Menu

Mandi

ఒక చిన్న కధ నుంచీ మొదలు పెట్టి ఈ సినిమా తీసారు.  ఇండియా లో మంచి మంచి నటులందరూ శ్యాం బెనగల్ దర్శకత్వంలో జీవాన్ని పోస్తూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించి, మండీ (అంగడి) సినిమాని ఒక లలితమయిన కళారూపంగా మన ముందు ఉంచుతారు.  థియేటర్ ఆర్టిస్టులు స్టేజ్ ను ఏలి నట్టు, ఈ నటీ నటులంతా స్క్రీన్ ను ఏలేస్తారు. ఎపుడో చిన్నపుడు చూసిన సినిమా యూ ట్యూబ్ లో ఉచితంగా దొరికితే హాయిగా చూశాను ఈ మధ్యే !

1983 లో శ్యాం బెనగల్ తీసారీ సినిమా.  ఒకానొక ఊర్లో (మహరాష్ట్ర లో ! పాత్రలన్నీ హైదరాబాదీ ని పోలిన హిందీ లో మాటాడతాయి)  ఒకానొక వేశ్యా వాటిక. దీనికి మహా రాణి రుక్మిణీ బాయి. ఈవిడ ఈ రొంపిని నడుపుతూ, రెండు చేతులా కాకపోయినా బానే సంపాయిస్తూ ఉంటుంది.

ఈ రుక్మిణీ బాయి (షబానా) కుడి భుజం ఠుమ్రూస్ అనే పనివాడు (నసీరుద్దీన్ షా). ఈ ఠుమ్రూస్, ఆ మండీ లో అమ్మాయిలకు చాయ్ పానీ చూడటం, చిన్న చిన్న పనులు చేసి పెట్టడం లాంటివి చూసుకుంటాడు… తను ఎవరో, ఎక్కడి వాడో తెలియదు.  బుద్ధి పుట్టెరిగిన నుండీ ఈ మండీనే అతని లోకం !

ఇతర పాత్రల లో వేశ్యలు గా ఇలా అరుణ్, నీనా గుప్తా, సోనీ రాజ్దాన్ – అవలోకగా సహజంగా నటించేసి, సినిమా కి సహజత్వాన్ని అద్దేస్తారు.  ఈ కధ లో నే ఇక్నొన్ని కధలు – ఊరి మధ్యలో మండీ (ఈ వేశ్యల కోఠీ) ఉండటం, చాలా మంది పెద్దాళ్ళకి నచ్చట్లేదు. ఆ కోఠీ ఉన్న జాగా పెద్దది – దీన్ని ఆక్రమించేసుకుంటే బొల్డంత సంపద ! ఉన్నట్టుండి రాజకీయాలు మొదలవుతాయి.  నవాబుల పోషణలో రుక్మిణీ బాయి పూర్వీకులకు అందిన ఆస్థి ఈ మండీ. దీన్ని ఎలా ఖాళీ చేయించడం ?

ఉన్నట్టుండి – ఈ కోటీ యజమాని నిండీ ఒక పెద్దాయన గుప్తాజీ (కుల్భూషణ్ కర్భంగా) కొనుక్కుంటాడు. ఈయనకి ఈ ప్రాతంలో విశేషమయిన పేరు ప్రఖ్యాతులున్నాయి. ఈ గుప్తాజీ ఎలానో రుక్మిణీ బాయి ని ఒప్పించి, ఈ మండీ ఉన్న జాగాని ఖాళీ చేయించి ఊరవతల ఏదో అనామక ఖాళీ స్థలం ఇప్పిస్తాడు. ఇది జరగడానికి ఊర్లో ఈ మండీ పట్ల వ్యతిరేకత, నారీ నికేతన్ అనే సంఘపు ‘నైతిక విలువల ఉద్యమం’ – ఇవన్నీ సహకరిస్తాయి.

రుక్మిణీ బాయి మండీ లో ఆడపిల్లలు కళాకారులు కూడానూ.  ఒకామె నృత్యంలో దిట్ట అయితే ఒకామె సంగీతంలో ! రుక్మిణీ బాయి మండీ లో సంగీతానికంటూ ప్రత్యేక ఆకర్షణ జీనత్ (స్మితా పాటిల్) ! ఈ జీనత్ ను రుక్మిణీ బాయి కన్న తల్లి లా సాకుతుంది. ఇంకెవర్నన్నా ధందా (వేశ్యా వృత్తి) లో దించుతుంది గానీ జీనత్ అందచందాలకు మురిసి ఎవరెన్ని చెప్పినా ఈ పిల్లను మాత్రం పూవులా చూసుకుంటూ ఉంటుంది.

