Menu

మహామంత్రి తిమ్మరుసు : చిత్రసీమయందు నీవె లెస్స

“వీర రక్తమును ఉడుకెత్తించే
విద్యానగర ప్రదాతకూ జై

ధరణిని కావగ దనుజులనణచిన
వరాహమూర్తికీ జై …”

పప పపాం పప పపాం …. అంటూ బాకావాయిద్య నేపధ్య సంగీతంలో బుఱ్ఱకధతో మొదలవుతుంది “పౌరాణిక బ్రహ్మ” కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలోని “మహామంత్రి తిమ్మరుసు”.

కధ పూర్వాక్రమం తెలియని వారికి సినిమా పరిధికి లోబడి అవసరమైన మేర, తెలిసినవారి మెదడు పొరల్లో మగ్గుత్తున్న చరిత్ర పుటల చెదలు దులిపేంత మేర, విజయనగర రాజ్య తత్ కాలమాన పరిస్థితులని బుఱ్ఱకధారూపంలో చెప్పడం, ఒక అద్భుతమైన ప్రక్రియ. అలాగే మధ్యలో కనిపించే ఎఱుక కూడ. రాయలు వారు తెలుగు కి పెద్దపీట వేస్తే, దర్శక-కథారచయితలు తెలుగుతోపాటూ తెలుగుసంస్కృతికి కూడా ఆపీట వేసారు అనిపిస్తుంది.

కథ క్లుప్తంగా చెప్పాలంటే: రాయల వారిచే ఆప్యాయంగా అప్పాజీ అని పిలువబడే అమాత్యవర్యుడు తిమ్మరుసు, రాయల కొమరుడ్ని హత్యచేసాడని నిందకు గురౌతాడు. పర్యవసానంగా అప్పాజి కనుగ్రుడ్లు పెఱికివేయించమని ప్రభువు ఆజ్ఞ. పిమ్మట పశ్చాత్తాప్త హృదయుడైన రాయలు, పితృసమానుడిగా భావించే అప్పాజీ అచంచలమైన ప్రేమలో తిరిగి బందీ అవడంతో కధ ముగుస్తుంది.

“దేశ భాషలందు తెలుగు లెస్స” అని పలికిన తెలుగు వల్లభుడు కృష్ణదేవరాయలి చరిత్రను ఎరుగని తెలుగు వారు, ఈ కాలం సంగతేమోగానీ, ఆకాలంలో ఉండేవారుకారేమో. తెలిసన ఈ కధను మూడుగంటల పాటు ఆశక్తికరంగా చెప్పడం ఒక ఎత్తు అయితే, కధ పరంగా తిమ్మరుసు(గుమ్మడి)కి, కధనం పరంగా రాయలు (ఎన్టీఆర్)కి సమ ప్రాథాన్యం ఇస్తూ సాగే జోడు గుఱ్ఱాల సవారీ మరొక ఎత్తు. ఇందులో దర్శకులు, సాంకేతిక వర్గం విజయంసాధించేరు అనడానికి, సినిమా విడుదలై సుమారు అర్ధశతాబ్ధికి పైగా కావస్తున్నా, ఈ దృశ్యకావ్యం గురించి ఈనాడు మనం పునఃశ్చరణ చేసుకుంటున్నామన్న విషయానికి మించి తార్కాణం ఏమికావాలి?

ఈ చిత్రంలో ముఖ్యంగా గుమ్మడి నటన గురించి చెప్పుకోవాలి. ప్రథమార్ధంలో రాయల్ని ఆజ్ఞాపించగలనన్న ధీమా, ద్వితీయార్ధంలో, వార్ధ్యక్యపు వాకిట తడబడుతూ బరువు బాధ్యలతోపాటూ, గారాబంగా పెంచిన రాయలకూ దూరమౌతున్నానా అని తనని తానే సంశయించుకునే తీరులో కనబరచిన వైవిధ్యం, మాటలకందనిది. రాయల మీద ప్రేమని, ప్రేమలోంచి ఉద్భవించే అభద్రతని, అభద్రతని అధిగమించే క్రమంలో రాజశ్రేయస్సుకోసం రాజునే అతిక్రమించడం, అతిక్రమణలో కూడ రాజు పట్ల విధేయత ప్రదర్సించడం, ఇన్ని సంక్లిష్ఠభావాల్ని పలికించడం ఆయనవల్లే సాధ్యమేమో! ఈ విధంగా పాత్రాని తలచిన రచయితకి, మలచిన దర్శకునికి, ఒలచిన (make-up) కళా-సాంకేతికవర్గానికి నా జోహార్లు.

