మిస్ కాకూడని మిస్సమ్మ ( ఒక సమగ్ర విశ్లేషణ )
“Story structure” is one of screenwriting’s most enduring cliches, and not without reason. Many of the most successful writers say that the story structure is the single most important function of the writing process, one that will ultimately determine the success or failure of the script and of the film itself.
Linda Seger & Edward Jay Whetmore ( From Script to Screen )
కొన్ని కథలు విన్నా, చదివినా ఎల్ల కాలమూ గుర్తుండిపోతాయి. అలాగే కొన్ని సినిమాలూ అంతే. మరి కొన్ని సినిమాలు కాలానికి అతీతంగా అందరికీ నచ్చుతాయి. అంటే ఏభై ఏళ్ళ క్రితం తీసిన సినిమా ప్రస్తుతం చూసినా మళ్ళీ ఆకట్టుకుంటుంది. విసుగు పుట్టించదు. కుర్చీకి కట్టి పడేస్తుంది. చూసిన చిత్రమైనా చివరవరకూ చూసేలా చేస్తుంది. హాలునుండి బయటకొచ్చినా మనల్ని వెంటాడుతుంది. రెండుమూడు రోజులు మనతో ఉండిపోతుంది. కొంతకాలం తరువాత మళ్ళా చూసినా అదే అనుభూతి కలుగుతుంది. అటువంటి చిత్రాల్నే సినీ భాషలో క్లాసిక్స్ లేదా ఆణిముత్యాలంటారు. దీర్ఘాయువు ( లాంజివిటీ ) ఈ ఆణిముత్యాల ముఖ్య లక్షణం. మనుషులకెలా ఆయుష్షుంటుందో ప్రతీ కళారూపానికీ ఓ జీవిత కాలం ఉంటుంది. మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అలాగే ఓ కళారూపం ఎక్కువకాలం బ్రతకాలంటే ఆ కళకి సంబంధించిన కొన్ని ప్రాధమిక సూత్రాలు పాటించి తీరాలి. అప్పుడే అది కలకాలం నిలుస్తుంది. ఈ సూత్రం సినిమాలకీ వర్తిస్తుంది. ఏ సినిమాకయిన కథ, కథావస్తువూ, కథనం, దృశ్య నిర్మాణం, నటన, ఫొటోగ్రఫీ, దర్శకత్వం ఇవి ప్రాథమిక అంగాలు. అవికాక సంగీతం, ఆహార్యం వగైరాలు కూడా సినిమాలో ముఖ్యమైన అంగాలుగానే పరిగణించచ్చు. ఇవన్నీ ఒకదానికొకటి లేసుల్లా ముడిపడి ఉన్నాయి. మధ్యలో ఎక్కడ అల్లిక తప్పినా రూపం చెడిపోతుంది. ఈ ప్రాథమిక అంగాలకీ కొన్ని మౌలిక సూత్రాలున్నాయి. ఈ అల్లిక నిర్మాణంలో అవి సరైన విధంగా పాటిస్తేనే ఆ రూపానికొక జీవం వస్తుంది. ఆణిముత్యాలని చెప్పబడే చాలా సినిమాల్లో ఈ ప్రాథమిక సూత్రాలు తగినంత పాళ్ళల్లో ఖచ్చితంగా పాటించబడతాయి. సాధారణ ప్రేక్షకుడు ఇవన్నీ పైకి గుర్తించలేకపోయినా, అంతర్గతంగా ఈ సూత్రాలే ఆకట్టుకునేలా చేస్తాయి. అంతే కాదు సాధారణ ప్రేక్షకుడు చాలా తెలివైన వాడు. కావల్సినవి గుర్తించ లేకపోయినా, అక్కర్లేని చెత్తని మాత్రం సున్నితంగా తిరస్కరించగలడు. వంటకం చేసే విధానమూ, వాడిన పదార్థాలూ తెలియకపోయినా, రుచి లేని వాటిని ముట్టుకోడు. ఈ సూత్రం ప్రతీ కళకీ, ముఖ్యంగా సినిమాలకీ, వర్తిస్తుంది.
ఓ ఆణిముత్యం అనబడే సినిమానొకటి తీసుకొని, అందులో ఈ ప్రాథమిక సూత్రాలు ఎలా పాటించారూ, ఏ ఏ పాళ్ళల్లో ఎంతవరకూ అమలు చేసారూ, ఇవన్నీ ముక్కలు ముక్కలుగా చేధించి పరిశీలించడమే ఈ వ్యాసముఖ్యోద్దేశం. ఇది సమీక్ష కాదు. మెచ్చుకోలు అంతకంటే కాదు. కేవలం చిన్న పరిశీలన మాత్రమే!
