మిస్ కాకూడని మిస్సమ్మ(ఒక సమగ్ర విశ్లేషణ) – 2

మొదట భాగం ఇక్కడ చదవండి.

పాత్రలూ, పాత్రోచితాలూ ఇవన్నీ కథకుడి చేతిలో పుట్టినవే! తన ఊహాశక్తికి ప్రాణంపోసి వీటిని స్క్రిప్ట్ ( కథామూలం ) అనే దాంట్లో బంధిస్తాడు రచయిత. అదొక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. సినిమాలో భాగమైన ఎవరైనా సరే, దాన్ని ఎంత కోరికతో తాకితే, అంతగా వారికి కావల్సిన అద్భుతాలు జరుగుతాయి. దానికి తగ్గట్టుగా వారి గొప్పతనం తెరమీద సాక్షాత్కరింస్తుంది. ఇదీ స్క్రిప్ట్ గొప్పదనం. ఈ స్క్రిప్ట్ నే సన్నివేశ పరంగా ముక్కలు చేస్తే అదే స్క్రీన్ ప్లే అవుతుంది. కాకపోతే స్క్రిప్ట్ కీ, స్క్రీన్ ప్లే ప్రతికీ కొంచెం తేడా వుంది. స్క్రిప్ట్ లో వివరాలెక్కువుండవు. కావల్సినంతే ఉంటాయి. స్క్రీన్ ప్లే లో వివరాలుంటాయి. స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా అనిపిస్తుంది. నిర్మాతకది ప్రేక్షకులను రంజింపచేసే ఒక కథ. కళా దర్శకుడికి అదొక సన్నివేశ నిర్మాణానికి కావల్సిన ముడిసరుకు. అందులోనే ఏఏ సెట్స్ కావాలి;ఏఏ దుస్తులు వాడాలీ; ఏఏ ఆహార్యం సమకూర్చుకోవాలీ; ఇలాంటి వివరాలుండే ఒక మూల వస్తువు. నటులకి తమ తమ పాత్రల పరంగా ఏఏ సన్నివేశంలో ఏ రకమైన హావభావాలు చూపాలో తెలిపే పుస్తకం. చాయాగ్రహకుడికీ ఇదే మూలం. సన్నివేశానుసారంగా ఏ ఏ కోణాల్లో తీయాలీ, కథా గమనాన్ని ఎలా చూపిస్తే దృశ్యం హత్తుకుంటుందీ, ఇవన్నీ దీన్నుండే నిర్ధారణ చేసుకోవాలి. ఇహ దర్శకుడికి ఈ స్క్రీన్ ప్లే ఒక భగవద్గీత లాంటిది. తను చెప్పబోయే కథ తాలూకు పూర్తి వివరాలున్న గ్రంధం. ఏఏ ఫ్రేములో ఎలా తీయాలీ, నటుల నుండి ఎలాంటి నటన రాబట్టుకోవాలీ, మొత్త సన్నివేశాన్ని ఎలా సృజనాత్మకంగా తెరకెక్కించాలీ వంటి వివరాలు ఇందులోనే పొందుపరుచుకోవాలి. ఒక రకంగా మంచి స్క్రీన్ ప్లే తయారయితే మొత్తం సినిమా తీయడం అతి తక్కువ కాలంలో ముగించేయచ్చు. అందుకే హాలీవుడ్ లో ఈ స్క్రీన్ ప్లే తయారీకే ఏడాది పైగా సమయాన్ని వెచ్చిస్తారు. ఏళ్ళు పట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. మిస్సమ్మ సినిమాకి దాదాపు రెండేళ్ళు పట్టిందని విన్నాను. సినిమాలో ఈ శ్రమ ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో వివరాలతో ప్రతీ పాత్రా సన్నివేశమూ మలచబడ్డాయి.