నారీ నికేతన్ పోరాటం మొదలయే ముందు – రుక్మిణీ బాయి కోఠీ కి ఒక బ్రోకరు ప్రేమించానంటూ మోసం చేసుకొచ్చిన ఒక మూగ పిల్లను అమ్మేస్తాడు. ఈ పిల్ల అందమయినది – తను మోసపోయిందని అర్ధమే చేసుకోలేనంత అమాయకత్వం గలది. ఈ పిల్లని నయానా, భయానా – ఈ రొంపిలోకి దించుతారు. ఆఖరికి ఆమె మేడ మీదినించీ దూకి, పారిపోవాలనుకుంటుంది. మొత్తానికి నానా రభసా అయి, ఆ పిల్లను ఠుమ్రూస్ కిందకు దించుతాడు.  ఈ సంఘటన తో నారీ నికేతన్  రుక్మిణీ బాయి మీద మరింత వ్యతిరేకత ను జనంలో పెరిగే లాచేస్తుంది.
ఈ పరిస్థితుల్లో గుప్తాజీ సూచించిన ప్రదేశానికి మారిపోవడం తప్ప రుక్మిణీ బాయి కి వేరే గతి లేదు. ఈ సందట్లోనే గుప్తాజీ తన కూతురి పెళ్ళి కి మేళం రమ్మని రుక్మిణీ బాయి బృందాన్ని పిలుస్తాడు. పెళ్ళి కొడుకు గుప్తాజీ స్నేహితుని కొడుకు ! ఈ పెళ్ళి కొడుక్కి, మేళంలో పాడిన జీనత్ నచ్చుతుంది. ఇంక ఈ జీనత్ నే పెళ్ళాడతాననీ, తనకి తండ్రి కుదిర్చిన సంబంధం (ఆ పెళ్ళి కూతురు ఎదిగీ ఎదగని మనసు కలది) వద్దనీ పట్టు బడతాడు !  ప్రేమిస్తున్నానని జీనత్ వెంట పడతాడు ! అయితే అతనికి తండ్రి అంటే భయం. తనతో పారిపోయి వచ్చేయమని జీనత్ ను బ్రతిమలాడతాడు !   జీనత్ మంచి మనిషి ! ముగ్ధ ! ఈ అబ్బాయి ని చూడగానే ఆమె మనసులో ఏదో తెలియని అభిమానం కలిగి ఆమె కూడా ఈ అబ్బాయిని ప్రేమిస్తుంది.  అయితే ఈ ప్రేమ విషయం తెలిసిన రుక్మిణీ బాయి జీనత్ గురించిన నిజం చెప్పేస్తుంది !

జీనత్, గుప్తాజీ స్నేహితునికి మండీ లో ఒక స్త్రీ ద్వారా కలిగిన అక్రమ సంతానం ! అంటే తాను ప్రేమిస్తున్న అబ్బాయి ఆమె కు సోదరుడు అవుతాడు !   ఇలా సినిమా అంతా పొరలు పొరలు గా కధలు – సాధారణ ప్రజల నుంచీ, సంఘంలో పేరున్న వ్యక్తుల నీలి గతాలూ, నీడలను మన ముందు బయటపెడుతూ – అత్యంత రమణీయంగా చిత్రించారు శ్యాం బెనగల్.

చివరాఖరికి ఏమయిందీ అని చెప్పేస్తే – ఎవరయినా చూడాలనుకున్నోళ్ళు ఈ సినిమా చూడరేమో ! చూడకపోతే మంచి సినిమా మిస్ అయిపోతారేమో అన్న ఆత్రుత తో కధ చెప్పేయట్లేదు.  ఈ కధ లో స్థూలమయిన ప్లాటు ఇదే ! అయితే ఈ మండీ నడిపే రుక్మిణీ బాయి సెంటిమెంటూ, ఆమె లో కఠినత్వం వెనుక స్త్రీత్వపు మమకారం ఇవన్నీ ఏవీ అతిగా లేకుండా సరయిన తూకంలో పడి కధ ముదిరి పాకాన పడే వేళకి ముగింపుకల్లా బోల్డన్ని కన్నీళ్ళు తెప్పిస్తాయి.

మండీ చుట్టూ తిరిగే పాత్రలు, పోలీసు, ఫోటోగ్రాఫరూ, డాక్టరూ – కోతులాడించే వాడూ – అబ్బ ! ఎక్కడా విసుగు పుట్టించకుండా మన చేత సినిమాని చూసేలా చెయ్యాలంటే ఆ గొప్ప గొప్ప దర్శకునికీ, అతని టీం కే సాధ్యం !    ‘మండీ’ సమాజం లో మన పాత్ర, పాత్రత ల మీద అనుమానం కలిగింపచేసే అంశాలని  గుత్తంగా చేసి, మన హిపోక్రసీ ని మనకే చూపించే చిన్న అద్దం.  వేశ్యల జీవితాల లోతులే కాదు మానవ జీవితాల్లో వివిధ కోణాలూ, చీకట్లూ, వెలుగులూ చూపించే మంచి సినిమా ఈ ‘మండీ’ !    యూ ట్యూబ్ లో చూడొచ్చు !

–సుజాత పాత్రో

3 Comments
  1. saif ali gorey December 26, 2008 /