సాధారణంగా సినిమాలు తీసేవారు రిస్కు తీసుకోటానికి ఇష్ట పడరు. సినిమా నిర్మాణం డబ్బుతో కూడిన వ్యవహారం. కాబట్టి ఒక్క సారి నష్టం వస్తే దాదాపుగా దివాళా తీయటం తప్ప వేరే మార్గం లేదు. అలాగే నష్టం పూడ్చుకోవాలన్నా ఇంకో సినిమా తీయటం తప్ప మరో దారి లేదు.
ఇటీవలే ఒక నిర్మాతను కలవటం తటస్థించింది. ఆయన చాలా మంచి సినిమాలు నిర్మించాడు ఒకప్పుడు. మాటల సందర్భంలో ఆయన సినిమాలు తీయటం ఎందుకు మానేశాడో చెప్పాడు.
హిట్ సినిమాలు నిర్మిస్తూ ఆయనకు ఒక సినిమా గురించిన ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనను ఒక ప్రఖ్యాత దర్శకుడికి చెప్తే, ఆయన ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడట. మొత్తం బాధ్యత అతడికి అప్పగించి నిర్మాత ఊరుకున్నాడు. ఎందుకంటే అతడు పేరున్న దర్శకుడు. అనవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదు.
అయితే, షూటింగ్ జరుగుతూంటే, ఆయన దగ్గరకు అనేకులు వచ్చి సినిమా దారి తప్పుతోందని చెప్తూ వచ్చారట. కానీ దర్శకుడు పెద్దవాడు. మధ్యలో జోక్యం చేసుకుంటే బావుండదు. అందుకని నిర్మాత ఓపిక పట్టాడు. సినిమా రషెస్ చూస్తూంటేనే అది నడవదని అర్ధమయిపోయింది. కానీ ముందుకు తప్ప వెనక్కు వెళ్ళలేని పరిస్థితి. దాంతో, మొండిగా సినిమా పూర్తిచేసి, విడుదల చేశాడు. అనుకున్నట్టే ఘోరంగా దెబ్బతింది సినిమా. ఆ కాలంలో 50 లక్షలపైగా నష్టం వచ్చింది.
రెండు మూడేళ్ళలో 50 లక్షల నష్టం పూడ్చుకోవాలంటే, మరో 50 లక్షలు అప్పు తెచ్చి సినిమా తీయాలి. ఇంత తక్కువ సమయంలో అంతగా సంపాదించాలంటే అదొక్కటే మార్గం. కానీ, సినిమా నడవకపోతే, నష్టం కోటి దాటుతుంది. ఆయన సందేహంలో పడ్డాడు.
అప్పుడు ఆయన శ్రేయోభిలాషులు, ఓ మాంచి మసాల సినిమా తీయండి. మినిమం గారంటీ వుంటుందని అన్నారు. ఆయనకు అలవాటయినట్టు సినిమా తీస్తే నడవదన్నారు. అసలే దెబ్బ తినివున్నారు, మళ్ళీ రిస్కెందుకన్నారు. వాళ్ళా మాటలకాయన లొంగాడు. అప్పు చేసి మసాలా సినిమా తీశాడు. ఘోరంగా దెబ్బ తిన్నాడు. అంత కాలం మంచి సినిమాలు నిర్మించిన పేరు పోయింది. మళ్ళీ సినిమా పేరెతాలేదు. ఆస్తులమ్మి అప్పులు తీర్చి, మూటా ముల్లె సర్దుకుని కూతురి ఇలు చేరుకున్నాడు. జీవితం గడిపేస్తున్నాడు.
అతని కథ విన్న తరువాత ఒక అనుమానం వస్తుంది. మసాలా సినిమాలు మనకు విజయానికి రహదార్లు. కానీ, ప్రతి మసాల సిన్మా హిట్ అవదు. అలా అయితే, ప్రతి సినిమా సూపెర్ హిట్ అవ్వాలి. ప్రతివారూ మసాలాలే తీస్తారు. కాబట్టి మసాలా సినిమాలే హిట్ అవుతాయని, ఒక ఫార్మూలా ప్రకారం తీస్తే హిట్ తప్పదని, అందుకు భిన్నంగా తీస్తే నడవవని అనుకోవటం కుదరదు.