మిస్సమ్మ సినిమాలో ప్రతీ సన్నివేశమూ అతి సహజంగా మలచబడ్డాయి. అందులో మచ్చుక్కు కొన్ని చూద్దాం. జమీందారు ఊరొచ్చి, మేరీ, ఎమ్‌టీ రావులు వారికిచ్చిన వసతిలో దిగిన మొదటి రోజు రాత్రి సన్నివేశం చూబెట్టిన తీరు అద్భుతం. ఉత్తుత్తి మొగుడూ పెళ్ళాలుగా నటించే ఎమ్‌టీ రావూ, మేరీ ఎలా గడుపుతారు? వారి ప్రవర్తనెలా ఉంటాయన్నదీ, వారికెదరయ్యే సమస్యలనీ ముందుగానే సూచన ప్రాయంగా చెబుతారు. ఆ సందర్భంలో చూపించిన ఎక్కుళ్ళ సీను అద్భుతం. ఆడదానిగా తన రక్షణ కోసం గది తలుపు గడియ ఒక వైపు వేసుకుంటే, మరో వైపు రోజంతా సిగరెట్ కాల్చక నోటి దురదని తీర్చుకోడం కోసం ఎమ్‌టీ రావూ తన వైపు గడియ వేసేస్తాడు. సరిగ్గా అదే సమయానికి మేరీకి ఎక్కుళ్ళు వస్తాయి. తలుపు తెరుద్దామనుకుంటే ఆవతలి వైపు గడియ పెట్టబడుంటుంది. తలుపులు బాదితే గానీ ఎమ్‌టీ రావు తీయడు. “నా వైపు గడియ పెట్టానుగా? మీరు గడియ పెట్టుకోవాలా?” అని మిస్సమ్మ అడిగితే, “ఎవరి జాగ్రత్తలో వాళ్ళుడం ఎందుకైనా మంచిది ” జవాబుతో ఆ ఇద్దరి పాత్రల ప్రవర్తనలూ తెలిసేలా చూపిస్తాడు దర్శకుడు. వీరి మధ్య దేవయ్య పాత్రెలాగూ ఉంది. ఈ సన్నివేశంలో నటీనటుల నటన చాలా బావుంటుంది. చిన్న చిన్న హావ భావాలతో ఎంత హాస్యం పండిచచ్చో ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అలాగే సంగీత పాఠాల సన్నివేశమూ అంతే! జమీందారు రెండో కూతురు ( జమున ) కి సంగీత పాఠాలని మిస్ మేరీ మొదలెడితే అది కాస్తా మీరే గదమాయింపుల వల్ల చెడుతుంది. ఆ సందర్భంలో మేరీ, ఎమ్ టీ రావు మీద విసుర్లు వేయడంతో అతనూ పాటతోనే జవాబిస్తాడు. అంతే జమీందారు కూతురు ఎమ్‌టీ రావు దగ్గరే సంగీతం నేర్చుకుంటానని మొండికేస్తుంది. ఉక్రోషం పట్టలేక మేరీ డిటెక్టివ్ రాజుకి సంగీత పాఠాలు చెప్పడానికుపక్రమిస్తుంది. అతని గొంతు కర్ణ కఠోరం. అయినా ఎమ్‌టీ రావుతో పంతానికి పోయీ, సంగీత శిక్షణ మొదలెడుతుంది. తప్పిపోయిన మహలక్ష్మే ఈ మేరీ అవ్వచ్చునేమో తెలుసుకునే ఉద్దేశ్యంతో డిటెక్టివ్ రాజూ ఒప్పుకుంటాడు. ఈ సన్నివేశం ఎంతో హాస్యంగా ఉంటుంది. నటన వరకూ వస్తే సావిత్రి హావభావాలు అద్భుతం. కోపమూ, కసీ, ఉక్రోషమూ, మూతి విరుపులూ, దెప్పిపొడుపులూ ఒకటేమిటి అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి ఆమె నటనలో! అలాగే డిటెక్టివ్ రాజు పాత్ర ధారి అక్కినేని నటనా ఈ సన్నివేశంలో మెచ్చుకోదగ్గది.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో పదికాలాలూ నిలిచే మాటలు హాస్యంగా రాసారు. జమీందారు స్కూల్లో ఉద్యోగం గురించి మేరీకి తన గురించి చెబుతూ ఎమ్‌టీ రావు ఇలా అంటాడు. “నేనూ ఓ మంచి సంస్కారం కలవాణ్ణే! కావాలంటే ఈ కాండక్ట్ సర్టిఫికేట్ చూడండి.” ఒక సన్నివేశంలో, వంటలో ఉప్పు ఎక్కువయితే దేవయ్య పై మండిపడతాడు ఎమ్‌టీ రావు. దేవయ్య దానికి సమాధానంగా “నన్నంటారేమిటి? మీరే ఉప్పుదగ్గరకొచ్చేసరికి కక్కూర్తి పడ్డారు!” అంటూ చెబుతాడు. ఇలాంటి మాటలు పదికాలాలపాటూ సజీవంగా ఉంటాయి. ప్రతీ సన్నివేశంలోనూ చలోక్తులూ, విసుర్లూ, దెప్పడాలూ, వ్యంగ్యాలూ ఉంటాయి. అవన్నీ మాటలతో పదునెక్కి సన్నివేశానికి అందన్నిస్తాయి.

