Menu

నేడు నటయోగి నాగయ్య వర్థంతి

నటయోగి నాగయ్య

Artistes are born, not made అన్న ఆంగ్ల ప్రవచనానికి నిదర్శనం మహానటుడు నాగయ్య. ఒకప్పుడు చిత్రసీమలో రారాజుగా వెలిగిన నాగయ్య గురించి నేటి యువతరానికి తెలియదు. మధ్యవయసు వారికి కూడ ఆయన కేవలం ఒక క్యారెక్టర్ నటుడిగానే స్మృతిపథంలో వుండవచ్చు.కాని ఒక దశాబ్దంపాటు ఆయన ప్రఖ్యాత హీరోగా వెలిగారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయనదొక స్వర్ణయుగం. హావభావాలను ప్రదర్శించడంలోగాని, భావ రాగ తాళ యుక్తంగా పాడడంలోగాని ఆయనదొక విశిష్టశైలి, తనదైన వ్యక్తిత్వ ముద్ర పడ్డ ఒక పోకడ!

చిత్తూరి నాగయ్యగా వినుతికెక్కిన ఆయన అసలుపేరు ఉప్పలదడియం నాగేశ్వరం [1]. 1904వ సంవత్సరం మార్చి 28న ఒక పేద కుటుంబంలో జన్మించిన నాగయ్య తన రెందవ యేటనుండే కుప్పం సమీపంలోని గోగునూరులో అమ్మమ్మ వద్ద పెరిగారు. తండ్రి రామలింగేశ్వర శర్మ గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతంలో ప్రభుత్వ రెవెన్యూ శాఖలో ఒక చిన్న ఉద్యోగిగా పనిచేస్తుండేవారు. ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో కొంతకాలానికి తల్లితండ్రులు కూడ కుప్పానికి తరలివెళ్ళారు. తండ్రి హరికథకుడిగా సంగీతంలో మంచి పరిజ్ఞానం కలవాడయినందువలన చిన్నవయసునుంచే నాగయ్యకు సంగీతంలో ప్రవేశం కలిగింది.

జీవనోపాధికోసం తండ్రి 1911లో చిత్తూరికి మకాం మార్చడంతో నాగయ్య నటజీవితం ప్రారంభమయింది. బడి నాటకాల్లో పాల్గొనడం, ఉత్సవాల్లో పాడుతుండడం పరిపాటయింది. ముఖ్యంగా ప్రహ్లాదుడి పాత్రలో రాణించి, పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళై, యస్.జి.కిట్టప్ప, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, నయనాపిళ్ళై, బళ్ళారి రాఘవ, అనిబీసెంట్, సత్యమూర్తి మొదలైన ప్రముఖుల ప్రశంశలు, ఆశీర్వాదాలు అందుకొన్నారు. సంగీత, నాటక అభ్యాసాలలో శ్రద్ధ ఎక్కువై చదువు మందగించి నాల్గవ ఫారంతో మూతపడింది. తరువాయి కాలంలో యెన్నో అవతారాలెత్తి [2] ఆఖరకు చిత్తూరు జిల్లా బోర్డు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగాన్ని సంపాదించడంతో ఆయన జీవితం కుదుట పడినట్లయింది. చిత్తూరు ‘రామవిలాస సభ ‘ బృందంతో ప్రథమంలో ఆయన వేసినవన్నీ స్త్రీ పాత్రలే; చిత్రాంగి, సావిత్రి, దమయంతి! నాగయ్య 69 ఏళ్ళ జీవితంలో సంతోషకరమైన ఘడియలివేనోమో! ఈ కాలంలోనే సబ్‌కలెక్టరుగా పనిచేస్తున్న బోల్డన్ అన్న ఆంగ్లేయుడివద్ద పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలోను, ఉస్తాద్ హమీద్ హుసేన్ (సారంగి), అబ్దుల్ ఫయాజ్ ఖాన్ ల ద్వారా హిందుస్తానీ సంగీతంలోను కొంత పరిజ్ఞానం సంపాదించారు. అలాగే యడవల్లి సూర్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు, వడ్లమాని విశ్వనాథం వంటి ప్రముఖ కళాకారులతో నటించే అవకాశం కలిగింది. బళ్ళారి రాఘవతో “రామదాసు” నాటకంలో ‘కహో రామనాం’ అన్నకీర్తన గానం చేస్తూ నాగయ్య అడుగెడితే ప్రేక్షకలోకం హర్షధ్వానాలు సల్పేది.

ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆయనకు వివాహం జరిగింది. కాని కొద్ది కాలానికే భార్య, (పసికందైన ?) కుమార్తె మరణించడంతో నాగయ్య జీవితంలో మొదటి సారిగా విషాదఛ్ఛాయలు అలముకొన్నాయి. వీటికి దూరం కావడం కోసం ప్రైవేటుగా బి.ఏ. చదువ తలపెట్టి, సి.ఆర్.రెడ్డి, ప్రొ. సుబ్రహ్మణ్యం ప్రభృతుల సహాయ సహకారాలతో డిగ్రీ పూర్తి చేశారు [3]. మద్రాసులో పార్టు టైం బి.ఏ చదివే రోజుల్లోనే సుగుణ విలాస సభ, చెన్నపురి ఆంధ్ర మహాసభల వారి నాటకాలలో నటించడం, బి.ఎన్.రెడ్డితో పరిచయం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తినడం లాంటి సంఘటనలు జరిగాయి.

బి.ఏ పూర్తయిన పిమ్మట చిత్తూరులో ఆంధ్రపత్రిక విలేఖరిగా కొత్త జీవితం మొదలయింది. పునర్వివాహం కూడా జరిగింది. మరల జీవితం కుదుట పడుతుందనుకొంటున్న తరుణంలో రెండవ భార్య, తండ్రి వెంట వెంటనే కాలధర్మం చెందడంతో అశాంతికి గురయ్యారు. నిరాశ నిస్పౄహలు వెంటాడ మొదలెట్టాయి.

మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో తిరిగి, చివరికి రమణ మహర్షి ఆశ్రమంలో కాలు పెట్టి, సన్యాసిగా మారిన నాగయ్య ఒక రికార్డింగు కంపెనీ ఏజెంటు ద్వారా గుర్తించబడి మరల బయటకు తీసుకురాబడటం కేవలం యాదౄఛ్ఛికం! తెలుగు సినీ, నాటక రంగాలకు పెద్ద వరం!

ఆ రోజుల్లో, ప్రముఖ సంగీత దర్శకుడు, గేయ రచయిత అయిన కొప్పరపు సుబ్బారావు H.M.V వారి తెలుగు సంగీత విభాగానికి అధినేతగా పనిచేస్తూ ఒకేసారి పెక్కుమంది కళాకారులను ఆహ్వానించి ప్రజాదరణ పొందిన నాటకాలను, గేయాలను రికార్డు చేయిస్తుండేవారు. నాగయ్యకు కూడా బెంగుళూరు నుంచి H.M.V వారి ఆహ్వానం అందింది. అలా తెలుగు దేశాన్ని తమ గాత్ర మాధుర్యంతో ఉర్రూతలూగిస్తున్న; అద్దంకి శ్రీరామమూర్తి, కపిలవాయి రామనాథశాస్త్రి, పంచాంగం రామానుజాచార్యులు, పారుపల్లి సుబ్బారావు, పారుపల్లి సత్యనారాయణ, తుంగల చలపతిరావు, ఉప్పులూరి సంజీవరావు మున్నగు రంగస్థల మార్తాండులతోను, జి.ఎన్.బాలసుబ్రమణ్యం, చౌడయ్య, సెమ్మంగుడి వంటి సంగీత విద్వాంసులతోను పరిచయాలు యేర్పడ్డాయి. ఈ పరిచయాలే మున్ముందు సినీ నటజీవనానికి పునాదిరాళ్ళయ్యాయి.