ఒక సంస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. చివరి ప్రయత్నంగా వారు సినిమా తీయాలనుకున్నారు. మంచి కథ ఎన్నుకున్నారు. కళాకారులను ఎన్నుకున్నారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఉత్తమంగా నిర్మించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. తరతరాలుగా వారికి ఎనలేని కీతిని సంపాదించిపెట్టింది. అది బైజూ బావ్రా అనే సినిమా!
రాజ్ కపూర్ ఎంత గొప్ప కళాకారుడో అంత తెలివయిన వ్యాపారి. దొంగలమనసుమారే అమ్షంతో హిట్ సినిమా తీసిన వ్యక్తి.( జిస్ దేష్ మె గంగా బహతీహై) అలాంటి వాడు మనస్ఫూర్తిగా ఉన్నదంతా ఖర్చుపెట్టి ఒక సినిమా తీసాడు. ఘోరంగా దెబ్బ తిన్నాడు. మేరా నాం జోకర్ ఇప్పుడు క్లాసిక్ కాని విడుదలయినప్పుడు ఘోరంగా విఫలమయింది. దాంతో రాజ్ కపూర్ పూర్తిగా నష్ట పోయాడు. అయిదేళ్ళవరకూ తేరుకోలేదు. ఇప్పుడు హిట్ సినిమా తీయకపోతే కుదరదు. దాంతో ప్రేమ ఫార్మూలాపై పడ్డాడు. గ్రాడ్యుయేట్ అనే ఆంగ్ల సినిమాను భారతీయీకరణం చేసి బాబీ అన్నాడు. దాంతో భారతీయ సినిమాలలో నిక్కర్ల ప్రేమ అధ్యాయం మొదలయింది. అంత గొప్ప హిట్ అది.
బోనీ కపూర్ హిట్ సినిమాలు నిర్మించాడు. మరో హిట్ సినిమాను సంకల్పించాడు. అనిల్ కపూర్, శ్రీదేవిలు నాయికా నాయకులు. లక్ష్మి ప్యారె సంగీతం. ప్రతీకారాలు, మోసాలు, ఎత్తుకు పైఎత్తులు, పాటలు, యుద్ధాలు మొత్తం మాల్ మసాలాలన్ని నింపాడు. అడుగడుగునా మసాలాను దట్టించాడు. రూప్ కీ రానీ చోరోంకా రాజా ఎంత ఘోరంగా దెబ్బ తిన్నదంటే, ఆయన ఇంకా తేరుకోలేదు.
మూస సినిమాలకు భిన్నంగా విశ్వనాథ్, అందరి సలహాలను కాదని శంకరాభరణం నిర్మించాడు. అప్పుడు వస్తున్న సినిమాలకు పూర్తిగా భిన్నంగా, హీరోను మాఫియా లాంటివాడిని చేసి రాం గోపాల్ వర్మ శివ తో సినిమాల స్వరూపాన్నే మార్చాడు. నాగేష్ కుకునూర్ తక్కువ బడ్జెట్ తో పెద్ద హిట్ హైద్రాబాద్ బ్లూస్ సాధించాడు. అస్సలు విలన్లు, యుద్ధాలు లేకుండా ఒక పెళ్ళి వీడియోలాంటి హం ఆప్కే హై కౌన్ ఘన విజయం సాధించింది. కమర్షియల్ సినిమా పరిథిలో వున్నా మూస సినిమాలకు భిన్నమయిన తారే జమీన్ పర్ సూపర్ డూపర్ హిట్.
వెస్టెర్న్ సినిమాలు అలవాటు లేని మనం అటు షోలే నూ ఇటు మోసగాళ్ళకు మోసగాడునూ ఆదరించాం. ఇలా చూస్తూ పోతే, హిట్ ఫార్మూల నిజంగా హిట్ ఫార్మూలా కాదని, కష్టపడి ఆలోచించి స్వయంగా సినిమా నిర్మించటం తప్పించుకునే బద్ధకానికి మారు పేరనీ అర్ధమవుతుంది.
నిజంగా హిట్ ఫార్మూలా అంటూ ఏదయినా వుంటే, అది హిట్ ఫార్మూలా అంటూ ఏదీ లేదన్నదే. ఇంకొన్ని విజయవంతమయిన సినిమాలను పరిశీలిస్తే, ఈ హిట్ ఫార్మూలా అపోహ ఎలా వచ్చిందో అర్ధమవుతుంది.
మన సినిమా పరిస్థితి గురించి విశ్లేషిస్తూ వచ్చిన మరికొన్ని వ్యాసాలు:
- మనము సినిమాలెందుకు చూస్తాం?
- మన సినిమాలెందుకు మూస దాటవు?
- సినిమాలెవరు తీస్తారు? ఎందుకు తీస్తారు?
- సినిమా కళనా? వ్యాపారమా?
- సినిమా హిట్- ఫార్ములా ఫిట్!
శంకర్ says:
’హిట్ ఫార్మూల నిజంగా హిట్ ఫార్మూలా కాదని, కష్టపడి ఆలోచించి స్వయంగా సినిమా నిర్మించటం తప్పించుకునే బద్ధకానికి మారు పేరనీ అర్ధమవుతుంది.’
చక్కని విశ్లేషణ … తర్వాతి భాగం కోసం ఎదురు చూస్తా.
ఇంతకీ ఆ నిర్మాత ఎవరో చెప్పలేదు.
chandra sekhar says:
చాల బాగ చెప్పారు హిట్ ఫార్ములా గురించి.మనిరత్నం సినిమాలు చూస్తె తెలుస్తుంది అసలు ఫార్ములా అంటు ఎమీ లేదని.
అంజలి – బాలల చిత్రం – హిట్
ఘర్షన – ఫామిలీ అండ్ యాక్షన్ ఎంటర్తైనర్ – హిట్
దలపతి – వయలెంట్ యాక్షన్ మూవీ – హిట్
గీతాంజలి – ప్రేమ కావ్యం – క్లాసిక్ హిట్
K మహేశ్ కుమార్ says:
ఖచ్చితంగా ఇప్పుకోవలసిన పాయింట్ చెప్పారు. ఎక్కడి ఫార్ములా… ఎవడి ఫార్ములా…సినిమా మంచిగుండాలంతే!
shree says:
నాకు తెలిసిన ఉదాహరణ ఆనంద్…
ప్రశాంత్ మహాగౌంకర్ says:
సినిమాలో డబ్బు పెట్టడమంటే దాన్ని పెట్టుబడి గా గుర్తించాలే కాని లాటరీ గా భావిస్తే కొంప మునిగినట్లే!
నా దగ్గరకి వచ్చిన వారికందరికి నేను చెప్పేది ఒక్కటే : మీ డబ్బు మొత్తం ఒక్క చోట పెట్టే కన్న, రెండు మూడు చోట్ల పెడితే మీ డబ్బుకి అపాయం కొంచెమైనా తగ్గుతుంది.
సినిమాలసంగతి వచ్చే సరికి, ఒక పెద్ద బుద్జెట్ సినిమా కంటే, రెందు medium బుద్జ్ట్త్, ఒక small బుద్జెట్టు సినిమా అని డబ్బు ని పలు చోట్లాపెడితే, ఒక సినిమా ఫ్లాప్ ఐనా మిగితావి దబ్బు సమకూరుస్తాయి. అర్థషాస్త్రం లో దీనిని దైవెర్సిఫికశన్ diversification అంటారు.
దీనికి ఉదాహరన UTV మరియు Amigo Productions (Shekhar kammula and Anish kuruvilla)!