ముందు మేరీ పాత్రకి భానుమతిని ఎంపిక చేసారు. కొన్ని సీన్లు కూడా తీసారు. చక్రపాణికీ, భానుమతికీ మధ్యొచ్చిన పొరపొచ్చాల వల్ల ఆమెను తప్పించి ఆ స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సినిమా చూసాకా ఆ పాత్ర సావిత్రి తప్ప మరెవ్వరు చేసినా నప్పదన్నట్లుగా ఉంటుందామె నటన. నటనా పరంగా ఈ సినిమాకి హీరో మిస్ మేరీ పాత్రధారి సావిత్రి. ఆ పాత్రలో మిస్ మేరీయే కనిపిస్తుంది తప్ప సావిత్రి కనిపించదు. ఈ క్రమంలో దేవయ్యా, ఎమ్టీ రావూ, డిటెక్టివ్ రాజూ, జమీందారూ, అతని రెండొ కూతురూ, డేవిడ్ ఇలా వీరందరూ వస్తారు. దేవయ్య పాత్ర నిడివి దాదాపు ఎమ్‌టీ రావు పాత్రకున్నంతా ఉంటుంది. సహాయ పాత్రయినా అద్భుతంగా పండింది.

అలాగే మిస్సమ్మ సినిమాలో కొన్ని కథా పరంగా కొన్ని అద్భుతమైన పాత్రలు ప్రవేశ పెటారు. మొదటిది దేవయ్య పాత్ర. అసలు కథలో ఈ పాత్ర కి ప్రాముఖ్యత వుందా అంటే ఉంది, లేదూ అంటే లేదు. కానీ మిగతా పాత్రల్ని సంధాన పరచడానికి ఈ దేవయ్య పాత్రని బ్రహ్మాండంగా వాడుకున్నారు. మేరీ, ఎమ్‌టీ రావుల మధ్య చిలిపి తగాదాల్ని సర్దాడానికీ, డిటెక్టివ్ రాజు ప్రయత్నాలని అడ్డుకోవడానికీ, ఎలా కావాలంటే అలా వాడుకునే పాత్రది. ఇతను ఎమ్‌టీ రావుకి బంధువూ కాదు, స్నేహితుడూ కాదు. ఎక్కడో పార్కులో పరిచయం అంతే! ఇలాంటి పాత్రల్ని సృష్టించడంలో కథకుల, దర్శకుల గొప్పదనం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. జానపద కథల్లో రాజు గారి చెలికాడు పాత్ర లాంటిదే అయినా, ఈ దేవయ్య పాత్రని సంధాన కర్తగా అనుకోవాలి. కథలో వేసిన అన్ని అంగాల అల్లికలనీ ఒకే తాటిమీదకి తెచ్చే పాత్రది. ఈ పాత్ర లేకుండా మిస్సమ్మ కథ ఊహించుకోలేం. దేవయ్య లేకుండా కథ ఒక్కడుగుకూడా ముందుకు నడవదు. ఈ పాత్ర నాకు బాగా నచ్చిన పాత్ర. మిగతా వన్నీ కథ కి అవసరమైన పాత్రలే! వాటికంటూ ఒక నిర్దిష్టమైన అవసరం ఉంది. కానీ దేవయ్య పాత్ర కేవలం అందర్నీ కలిపే పాత్ర మాత్రమే!

అలాగే నాకు నచ్చిన మరో పాత్ర ఇంకోటుంది. అది డిటెక్టివ్ రాజు అసిస్టెంట్ గోవిందు పాత్ర. దీన్ని బాల కృష్ణ పోషించాడు. దాదాపు డిటెక్టివ్ రాజున్న ప్రతీ సన్నివేశంలోనూ ఈ పాత్రుంటుంది. ఈ పాత్రకో విశేషముంది. సినిమా మొత్తంలో ఒక్క మాట కూడా మాట్లాడదీ పాత్ర. అంతా హావ భావాలే! “గోవిందూ, రాసుకో!” అంటే ఇతను రాస్తున్నట్లు నటిస్తాడు. సినిమా మొత్తమూ ఒక పాత్ర ఉండి, ఒక్క డైలాగూ లేకుండా చివరి వరకూ నడిపించడంలో రచయిత నైపుణ్యం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. ఈ తరహా ప్రయోగం మరలా అంతగా ఎవరూ చేయలేదు. కథల్లో ఇలాంటి పాత్రలు చాలామంది సృష్టించారు. కానీ సినిమాలో ఈ ప్రక్రియ చూపించడం ఇదే ప్రథమం.