నిజ జీవితంలో రాయలు కురూపి కావచ్చేమోకానీ, రాజకంఠీరవా అంటే ఎన్టీఆరే అనేంత రాజసం ఉట్టిపడే విగ్రహం అయనది. నటమయూరి ఎల్. విజయలక్ష్మి(చిన్నాజీ పాత్రధారిణి) తో వారి యుగళగీతం, “ప్రియవాణీ చరణ కమల సన్నిధి మన సాధనా…”, జుగల్ బందీ తరహాలో పోట పోటీ గా ఉంటుంది. పాట చివరలో వచ్చే “నాగస్వర విన్యాసం”లో ప్రేక్షకుల హృదయాలు, విజయలక్ష్మి వయ్యారంతోపాటూ ఊయలలూగాల్సిందే. నాదృష్ఠిలో ఇది “మంచిమనసుకు మంచి రోజిలు” లోని “రావే నా చెలియా” తో సరితూగవలసినది. “పెండ్యాల” స్వర సారధ్యంలో “ఘంటసాల” గానమాధుర్యానికి ఇది తొలి పలుకు మాత్రమే ఈ సినిమాలో!

“మోహనరాగమహా-మూర్తిమంతమాయే …” అన్న పదవిరుపులతో, పెండ్యాల స్వరమెరుపులతో
“చిత్రసీమలో వెలయగజేసి” అంటూ ఎన్టీఆర్/దేవిక మన మనోచిత్రసీమలలో నిలయగ,
దివ్యగానమున జీవముబోసి ….” అంటూ ఘంటసాల/సుశీల గంధర్వగానంతో మనల్ని
స్వర్గసీమలలోపునరుజ్జీవులని చేస్తారు!

ఎస్.వరలక్ష్మి(తిరుమల దేవి పాత్రధారిణి) స్వయంగా పాడిన
“లీలా కృష్ణ, నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా” పాటలో,
లలితమైన పదాలతో పాటల “మయాబజార్” సృష్టించడం పింగళికే సాధ్యమౌనా అని అనిపించకమానదు. మరి మాటల విషయనికి వస్తే:

“నీకు ఏలుకోవడనికి ఒక చిన్నసామ్రాజ్యమే కావాలా” అని రసజ్నుడైన సార్వభౌముడు తన ప్రేయసి అయిన చిన్నాజీతో అనడంలో, రాయలి ఔదార్యాం గోచరిస్తుంది. అంతేకాదు, రాజ్యవిస్తరణాకాంక్షని నెరవేర్చగల శక్తులతోపాటూ, రససామ్రాజ్యాల్ని జయించగల యుక్తులూ రాయలు సొంతం అని అనిపించకమానదు.

అంతలోనే, అప్పాజీ అభీష్ఠం మేరకు తిరుమలదేవిని కేవలం రాజ్యక్షేమంకోసం వివాహమాడవలిసి వస్తూ, “ఒకసారి రాచరికిపు తంత్రంలో చిక్కుకున్నాతరువాత, స్వాతంత్ర్యసౌరభాలు సేవించాలంటే కత్తిమీద సామే” అంటాడు. ఇది రాచరికంలోని అనిశ్చితిని, ప్రజాసంక్షేమం కొరే ప్రభువులు గురయ్యే నిరంతర మానసిక సంఘర్షణనీ తెలియజేస్తూ, జరుగబోయే కీడుకు సాక్షులుకండని ప్రేక్షకులని హెచ్చరిస్తుంది.

ఇది మాటలు/పాటలు సమకూర్చడంలో పింగళి, కధనం/దర్శకత్వంలో కమలాకరుని ప్రతిభాపాటవాలకి ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే, పాత్రల ఆహార్యం విషయంలోనూ తీసుకున్న శ్రద్ధ, చూపించిన వైవిధ్యం అభినందనీయమైననవి.

కానీ, కథ ప్రారంభంలో, రాయలు( అదే ఎన్టీఆర్), “వృషభవీర” అనబడే ఒక వస్తాదుతో తలపడబోతూ, నీ ఉచ్చారణ బావులేదని వేళాకోళం చేస్తాడు. కాని అదే ఎన్టీఆర్ (అదె రాయలు) ఒక సంధర్భంలో “మేము గ్నానులము” అంటాడు. మనందరికి తెలిసిన విషయమేగా, ఎన్టీఆర్ కి “జ్ఞ” పలకదని.

