కు(సోం)బేరులు

kuberulu-feature

మనం తీసేది ఊర కామెడీ..దానికి కూడా ఊరించే కథ,కథనాలు వంటివి అవసరమా…రెండు పంచ్ డైలాగులు వేస్తే పడీ పడీ నవ్వుకోరు…అంతగా కాకపోతే…కాక ఎక్కించే రీతిలో వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా(ఆఖరుకి జయమాలిని చేత కూడా) ఎక్స్పోజింగ్ చేయిద్దాం…చూడక ఛస్తారా…అని డిసైడై దర్శకుడు శ్రీనివాస రెడ్డి తీసిన చిత్ర రాజం కుబేరులు.రొటీన్ వజ్రాల వేట కధ కావటం,ప్రధాన పాత్రలు ప్యాసివ్ గా మారటం,ఉత్సాహాన్నివ్వని పాటలు ఈ సినిమాకు ప్లాఫ్ దారి పట్టిస్తే…వైయస్ ని అనుకరిస్తూ డైలాగులు,ఆయన విజువల్స్ చూపటం ప్రభుత్వ ప్రకటన ఫీలింగ్ ని కలుగ చేసాయి.కాబట్టి ఆకర్షణీయమైన టైటిల్,పోస్టర్స్ ,శ్రీనివాస రెడ్డి గత చిత్రాల క్రెడిబులటీ ఆధారంగా కొద్దిగా వర్కవుట్ అయ్యినా నిలబడటం కష్టమే.

అనగనగా ఓ ఐదువందలకోట్లు విలవచేసే నగల చోరి. అయితే దాన్ని దొంగిలించిన వ్యక్తి పోలీసులు వెనకపడుతూంటే మొన్న బ్లేడు బాబ్జి సినిమాలోలా ఓ చోట గొయ్యి తీసి పాతి పెట్టి ఆ ప్లేస్ ని సెల్ ఫోన్ తో ఫొటో తీసి ఆ సెల్ ని దగ్గరలో ఉన్న ఓ ఇంట్లో దాస్తాడు.(ఏం ఎమ్.ఎమ్.ఎస్ మెసేజ్ పంపచ్చు కదా అని అడగవచ్చు …దర్శకుడు గారు అలాగే చెప్పారు లేదా ఆ సెల్ కి ఆ ఫెసిలిటీ లేదు) తర్వాత ఆ విషయం తన బాస్ కి చెప్పి చచ్చిపోతాడు.ఇదీ సెటప్.

ఇదిలా ఉంటే దేవరపల్లిలో తింగరమేళంలా తిరిగే శివరామ్ ఉరఫ్ జూ.వై.యస్(శివాజి), చిట్టిబాబు(అలీ) ఊరికి ఉపకారం చేసేయ్యాలని జీవితాశయం. దాంతో అలీ సలహాపై శివాజి ఆ ఊరి మంచి చేద్దామని ఓ మోసగాడు చేతిలో బోల్తాపడతారు. తాము మోసపోవటమే కాక ఊరివారందరిని మోసానికి గురి అయ్యేలా చేస్తారు.ఊరి జనం తిరగబడితే ఏం చేయాలో అర్ధం కాని స్ధితిలో కోట్లు సంపాదించుకుని కుబేరులుగా తిరిగి వస్తామని హైదరాబాద్ వస్తారు. అక్కడ అనుకోని స్ధితిలో వారికి తమ బెస్ట్ ఫ్రెండ్ రాంబాబు ఉరఫ్ రాంబో(కృష్ణ భగవాన్) కలుస్తాడు.