తమ తమ డైలాగుల్ని చెప్పేస్తే చాలు నటించడమయిపోయిందనుకుంటారు చాల మంది నటీనటులు. నటన అంటే డైలాగులు చెప్పడమే కాదు. మిగతా పాత్రల్ని బట్టీ తమ హావ భావాలని సందర్భోచితంగా ప్రకటించడమే నటనంటే! ఈ సూత్రం చాలా మంది నటులకి తెల్సినా అమలు పరిచడం లోకొచ్చేసరికి చతికిలబడతారు. సినిమా మొత్తమూ ఒక్క డైలాగు లేకుండా కేవలం నటనతోనే మెప్పించగలిగిన పాత్ర గోవిందుది. బాలకృష్ణ ఆ పాత్రకి ప్రాణం పోసాడు. నటనకి ఒక చక్కని ఉదాహరణ్ణి చూపించాడు. ఇది నాకు బాగా నచ్చిన పాత్ర. ఇలాంటి పాత్రలు రచయితా, దర్శకుల ప్రతిభకి తార్కాణాలు.

ఈ సినిమాలో కనిపించే ప్రతీ చిన్న పాత్రకీ ఒక రకమైన మేనరిజం లాంటివి పెట్టారు. డిటెక్టివ్ రాజు “గోవిందూ రాసుకో” అంటూ అస్తమానూ అంటూంటాడు. అలాగే దేవయ్య కి “తైలం తైలం” అంటూ అందర్నీ విసిగిస్తాడు. మేరీని పెళ్ళి చేసుకోమని వేధించే ఆమె బంధువు డేవిడ్ “మేరీ ప్లీజ్” అంటూ మరో మెనరిజం ప్రవేశబెట్టారు. ఇలాంటి మేనరిజాల వల్ల పాత్రలు బాగా కనిపిస్తాయి. తెలీయంకుండా కథకి జీవకళొచ్చేస్తుంది.

చాలామంది సినిమావాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉంటారు. సినిమా విజయానికి సూత్రాలేమిటని? మంచి కథనెన్నుకోవడం మొదటిదయితే, పైన చెప్పిన సృజనాత్మకమైన ప్రక్రియల్తో పాత్రల్ని నిర్మించడం రెండో సూత్రం. కథలో సృష్టించబడిన అన్నింటినీ, అంటే పెద్దా, చిన్న సమస్యల్నీ సహజత్వానికి దగ్గరుండేలా చూపిస్తూ చివర్లో ముడివేయడం. ఇది మూడో సూత్రం. మంచి దర్శకత్వ్వ ప్రతిభ చూపిస్తూ, పాత్రల పరిధిలో కావల్సిన నటనన్ని నటుల నుండి రాబట్టుకోడం నాల్గో సూత్రం. ఇహ ఆఖరిదీ, సినిమా విజయంలో ముఖ్యమైనదీ! అది సంగీతం. కధా అన్నీ బాగుండీ, నటులు బాగా చేసినా సంగీతం చప్పగా ఉంటే సినిమా విజయం కాదు. సంగీతం బాగోలేకుండా ( పాటలు హిట్ కాకుండా ) విజయవంతమైన సినిమాలు వేళ్ళ మీద లెక్కట్టచ్చు. చాలా మంది దర్శకులు మిగతా విషయాలపై దృషిటి కేంద్రీకరిస్తారు కానీ, సంగీతమొచ్చేసరికి వారికొక అవగాహనుండదు. సంగీత దర్శకుడు ఏం చెబితే అదే వేదం అనుకుంటారు. కానీ దర్శకుడికీ కాస్త అవగాహనుంటే మంచి సంగీతమొచ్చే అవకాశం ఉంటుంది. మొదటి నాలుగు సూత్రాలూ పాటించిన ఆఖరి సూత్రమొచ్చే సరికి సర్దుకుంటారు. ఒక మంచి సినిమా పాటని గుర్తుచేయలేకపోవచ్చేమో గానీ, ఒక మంచి పాట సినిమానెప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. సినిమాని మర్చిపోవడం జరుగుతుందేమో కానీ, మంచి పాటనెవరూ అంత సులభంగా మర్చిపోరు. అదీ సంగీతానుకున్న ప్రాధాన్యత.