అలాగే, మగవేషంలో ఉన్న అన్నపూర్ణాదేవి (అదె దేవిక) అన్న(ప్రభాకర్ రెడ్డి)ని ఎదిరించే పక్షంలొ, ఎన్టీఆర్, దేవికని, పసివాడా అని, బాలవీరా అని సంభోదించడమ్ జరుగుతుంది. ఇది కొంచం నవ్వు తెప్పిస్తెందుకంటే, నిండు కుండలా గుంభనంగా మగ వేషంలో ఉన్న దేవికని “పసివాడా” అన్నందుకు. అయితే, ఆ ముఖంలోని సాత్వికత, ప్రసన్న వదనం, ఆ ఆలోచనని పటాపంచలు చేస్తాయనుకోండీ. లేదా రాయల పరాక్రమం ముందు, అందరూ పసివారే అనైనా అనుకోవాలి!

ఇక కథలోకి వస్తే…

అప్పాజీ విజయనగరసామ్రాజ్యాన్ని విస్తరింపజేయడనికి తన యుక్తులన్ని ప్రయోగిస్తూ, శక్తులన్నీ ధారపోస్తుంటాడు. అందులో భాగంగానే, ఆగర్భ శతృవులైన గజపతులతో వియ్యానికి రాయలని ఒప్పించి, అన్నపూర్ణదేవి(దేవిక)ని రాయలకి కట్టబెట్టిస్తాడు. ఇది రాయలని దాసీపుతృడని కించపరిచే గజపతులకి చెంపపెట్టులాంటిది. అందుచేత అన్నపూర్ణదేవిని, ప్రేమించిన పతిని తొలిరాత్రే కడతెర్చమని తండ్రి(ముక్కామల) అర్ధిస్తాడు, తుదకు శాశిస్తాడు. అటు తండ్రి మాటకు, పరువు-ప్రతిష్ఠలకు, ఆత్మాభిమానానికి అడ్డుచెప్పలేనిదై, ఇటు ప్రేమించిన పతిని కడతేర్చజాలనిదైన స్త్రీ పడే మనోవ్యధను వ్యక్తపర్చడంలొ దేవిక సఫలీకృతురాలయ్యింది.

అప్పాజీ అన్నపూర్ణాదేవిని రక్షించడం, ఆమె (వరుసకు) పినతండ్రి అయిన హయగ్రీవుడు(లింగమూర్తి) ప్రతీకారేచ్చకోసం రాయల ఇంటచేరి, అపనమ్మకపు బీజాలు నాటడం, అవి మహావృక్షాలయై ఆ కూకటివ్రేళ్ళు అప్పాజి మెడకు చుట్టుకోవడం – ఇవన్ని చాలా ఆర్ధ్రంగా, భారంగా, కదులుతూంటే, సగటు ప్రేక్షడు సప్తశోకసముద్రాలలో ములిగి, తిరిగి ములిగినంత అనుభూతికిలోనవుతాడు. ఇప్పటి పరిభాషలో చెప్పలి అంటె – గుండెలు పిండేసేంత. ఆదిశేషువువలే కాపాడిన అప్పాజి, కాలసర్పమువలె కాటు వేసెనా అని రాయలు పడేవేదనని ఎన్టీఆర్ అద్భుతంగా పోషించారు. ఈ నేపధ్యంలో వచ్చే

” చరిత్ర ఎరుగని మహాపాతకం
మా దేశానికి పట్టినదా…”

అనే విషాదగీతం సంధర్భోచితంగా తోస్తుంది. యాధృచికం కాని విషయం ఎమిటంటే, ఈ సినీమా చరిత్ర గురించి చరిత్ర సృష్ఠించినా, చరిత్రలో చిరిగి చెరిగి, తెరమరుగవ్వాల్సిన ఈ ఒక్క వాక్యం మాత్రం నేటికీ సజీవమే!

“విజయనగర పౌరులెల్ల వీర రాయలే” అన్న ప్రజల మధ్య,
“ప్రజలే నాకళ్ళూ” అంటూ, అంధుడైన అప్పాజి రాయలని కౌగలించుకోవడంతో ఈ సినిమా ముగుస్తుంది!

ప్రజాసంక్షేమంకోరే ప్రభువుల,
ప్రభువుల కటాక్షం కాంక్షించే ప్రజల,
“మా సినిమాలో సగటు ప్రేక్షకుడు ఏవి కోరుకుంటాడొ అవన్నీవున్నయ్” అనే దర్శక-నిర్మాతల,
ఆత్మాధ్యయనానికి తెరలేస్తుంది!

–అసంఖ్య ధవళ

7 Comments
  1. అసంఖ్య December 29, 2008 /
  2. Rohiniprasad January 3, 2009 /
  3. అసంఖ్య January 5, 2009 /
  4. అసంఖ్య January 5, 2009 /
  5. MayaBazar April 7, 2010 /