ఏదైనా ఒక చెత్త సినిమాని సమీక్షించడమంటే చాలా సులభమైన పని. ఫలానా సినిమా ఎందుకు విజయవంతం కాలేదో రాయచ్చు. తప్పుల తడకలు అతి సునాయాసంగా బయటకు తీసేయచ్చు. కానీ ఒక సినిమా మంచి సినిమా అని రాయాలంటే కాస్త కష్టమైన పనే! ఆ సినిమా గురించి పూర్తి అవగాహనతో రాయాలంటే అన్ని కోణాల్లోంచి చూడాలి. ఎందుకు ఆ సినిమా గొప్పదో స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే ఆ సమీక్ష లేదా విమర్శ పాఠకుల్నైనా, ప్రేక్షకుల్నైనా హత్తుకోవడమనేది జరుగుతుంది. నటన, సంగీతం, కథ అన్నీ అద్భుతం అని రాసేయచ్చు. దర్శకత్వం బావుందని పొగడచ్చు. కథనం గొప్పగా ఉందని చెప్పచ్చు. కానీ ఇవొక్కటే కాదు మంచి సినిమాకి కావల్సిన లక్షణాలు. ఏ ఏ విషయాల్లో ఆయా విభాగాల ప్రాధమిక సూత్రాలను పాటిస్తూ, ఏ రకంగా జన రంజకంగా మలచబడ్డాయో లేదా కొత్తగా చూపించబడ్డాయో రాసినప్పుడే విమర్శకుల మన్నన లభిస్తుంది. సినిమాకీ, సమీక్షకీ శాస్త్రీయత చేకూరేదప్పుడే! దీన్నే ఆధునిక పద్ధతిలో “టెక్స్ట్ బుక్” ప్రతీక అంటూంటాం. అటువంటి సినిమా కోవలోకి చెందుతుంది విజయా వారి ఆణిముత్యం మిస్సమ్మ సినిమా. వేలెత్తి చూపడానికి వీలు లేకుండా ఇప్పటికీ విసుగు లేకుండా చూడగలిగే ఆహ్లాదకరమైన సినిమా మిస్సమ్మ. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ సినిమా గురించి రాసారు. సినిమా శాస్త్రీయత దృష్ట్యా నాకు నచ్చిన సినిమా ఇది.
కథ – కథావస్తువూ – కథనం
కథ రాయడం వేరు. చెప్పడం వేరు. చూపించడం వేరు. మూడింటికీ ప్రాథమిక సూత్రం ఒకటే అయినా ఒక్కొక్కటీ ఒక్కో పద్ధతిలో ఉంటాయి. రాసే కథకి వర్ణన ( నేపధ్యం, పాత్రల స్వభావం, శిల్పం, శైలీ వగైరాలు ) ఒకలా ఉంటుంది. చదవడం పూర్తి కాగానే దృశ్యాలన్నీ పాఠకుల మదిలో ఆవిష్కరింప బడతాయి. పాఠకుల ఊహా శక్తీ, అవగాహన్ని బట్టీ మారుతుంది. చెప్పే కథకి చెప్పే వాణ్ణి బట్టి ఉంటుంది. చెప్పడం అనే ప్రక్రియలో చెప్పేవాడి శక్తి మీదే కథ బాగోగులు ఆధార పడతాయి. చెప్పడం సరిగ్గా లేకపోతే ఎంత మంచి కథైనా వినేవాడికి ఎక్కదు. కొంత మంది చిన్న విషయాన్ని కూడా ఎంతో ఆసక్తి కరంగా మలుస్తారు. కొంత మంది రమ్య మైన కథని చెప్పడం చేతకాక విసుగు పుట్టిస్తారు. ఇక్కడ వాచ్యం మీదే మొత్తం కథ బ్రతుకాథార పడి ఉంటుంది.
ఇహ మూడోది. చూపించడం. ఇక్కడ వర్ణన అవసరం లేదు. వాచ్యం అవసరమైతే తప్ప ఉండకూడదు. దృశ్యాన్ని చూడగానే నేపథ్యమూ, పాత్రల్న్ని చూడగానే వారి స్వభావమూ ఇవన్నీ చెప్పనవసరం లేకుండానే తెలిసిపోతాయి. పాత్రల ప్రవర్తన్ని బట్టీ మనస్తత్వాలు తెలుస్తాయి. మాటలు కథనానికి దారి చూపిస్తాయి. ఇది రాయడానికీ, చెప్పడానికీ అతి సులభంగా కనిపించినా అత్యంత కష్టమైన ప్రక్రియిది.
మొదటి ప్రక్రియలో రచయితే కర్తా, కర్మా, క్రియా. రెండో ప్రక్రియలో రచయిత కర్తా, చెప్పేవాడు కర్మ, క్రియా. మూడో ప్రక్రియ లో రచయిత కర్త, పాత్రలు కర్మా, దర్శకుడు క్రియా. వాక్యానికి కర్తా, కర్మా, క్రియా ఎంత అవసరమో హృద్యమైన దృశ్యానికీ ఆ ముగ్గురూ కావాలి. అప్పుడే ఆ దృశ్యం పండుతుంది.
రాయడానికీ, చెప్పడానికీ, చూపించడానికీ అంతర్లీనంగా ఉండే ప్రథాన వస్తువు కథే! కథ అనే దారమే ఈ మూడు ప్రక్రియలకీ ఆథారం. పూలైనా, ముత్యాలైనా అందంగా గుచ్చాలంటే గట్టి దారం కావాలి. అలాగే రచనైనా, దృశ్యమైనా పదికాలాలపాటూ హత్తుకునేలా నిలవాలంటే మంచి కథా వస్తువు కావాలి. అప్పుడే అది నిలబడుతుంది.
ముఖ్యంగా ఒక సినిమా అనబడే దృశ్య మాద్యమానికి ఇది చాలా అవసరం. ఒక సినిమా ఎంతకాలం నిలుస్తుందీ అన్నది నూటికి ఎనభై శాతం దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఏభై సంవత్సరాల క్రితం తీసిన ఒక సినిమా గురించి ఇప్పుడు మరలా మరలా ప్రస్తావించుకోడానికిదే ప్రథాన కారణం. తరాలు మారినా అందర్నీ హత్తుకునేది సజీవమైన కథ ఒక్కటే!
అసలు ( మిస్సమ్మ ) కథ
అప్పాపురం జమీందారు పెద్ద కూతురు మహాలక్ష్మి తిరునాళ్ళలో తప్పిపోతుంది. తప్పిపోయిన పిల్ల పేరిట ఓ స్కూల్ నడుపుతూ ఉంటారు. ఆ స్కూల్లో చదువు చెప్పడానికి ఓ పంతులమ్మ, పంతులయ్య కావాలనీ, వాళ్ళిద్దరూ భార్యా భర్తలై ఉండాలనీ, అందులో పంతులమ్మకి సంగీతం కూడా వచ్చి ఉండాలన్న నియమాలతో ఓ పేపరు ప్రకటన ఇస్తారు. నిరుద్యోగ సమస్యతో నిండిన ఓ వ్యక్తీ ( ఎమ్ టీ రావు ), అప్పుల బాధలతో సతాయింపబడే క్రిష్టియన్ మతస్తురాలైన మరో అమ్మాయీ (మిస్ మేరీ,), ఇద్దరూ కలిసి కోసం మొగుడూ పెళ్ళాలుగా నటించడానికి సిద్ధ పడి, ఆ ఉద్యోగాలకి అప్ప్లై చేస్తారు. ఆ అమ్మాయేమో పక్కా క్రీష్టియన్. అతనేమో హిందువు. మిస్ మేరీ ముందుగా ఈ ప్రతిపాదనకి ఒప్పుకోదు. తన చదువుకోసం తండ్రి చేసిన అప్పు తీర్చమనీ మేరీ బంధువు సతాయిస్తాడు. లేదా మేరీని పెళ్ళి చోసుకోమని నిర్బంధింస్తాడు. రెండు నెలల్లో తీసుకున్న అప్పు అతని మొహాన కొడదామని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎంప్టీ రావు చేసిన ప్రతిపాదనకు సరే నంటుంది. తమతో పాటే పనీ పాటూ లేక బిచ్చగాడి వేషంలో ప్రజల్ని మోసం చేసే దేవయ్యనీ తోడుగా తీసుకెళతారు. అక్కడ అప్పాపురం జమీందారుకి సీత అనే ఓ గారాలపట్టి కూతురుంటుంది. ఈ జమిందారు మేనల్లుడు, డిటెక్టివ్ రాజు అప్పాపురం స్కూలు హెడ్మాస్టర్ గా ఉంటాడు. తప్పిపోయిన జమీందారు మొదటి కూతురు మహలక్ష్మిని ఎలాగైనా పట్టి తన ప్రతిభ అందరూ గుర్తించేలా చెయ్యలన్న కోరిక ఈ డిటెక్టివ్ రాజుది. స్కూలు సరిగ్గా నడపడం లేదనీ, అతన్ని తీసేసి పేపర్లో ప్రకటనిస్తాడు జమీందారు. ఆ ఉద్యోగాలకే ఎంప్టీ రావూ, మిస్ మేరీ వస్తారు. ఆ అప్పాపురం జమీందారు హిందూ సాంప్రదాయాల మధ్య ఇమడలేని ఆమే, వెయ్యి అబద్ధాలు చెప్పి ఉద్యోగం నిలుపుకోవాలని ప్రయత్నించే అతనూ, తప్పిపోయిన మహలక్ష్మిని వెతుకుదామని వీర ప్లానులేసే జమీందారు బావ మరిది డిటెక్టివ్ రాజూ, పంతులయ్యకీ పంతులమ్మకీ తలనొప్పిలా తయారైన జమీందారు గారాల రెండో కూతురూ, సహాయానికొచ్చి అందరి దగ్గరా డబ్బులు కొట్టి పబ్బం గడుపుకొనే జిత్తులమారి దేవయ్యా. ఇలా రక రకాల పాత్రల మధ్య నడిచే కథే ఈ మిస్సమ్మ.
పైకి కనిపించే కథ ఇదైనా ఇందులో కథా వస్తువు నిరుద్యోగం. అప్పట్లో, అంటే పంతొమ్మిదివందల ఏభైల్లో నిరుద్యోగ సమస్యనెత్తుకొని దానిమీదుగా పైన చెప్పిన కథ నడిపిస్తాడు. పైగా ఈ నిరుద్యోగంలో రకరకాల పాత్రల్నల్లారు. చదువూ సంధ్యాలేక ప్రజల్ని మోసం చేస్తూ పబ్బం గడుపుకొనే ఓ దేవయ్య పాత్రొకటుంటుంది. చదువూ, సంస్కారముండీ ఉద్యోగం కోసం ఎదురు చూసే నాయికా నాయకుల పాత్రలుంటాయి. ఆస్తీ అంతస్తూ ఉండి సరిగ్గా ఓ రోజు కూడా స్కూల్లో సరిగా పాఠం చెప్పలేని డిటెక్టివ్ రాజు పాత్రుంటుంది. ఇవన్నీ మరలా కథలో సునాయాసంగా అల్లుకుపోతాయి. ఇదీ ఈ కథా వస్తువు గొప్పతనం. నిరుద్యోగం అనే కథా వస్తువు పైనే ఈ కథానిర్మాణం జరుగుతుంది. ఈ కథా వస్తువు నిర్థారించడానికి కొన్ని పాత్రలూ, సన్నివేశాలూ కల్పించి పునాది వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కంపనీ యజమాని గుమ్మడి పాత్రా, దానికి సంబంధించిన సన్నివేశాలూ కనిపిస్తాయి. సంభాషణలూ వినిపిస్తాయి. నిరుద్యోగం పై సెటైర్లు వినిపిస్తాయి.
ఈ కథా వస్తువుని ఎష్టాబ్లిష్ చేసే నిమిత్తమై కొన్ని సహజమైన సన్నివేశాలు కల్పించారు. ప్రారంభంలో ఎంప్టీ రావు ఓ బడ్డీ కొట్టు దగ్గర ఒకాయన పేపరు చదువుతుంటే అందులోకి తొంగి చూస్తాడు. ” ఓ ! వాంటెడ్ కాలమా? ” అని ఆ పేపరు కల వ్యక్తంటే – ” చదువుకునే రోజుల్లో మేమూ స్పోర్ట్స్ కాలమే చూసేవాళ్ళం బ్రదర్ !” అంటూ ఓ చలోక్తి విసురుతాడు ఎంప్టీ రావు. నిరుద్యోగమున్నంతకాలమూ ఈ సన్నివేశం జీవిస్తుంది. అలాగే ఉద్యోగం ఇంటర్వ్యూ కి వెళితే గుమ్మడి పాత్ర ద్వారా పలికించిన సంభాషణలు ఎంతో సహజంగా ఉంటాయి.
నిరుద్యోగమనే కథా వస్తువునెన్నుకొని అది సందర్భోచితంగా, పాత్రోచితంగా నిర్ధారించబడడం ఈ సినిమాలో కనబడుతుంది. అదీ అతి సహజంగా వుంటుంది.
ప్రతీ కథకీ మూడు భాగాలుంటాయి. అవి ప్రారంభం, మధ్యమం, ముగింపు. ప్రారంభంలో కథా నేపధ్యాన్ని వివరిస్తూ ఓ సమస్య చూపించడం జరుగుతుంది. మధ్యమంలో నాయికా నాయకులు ఆ సమస్యని సాధించడానికెదుర్కున్న అవరోధాలు చూపించడం జరుగుతుంది. అవి ఎలా పరిష్కరించారో ముగింపులో వస్తుంది. ఏ కథకైనా కీలకమైన ఈ మూడు అంశాలూ తప్పనిసరిగా ఉంటాయి. ఇందులో సమస్య అనేదాన్నే మనం మెయిన్ థ్రెడ్ ( అల్లిక తాడు ) అంటాం. ఇది కాక చిన్న చిన్న థ్రెడ్ లు కూడా ఉండచ్చు. ఎన్నున్నా చివర్లో అన్నీ ముడేయాలి. అది కూడా కథా పరంగా సహజత్వానికి దగ్గరగా ఉండాలి.
మిస్సమ్మ కథలో నిరుద్యోగం అనే మెయిన్ థ్రెడ్ పై కథ నడుస్తుంది. ఈ నిరుద్యోగ సమస్యే రెండు వేర్వేరు మతస్థులైన నాయికా నాయకుల్ని కలుపుతుంది. జీవనాధారం కోసం ఇద్దరూ తమ మతాల్నీ, అభిమతాల్నీ పక్కన బెట్టి కలిసి జీవించేలా పురికొల్పుతుంది. ఇద్దరినీ ఒక దారికి తెస్తుంది. ఈ కథా వస్తువు ఆధారంగా మిగతా కథ నడుస్తుంది. కొత్త కొత్త సమస్యలు ( చిన్నవీ, పెద్దవీ ) సృష్టించబడతాయి. అవన్నీ కథలోని పాత్రలు ఎలా పరిష్కరించబడతాయో చివరకు కానీ తెలీదు. ఈ సమస్యలనే థ్రెడ్ లు ఒక దాన్లోంచి ఇంకోటి అతి చక్కగా ముడి వేయ బడతాయి. ఇహ కథలో సంవిధాన మరియు స్వల్ప సమస్యలు ఏమిటో చూద్దాం.
1. వేరు మతస్థులైన నాయికా నాయకులు భార్యా భర్తలుగా నటిస్తూ అప్పాపురం జమీందారు బడిలో పాఠాలు చెప్పే పంతుళ్ళ ఉద్యోగాలకి వెళతారు. అక్కడ వాళ్ళిద్దరూ ఎలా నెట్టుకొస్తారన్నది ప్రథాన సమస్య.
మేరీ క్రిష్టియన్, అతను హిందువు. వేరు మతాల వాళ్ళు కలసి ఎలా కాపురం చేస్తారన్న దానితో ఈ ప్రథాన సమస్య మరింత జటిలం అవుతుంది. అలాగే ఆమె అభిమానవతీ, ఆవేశపరురాలు. అతనేమో బ్రతుకు తెరువు తెలుసున్న వ్యక్తి. దొరక్క దొరికిన ఉద్యోగమే అతనికి ముఖ్యం. ఈ రెండు పాత్రలతో ప్రథాన సమస్య బిగుస్తుంది.
దానికి తోడు జమీందారూ, భార్యల చేధస్తం తో మరింత తీవ్రం అవుతుంది. తిరునాళ్ళలో తప్పిపోయిన మహాలక్ష్మిని వెతికి పట్టుకునో నేపథ్యంలో డిటెక్టివ్ రాజు ప్రయత్నాలతో వచ్చే చిక్కులూ, జమీందారు రెండో కూతురు వల్ల వచ్చే తలనొప్పులూ, ఇవన్నీ కలసి ప్రథాన సమస్యని కొండత చేస్తాయి. ప్రథాన పాత్రలు ఈ కొండని ఎలా దాటుతారా అన్నదే ప్రేక్షకుడి ముందు వదిలిన పెద్ద సమస్య.
2. ఇహ మిగిలినవి చిన్న సమస్యలు. అవి కూడా కథలో భాగమే కానీ సమాంతర సమస్యలు ( పేరలల్ థ్రెడ్స్ ) కావు. తప్పి పోయిన మహాలక్ష్మిని ఎలాగైనా వెతికి తేవాలన్న డిటెక్టివ్ రాజు థ్రెడ్ వేరు. అప్పు ఇచ్చి మేరీని పెళ్ళాడాలన్న డేవిడ్ నడిపే థ్రెడ్ వేరు. అది కాక భార్యా భర్తలుగా ప్రతీ క్షణం నాటకమాడుతూ రోజుకో గండాన్ని తప్పించుకునే నాయికా నాయకుల థ్రెడ్ ఎలానూ ఉంది. ఇవన్నీ చివర్లో అతి సహజంగా ముడివేయబడతాయి. ఆ మేరేయే తప్పిపోయిన మహాలక్ష్మి అనే సమస్యా పరిష్కారంతో కథ ముగుస్తుంది. సినిమా ఆద్యంతమూ ఒక దాంట్లోంచి ఇంకోటి అతి సహజంగా అల్లుకుపోతూ వుంటాయి. మూడు గంటలూ మూడు నిమిషాల్లా గడిచిపోతాయి.
ఈ రకంగా ప్రథాన కథలోనే సహజత్వం నిండుంటుంది. దాన్ని మలిచిన తీరులో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది.
మొదట్లో సృష్టించిన సమస్యలన్నింటికీ సహజత్వానికి దగ్గరగా లాజికల్ ముగింపు కనిపిస్తుంది. ఎక్కడా అసంబద్ధం అనిపించదు. ఇదీ ఈ కథలో వున్న ప్రత్యేకత.
కథనం లేదా స్క్రీన్ ప్లే
ఏ కథ తెరకెక్కించాలో నిర్ణయించడం ఒక ఎత్తు. దాన్ని ఎలా తెరపై చూపించాలాన్నది మరో ఎత్తు. ఒకే కథని వెయ్యి రకాలుగా చూప్పించచ్చు. ఎలా చూపించినా ప్రాక్షకుల హృదయాలకి హత్తుకోవాలి. దృశ్య నిర్మాణం ఎక్కడా చెడకుండా కథని తెర కెక్కించినప్పుడే రాణిస్తుంది. మిస్సమ్మ సినిమాలో స్క్రీన్ ప్లే పాఠ్య గ్రంధంలా ఉంటుంది. ప్రతీ సినిమాకీ ప్రారంభం చాలా ముఖ్యమైంది. దాని ద్వారానే కథా నేపధ్యాన్ని అంకురార్పణ జరుగుతుంది. మొదటి పావుగంటలోనే కథా నేపధ్యం ద్వారా సమస్య నిర్థారించబడుతుంది.
పైన చెప్పిన కథని అనేకరాకాలుగా ప్రారంభించచ్చు. ప్రస్తుత సినిమాల్లోలాగ హీరో లేదా హీరోయిన్ పాత్రల ద్వారా చూపించడం ఒక పద్ధతి. కానీ ఇందులో సినిమా ప్రారంభం సహాయ పాత్రల ద్వారా మొదలవుతుంది. అప్పాపురం స్కూలుని డిటెక్టివ్ రాజు శ్రద్ధగా నిర్వహించడం లేదన్న పాయింటుతో మొదలవుతుంది. ఆ స్కూలికి కొత్త టీచర్ల అవసరం చూపిస్తూ మొదలవుతుంది. అలా మొదలైన కథ మెల్లగా జమీందారు పెద్ద కూతురు తిరుణాల్లలో తప్పిపోయిన విషయం చెప్పబడుతుంది. జమీందారు భార్యకి తప్పిపోయిన కూతురు గుర్తుగా నడిపే ఆ స్కూలంటే ప్రాణం. జమీందారుకి భార్యంటే ప్రాణం. అలా జమీందారు మేనల్లుడుని తప్పించి ఆ స్కూలు నడిపడానికి కొత్త టీచర్ల కోసం ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. రెండో కూతురికి సంగీత పాఠాలు చెప్పడానికి మరో టీచరు అవసరం లేకుండా సంగీతమొచ్చిన ఆడ టీచరయితే మరింత జీతమంటూ అని ప్రకతిస్తారు. ఇలా కథకి కావల్సిన ప్రథాన ముడిసరుకు ఎంతో లాజికల్ గా అమరుస్తారు. తప్పిపోయిన కూతురి ప్రస్తావన తెస్తూ జమీందారు భార్య పాత్ర ద్వారా ఆ అమ్మాయుకున్న ఒకే ఒక గుర్తుని సూచన ప్రాయంగా చెప్పిస్తారు. అది ఆ అమ్మాయికి కుడి కాలి పాదమ్మీద రూపాయి కాసంత పుట్టుమచ్చ. అది ప్రస్తావిస్తూ దృశ్యాన్ని హీరోయిన్ పాత్ర పరిచయం జరుగుతుంది. అంతే కాదు సదరు నాయిక మిస్ మేరీకి సంగీతమొచ్చని చెప్పడానికి, ఒక చిన్న అమ్మాయికి శాస్త్రీయ సంగీతం పాఠం చెబుతున్నట్లుగా ఓ పాటతో మొదలవుతుంది. అదే చోట మన హీరో ఎంటీ రావుకూడా వాళ్ళబ్బాయికి లెక్కలూ, ఇంగ్లీషు ట్యూషన్ చెబుతున్నట్లుగా ప్రవేశ పెడతారు. ఆ యజమానికి మరో వూరు బదిలీ అవ్వడంతో ఇద్దరూ నిరుద్యోగులవుతారు. ఏదో పూట గడవడానికే ఈ ట్యూషన్లు చెబుతూ మరో పక్క ఉద్యోగ ప్రయత్నాలూ చేస్తూ ఉంటారు. ఇలా ఇద్దరికీ ఉద్యోగావసరాన్ని కలిపిస్తారు. ఇలా ఒక దాంట్లోంచి ఇంకోటి అల్లుకుంటూ ప్రతీ పాత్రనీ పరిచయం చేస్తారు.
స్క్రీన్ ప్లే కి ప్రథాన అంగమొకటుంది. అది పాత్రల పరిచయం. పాత్రల నడకనీ, వ్యక్తిత్వాలనీ చెప్పడం. వాటి స్వభావాన్ని ప్రస్ఫుటంగా చూపించడం. పాత్రోచితం స్క్రీన్ ప్లేలో అంతర్లీనంగా ప్రథాన భాగం కావాలి. అప్పుడే ఆ కథ హత్తుకుంటుంది. మిస్సమ్మ సినిమాలో ఈ సూత్రాన్ని ఆద్యంతమూ పాటించారు. జమీందారు రెండో కూతురు గారాల పట్టి. పెంకి పిల్ల. ఉడుకుమోత్తు. జమీందారు భార్య “మీ అక్క మహాలక్ష్మి తప్పిపోయిందని చెబుతూ మీ అక్క చాలా మంచిది, నెమ్మదస్తురాలంటూ వర్ణిస్తుంది. “అంటే నేను కాదా?” అంటూ ఏడుస్తూ రెండో కూతురు ఉడుకుమోత్తు స్వభావాన్నీ చూపిస్తారు. ఇలా ప్రతీ పాత్ర తీరుతెన్నులూ చక్కగా చెబుతారు. దేవయ్య పాత్రయినా, డిటెక్టివ్ రాజు పాత్రయినా, మిస్సమ్మ పాత్రయినా, ఎంటీ రావు పాత్రయినా, ఏదైనా ఒక ప్రత్యేకతతో చూపిస్తారు. ఈ సినిమా స్క్రీన్ ప్లేకి ఇదే ఒకరకంగా ఆయువు పట్టు.
అలాగే చీటికీ మాటికీ ఎంటీ రావుపై చిర్రు బుర్రులాడే మిస్సమ్మ మెల్ల మెల్లగా అతనిపై ప్రేమ పెంచుకునే తీరునీ ఒక పద్ధతిగా చూపిస్తారు. మిస్సమ్మ లాంటి కథనెన్నుకోవడంలోనే పింగళీ, చక్రపాణి ల ధైర్యమూ, తెగింపూ కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రంలో మాటలు ఎంతో సహజంగా ఉంటాయి. అవసరమైనచోట వ్యంగ్యాన్నీ, హాస్యానీ పండిస్తాయి. ఈ చిత్రంలో దేవయ్య పాత్ర ద్వారా లంచాన్నీ “తైలం” అంటూ పలికించడంలో ప్రత్యేకత కనిపిస్తుంది. అలాగే ప్రతీ సన్నివేశ నిర్మాణంలోనూ సహజత్వమూ, హాస్యమూ చక్కగా విలీనం చేసినట్లుగా అనిపిస్తుంది. ఒక్క సన్నివేశం కానీ, పాత్ర కానీ ఎబ్బెట్టుగా అనిపించదు. ఇదీ ఈ సినిమా స్క్రీన్ ప్లే ప్రత్యేకత.
ఈ సినిమాలో ఏ ఒక్క పాత్రా తమ ఉనికిని దాటి పోవు. అంటే ఆయా పాత్రల స్వభావాలు చివరి వరకూ ఒకేలా ఉంటాయి. చీటికీ మాటికీ “తైలం” అంటూ ప్రతీ వాళ్ళ దగ్గర డబ్బు గుంజే మనస్తత్వం కల పాత్ర దేవయ్యది. అందితే జుట్టు అందక పోతే కాళ్ళూ పట్టుకొని ఎలాగైనా మేరీని తన దాన్ని చేసుకోవాలనే పాత్ర డేవిడ్ ది. ఈ పాత్రలు చివరి వరకూ అలాగే ఉంటాయి. కథ మధ్యలో మేరీకి ఓ కలస్తుంది. అందులో ఆమె రాజకుమారి గానూ, తనన్ని వేధించే వ్యక్తి గా డేవిడ్ మరో రాజు గానూ కనిపిస్తారు. అతని బారినుండి మేరీని రక్షించే రాకుమారిడిగా ఎంటీ రావూ ఉంటారు. అందులో మళ్ళా దేవయ్య రాకుమారిడి అనుచరిడిగా వస్తాడు. అక్కడ కూడా “తైలం” అంటూ డేవిడ్ ని ఆటాడిస్తాడు. ఈ కలలో మాటలులేక పోయినా పాత్రల ప్రవర్తనతో ఏం చెబుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి సన్నివేశాలు రాసేటప్పుడే రచయిత వాడి కనబడుతుంది.
( ఇంకా వుంది )
రెండో భాగం ఇక్కడ చదవండి.
Filed Under: featured • lead • భారతీయ సినిమా • విశ్లేషణ
మిస్సమ్మ సినిమాకు ఒక బెంగాలీ కథ ఆధారం అని విన్నాను. డైలాగులు చక్రపాణిగారివే కనక అది నిజమే అయుండాలి.
షేక్స్పియర్ సాహిత్యమంతా ఒక గదిలో పెట్టగలిగితే దాని తాలూకు విమర్శలూ,విశ్లేషణలూ అన్నీ కలిపి పెట్టడానికి ఒక అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ అంత స్థలం కావాలట. అలాగే కొన్ని తెలుగు సినిమాల గురించి ఎంత రాసినా “అసమగ్రమే”.అందులో మిస్సమ్మ ఒకటి. అయినా, మీ వంతుగా ఒక సమగ్రమైన వ్యాసం ‘మిస్సమ్మ’ గురించి రాయబూనడం అభినందనీయం. కృతజ్ఞతాభినందనలు. మిగతా భాగాల కోసం ఎదురు చూస్తాను.
నాకు ఒక సీను ఇప్పడికి గుర్తు వస్తుంది. రామారావుకు పేపరు కొనుక్కాటనికి కూడా డబ్బులు కరువు. ఎవరో పేపరు చదువుతుంటె బస్ స్టాపులో అనుకుంటాను, వెనకనుంచి ఉద్యొగాల సెక్షను చూస్తూ ఉంటాడు. ఫేపరు చదివే ఆయన చూసి ‘నేను స్పోర్ట్సు తప్ప మిగతావి చూడనూ అని ఉద్యొగాల సెక్షను ఇచ్చేసి వెల్తాడు. నేననుకోటం ఏ సినిమాలో కొన్ని ప్రజల సమస్యలు కూడా సున్నితముగా చూపించారని. బెంగాలి సినిమా మీద అధారపడటం నిజము లాగానే ఉంది:
http://entertainment.indianetzone.com/films/1/bengali_films.htm
(Manmoyee Girls School)
డైలాగు,పాటలు ఫింగళి ?
Just checked a DVD of Missamma. Screenplay by Chakrapani.
మంచి విశ్లేషణ. రెండో భాగం కోసం చూస్తున్నా.
మిస్సమ్మకు దయ్యం పట్టిందనుకుంటారు చూడండి, అది మాత్రం అద్భతమైన కల్పన.
అవును ఈ సినిమాకి మూలం ఒక పేరుగాంచిన బెంగాలీ నాటకం. 1935 నాటికే బెంగాలీలో సినిమాగా వచ్చింది. రకరకాల మిస్సమ్మ వెర్షన్ల గురించి వివరంగా కొన్ని పోస్టులు రాసాను. నెట్-లో వెతకాలి.
http://www.ghantasala.info/tfs/cdataca59.html
http://navatarangam.com/2008/04/missamma-review/
– శ్రీనివాస్
మీ అడ్రస్ తెలియజేస్తే త్వరలో రిలీజవుతున్న “సినిమా తీయడం ఎలా?” అనే నా పుస్తకాన్ని
మీ అమూల్యమైన అభిప్రాయం కోసం కాంప్లిమెంటరీగా పంపించగలను.
గౌడ్ గారూ,
మీకు ఎవరి అడ్రస్ అని ఇవ్వమంటారు?నవతరంగంలో 50 మంది రచయితలు ఉన్నారు. అందరికీ కాపీలు పంపుతారా? లేదంటే ఒక ఐడియా.మీరు మీ పుస్తకాన్ని నవతరంగంలో ప్రచురించగలరేమో ఆలోచించండి.అప్పుడు అందరం చక్కగా చదువుకోవచ్చు. మీ వివరాలతో navatarangam at gmail dot com కి మైల్ చెయ్యండి.
పదేళ్ళ క్రితం అమెరికాలో నేను Script Writing / మూవీ మేకింగ్ కోర్స్ చేసాను. అందులో ఒక ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ మీద ఒక ఎనాలిసిస్ రాయాల్సి వచ్చింది. రాయడమే కాదు, అందరూ ఆ సినిమా చూస్తారు. ఆ తరువాత మన విశ్లేషణ వాళ్ళు వింటారు. ఇది నా ప్రాజక్ట్. ఆంగ్ల ప్రతికిది తెలుగు రూపం. అప్పట్లో ఇక్కడ వాళ్ళందరికీ ఈ సినిమా ఎంతో బాగా నచ్చింది. కొంతమందయితే డి వి డి కాపీలు తీసుకున్నారు. ఇంత గొప్ప సినిమాలోనూ కొన్ని పొరపాట్లు దొర్లాయి. అవి తరువాత భాగంలో వస్తాయి. (gorthib@yahoo.com)
Apologies for another post. I am bit confused about screenplay, script, dialogues. Can somebody explain?
Some internet entries say Pingali wrote the dialogues but the video I have says that script and screenplay are by Chakrapani.
>> “మిస్సమ్మ సినిమాకు ఒక బెంగాలీ కథ ఆధారం అని విన్నాను”
ఒకటి కాదు; రెండు. చక్రపాణి బెంగాలీ నుండి తెలుగుకి అనువదించిన రెండు నాటకాలు – ‘డిటెక్టివ్’, ‘ఉదర నిమిత్తం’ – కలగలిపి మిస్సమ్మ కధ వండారు.
బెంగాలీ మూలం సంగతేమో గానీ ఈ సినిమా చూసినప్పూడల్లా నాకు వుడ్‌హౌసు బ్లేండింగ్స్ కేజిల్ నవల్లు గుర్తొస్తాయి. ప్రతీ దాంటోనూ మారు వేషాల్తో జమీందారు కోటలో పాగా వెయ్యడమేనాయె, యెక్కడ యే నిమిషంలో వేషం బయటపడిపోతుందోనని భయమేనాయె ..
అదలా వుండగా .. ఈ సినిమా గురించి టూకీగా నా ఆలోచనలిక్కడ!