Menu

నవతరంగం:2009

నవతరంగం మొదలయ్యి సంవత్సరం గడిచిపోతుంది. గత సంవత్సరం రోజులుగా ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాల గురించి, వివిధ దేశాలకు చెందిన దర్శకుల గురించి నవతరంగం సభ్యులు రాస్తూ వచ్చారు.ఇంకో రోజులో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న సందర్భంలో 2009 లో నవతరంగంలో చెయ్యాలనుకుంటున్న కొన్ని కార్యక్రమాల గురించి, అలాగే 2008 లో వచ్చిన వ్యాసాల గురించి కొన్ని వివరాలు.

2008:ఈ సంవత్సరం మొదట్లో నవతరంగం మొదలుపెట్టినప్పుడు ఇలా చెయ్యాలి, ఇవి వ్రాయాలి అని పెద్ద ప్రణాళిక లేనప్పటికీ ప్రతీ నెలా ఒక మంచి సినిమాని పరిచయం చేస్తూ ఈ నెల సినిమా అనే శీర్షిక నడపాలని అలాగే ప్రతీ నెల ఒక్కో దర్శకుణ్ణి/సినీ ప్రముఖుణ్ణి పరిచయం చేసి ఆయా దర్శకుల/ప్రముఖుల సినిమాల గురించి వ్యాసాలు ప్రచురించాలని అనుకున్నాం.2008 మధ్యలో ప్రపంచ సినీ ఉద్యమాలు పేరిట ఒక శీర్షిక మొదలుపెట్టి  కొన్ని వ్యాసాలు ప్రచురించినప్పటికీ ఆ వ్యాసాలు ఒక సినీ ఉద్యమం (భావ వ్యక్తీకరణ వాదం) తోనే ఆగిపోయింది. ఈ మూడు శీర్షికల్లో తప్ప మిగిలిన విభాగాల్లో పెద్దగా ప్లానింగ్ ఏమీ లేకుండానే వ్యాసాలు ప్రచురిస్తూ వచ్చాము.

ప్లాన్ చెయ్యకపోయినప్పటికీ సౌమ్య గారు సత్యజిత్ రే రచించిన ‘మేకింగ్ మూవీస్ ‘ పుస్తకంలోని అన్ని వ్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఈ వ్యాసాలు కాపీరైట్ లేకుండానే తెలుగులోకి అనువదించినప్పటికీ లాభాపేక్ష లేకుండా ఈ పని చేశాం కాబట్టి ఫర్వాలేదని మాకు మేమే చెప్పుకుని సర్దుకుపోయాము. అలాగే ఈ సంవత్సరం లండన్ చలన చిత్రోత్సవానికి నాకు ప్రెస్ అక్రెడిటేషన్ లభించడంతో ఆ చిత్రోత్సవంలో పాల్గొని అక్కడ చూసిన యాభై కి పైగా సినిమాల గురించి సమీక్షలు రాయాలని సంకల్పించినప్పటికీ కేవలం సినిమా పరిచయాల దగ్గరే ఆ వ్యాస పరంపర ఆగిపోయింది. ఈ సంవత్సరం గోవా చలనచిత్రోత్సవానికి వెళ్ళడానికి నవతరంగం సభ్యునికి ప్రెస్ అక్రెడిటేషన్ లభించినప్పటికీ అనివార్య కారణాల వలన ఆ చిత్రోత్సవాన్ని కవర్ చెయ్యడం కుదర్లేదు.

నవతరంగం మొదలుపెట్టినప్పుడు అనుకోకపోయినా ఈ సంవత్సరంలో బాపు గారి “మా సినిమాలు” అనే వ్యాసాలను ప్రచురించే అవకాశం దొరికింది. అలాగే బి.యన్.రెడ్డి గారి శతజయంతి సందర్భంగా పాటిబండ్ల దక్షిణామూర్తి గారు రచించిన ఒక పుస్తకం నుంచి కొన్ని వ్యాసాలు నవతరంగంలో ప్రచురించాము. అలాగే వారాల ఆనంద్ గారి పుస్తకాల నుంచి సేకరించిన వ్యాసాలు, కందుకూరి రమేష్ బాబు గారు సామాన్య శాస్త్రం సీరీస్ లో ప్రచురించిన ‘జాన్-2008’ పుస్తకంలోని  వ్యాసాలు ప్రచురించాము. ఇవి కాకుండా వందల సంఖ్యలో సమీక్షలు, సినిమా విశ్లేషణలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. సంవత్సరారంభంలో ఐదారు మంది తో మొదలయిన నవతరంగం ఈ రోజు యాభై కి పైగానే సభ్యులను కలిగి ఉంది. నూతన సంవత్సరంలో మరింత మంది నవతరంగంలోచేరుతారనే నమ్మకం ఉంది.

2009 లో నవతరంగంలో వ్యాసాల సంఖ్య వందల నుంచి వేలకు చేరే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు విడుదలయ్యే కొత్త సినిమా సమీక్షలు, ఇంట్లో కూర్చుని టివి/డివిడి లలో చూసే పాత సినిమా సమీక్షలు, పరిచయాలు, విశ్లేషణలతో పాటు ప్రముఖలతో పరిచయాలు, ఇంటర్వ్యూలు ఇలా అన్ని విభాగాల్లో వ్యాసాలు ఎలాగూ ప్రచురిస్తామనే నమ్మకం ఉంది. అయితే వాటన్నింటికీ అంత ప్లానింగ్ అవసరం లేదు. కాకపోతే నవతరంగంలోని కొన్ని శీర్షికలకు ప్లానింగ్ అవసరం ఉంది. దాని గురించి కొన్ని వివరాలు.

ఈ నెల సినిమా: అంతగా ప్రాచుర్యం పొందని ఒక మంచి సినిమాని పరిచయం చేయడమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశం. ఇన్ని రోజులు నాకు నచ్చిన/తెలిసిన సినిమాలనే ఈ శీర్షికకోసం ఎన్నుకుంటూ వచ్చాను. ఇక నుంచీ ఈ శీర్షికలో మీరూ పాల్గొనవచ్చు. ఈ శీర్షికలో ఒక సినిమా చేర్చడానికి అర్హతలంటూ ఏమీ లేవు కానీ ప్రపంచ సినిమా చరిత్రలో అంత ప్రాముఖ్యం పొందని దేశాల సినిమాలైతే మేలు. అలాగే అవి కొత్త సినిమాలైతే ఇంకా మేలు. ఉదాహరణకు ఈ మధ్య వచ్చిన “తుల్పన్ ” అనే ఖజకిస్తాన్ సినిమా, బ్యాండ్స్ విజిట్ అనే ఇజ్రాయిలీ సినిమా, “లాస్ట్ ఠాకూర్” అనే బంగ్లాదేశీ సినిమా ….ఇలా అన్నమాట. మీకు నచ్చిన సినిమాని ఈ నెల శీర్షికలో చేర్చమని తెలియచేయడమే కాకుండా ఆ సినిమా గురించి ఒక సమీక్ష రాసి పంపితే ఇంకా బావుంటుంది.

ఫోకస్: ఈ శీర్షికలో ప్రతీ నెలా ఒక ప్రముఖ దర్శకుణ్ణి పరిచయం చేస్తూ వచ్చాము. ఆయా దర్శకుల పరిచయంతో ఆగిపోకుండా వారి దర్శకత్వంలో వచ్చిన సినిమాల పరిచయాలు, విశ్లేషణలు ప్రచురించాం. కొంతమంది దర్శకుల గురించి మరీ ఎక్కువ సమాచారం సేకరించలేకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో ఎవరోఒకరు ఈ దర్శకుల గురించి, వారి సినిమా గురించి రాస్తారనే ఆశిస్తున్నాను. ఈ సంవత్సరంలో కూడా ఈ శీర్షిక కోసం మీ సలహాలు కావాలి.  నావరకూ నేను ఈ క్రింది లిస్టుని తయారు చేశాను. ఏదైనా నెలలో ఈ దర్శకులు కాకుండా మీరు మరో దర్శకుడి గురించి వ్రాయగలరు అనుకుంటే కనీసం నెల ముందైనా తెలియచేస్తే ఆ నెల ఫోకస్ శీర్షిక నిర్వహించే బాధ్యత వారికి అప్పగించబడుతుంది. ఇప్పటివరకూ నేననుకున్న దర్శకుల వివరాలు :

 • జనవరి: Orson Welles
 • ఫిబ్రవరి: Adoor Gopala Krishnan
 • మార్చ్: Jean-Luc Godard
 • ఏప్రిల్: Sergei Parajanov
 • మే: Michelangelo Antonioni
 • జూన్: Mrinal Sen
 • జులై: Mohsen Makhmalbaf
 • ఆగష్ట్: Robert Bresson
 • సెప్టెంబర్: Ingmar Bergman
 • అక్టొబర్: Krzysztof Kieślowski
 • నవంబర్: Yasujirō Ozu
 • డిశెంబర్: Stanley Kubrcik

కొడవటిగంటి కుటుంబరావు:2009 కొకు శతజయంతి సంవత్సరం. కొకు కథా-నవలా రచయితగానే కాకుండా సినిమాకి సంబంధించిన సాహిత్యాన్ని కూడా రచించారు. ఈ సందర్భంగా కొకు సినిమా సాహిత్యాన్ని పరిచయం చేస్తూ, ఆయన వ్యాసాలను విశ్లేషిస్తూ నవతరంగంలో వ్యాసాలు ప్రచురించాలని ఆలోచన వుంది. అలాగే కొడవటిగంటి రోహిణి ప్రసాద్ గారి సహకారంతో సినిమాల్లో కొకు పాత్ర గురించి మరిన్ని విశేషాలు అందచేయనున్నాం.

Elia Kazan: ఆన్ ది వాటర్ ఫ్రంట్, ఈస్ట్ ఆఫ్ ఈడెన్, ఎ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్ వంటి హాలీవుడ్ క్లాసిక్స్ రూపొందించిన Elia Kazan కు కూడా 2009 శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా ఆయన సినిమాల పరిచయం, సమీక్ష, విశ్లేషణలు చేయాలకున్నవారికి స్వాగతం.

ప్రపంచ సినీ ఉద్యమాలు:ఈ శీర్షికలో ఇప్పటికే జర్మనీలోని భావవ్యక్తీకరణవాదపు సినిమాల గురించి కొన్ని వ్యాసాలు ప్రచురించాము. రాబోయే రోజుల్లో ఫ్రెంచ్ న్యూ వేవ్, రష్యన్ కినో ఐ, డోగ్మా, జపనీస్ న్యూ వేవ్, ఇటాలియన్ నియో రియలిజం, స్వీడెన్ సినిమాల్లోని రాడికలిజం, బ్రిటిష్ ఫ్రీ సినిమా ల గురించి వ్యాసాలు ప్రచురించాలనే ఆలోచన ఉంది. అయితే వీటి గురించి వ్రాయాలంటే చాలా కష్టపడాలి. ఈ శీర్షికలో వ్యాసాలు వ్రాయడంలో కూడా మీరు సహాయం చేయవచ్చు.

అలాగే మరికొన్ని కొత్త అంశాలను కూడా నవతరంగంలో చేర్చాలనే ఆలోచన ఉంది. అందులో కొన్ని:

 • క్విజ్ – సినిమాకి సంబంధించిన ప్రశ్నలతో కూడిన క్విజ్ కు రూపొందించి వీలైతే బహుమతులు కూడా అందచేయడం.
 • చూడాలనిఉంది – మీకేదైనా సినిమా చూడాలని ఉండి ఆ సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ విషయం నవతరంగంలో తెలియచేవచ్చు. ఇలా వచ్చిన లిస్టులోనుంచి సభ్యులు/పాఠకులు తమ సమీక్షలను నవతరంగంలో ప్రచురించవచ్చు.

ఇవి మాత్రమే కాకుండా 2009 లో తెలుగులో వచ్చిన కొన్ని మంచి సినిమాల స్క్రిప్ట్ లను నవతరంగంలో ప్రచురించబోతున్నాము.ఈ ప్రయత్నంలో మొదటిగా సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో వచ్చిన ‘వినాయకుడు ‘  సినిమా స్క్రిప్ట్ ని త్వరలోనే నవతరంగంలో ప్రచురించబోతున్నాము. అలాగే ప్రముఖ సినిమా దర్శకులను కలిసి వారి ద్వారా ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించిన అంశాల గురించి తెలుసుకునే వ్యాసాలు, వీడియో లు కూడా 2009 లో  నవతరంగంలో ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాము.

పైన పేర్కొన్న అంశాలే కాకుండా నవతరంగంలో మరేదైనా శీర్షిక  చేర్చాలనుకుంటే మీ సలహాలు కామెంట్ల రూపంలో తెలియచేయవచ్చు.

2008 కి గాను నవతరంగంలో ఇదే చివరి పోస్టు. నూతన సంవత్సరంలో మరిన్ని కొత్త వ్యాసాలతో నవతరంగం మీ ముందుంటుందని తెలియచేసుకుంటూ నవతరంగం పాఠకులకు మరియు సభ్యులకు హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

17 Comments
 1. అసంఖ్య December 31, 2008 /
 2. గిరి December 31, 2008 /
 3. చంద్ర శేఖర్ కాండ్రు December 31, 2008 /
 4. మేడేపల్లి శేషు December 31, 2008 /
 5. Purnima December 31, 2008 /
 6. శంకర్ January 1, 2009 /
 7. chandramouli January 1, 2009 /
 8. niyanta January 1, 2009 /
 9. shriedhar January 1, 2009 /
 10. చండీదాస్ January 2, 2009 /
 11. చండీదాస్ January 2, 2009 /
 12. jaya January 2, 2009 /
 13. rammohan January 11, 2009 /