కథా, కథనమూ, మాటలూ, మంచి నటనా, దర్శకత్వమూ ఇవాన్నీ పుష్కలంగా ఉన్న మిస్సమ్మ సినిమాలో సంగీతం ఓ మెట్టు పైనే ఉంటుంది. స్వరాల రారాజు రాజేశ్వరరావు చేతిలో ప్రతీ పాటా ఒక ఒక్కో ఆణిముత్యం. ఇప్పటికీ ఈ పాటలు హాయిగా పాడుకోగలం. ఏభై ఏళ్ళ తరవాతకూడా ఈ సినిమాలో పాటలు ప్రజల నాల్కలమీద నాట్యం చేస్తున్నాయంటే అది రాజేశ్వర రావు ప్రతిభే తప్ప మరేమీ కాదు. పాటకి రాగమూ, దాని వరుసే ముఖ్యం కానీ ఎవరు పాడేరన్నది ముఖ్యం కాదని నమ్మే సంగీత విద్వాంసుడాయన. పాటని బ్రతికించేది దాని వరసే తప్ప మరోటి కాదు. మంచి ట్యూన్ ( వరస ) ఉంటే ఎవరు పాడినా రక్తి కడుతుంది. దీనికి సంబంధించి ఈ మిస్సమ్మ సినిమాపై ఒక కథ సినీరంగంలో చెబుతారు. మల్లీశ్వరి సినిమాలో రాజేశ్వర రావు కీ, ఘంటసాల వారికీ మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. విజయా వారి సినిమాలంటే ఘంటసాలా పాడాల్సిందే! అలాగే చక్రపాణికి రాజేశ్వర రావు పాటన్నా అమితమైన ఇష్టం. రాజేశ్వర రావు మొదట్లో అన్ని పాటలకీ ట్యూన్స్ కట్టారు. అన్నీ చక్రపాణి గారికి నచ్చాయి. ఇహ ఏముందీ, ఘంటసాల గారి చేతా పాడిద్దాం అన్నారు. రాజేశ్వర రావు ససేమిరా కూడదన్నారు. దాంతో ఇద్దరికీ మధ్య తేడాలొచ్చాయి. పైన చెప్పినట్లుగా పాటకి రాగం, వరుసా ముఖ్యం కానీ, గాయకుడు ముఖ్యం కాదు. ఘంటసాల పాడకపోయినా పాట బాగుంటే జనం వింటారు. ఈ విషయంలో వీళిద్దరూ ఎంతో ఘర్షణ పడినా చివరకి రాజేశ్వర రావు గారే నెగ్గారు. అన్ని పాటలూ ఏ. ఎం. రాజా తో పాడించారు. ఈ సినిమాలో ఘంటసాల ఒక్క పాటా పాడలేదు. ఇదీ ఈ సినిమా సంగీతం వెనుకున్న కథ. ఇప్పటికీ మిస్సమ్మ సినిమా పాటలు మధురంగానే ఉంటాయి. ప్రతీ పాటనీ శాస్త్రీయ సంగీతం ఆధారంగానే ట్యూన్ చేసారు. రావోయి చందమామా ( ఆభేరి ), బాలనురా మదనా ( ఖరహరప్రియ ), తెలుసుకొనవె యువతీ ( మోహన ), ఏమిటో ఈ మాయా ( సింధుభైరవి ), శ్రీ జానకీదేవి ( ఆనంద భైరవి ), రాగ సుధారస ( ఆందోళిక ) ఇలా ప్రతీ పాటకీ మంచి మంచి రాగాల్నెన్నుకున్నారు. తరాలు మారినా “బృందావన మన మందరిదీ” ఇప్పటికీ మనం వింటూంటాం. ఈ చిత్ర సంగీతంలో మరో విశేషముంది. దేవయ్య పాత్రకి రెండు పాటలున్నాయి. ఆ రెండూ కూడా ఆ వేషం వేసిన రేలంగే పాడారు. ఇలా సహాయ పాత్రలకి పాట పెట్టడానికి చాలా ధైర్యం కావాలి. ఒకటి కాదు, రెండు పాటలు. మళ్ళీ ఆ పాటలు ఆ పాత్ర వేసిన వారి చేతే పాడించడానికి మరింత తెగువ కావాలి. సంగీత పరంగా ఈ సినిమాలో పాటలు ఆపాత మధురాలు.

సినిమా విజయానికి కావల్సిన పంచ ప్రాణాల్లో అఖరిదీ, అతి ముఖ్యమైనదీ అయిన సంగీతమూ బావుంటే ఇహ చెప్పేదేముంది. విజయా వారి విజయానికి ఢోకా ఏమీ లేదు.

పొరపాట్లు:

ఎంతో శ్రద్ధతో ఎన్నో రోజులు కష్టపడి రాసిన ఈ స్క్రిప్ట్ లో కొన్ని చోట్ల తప్పులు దొర్లాయి. అంతగా పట్టించుకోవల్సినంతగా లేని తప్పులవి. చూసీ చూడనట్లు వదిలేసినా మిగతా సినిమా కథకెక్కడా భంగం రాదు. అవి ఏమిటో చూద్దాం. మొదటిది. ఈ సినిమాలో జమీందారు స్కూల్లో పంతులమ్మా, పంతులయ్యా ఉద్యోగాలకి అప్లై చేయడానికి రెండు షరతులు పెడతారు. పంతులమ్మా, పంతులయ్య భార్యా భర్తలు కావాలనొకటీ, అందులో పంతులమ్మకి సంగీతం వచ్చి తీరాలని రెండోదీ ఉంటాయి. మిస్సమ్మ కథా నాయిక పాత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్పుతున్నట్లుగా ఆమె పాత్ర ప్రవేశ పెట్టబడుతుంది. కానీ మిస్ మేరీ పక్కా కిరస్తానీ కుటుంబమని చూపిస్తారు. అలాగే వేరే మతాల మీద మేరీ పాత్రకు అంత సదభి ప్రాయం లేనట్టు చూపిస్తారు. అలా వేరే మతాల మీద సదభిప్రాయం లేని పాత్ర మరో మతంలో ఉన్న కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఎలా నేర్చుకుంటుంది? నేర్చుకున్నదే అనుకుందాం, మరీ త్యాగరాజ కీర్తన పాడడంతో ఆ పాత్రని దెబ్బ తీసాయి. కానీ మేరీ కి ఈ సంగీతం రావడమన్నది ప్రధాన కథకవసరం. అది లేకపోతే మిస్సమ కథ ఒక్కడగు కూడా ముందుకు పడదు. ఈ చిన్న విషయంలో కథకుడిగా చక్రపాణి కొన్ని మినహాయిపులు తీసుకొని ముందుకెళ్ళారు. ఇది మాత్రం నాకు మింగుడు పడని విషయం. కాకపోతే ఇదేమీ ఘోరమైన తప్పు కాదు.

కథ నడిపించడానికి వేరే మార్గం లేదు మరి. అందుకే ఇక్కడ సరిపెట్టుకున్నారనిపించింది.

ఇహ రెండోది: డిటెక్టివ్ రాజుకి మిస్ మేరీయే తప్పిపోయిన మహలక్ష్మని నమ్మడానికి సరైన కారణాలు చూపించలేదు. అంతకు ముందు పత్రికా ప్రకటనిచ్చి ఎంతో మంది అమ్మాయిల్ని కాలి పాదమ్మీద మచ్చ విషయమై సంప్రదించడం చూబెడతారు. ఏదో దేవయ్యతో మాట కలిపినట్టుగా చెప్పించేసి డిటెక్టివ్ రాజుకి మేరీ మీద అనుమానం వచ్చేట్లా కథ నడిపించేస్తారు. ఇది మాత్రా సరిగ్గా కుదర్లేదు. ఈ విషయంపై కొన్ని సన్నివేశాలూ వుంటాయి. ఇదీ అంత ముఖ్యమైనది కాకపోయినా అంత పకడ్బందీగా కథ చెబుతున్నప్పుడు ఇలాంటివి కూడా బాగా ఎష్టాబ్లిష్ చేసుంటే బావుండేది.

అలాగే మేరీ అడ్రసు కాగితం ఒక భరిణలో దాచుంచామనీ, దాన్ని డేవిడ్ దొంగతనం చేసి తీసుకుపోయాడని మేరీ ఫాదర్ చేత చివర్లో చెప్పిస్తారు. మేరే అడ్రసు కాగితం డేవిడ్ దొంగిలిస్తే, చివర్లో మేరీ ఫాదర్ అప్పాపురం ఎలా రాగలిగేడు? రావాలంటే అడ్రసు తెలియాలి కదా? ఇవన్నీ చిన్నవి. మూల కథని కూలదోయవు. కాబట్టి మామూలు ప్రేక్షకుడు అంతగా పట్టించుకోనవసరం లేదు.

మొదట్లో ప్రస్తావించిన అన్ని అల్లికలూ ( థ్రెడ్లూ ) చివర్లో చక్కగా ముగిస్తారు. చివరకి డేవిడ్ వల్ల మేరీ మిస్ మేరీ అనీ, కిరస్తానీ అమ్మాయనీ తెలుస్తుంది. ఎమ్టీ రావూ, మేరీ భార్యా భర్తలూ కారనీ తెలుస్తుంది. అదొక నాటకమనీ బయల్పడుతుంది. మేరీ ఫాదర్ రాకతో అసలు ముడి విప్పబడుతుంది. మేరీ వాళ్ళకి తిరునాళ్ళలో దొరికిన అమ్మాయేనని తెలుస్తుంది. డిటెక్టివ్ రాజు ఆఖరికి మేరీ యే తప్పిపోయిన మహాలక్ష్మని రుజువు చేస్తాడు. ఆ రకంగా కథ సుఖాంతమవుతుంది. ఈ సినిమా ముగింపు కూడా గమ్మత్తుగా వుంటుంది. చివరకి దొరికిన మహలక్ష్మిని చూపిస్తూ – “ఇంతకీ ఎవరమ్మాయి?” అంటూ ఒక పాత్ర మరో పాత్రనడుగుతుంది. “అదే” అంటూ అందరూ చివరకి దేవయ్య దగ్గరకొస్తుంది. “తైలం వారమ్మాయంటూ” దేవయ్య ముగిస్తాడు. తైలం అంటే డబ్బు. నిజంగా తప్పిపోయిన మహలక్ష్మి తైలంవారి అమ్మాయే! సినిమా చివర్లో అన్ని మతాలూ ఒకటే అన్న నీతిని చెప్పిస్తారు కూడా.

ఈ సినిమాకి చక్రపాణీ, పింగళీ రెండు చక్రాలయితే అశ్వాల్లాంటి నటీనటుల్ని చాకచక్యంగా పరిగెత్తించి విజయ గమ్యం చేర్చిన రథ సారధి ఎల్ వి ప్రసాద్. ఆయన దర్శకత్వ ప్రతిభ మెచ్చుకోతగ్గది. నా దృష్టిలో ఒక విజయవంతమైన సినిమాకి కావల్సిన సూత్రాలన్నీ మిస్సమ్మ సినిమాకున్నాయి. అందుకే ఏభైఏళ్ళ తరువాత కూడా అది అందర్నీ అలరిస్తోంది. ఇది మాత్రం ఎవ్వరూ కాదనలేరు. దేవయ్య భాషలో విజయానికి తైలం కావాలి. ఇదే డిటెక్టివ్ రాజైతే తన భాషలో ఇలా ముగిస్తాడు – “గోవిందూ, నోట్ చేసుకో!”

–సాయి బ్రహ్మానందం గోర్తి

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

9 Comments to “మిస్ కాకూడని మిస్సమ్మ(ఒక సమగ్ర విశ్లేషణ) – 2”

  • పాటల బాణీలు బావుంటే ఎవరు పాడినా రక్తి కడుతుందని నమ్మాలనుకున్నా ‘రాజ్ సీతారామన్’ అనే ఆయన గుర్తుకువచ్చి కష్టపడుతున్నాను :)

    బ్రహ్మానందం గారు, చాల బాగా వ్రాసారు. మీ సమగ్ర సమీక్ష బావుంది, మిర కొన్ని ఆణిముత్యాల నేరుకొని మాముందుంచండి.
    పింగళి గారంటే నాకు ఏంతో అభిమానం. ఈ చిత్రానికి ఆయన పండించిన గీతసాహిత్యమే సాహిత్యం.

  • Beautiful! మిస్సమ్మ సినిమాలాగనే ఈ వ్యాసం కూడా మరికొంచెం ఉంటే బాగుండననిపించింది.
    Thank you.

  • సాయి గారు మీరన్నది నిజమే కదా అని నేను భావించాను మొదట.కానీ మిస్సమ్మ సినిమా రావటానికి చాలా కాలం ముందు నుంచే క్రైస్తవులు తమ మతానికి సంబంధం లేని శాస్త్రీయసంగీతం నేర్చుకోవటం కొండొకచో దానిని తమజీవనాధారంగా చేసుకున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి.ఒకటి 19శతాబ్దములో పుట్టి,ఒరియా మాతృభాష అయిన ప్రముఖ క్రైస్తవగీతరచయిత పురుషోత్తం చౌదరి,రెండవవారు మనకందరికీ ప్రీతిపాత్రులయినగాయకులు కె.జె.జేసుదాస్. పురుషోత్తం చౌదరి గీతాలను అన్నిటిని శుద్ధశాస్త్రీయసంగీతానికి అనుగుణంగా రాసారు.
    ఉన్నాపాటున వచ్చు
    చున్నాను నీపాద
    సన్నిధీకో రక్షకా… ఇలా సాగుతాయి ఆయన గీతాలు. పురుషోత్తం చౌదరి గారి గీతాలను ఇక్కడవినవచ్చు. http://www.uecf.net/songs/purushotham.htm
    మిస్సమ్మ1955లో వచ్చింది.1940,జనవరి10 న పుట్టిన జేసుదాస్ బాల్యం నుంచే సంగీతాభ్యాసం చేసిన సంగతి మనకు తెలిసిందే.కాకపోతే వారి నాన్నగారి పేరు అగస్టీన్ జోసెఫ్ భాగవతార్ అని కానీ ఆయన మళయాళశాస్త్రీయసంగీతకళాకారుడనీ,ప్రముఖరంగస్థలనటుడనీ చాలామందికి తెలియదు.ఇప్పటి సంగతి తెలియదు గానీ నా కాలేజీ రోజుల్లో అమృతవాణి అన్న ఒకక్రైస్తవమతప్రచార సంస్థవారు(తనికెళ్ళభరణి ఇందులోనే చాలా కాలం ఉద్యోగం చేసారు)భరతనాట్యం,కూచిపూడి తదితరకళారూపాల ద్వారా క్రీస్తు జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు.
    క్రైస్తవులు కూడా హైందవ సంగీతాన్ని నేర్చుకున్నారు అని చెప్పేందుకు ఈ ఉదాహరణలను ఇచ్చాను :)

  • బ్రహ్మానందం గారూ, మీ ‘మిస్సమ్మ’ సమగ్ర విశ్లేషణ నిజంగానే చాలా సమగ్రంగా ఉంది. చెప్పాలంటే ఇది ఒక కేస్ స్టడీ లాగా ఉంది. మంచి సినిమాను ఎన్నుకుని చక్కటి విశ్లేషణ చేశారు. మీ విశ్లేషణ కోణంలో మళ్ళీ సినిమాను చూడాల్సిన అవసరం ఉంది.

  • రాజేంద్ర@

    క్రిష్టియన్స్ నేర్చుకోకూడదనీ, నోర్చుకోరనీ నా పాయింటు కాదు. కర్ణాటక సంగీతం అనేకమంది క్రిష్టియన్లు నేర్చుకున్నారు. కాదనరెవరూ! కానీ కథలో వేరే మతాల మీద తనకస్సలు నమ్మకంలేదంటూ ఒక పాత్రని పరిచయం చేసీ, అదే పాత్ర చేత వేరే మతానికి సంబంధించిన విషయాన్ని స్వీకరిస్తారని నేననుకోను. సంగీతానికి మతాలతో పని లేదు. కాదనను. కానీ పాడే పాటకుంటుంది. ఆ పాట ఎవరిపైనన్నదానితో మరీ వుంటుంది. ఇది నా అభిప్రాయం. అలా కాదూ అన్ని మతాలు మాకొకటే అనే ( రాజకీయ నాయకులు తప్ప ) మనుషులెవరైనా ఎదురుపడితే నిజంగా చేతులెత్తి నమస్కరిస్తాను.

    శేషు@ మీకు వ్యాసం నచ్చినందుకు సంతోషించాను. ఇంకా విషయాలున్నాయి కానీ కుదించి రాయాల్సొచ్చింది. మిస్సమ్మ సినిమా నా కోర్సులో నేనెంచుకున్న కేస్ స్టడీ!

    సాయి బ్రహ్మానందం గొర్తి

  • mee visleshana bagumdi. S.V.R. act chesina seens gurimchi komchem vraste bagumdedi

  • E movie…

    LV prasad gari..sensitive humour sense ki ..best example anadam lo doubt ledu andi…artists selection lone ayina talent telisina…performence ni ye meraku kavalooooooo..antha varaku rabattukuni…o Manchi “ VINDU BHOJANAANI` serve chesi…ayina ghanathanu chaatukunnaru.

    missama ga MAHA NATI..SAVITRI kaakapothey..cinema `classics `list lo miss ayyedi.andanaki..doubt ledu:)

  • Savitri..ANR ku ..music teach chese scene okkati chalu andi…sensitive humour yela pandinchaloooooooo telusukovadaniki

  • review ante ila vundaali…………………………………..

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories