గురించి నా అభిప్రాయం

నిన్న సాక్షి దిన పత్రిక లో మన తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ తో ముఖాముఖి చదివి నేను ఈ రోజు ఉదయం “నేనింతే” సినిమా కి వెళ్ళాను.ఈ సినిమా కథ విషయానికి వస్తే ఏమి అంత గొప్పగా లేకపోవడమే కాదు అసలు ఏమీ లేదనే చెప్పాలి. సినిమా ద్వారా ఒక కథ చెప్పడం కంటే తన సినిమాలతోపాటు తన తోటి దర్శకుల సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతండడంతో ఈ పరిస్థితికి కారణాలైన (ఆయన దృష్టిలో) మీడియా పైన తన అక్కసు తీర్చుకోడానికి మాత్రమే ఈ సినిమా కథను తయారు చేసుకున్నట్టనిపించింది.

ఈ సినిమా గురించి చాలా విషయాలు ఇది వరకు వచ్చిన సమీక్ష లో చెప్పారు కాబట్టి సినిమాలోని మరికొన్ని విషయాల గురించి ఇక్కడ చర్చించాలని ప్రయత్నం చేస్తాను.పూరి జగన్నాథ్ సినిమాల్లో నాకు నచ్చిన ఒకే ఒక సినిమా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం. అలాగే ఇడియట్ కూడా బాగానే ఉంటుందనుకుంటాను. (అలా అనుమానంగా ఎందుకంటూన్నానంటే ఆ రోజుల్లో నచ్చింది, ఇప్పుడూ చూస్తే నచ్చకపోవొచ్చేమోనని)

పూరి కెరీర్ లో పోకిరి ఇండస్ట్రీ హిట్ ఐతే అయ్యుండోచ్చు కానీ దానికి క్లాసిక్ స్థాయిని ఇవ్వలేము. కొన్నేళ్ళ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చూడొచ్చేమో కానీ పోకిరి చూడలేము. అంటే ఏ విధంగా చూసినా పూరి జగన్నాథ్ పెద్ద పాథ్ బ్రేకింగ్ సినిమాలు తియ్యలేదనే చెప్పాలి. ఆయన తీసిన కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయ్యుండొచ్చు. అంత మాత్రాన సినిమా ప్రపంచంలో ఎంతో సాధించేసి ఇప్పుడు కేవలం మీడియా చేస్తున్న ప్రచారం వల్ల సినిమా పరిశ్రమకు పెద్ద నష్టం వాటిల్లుతోందనే ఉద్దేశంతో మీడియా పై తన అస్త్రంగా తీసిన ఈ నేనింతే సినిమా రివర్స్ అయ్యి ఆయనకే గుచ్చుకుందనిపిస్తుంది.

ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో హీరో రవి (రవితేజ) సినిమా ని “క్యారం బోర్డ్” తో పోలుస్తాడు. బోర్ద్ లో ఇది స్యూర్ కాయిన్ అనుకుని ట్రై చేస్తాం కాని అది కొన్ని సార్లు పడదు ….సినిమా కూడ అంతే అని అంటాడు, అంతే కాకుండా రివ్యూ ని రెడ్ కాయిన్ తో పోలుస్తాడు.అలాగే ఈ సినిమాలో నిర్మాత(షియాజి షిండె) “పులి కేక” అనే ఒక సినిమా తీసి బాగ నష్టపోతాడు .ఈ నిర్మాత అమెరికాలో ఉన్న అల్లుడికి ఫోన్ చేసి సినిమా గురించి అడగ్గా, “నేను ఇంకా చూడలేదు,సినిమా రివ్యూ చదివాను అంతగా ఏమి బాగాలేదని వ్రాసారు” అని చెప్పినప్పుడు నిర్మాత అతని పై విరుచుకుపడతాడు. “నీ లాంటివాళ్ళ వల్లే తెలుగు సినిమా సక్సెస్స్ రేటు 2% కి పడిపొయింది,రీవ్యూ రాసే వారందరు మా దగ్గర డబ్బులు తీసుకొని రేటింగ్ ఇస్తారు తెలుసా?” అని చెప్తాడు.

అయితే వెబ్ సైట్లలో రివ్యూలే సినిమాలను నష్టానికి గురిచేస్తున్నాయని పూరి విసిరిన అస్త్రం కొందరికి గుచ్చుకోవాల్సిన చోట గుచ్చుకుందని అర్థం అవుతుంది. ఒక ప్రముఖ తెలుగు వెబ్ సైట్ ఏదైనా సినిమా విడుదలవ్వగానే హోమ్ పేజి బదులు ఆయా సినిమా పోస్టర్ ప్రదర్శించడం, రిలీజింగ్ టుడే అంటూ ఆ సినిమా కి సంబంధించిన బొమ్మలు, ఇంటర్వ్యూలు పెట్టి ఆ తర్వాత మొక్కుబడిగా మూడు మూడున్నర రేటింగ్ ఇవ్వడం చేస్తుండేది. అయితే ఈ సినిమాకి అలా ఏమీ చెయ్యకపోవడంలో అర్థం ఏంటో మీకందరికీ తెలిసేఉంటుంది.ఆ విధంగా చూస్తే ఈ సినిమాతో పూరి విసిరిన బాణాల ప్రభావం మాత్రం కొద్దిగా కనిపిస్తుంది.

అయితే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ ప్రస్తావించిన అంశాలలో నిజం లేదని కాదు.ఆ మధ్యలో ఒక ప్రముఖ వెబ్ సైట్ ఒక చెత్త సినిమా రిలీజవ్వడానికి ఒక రోజు ముందే ఆ సినిమా పోస్టర్ తో హోం పేజ్ పెట్టి ఆ సినిమాని పొగుడ్తూ మన చెవిలో మల్లెపువ్వులు పెట్టారు. అయినప్పటికీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే సినిమా వాళ్ళ గురించి లేని పోనివి రాస్తూ వారి ప్రైవేట్ జీవితాలని పబ్లిక్ చేసి గ్రేట్ గా ఫీల్ ఐపోయే వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఈ సినిమా దెబ్బతో ఆయా వెబ్ సైట్లు ఇలాంటి దిగజారుడు పనులు మానితే నేనింతే సక్సెస్ అయినట్టే.

కాకపోతే పూరి జగన్నాథ్ చెప్పినట్టు కేవలం వెబ్ సైట్ రివ్యూస్ వల్ల సినిమాలు నష్టపోతున్నాయని ఎవరైనా అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. రాబోయే కాలంలో తెలుగులో ఇంకా కుప్పలు తెప్పలుగా వెబ్ సైట్స్ పుడతాయి. అలాగే ఆయా సఈత్లలో ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు సమీక్షలు రాస్తారు. నవతరంగంలోనే ఈ సినిమా గురించి ఎంతో మంది ఎన్నో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే మంచి సినిమాని ఈ వెబ్ సఈత్స్ అన్నీ ప్రోత్సాహిస్తాయనే సంగతి కూడా పూరి గమనించి ఉండాల్సింది.

మన దేశం సంగతి వదిలేస్తే అమెరికా లాంటి ఇతర దేశాల్లో సినిమా రిలీజవ్వకముందే అంటే దాదాపు నాలుగైదు వారాల ముందే సినిమా గురించి విమర్శకుల రివ్యూలు ఆయా పత్రీక్ల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. మంచి సినిమా తీసిన తీస్తే ఈ సమీక్షలు అన్నీ కాకపోయినా ఎక్కువ శాతం పాజిటివ్ గా వుండి ఫ్రీగా పబ్లిసిటీ కూడా దక్కుతుంది. అందుకు పెద్ద ఉదాహరణ స్లం డాగ్ మిలియనీర్. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ రివ్యూస్ చదివి ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ప్రేక్షకులు ఎదురుచూసేలా చేసింది. మన వాళ్ళకి అంత ధైర్యం లేదు. ఎందుకంటే మనం మంచి సినిమాలు తియ్యడం కంటే కూడా క్రేజీ కాంబినేషన్స్, హీరోయిన్ ఎక్స్పోజింగ్, సినిమాకి సంబంధం లేని కామెడీ ఇలాంటి వాటి మీదే సినిమాని నిర్మిస్తున్నారు. ఇది పూరి జగన్నాథ్ ఒక్కడే చేస్తున్నాడని అనటం లేదు దాదాపు అందరూ చేస్తున్నదే.

మరొక విషయం ఏంటంటే పూరి గతంలో పోకిరి లో కూడా మీడియా మీద సెటైర్ లు వేశారు.ఈ సినిమాలోనూ మీడియాకి నీతులు బోధించారు. ఈ సినిమాలోని మరో సన్నివేశంలో నటి ముమైత్ ఖాన్ రేప్ కి గురైన తర్వాత మీడియా దానిని రాద్దాంతం చేయటంతో హొస్పిటల్ లో వున్న ముమైత్ ఖాన్ బైటకు వచ్చి మీడియా లొ గాసిప్స్ రావటం వల్ల మాలాంటి నటులు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నామని చెప్తుంది.ఇక్కడ చాలా డైలాగులు సెన్సార్ చేసారు. ఇక్కడ తమాషా ఏంటంటే నీతులు చెప్పించడానికీ ఒక స్థాయి ఉండాల్సిన అవసరం పూరి గ్రహించినట్టులేదు. ఎవరంటే వాళ్ళు నీతులు చెప్తే వినడానికి ప్రజలు సిధ్ధంగా ఉండాలి కదా. అలాగే సినిమా పరిశ్రమ పై ఆధారపడి నడిచే వెబ్సైట్లను పూరి అన్నట్టే ప్రేక్షకులపై ఆధారపడి నడిచే సినిమా పరిశ్రమనూ ప్రజలు విమర్శించడం మొదలుపెడితే ఎలా ఉంటుందో పూరి ఊహించగలరా? ఈ రోజు ప్రతి వెబ్ సైట్లోనూ ఈ సినిమాని ఇంతగా విమర్శించడానికి కారణం కూడా ప్రేక్షకులూ త్వరలో సినిమాలు చూడకుండా తిరుగుబాటు చేస్తారేమో.

ఇక్కడ ఇంకో తమాషా ఏమిటంటే పూరి గారు సాక్షి కి ఇచ్చిన ముఖాముఖి లొ ఒక ప్రశ్న కి సమాధానము చెప్తూ పోకిరి సినిమా సెన్సార్ జరుగుతున్నప్పుడు బోర్ద్ వాళ్ళు ఇటువంటి సినిమాలు కాకుండా మంచి సినిమాలు తీయవచ్చు కదా అని ప్రశ్నించగా జగన్ దానికి సమాధానం గా “నేనింతే” అనే ఒక మంచి సినిమా చేస్తున్నాను అని చెప్పాడంట. పాపం ఆయన తీసిన మంచి సినిమాలో కూడ సెన్సార్ తప్పలేదు.(అంటే ఇది ఆయన దృష్టిలొ మాత్రం మంచి సినిమానే కదా).

అలాగే సినిమా పరిశ్రమని కించపరచడానికి కొందరు వ్యవహరిస్తున్నట్టుగా సినిమా పరిశ్రమని బాగు చేయటానికి చాలా మంది(హైదరాబాదు ఫిల్మ్ క్లబ్, నవతరంగం వెబ్ సైట్, ఆనంద్ వారాల, ఇలా ఎంతో మంది) కృషి చేస్తున్నారన్న విషయాన్ని కూడా పూరి ప్రస్తావించి వుంటే బాగుండేది. ఒక సినిమా రివ్యూ అనేది వేరు వేరు వ్యక్తుల అభిప్రాయాలు మరియు వారి మనోభావాల మీద ఆధారపడి వుంటుంది.ఎవరో కొంతమంది సినిమా రివ్యూల పేరుతో డబ్బులు సంపాదిస్తున్నంత మాత్రాన అందరూ అందుకే సినిమా రివ్యూలు రాయరు. నవతరంగంలో రోజు ఏదో ఒక సినిమా రివ్యూ చదువుతుంటాను. ఇక్కడ నాలాగే తమ అభిప్రాయాలు తెలియచేస్తున్నారు. అంత మాత్రాన సినిమా రివ్యూల వల్ల సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు.

ఏది ఏమైనా సినిమా తీసి ప్రజలను మెప్పించే సత్తా మనలో వుండాలి గాని,పోకిరి లాంటి బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమాలు తీసిన పూరి జగన్ గారు రివ్యూలకి భయపడడం ఎందుకో ఆయన నొటితో (మన రాం గోపాల్ వర్మ లాగా) చెప్తే మనసారా వినాలని వుంది.


–పి.విష్ణువర్థన్ రెడ్డి, బెంగళూరు.

13 Comments
 1. Madhura vaani December 18, 2008 /
 2. విష్ణు December 18, 2008 /
 3. sahiti December 18, 2008 /
 4. రామ December 18, 2008 /
 5. sahiti December 18, 2008 /
 6. విష్ణు వర్ధన్ రెడ్డి December 19, 2008 /
 7. సైఫ్ అలి గొరే.. December 19, 2008 /
 8. చండీదాస్ December 19, 2008 /
 9. srinivas goud December 19, 2008 /
 10. srinivas goud December 19, 2008 /
 11. విష్ణు వర్ధన్ రెడ్డి December 19, 2008 /
 12. సైఫ్ అలి గొరే.. December 20, 2008 /
 13. Ravi December 22, 2008 /