వీళ్ళ పిచ్చి కష్టాలు విన్న రాంబో అటువంటివి తీరటానికి ఓ పిచ్చి ఐడియా చెప్తాడు. రీసెంట్ గా సిటీలో ఐదువందలు కోట్ల విలువ చేసే డైమండ్స్ చోరి జరిగిన వార్త చెప్పి దాన్ని సాధిద్దామంటాడు. దాంతో ముగ్గురూ అంజనం ద్వారా డైమండ్స్ పట్టేద్దామని పొలోమంటూ ఓ స్వామీజీని(ఎల్.బి.శ్రీరామ్)ని ఆశ్రయిస్తాడు. ఆయన వీళ్ళని మిస్ గైడ్ చేసి డబ్బు లాగుదామనుకుంటాడు.(కథ ప్రక్కకెళుతోందనిపిస్తోందా..కానివ్వండి). ఈలోగా వీళ్ళకు కల్పన(ఫర్జనా)పరిచయమవుతుంది. ఆమె దగ్గర ఆ డైమండ్ చోరి కి సంభందించిన ఓ క్లూ ఉంటుంది. మరో ప్రక్క సలీం అనే ఒక డాన్ (శివప్రసాద్ రెడ్డి )ఆ డైమండ్స్ కోసం ట్రై చేస్తూంటాడు.అక్కడ నుండి వాళ్ళు ఆ డైమండ్స్ ని ఎలా సంపాదించి కుబేరులయ్యారన్నది తెరపై చూడాల్సిందే.

ఇక ఈ పై కథ చదివిన వారెవరికైనా పూర్తిగా వండకుండా షూటింగ్ కి వెళ్ళిన స్క్రిప్టు ఈ సినిమా అని స్పష్టంగా అర్దమవుతుంది. దాంతో ఈ కామెడీ యధాశక్తి ఏడిపిస్తుంది. స్క్రిప్టు పరంగా చూస్తే.. ఎక్కడా ప్రధాన పాత్రలు పొరపాటున కూడా తమ స్వయం శక్తితో గానీ, ప్లాన్స్ తో గానీ ఆ డైమండ్స్ గురించి ఎంక్వైరీ చేయరు…ఫన్ పుట్టించరు. కాసేపు స్వామీజి దగ్గర అంజనం వేసి ఆ డైమండ్స్ ఎక్కడున్నాయో కనుక్కుందామని తింగరగా తిరుగుతూంటారు. తర్వాత హీరోయిన్ ఇచ్చిన క్లూ సాయంతో సెల్ ఫోన్ కోసం సెర్చింగ్ చేస్తూంటారు. పోనీ సెల్ ఫోన్ ఎడ్రస్ కోసమన్నా సీరియస్ ప్రయత్నాలు చేస్తారా అంటే అదీ ఉండదు. కాస్సేపటికి …డైరక్టర్ గారికే విసుగొచ్చినట్లు ఆ సెల్ ఫోన్ డైరక్ట్ గా వచ్చి వీరి చేతికి వచ్చి చేరుతుంది. అలా పాత్రలు ప్యాసివ్ గా మారటం స్క్రీన్ ప్లే లోపమై సినిమాను అధ:పాతాళానికి గెంటేసింది. దాంతో కుబేరులు కాస్తా ఏ పనీ చేయక,కథనీ నడిపించక,నవ్వించనూ లేక సోంబేరుల్లా మిగిలి స్క్రీన్ టైం ని, ప్రేక్షకుడు డబ్బుని వేస్ట్ చేస్తారు. దాంతో ఏం చేయని ఈ కుబేరులకు జై కొట్టేదెవరు…అసలు భరించేదెవరు.

నటీనటుల్లో శివాజి,అలీ ఇద్దరూ వైయస్,చంద్రబాబు లను అనుకరించటం బాగుంది. ఇక కృష్ణ భగవాన్ వి రొటీన్ పంచ్ లు.అవి మనకు ఎంతగా అలవాటు పడిపోయాయంటే తర్వాత డైలాగ్ చెప్పేయవచ్చు. ఫర్జానా తన పెరిగిన శరీరంతో హీరోయిన్ గా చాలా కష్టం అనే ఫీలింగ్ తెప్పించింది. ఇక మిగతావాళ్ళు సొ..సొ.టెక్నికల్ గా విశ్లేషించే రీతిలో ఏ విభాగం కనపడదు.ఇక జ్యోతిలక్ష్మి ని ఎందుకు పెట్టారో డైరక్టర్ కే తెలియాలి. శ్రీనివాస రెడ్డి తన కెరీర్ లో అతి వీక్ స్క్రిప్టు ఇదే నేమో.

నవ్వులాటకైనా ఈ సినిమాకి వెళ్ళితే ఫలితం చాలా సీరియస్ గా అనుభవించాల్సి వస్తుంది. ఇక ఆ కొద్దిపాటి కామిడీ సంగతి అంటారా…రోజూ ప్రోమోల్లో ఎలానూ చూపిస్తారు. అంతగా కాకపోతే..కొద్ది రోజులు పోతే టీవీల్లో ఎలాగూ బాగున్న సీన్స్ ముక్కలు ముక్కలుగా కట్ చేసి రోజూ వేస్తారు. అన్నీ కలిపి ఒకేసారి రెండు గంటలుసేపు భరించటం సులభమా…కామిడీ బిట్స్ గా రెండు నిముషాలు పాటు వాటిని ఎంజాయ్ చేయటం బెటరా..డిసైడ్ చేసుకోండి.

సంస్థ: గోదావరి టాకీస్‌
నటీనటులు: శివాజీ, అలీ, కృష్ణభగవాన్‌, ఫర్జానా, కౌశ, శివప్రసాద్‌, భువనేశ్వరి, జ్యోతిలక్ష్మి తదితరులు.
‌కథ :శివ మరియు సురేష్
కెమెరా:రామ్ పినిశెట్టి
సంగీతం: జీవన్ ధామస్
మాటలు :దాసరి బ్రహ్మం
దర్శకత్వం: శ్రీనివాస్‌రెడ్డి
నిర్మాతలు: కరుటూరి శ్రీనివాస్‌, యాగంటి శ్రీనివాస్
రిలీజ్ డేట్: 04 డిసెంబర్ 2008

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

13 Comments to “కు(సోం)బేరులు”

  • సినిమా సంగతేమో గానీ మీ సమీక్ష ఎంటర్ టైనింగ్ గా ఉంది. :-)

  • ఆర్యా .. ఈ సినిమాలో ప్రదర్శించబడిన పూర్వసుందరీమణి జ్యోతిలక్ష్మియా జయమాలినియా మా సందేహ నివృత్తి చెయ్యగలరు. సినిమా సంగతేమోగానీ మీరు పెట్టిన ఈ సస్పెన్సు తట్టుకోలేక నరాలు చిట్లుతున్నాయి! :)
    ఊర కామెడీ .. కథ,కథనాలు వంటివి అవసరమా .. నవ్వులాటకైనా ఈ సినిమాకి వెళ్ళితే ఫలితం చాలా సీరియస్ గా అనుభవించాల్సి వస్తుంది .. బ్రహ్మాండంగా రాశారు!

  • ఇంతకు ముందు కామెడీ సినిమాల్లో లాజిక్ చూడకూడదనేవారు, కొణ్ణాళ్ళైతే కధ కూడా చూడకూడదంటారు. అసలు ఇలాంటి ఇనిమాలే చూడకూడదనే రోజెప్పుడొస్తుందో. టైటిల్ బావుందని ఈ దర్శకుడి గత చిత్రం ‘ టాటా బిర్లా మధ్యలో లైలా’కి మొదటి రోజే వెళ్ళాను. ఆ సినిమాలో కామెడీకి కాదు కానీ కామెడీ చెయ్యాలనే తపనతో వాళ్ళు వేసే వెర్రి వేషాలకు బాగా నవ్వొచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ సినిమా బాగానే వసూళ్ళు సాధించింది తర్వాత. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో అని డౌట్‌గా ఉంది. మరీ కామెడీ సెన్స్ లేని లేనివాళ్ళుగా జమకడతారని భయమేస్తుంది.

  • జ్యోతిలక్ష్మి నే కొత్తపాళీ గారు. విఠలాచార్య జగన్మోహిని సినిమాని మళ్ళీ తీస్తున్నారు, దానిలో జయమాలిని పాత్ర నమిత వేస్తుంది, నమిత తల్లిగా జ్యొతిలక్ష్మి మళ్ళీ మన ముందు రాబోతుంది. ఈ సందర్భంగా కొన్ని సినిమాల్లో “వాడిపోయిన ఐటం సాంగ్స్” చేస్తుంది.

  • అరవై రెండేళ్లావిడకి పిచ్చి బట్టలేసి గంతులేయించే స్థాయికి తెలుగు సినిమాలు దిగజారిపోయాయి. ఏమనాలో అర్ధం కావటం లేదు.

  • ఆర్యా…
    ఈ సినిమా చూసిన తర్వాత అందులో ఎవరు ఏక్ట్ చేసారో…అసలు ఆమె జయమాలినో,జ్యోతి లక్ష్మో తెలియని స్ధితికి చేరి మైండ్ మొద్దు బారిపోయింది…ఏం చెయ్యను…లక్కీగా నేనెవరనేది మాత్రం మర్చిపోకపోవంటంతో మీకు ఈ రివ్యూ వచ్చింది.
    సూర్య ప్రకాష్ జోశ్యుల

  • హమ్మయ్య ఈ సినిమా చూసే బాధతప్పింది. ధన్యవాదాలు. ఈ సినిమా డబ్బుల్తో మీకు పార్టీ ఇవ్వాలండీ! ఎక్కడ దొరుకుతారూ?

  • ఆయన(ఈ సినెమ డైరెక్టరు) మంచి సినెమాలు తీసి…వాల్ల పాప కి పాల ప్యాకెట్ కొనలేని స్థిథికి వెల్లానని..అందుకే ఇకనుంచి ఇలాంటి సినెమాలు మాత్రమే తీస్థానని..మొన్ననే eenaadu paper ‘సాక్షీ’ గా ప్రమానం చెసాడు… కాబట్టి Next సినెమ ఇంతకంటే దారునంగా వుంటుందని..మీకు అర్దం అయ్యిందనుకుంటున్నాను….

    Last week I read an exclusive interview of this director in our telugu daily…i dont remember the name but it may be eenaadu or saakshi..

  • >> “ఆయన(ఈ సినెమ డైరెక్టరు) మంచి సినెమాలు తీసి…వాల్ల పాప కి పాల ప్యాకెట్ కొనలేని స్థిథికి వెల్లానని..అందుకే ఇకనుంచి ఇలాంటి సినెమాలు మాత్రమే తీస్థానని..మొన్ననే ఈనాదు పపెర్ ‘సాక్షీ’ గా ప్రమానం చెసాడు”

    శ్రీనివాసరెడ్డిగారు తీసిన ఆ మంచి సినిమాలు ఏమిటో? ఇంతకు ముందువీ ఇలాంటివేగా.

  • మారు పేరుతో మరాఠీ లో తీసాడేమో….:-)

  • అసలు ఆయన ఎమన్నాడంటే…అంతకు ముందు నాలుగు సినెమాలు ఫైయుల్ అయ్యాయని…అప్పటినుంచి…థియెటర్లలో కూర్చుని…జనాల నాడి పట్టుకున్నానని…అందుకే comedy కి పెద్ద పీట వేస్థానని చెప్పాడు అసలు ఆయన తీసిన సినెమాలేంటో నాకు నిజంగా తెలియదు…

  • thanks for the review.

  • హమ్మయ్య ఈ సినిమా చూసే బాధతప్పింది.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories