Menu

దటీజ్ బాపు…అంతే

ఏది తూరుపు..ఏది వెలుతురు..ఎవరు బాపు? పొద్దు పొడవగానే తూరపు తెలుస్తుంది..చీకటి పడగానే వెలుతురు తెలుస్తుంది.బొమ్మ చూడగానే.. తెలుగుతనం పరవళ్ళు తొక్కగానే..గీతలు అందాలు దిద్దుకోగానే…మాటలు బిడియం ఒలికించగానే..రాతలు వినయం తొణికించగానే..రమణ స్నేహంలో రూపం మూర్తి కట్టగానే…బుడుగు అల్లరి స్పురణకు రాగానే…రాముని దయ స్మరణకు రాగానే బాపు తెలుస్తాడు. బాపు కేవలం ఒక వ్యక్తి కాదు. బాపు ఒక సిద్దాంతం.ఒక తత్వం. ఒక చరిత్ర.ఒక సంస్కృతి…ఇలా బాపు గురించి అధ్బుతంగా చాలామంది చాలాకాలం నుంచి ఉన్న నిజాలు ..చెప్తూనే ఉన్నారు. అదే పనిగా రాస్తూనే ఉన్నారు. ఇది కూడా వాళ్ళు భక్తితో రాసిన వాటిలోంచే కాపీ. కాబట్టి ఆయన గురించి కొత్తగా చెప్పేదీ లేదు. చెప్పుకునేది లేదు. అలాగే నాకు తెలిసుండీ బాపు గురించి తెలియని వాళ్ళూ లేరు.

మరి ఏం రాయాలి..ఆయన డభ్బై ఐదవ పుట్టిన రోజుని పురస్కరించుకుని…ఏం రాయాలి..పోనీ ఆయన తీసిన ఏదైనా సినిమా ఎత్తుకుందామన్నా పేజీలు,రోజులు గడిచిపోతాయి కానీ పూర్తవదు. పోనీ కార్టూన్ లు గురించి మాట్లాడదామా అంటే ..అదో అంతుతెలియని సాగరం. మరి ఏదీ చెయ్యలేనప్పుడు ఎందకీ ఆర్టికల్ అంటే…నాకు ఆయనపై ఎప్పుడునుంచో ఓ కంప్లైంట్ ఉంది అది మీతో పంచుకుందామని. అది మరేదో కాదు…బాపు పూర్తిగా కాపీ మాస్టర్ రమణగారి లాగే.

నమ్మబుద్దికావటంలేదా..ఒక్కసారి ఆ కార్టూన్స్,బొమ్మలు,సినిమాలు గుర్తు తెచ్చుకోండి.గుర్తు వచ్చిందా..మన మధ్య తరగతి జీవితాలని ఉన్నదున్నట్లు జెరాక్స్ లా కాపీకొడతారు. ఏదీ వదలరు..ఎవరన్నా ఏదన్నా అనుకుంటారన్న భయం లేదు. అలాంటి వీళ్ళగురించి ఏం మాట్లాడుతాను…కాబట్టి ఏదో నేను విన్నవి ఓ నాలుగు చెపుతాను…

బాపు ఓ మిత్రుడ్ని పరిచయం చేస్తూ ‘కొంచెం అతిశయోక్తి చెబుతాడు లెండి’ అని శాంపిల్ గా ఇది చెప్పారు. నేనూ అక్కినేని నాగేశ్వరరావు గారు ‘అందాల రాముడు’ సెట్ మిద జుట్టూ జుట్టూ పట్టుకున్నాం అని చెప్పాడొకసారి. మరి మా జుట్ల విషయం లోకవిదితమే కదా (ఇద్దరివి బట్ట తలలే కదా ).

ఓ నవలకి కవర్ డిజైన్ వేసినందుకు వంద రూపాయలా అని విస్తుపోయిన మిత్రుడుకి ఆ రోజుల్లో బాపు జవాబు “డిజైన్ చేసినందుకు కాదు. ఆ నవల చివరిదాకా చదివినందుకు”.

