రెండవ మాడగాస్కర్ (Madagascar: Escape 2 Africa)

మును మాడగాస్కరను పుర

మును, తమ పట్టణపు హొయల ముంచిన వైన

మ్మును గని నగి జనిన జన

మ్ము నుల్లసమున మలి ముంచి ముదమందించే

***

పని తలపెట్టి, కితకితల

పనితనముకు సానపెట్టి, పసతో గురిత

ప్పని హాస్యము సంధించియు,

పనితములయిన పనులన్ సఫలముగ సలిపే

***

నలుగురు ముందు కురికి, కో

నులు కానలు తిరిగి యాతనల బడినా, పి

న్నల పెద్దల కొరకై, చి

న్నెలు చిందించి యలరింప నేర్చిరి భళిరా!

***

మునుపటి స్నేహితుల్ హితులు మూగిరి సాయముసేయ సంబరమ్మున సరి క్రొత్త జంతువుల మూకలు వచ్చెను తోడు సంతసమ్ము నినుమడింపజేయ.

***

గొప్పమాటలింత లప్పజెప్పుచునుంటి

వెవ్వరీ పిడుగులు? నవ్వు లాట

లందు నారితేరి సందడి పుట్టించి

రెవ్వరీ నలుగురు? నువ్వె దెలుపు?”

అని యడుగగలరు మహాశయులు చదివి,

అవధరింపుడిక మహాశయులార.

***

గునిసియాడు అలెకి యనెడు సింగడొకడు

గఱువ చారల-తురగమ్ము మార్టి

మృదు మెతక జిరాఫు, మెల్మాను యనువాడు

గ్లోరి యాను నీటిగుఱ్ఱ మొకతె

వీరి గాధలేను వేరుకథలు గావు

మీకు చెప్పుచుంటి నేక బిగిన

***

మొదటి విడతలోన మొలవని నవ్వులు

మొలిచె నిచట థాంక్స్టు మోటొమోటొ

మోటు నీటితురగ మదవతీమణులకు

మోహకారకుండు మోటొమోటొ

ఒక్కమాటుపలికి ఊరుకున్న తగని

మేటి నామ మెదిర? మోటొమోటొ

***

యానిమేషను కేమి హైటెక్-నిక్కు, పాత్ర

లాటలదిరె పాటలదిరె, మాటలదిరె

తేరి జూచిన చిత్రంపు తీరె యదిరె,

చూడతగిన చిత్రమ్మిది, చూచిరండు

–గిరి లంక

Filed Under: featuredleadఅమెరికాప్రపంచ సినిమాసమీక్ష

Tags: , , , , ,

Comments (7)

Trackback URL | Comments RSS Feed

  1. avatar ప్రపుల్ల చంద్ర says:

    నాకు కూడా బాగా నచ్చింది… ముఖ్యంగా పెంగ్విన్ ల సీక్వెన్స్…

  2. మొదటి భాగం కంటె అంత ఏమి కాదు… నాకు మాత్రం MADGASCAR first part బావుంది!

  3. avatar గిరి says:

    ప్రఫుల్ల చంద్ర, పెంగ్వినులు మొదటి భాగంలో లాగ ఘటికులే – నాకు మటుకు మోటొమోటొ పాత్ర తెగ నచ్చింది.

    సత్య శ్యాం, నాకు మొదటి భాగంలో ఐ లైక్టు డూ ఇట్ పాట తప్ప ఏదీ నచ్చలేదు. మొదట్లో రెండవ విడత రూపొందిస్తున్నారని చదివి హాశ్చర్య పడ్డాను. విజయవంతమైతే దేన్నైనా లాగదీస్తారు హాలివుడ్డువారని సరిపెట్టుకున్నాను. మీకు మొదటి భాగం రెండవ దాని కంటే ఎక్కువగా ఎందుకు నచ్చిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.

  4. పద్య రచనాభిలాషులగు మీకు అభినందనలు.
    భావనని ఛందో బద్ధం చేయడం ముదావహం. ఐతే ఒక చంపకమాల వృత్తాన్నెత్తుకొని మూదవపాదంతో అసంపూర్ణంగా ఎందుకుంచేశారో అర్థం కాలేదు. చూడండి.

    చంపకమాల:-
    మునుపటి స్నేహితుల్ హితులు మూగిరి సాయముసేయ సంబర
    మ్మున సరి క్రొత్త జంతువుల మూకలు వచ్చెను తోడు సంతస
    మ్ము నినుమడింపజేయ…………………………………………………………
    ………………………………………….యని మూడవ పాదము నందు వీడి తే
    మనుకొనవచ్చు మేము? అసహాయముచే విడినాడవందునా?

    వృత్త పద్యం కూడా చాలా బాగా వచ్చింది మూడవ పాదం వరకూ. పూర్తిగా పద్యం వ్రాసివుంటే యికా బాగుండేది.
    { ఆంధ్తామృతం }

  5. నాకు కూడా మొదటి పార్టుకంటే రెండవదే బాగుంది. అలా అని మొదటి తక్కువని కాదు. పార్టు చాలా ఎంటర్‍టైనింగ్‍గా ఉంది. ఒక్క బోరింగు సీన్ కూడా లేదు.

  6. avatar Satya SKJ says:

    Chinta Ramakrishna garu
    The first part of Madgascar has got some originality of story where 4 animals wanted to go out of their day-to-day boredom, you will agree that this is first of its kind in animated movies so far.

    Most of the 2nd part is copy to LION KING and it has been dragged a lot by simply adding the scens before climax. I agree that Penguins has got more role on this part but still there is a chance of perfection.

  7. avatar గిరి says:

    గురు సమానులు రామకృష్ణా రావుగారు,
    అసహాయతయో, బధ్ధకమో మీరు ఏది ఆపాదించినా ఒప్పుకోక తప్పదు. ఎలాగూ చెప్పాలనుకున్న భావము కుదిరింది కదా అని ఊహించి పద్యంగా ఎత్తుకున్నదాన్ని వచనంగా వదిలేసాను. అది గమనించి నిలదీయడం మీ బోటి వారికే చెల్లింది. మధ్యలో ఆపితే మొండితేలు భయం ఉందంటే, ఇదిగో ఇలా పూరిస్తాను.

    మునుపటి స్నేహితుల్ హితులు మూగిరి సాయము సేయ సంబర
    మ్మున, సరికొత్త జంతువుల మూకలు చేరెను తోడు సంతస
    మ్ము నినుమడింపజేయ, విరబూయ కులాంతర* ప్రేమలింతలో
    మునిగిరి మోదవాహినుల ముచ్చటగా నట చేరి యెల్లరున్

    * జంతువులలో కులాంతర ప్రేమలేమిటా అని ఆశ్చర్యం కలిగితే చిత్రం చూడండి, మీకే తెలుస్తుంది.

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.

Powered By Indic IME