నాగయ్య యిచ్చిన మొట్టమొదటి రికార్డు; ‘మేల్ మేల్ మేలౌరా ఓ బాలక’ అన్న “ప్రహ్లాద” నాటకంలోని పాట, ఆంధ్రదేశం నాల్గు చెరగులా మ్రోగింది [4]. అప్పుడే వస్తున్న టాకీ చిత్రాలలో తనవంటి నటుడికీ, గాయకుడికీ మంచి భవిష్యత్తుంటుందన్న శ్రేయోభిలాషుల ప్రోద్బలంతో 1932లో మద్రాసు చేరిన నాగయ్య 1938 వరకు యెందుకు ఆగవలసి వచ్చిందన్నది వివరించాలంటే ఒక సుదీర్ఘ గ్రంథమవుతుంది [5]. అన్ని అవాంతరాలను యెదుర్కొని, చిట్టచివరకు కొత్తగా స్థాపింప బడిన “రోహిణి” సంస్థ వారి “గృహలక్ష్మి” (1938) చిత్రంలో గోపీనాథ్ పాత్ర ద్వారా చలనచిత్ర రంగప్రవేశం చేశారు [6]. మొదటి చిత్రంతోనే తన నటనా పటిమ, గాన కౌశల్యాలతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించారు. ముఖ్యంగా ఆ సినిమాలో పాడిన; ‘లెండు భారత వీరులారా కల్లు మానండోయ్!’ మరియు ‘వందే భారత మాతా’, అన్న పాటలు బహుళ ప్రాచుర్యం పొందాయి.

“గృహలక్ష్మి” నిర్మాణ కాలంలోనే హెచ్.ఎం.రెడ్డితో విభేదాలు తలెత్తడంతో బి.ఎన్.రెడ్డి తన మిత్రులైన మూలా నారాయణస్వామి, ఛాయాగ్రాహకుడు కె.రాంనాథ్, కళాదర్శకుడు ఏ.కె.శేఖర్, నాగయ్య, కె.వి.రెడ్డిల అండదండలతో వాహినీ సంస్థను నెలకొల్పారు. నాగయ్యకు, వాహినీ సంస్థకు గల అవినావభావ సంబంధాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాని పని. ఆ సంస్థవల్ల నాగయ్యకు, ఆయన వల్ల వాహినీ సంస్థకు అజరామరమైన కీర్తి, ప్రతిష్ఠలు లభించాయి [7]. నాగయ్య ఉన్నతికి ఛాయాగ్రహకుడైన రామ్‌నాథ్, కళాదర్శకుడైన శేఖర్, సాహిత్యం పొదిగిన సముద్రాల సీనియర్,దర్శకులైన బి.ఎన్, కె.వి.రెడ్డిలు కూడ కారణభూతులని చెప్పక తప్పదు. వాహినీ వారి తొలిచిత్రం “వందేమాతరం” (1939) తో నాయకుడిగా, చిత్ర సంగీత దర్శకుడిగా నాగయ్య చలన చిత్ర జైత్రయాత్రకు నాందీ వాక్యం పలుకబడింది. “సుమంగళి” (1940)లో కందుకూరి వీరేశలింగాన్ని ప్రతిబింబించే వృద్ధుని పాత్రను పోషించిన తీరు నభూతో నభవిష్యతి. తన మూడవ చిత్రంతోనే ఆయన అందరాని యెత్తులకు యెదిగిపోయారు. అప్పటినుండే ఆయన “భారత పాల్ ముని” గా ప్రస్తుతింపబడ్డారు! వాహినీ వారి తదుపరి “దేవత” (1941) లో చెడ్డత్రోవలు తొక్కిన నాయకుడి పాత్రలో రాణించారు.