తనకు నచ్చితే రచయిత తనంత తానుగా వేసుకుంటున్న పుస్తకానికి ఉచితంగా ముఖచిత్రం వేస్తారు బాపు. వెయ్యినూట పదహార్లు చెక్కు పంపినా దాని వెనుక శుభాకాంక్షలతో అని తిప్పి పంపుతూ బొమ్మి పంపిన సందర్భాలు పలువురుకి తెలుసు.రంగనాయకమ్మ గారు రామాయణ విష వృక్షం పుస్తకానికి బొమ్మ వేయమన్నప్పుడు మాత్రం ఆవిడ పంపిన చెక్ వెనకాల రామరామరామరామ అంటూ రాసి బొమ్మ పంపకుండా చెక్ తిప్పి పంపేశారుట.నవరసాలు,వివిధ నాట్యరీతులు మొదలైనవి బాపు గారి చేత వేయించి వాటిని ఆంధ్రదేశంలోని పలు కళా వేదికలపైనా, ఆడిటోరియంలోనూ ప్రదర్శింపచేయటానికి కృషి చేసిన నూతన్ ప్రసాద్ చెప్పిన విషయం ఇది..బాపు గారు ఎంతో అధ్బుతంగా చిత్రిస్తారు. కానీ ఇప్పటికీ బొమ్మ చాలా బాగా వేశాను అని ఎప్పుడూ అనరు. బొమ్మ బాగా కుదిరింది అంటారు.

సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో బాపుగారి మొదటి చిత్రం ‘సాక్షి’ లో జీవించి విమర్శకుల ప్రశంసలు పొందారు. కానీ చాలా కాలం దాకా ఆ కాంబినేషన్ రిపీట్ కాలేదు. మళ్ళీ పదిహేణేళ్ళ తరువాత అంటే 1982 లో ‘కృష్ణావతారం’ లో చేసారు. అప్పుడు బాపు గారు ఓ కీలకమైన సన్నివేశం కోసం ఆయన్ని రీటేక్ అడిగారు.దానికి కృష్ణ గారు డాన్స్ డైరక్టర్ శ్రీను ని పిలిచి “పాపం..బాపు గారు సాక్షి చేసి పదిహేనేళ్ళయింది కదా…నటనలో నేను ఇంప్రూవ్ అయ్యుంటానని అనుకుని రెండో టేక్ అడుగుతున్నారు…నేను యేం మారలేదని హామీ ఇవ్వండి” అని పకపకా నవ్వారుట.

ఇక ఒకావిడ బాపుగారికి వీరాభిమానిగా ఉండేదిట. ఆవిడ బాపు గారి సినిమా రిలీజ్ అవగానే మొదటి రోజు…మార్నింగ్ షోకు భర్తను తీసుకెళ్ళమని పోరేదిట. దానికాయన అట్లాకాదు..ఆఫీస్ కి శలవు పెట్టి శుక్రవారం(రిలీజ్ రోజు) వెళ్ళటం కన్నా ఆదివారం ప్లాన్ చేసుకుని వెళ్ళటం బెటర్ కదా అనేవాడు. దానికావిడ దీనంగా ముఖం పెట్టి అప్పటిదాకా ఆయన సినిమాలు ధియోటర్ లో ఉండద్దూ అందిట. ఇది బాపూ గారే స్వయంగా ఆయన మీద ఆయనే వేసుకున్న జోకు. దటీజ్ బాపు.

ఇవన్నీ ఎప్పుడో మాకు తెలిసినవే బోడీ అంటారా..ముందే చెప్పానుగా…బాపు గురించి కొత్తగా చెప్పేది లేదని. ఆయన మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ.. శుభాకాంక్షలు …నవతరంగం తరుపున.

10 Comments
  1. మేడేపల్లి శేషు December 15, 2008 /
  2. Sowmya December 15, 2008 /
  3. చిలమకూరు విజయమోహన్ December 15, 2008 /
  4. kumar December 15, 2008 /
  5. Satya Shyam KJ December 15, 2008 /
  6. kumar December 16, 2008 /
  7. ceenu December 17, 2008 /
  8. kranthi December 19, 2008 /
  9. v.prathap reddy February 7, 2011 /