వాహినీ వారు, వృద్ధ పాత్రల ద్వారా తనను పక్కకు నెట్టి వేస్తున్నారనే భావనతో 1942లో తన స్వంత బ్యానర్ “రేణుక” నెలకొల్పి “భాగ్యలక్ష్మి” (1943), “త్యాగయ్య” (1946), “నాయిల్లు” (1953), “భక్త రామదాసు” (1964) చిత్రాలను నిర్మించారు. ఈ నాల్గు చిత్రాలు ఆయన సంగీతాభిరుచికి దర్పణాలు.

నాగయ్యకు శాశ్వతకీర్తి సంపాదించిపెట్టిన నాలుగు చిత్రాలు; “భక్త పోతన” (1942), “త్యాగయ్య”, “యోగి వేమన” (1947), “బీదల పాట్లు” (1950). ఈ నాల్గు పాత్రలలో ఆయన అత్యున్నత శిఖరాగ్రాలను అధిష్టించారు. ఆ పాత్రల పోషణలో ఆయన చూపిన హావభావాలు ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించాయి. పోతన అంటే పేదరైతు, భక్తుడు, బక్క చిక్కి వుండాలి అని కొందరు సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ చిత్రం చూచిన పిమ్మట పోతన యిలాగే వుండే వాడన్న నిర్ణయానికి రాగలిగారు. చివరకు నాగయ్య గారి “పోతన” చిత్రం బడిపిల్లల పుస్తకాలలోకి ముద్రితం అయిపోయింది. “త్యాగయ్య” చిత్రపు స్క్రీన్‌ప్లే రూపకల్పనలో [8] ఆయన సల్పిన కృషి చెప్ప శక్యం కాదు. త్యాగయ్య, వేమన చిత్రాల్లో వయసు ముదురుతున్న కొద్దీ నాగయ్య తమ గొంతుకలో తీసుకువచ్చిన మార్పులు కేవలం గొప్ప కళాకారులే ద్యోతకం చేయగలరు. విక్టొర్ హూగో రచన Les Miserables మాతృకగా నిర్మింపబడ్డ “బీదలపాట్లు” లో క్రూరుడిగా, తరువాత పశ్చాత్తాప చిత్తుడైన కరుణామూర్తిగా ఆయన నటన అద్వితీయం. చరిత్రలో అగ్రనటుల విజయవంతమయిన చిత్రాలను అనుకరించి, అనుసరించి ఎందరో ఎన్నో చిత్రాలు నిర్మించారు. కాని నాగయ్య నటించిన యే చిత్రాన్నీ పునర్నిర్మించి విజయం సాధించిన వారులేరు.

కేవలం తెలుగు చిత్రాలలోనేగాక అసంఖ్యాక తమిళ, కన్నడ చిత్రాలలోకూడ నటించి అక్కడి ప్రేక్షకుల మన్ననలందుకున్నారు. సంగీత దర్శకుడిగా ఆయన చేసిన చిత్రాలు ఏడే అయినా, అవి ఆణిముత్యాలు, సంగీత సౌరభాల హరివిల్లులు! ఆడబ్రతుకే మధురం, పసుపు కుంకుమ, ప్రేమమయమీ జీవనము,దయామయముగా (నాగయ్య), వస్తాడే మాబావ (మాలతి; సుమంగళి), ఎన్నాళ్ళుండెద విహసుఖములలో (నాగయ్య), వెండి కంచాలలో వేడి బువ్వుందోయి (సూర్యకుమారి), అదిగో అందియల రవళి, రాదే చెలీ! నమ్మరాదే! (రాజరత్నం; దేవత), పావన గుణనామ, సర్వ మంగళ నామ (నాగయ్య), ఇది మంచి సమయము రారా (రాజరత్నం; భక్తపోతన), ఆశ నిరాశ (భాగ్యలక్ష్మి), ఎందరో మహానుభావులు, వరదరాజ నిన్నే కోరి (నాగయ్య; త్యాగయ్య), అందాలు చిందేటి నా జ్యోతి, వదల జాలరా (నాగయ్య; వేమన), అదిగదిగో గగనసీమ (జిక్కి, బాలసరస్వతి, నాయిల్లు-1953) గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన ప్రతిభకు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.

“రామదాసు” చిత్ర నిర్మాణంలో ఆయన పడ్డ కష్టాలు భద్రాచల దేవాలయ నిర్మాణంలో ఆ రామదాసు కూడ పడి వుండడు. నటుడిగా, నిర్మాతగా విజయం వరించిన వ్యక్తి ఆర్ధిక సమస్యలలో చిక్కుకొని చివరి రోజుల్లో కడు దీనావస్థలకు గురయ్యారు. ‘ఉదర నిమిత్తం బహుకృత వేషం’ అని తనపై తానే వ్యాఖ్యానించుకొని, ఎటువంటి వేషాలకయినా సిద్ధపడవలసి వచ్చింది.

ఆయన సంపాదన అంతా దానధర్మాలకే కరగి పోయిందంటారు. అడిగినవాళ్ళకు కాదనకుండా తన శక్తికి మించి దానాలు చేసి కష్టాలకు లోనయ్యారు. పెళ్ళికి తాళిబొట్లు యివ్వడం దగ్గరనుంచి పిల్లల స్కూలు ఫీజులు, కాలేజీలలో అడ్మిషన్ల వరకు ఆయనదే ‘బాధ్యత’. ఇంకా కాంగ్రెస్ పార్టీకి,కళా సంస్థలకు ఇచ్చిన దానాలకు అంతులేదు. నరం లేని నాలుక, ఎముకలేని చేయి, అపర దధీచి అన్న ప్రశంశలు ఆయనకే వర్తిస్తాయి. నిలువెల్లా ఆయన కళాకారుడు కావడం చేతనే వ్యాపార సంబంధమైన లౌక్యాలు తెలియక, వేలకువేలు తనవద్ద తిన్నవాళ్ళ చేతనే వెన్నుపోట్లు పొడవబడ్డారు.వాళ్ళు మరల తన వద్దకు వస్తే ‘చంపదగిన యట్టి శత్రువు తన చేత చిక్కెనేని పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు’ అన్న వేమన పద్యాన్ని మనసులో వల్లించుకొని వాళ్ళను ఆదరించడం నాగయ్యకే చెల్లింది. నాగయ్యకు జరిగినన్ని సన్మానాలు భారదేశంలో మరే నటుడికీ జరిగి వుండవేమో!

సంస్థానాధీశ్వరులు మొదలుకొని దేవాలయాలు, పండిత సమావేశాలు, ప్రభుత్వ సంస్థలు ఆయనను ఘనంగా సన్మానించాయి. లభ్యమైన పారితోషికాలన్నీ అప్పులవాళ్ళ వద్దకు చేరితే, వందల కొలదీ శాలువాలు పండితులకు, అభాగ్య జీవులకు దక్కాయి.

ఒక సినీనటుడి సిఫార్సు ఉత్తరం కోసం ప్రజలు బారులు తీరడమన్నది సామాన్యమైన విషయం కాదు. సినీ నటులను చులకనగా చూసే లోకంలో, నటుడు గుమ్మడి మాటలలో చెప్పాలంటే ‘ఆయనను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ గౌరవార్థకంతో సంబోధించని వారులేరు’. చిత్తశుద్ధి, అణకువలతో నటించి ధరించిన ప్రతి పాత్రలోను తాదాత్మ్యం చెందాడాయన. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడటం, నెమ్మదితనం, శాంతం ఆయనకున్న వెలలేని ఆభరణాలు. “పద్మశ్రీ” బిరుదు లభించిన సమయంలో ఆయనే చెప్పుకొన్నట్లు ‘పద్మమే (= కీర్తి) వుంది, (కాని) శ్రీ లేదు’.

కళ అనేది మహాసాగరం. అందులో ఎందరో కళాకారులు ఉద్భవించి, తమ ప్రజ్ఞా, పాటవాలను ప్రదర్శించి కాలగర్భంలో కలసి పోతుంటారు. అయినా వారి కళా సాధన లోకం మరచిపోదు. శిల్పి మరణించినా అతడు సృష్టించిన శిల్పం శాశ్వతమయినట్లు, నాగయ్య గారు తెలుగువారి హృదయాల్లో పోతనగా,త్యాగయ్యగా, వేమనగా చిరస్మరణీయులే.

[“నాగయ్య – స్వీయ చరిత్ర” ప్రతిని నాకందించి, నాగయ్య గారి గురించి యెన్నో విషయాలు తెలిపిన “కళాప్రపూర్ణ” ఇంటూరి వెంకటేశ్వరరావుగారికి కృతజ్ఞాతాభివందనాలతో –రచయిత. అలాగే మద్రాసులోని పానగల్ పార్కులో నాగయ్య విగ్రహావిష్కరణ సందర్భంగా వెలువడిన “నాగయ్య స్మారక సంచిక”లోని కొన్ని వ్యాసాలు కూడా ఈ రచనకు ఉపయోగపడ్డాయి. Widener library (Harvard Univ.) నుండి ఈ సంచికని ఫోటోకాపీ చేసి పంపిన మిత్రునికి కూడా ధన్యవాదాలు.]

Notes:

[1] 1931 ప్రాంతాల్లో హచ్చిన్స్ రికార్డింగ్ కంపెనీ వారి షాపులో కాలం గడుపుతున్నప్పుడు, కాశీనాథుని నాగేశ్వరారావు పంతులుగారి ఉత్తరాలు వీరికి, వీరి ఉత్తరాలు వారికి వస్తుండటంతో శ్రీమతి ఆచంట రుక్మిణీ లక్ష్మీపతిగారి సలహా మేరకు తనపేరును నాగయ్యగా మార్చుకొన్నారు. చిత్తూరు ‘రామవిలాససభ’ ద్వారా నటుడిగా ప్రఖ్యాంతిగాంచటం వల్ల అది ఆయన ఇంటిపేరయ్యింది.

[2] కచేరీ విద్వాంసుడిగా బ్రతుకుదామని ఉద్దండులైన చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై, పేరయ్య శాస్త్రిల వద్ద సంగీతశిక్షణ పొందడం, టీచర్ ట్రైనింగ్ పొంది కొంత కాలం ఉపాధ్యాయుడిగా పని చేయడం, ఇంకా కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు … ఇలా ఎన్ని చేసినా యెక్కడా స్థిరంగా నిలువలేకపోయారు. కారణం,మనసు పూర్తిగా నాటక రంగంపై కేంద్రీకృతమై ఉందటమే! వీటన్నిటికీ కట్టమంచి రామలింగారెడ్డి, టి.వి.రంగాచార్యుల వంటి వారి అండదండలు లభించాయి.

[3] “కాని, సత్యమూర్తి ‘ఇంగ్లీషు చదువులొద్దంటుంటే యిప్పుడు నువ్వు బి.ఏ. పాసయ్యావేమిటి’ అని వ్యాఖ్యానించడంతో కాన్వొకేషనుకు వెళ్ళలేదు. పట్టా కొంత కాలానికి పోస్టులో వచ్చింది.” అని స్వీయచరిత్రలో చెప్పుకున్నారు.

[4] ఆ పాటను, అదే రికార్డు రెండవ ప్రక్క ఉన్న “శ్రీరామ మంత్రము” అన్న “రామదాసు” నాటకంలోని పద్యాన్ని మొదటి పర్యాయం విన్నప్పుడు నేను అది 1930 ల ప్రారంభంలోని పాటంటే నమ్మలేకపోయాను! బెంగుళూరులో ఉన్న కాలంలోనే మంగళగిరి శ్రీరంజని (సీనియర్) బృందంతో “సుభద్రా పరిణయం”, రామవిలాస సభ వారితో “విశ్వామిత్ర”, రెంటచింతల సత్యనారాయణతో “గరుడ గర్వభంగం” మొ|| నాటకాలు రికార్డులపై వెలువడ్డాయి. HMV వారి ద్వరా, తరువాత హచ్చిన్స్ వారి ద్వారా వెలువడ్డ నాటకాలు, పద్యాలు (ఉదా: హరినారాయణ మాధవ శౌరి, సురవినుత చరణ), జావళీలు (ఇంక తాళ జాలనే, ఓ మై లవ్లీ లలనా), శాస్త్రీయ కీర్తనలు (సీతాపతే, సీతమ్మ మాయమ్మ, వాగీశ్వరి), అష్టపదులు, పదాలు సంగీత కళాలక్ష్మికి వెలలేని ఆభరణాలుగా రూపొందాయి.

[5] క్లుప్తంగా చెప్పాలంటే ఆ ఆరు సంవత్సరాల కాలంలో ఆయనను కేవలం దురదృష్టం వెన్నాడుతూ వచ్చింది. సీతా కల్యాణం (1935), ద్రౌపదీ వస్త్రాపహరణం (1936), శశిరేఖాపరిణయం (మాయాబజార్, 1936), సారంగధర (1937), చిత్రనళీయం (1938) ఇలా యెన్నో చిత్రాల్లో నటించే అవకాశం చేజారిపోయింది. కొంత కాలం భారత చలన చిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కె వద్ద ఎడిటింగ్ శాఖలో పని చేయటం, తండ్రి మరణానంతరం చేతికందిన పెద్ద మొత్తం సొమ్ముతో సినిమా కంపెనీ పెట్టి, “నరనారాయణ” చిత్రం తీదామని ఒక ప్రబుద్ధుడు ఆయనను బుట్టలో వేసుకొని జేబులు ఖాళీ చేయడం, చేతిలో చిల్లిగవ్వ లేక, చేయిచాచి మరొకర్ని ముష్టి అడగలేక కృశించిపోతున్న సమయంలో హచ్చిన్స్ కంపెనీ అధినేత అచ్యుతస్వామినాయుడు ఆదుకొని మరల మామూలు మనిషిని చేయడం… ఈ కాలంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మాత్రమే!

[6] ఈ పాత్ర కూడ అదృష్టవశాత్తు దొరికినట్లు! హెచ్.ఎం.రెడ్డి ఆ పాత్ర పారుపల్లి సత్యనారాయణ చేత వేయిద్దామనుకున్నారు. బి.యన్.రెడ్డి ప్రోద్బలంపై నాగయ్యకు ఆ పాత్ర లభించింది.

[7] అలాంటిది 1950-51 తరువాత వాహినీ, విజయా సంస్థల చిత్రాలలో ఆయన కనిపించకపోవడం అంతుపట్టని విషయం!

[8] త్యాగయ్య నిర్మాణ కాలంలో రేణుకా వారి (నాగయ్య గారి బ్యానర్) ఆఫీసు ఒక ఆశ్రమంగానూ, సంగీత విద్వాంసుల నిలయం గానూ మారింది.

కొసమెరుపు: ఆ కాలంలో రేణుకా వారి భోజనశాల “వడలకు”, సారధి వారి మెస్ పెసరట్లకు ప్రసిద్ధిగాంచాయి.

–పరుచూరి శ్రీనివాస్

తొలిప్రచురణ:తానా పత్రిక,మార్చి 1998

11 Comments
  1. గిరి December 30, 2008 /
  2. Sowmya December 30, 2008 /
  3. కేవియార్ December 30, 2008 /
  4. మేడేపల్లి శేషు December 30, 2008 /
  5. నవీన్ గార్ల December 30, 2008 /
  6. pappu December 30, 2008 /
  7. krishna rao jallipalli December 30, 2008 /
  8. శ్రీ లక్ష్మీ కళ January 6, 2009 /
  9. chandra vanam January 21, 2009 /
  10. Yedu Kondala Swamy January 29, 2009 /