Menu

గులాబీలు

తీసుకోవటంలో కాదు, ఇవ్వటంలోనే ఆనందం ఉందని చెప్పిన చిత్రం ‘గులాబీలు’

ఈ సినిమా గురించి సమీక్ష రాయడానికి ముందు, అసలు ఈ సినిమా గురించి నాకు ఎలా తెలిసిందో చెపుతాను. 2006 వేసవిలో, ఒక రోజు హైదరాబాదునుంచి మా స్నేహితుడు రవీందర్ ఫోన్ చేసి, తనకు తెలిసిన కుటుంబం ఒకరు ఢిల్లీకి వస్తున్నారని, వాళ్లకు ఏర్పాటు చేసిన వసతి గురించి చిన్న సమస్య వచ్చినందువల్ల, వాళ్లు ఢిల్లీకి చేరిన రోజునుంచి కాకుండా ఆ మర్నాటినుంచి వసతి ఇచ్చారని, అందువల్ల, ఒక్కరోజు మా ఇంట్లో ఉంచుకోమని చెప్పాడు. వాళ్ల అమ్మాయి రాష్ట్రపతినుంచి (అప్పట్లో అబ్దుల్ కలాం గారు) ‘బాలశ్రీ‘ అవార్డు అందుకోబోతోందని, అందుకే వాళ్లు ఢిల్లీ వస్తున్నారని చెప్పాడు. నేను సరేనన్నాను. వాళ్లు వచ్చిన రోజు మా ఇంట్లోనే ఉన్నారు. మాటల సందర్భంలో ‘భరతనాట్యం’ అంశానికి వాళ్ల అమ్మాయి ‘వర్షిణి‘కి (పన్నెండు ఏళ్ళు) అవార్డు వచ్చిందని తెలిసింది. అయితే, వర్షిణి ‘బాలనటి’ అని కూడా తెలిసింది. అంతకు ముందు సంవత్సరమే ‘గులాబీలు‘ అనే పిల్లలకు సంబంధించిన సినిమాలో నటించిందని, ఉత్తమ బాలనటిగా రాష్ట్రప్రభుత్వ అవార్డు కూడా వచ్చిందని వర్షిణి అమ్మ, నాన్న చెప్పారు. ఆ సినిమా అక్కినేని కుటుంబరావుగారు డైరెక్టు చేశారని, కథ ప్రముఖ రచయిత్రి ఓల్గా గారిదని తెలిసి ఇంకా సంతోషించాను. అక్కినేని కుటుంబరావుగారు ‘భద్రం కొడుకో’ చిత్రదర్శకుడిగా పేరు పొందకముందే, రచయితగా నాకు తెలుసు. ఓల్గా గారు నిఖార్సైన స్త్రీవాద రచయిత్రిగా పేరు పొందినా, జీవితంలోని చిన్న చిన్న అంశాల గురించి కూడా ఆమె చక్కని కథలు రాశారు. ‘గులాబీలు’ కూడా సినిమా కోసం రాసిందేమీ కాదు. ఆ కథ నచ్చిన చావా సుధారాణి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నట్టు ఈ సినిమాకు, కుటుంబరావు గారికి కూడా, ఉత్తమ బాలలచిత్రదర్శకుడిగా రాష్ట్రప్రభుత్వం అవార్డునిచ్చింది. నా కోరికపైన, వర్షిణి వాళ్ల నాన్న, శ్రీనివాసరావు గారు హైదరాబాదు వెళ్ళగానే, ‘గులాబీలు’ సిడిని నాకు పంపించారు. అలా ఇంత మంచి సినిమాను నాకు చూసే అవకాశం నాకు కలిగింది.

పువ్వులంటే ఎవరికి ఇష్టం ఉండదు గనుక. అలాగే చిన్నారి లయకు (బేబి వర్షిణి) కూడా పూలంటే చాలా ఇష్టం. అందులోనూ, పువ్వులన్నిట్లోకీ మహారాణి వంటి ‘గులాబీ’ అంటే మరీ ఇష్టం. లయకు ప్రాణప్రదమైన స్నేహితురాలు రమ్య (బేబి త్రిష). ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళే దారిలో ఒక బంగళాలో ఒక పెద్ద గులాబీ తోట ఉంటుంది. ఆ దారిన వెళ్ళినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఆ తోటను చూసి మురిసిపోతుంటారు. దగ్గిరకు వెళ్లి చూద్దామంటే, ఆ బంగళా ముందున్న బుర్రమీసాల వాచ్ మాన్ వాళ్ళను తరిమేస్తూ ఉంటాడు. ఒకరోజు వాచ్ మాన్ లేని సమయంలో ఇద్దరూ, గేటు తీసుకుని తోటను చూడటానికి లోపలికి వెళ్తారు. ఇంతలొ ఆ బంగళా యజమానురాలు బయటికి వచ్చి కేకలు వేయటంతో, రమ్య భయపడి పారిపోతుంది. లయ మాత్రం ఆమె చేతికి చిక్కుతుంది. ఆమె లయను అనరాని మాటలని, ‘దొంగ’ అని ముద్ర వేస్తుంది. ఇంటికి వచ్చి లయ ఒకవిధమైన షాకుతో జ్వరం తెచ్చుకుంటుంది. తనను వదిలిపెట్టి పారిపోయి వచ్చినందుకు రమ్య మీద కూడా కోపం పెంచుకుంటుంది. ఆ అమ్మాయితో మాట్లాడటం మానేస్తుంది. అయితే, ఈ సంఘటన గురించి లయగాని, రమ్యగాని తమ ఇళ్ళల్లో చెప్పరు. తల్లిదండ్రులకు (కృష్ణశ్రీ, సురేష్), లయ ఈ విచిత్రమైన ప్రవర్తన అర్థం కాదు. తనకంటూ ప్రత్యేకంగా ఒక గులాబీ తోట పెంచుకోవాలన్న కోరికను మాత్రం బైటపెడుతుంది. వాళ్లు ఎలాగూ కొద్ది రోజుల్లో కొత్తగా కొనుక్కున్న ఇంటికి మారబోతున్నారు కాబట్టి, అక్కడ పెంచుకోవచ్చని తలిదండ్రులు మాట ఇస్తారు. ఆ కోరిక నెరవేరుతుంది కూడా.

తను సొంతంగా పెంచుకున్న గులాబీ తోట అంటే లయకు ప్రాణం. వాటిని ఎవరినీ ముట్టుకోనీయదు. ఒకరోజు ఒక గులాబీ పువ్వు ఎవరో తుంపేసి ఉండటం చూసి, లయ చాలా బాధ పడుతుంది. కోపం తెచ్చుకుంటుంది. ఆ తోటను చూసుకోవటానికి ఎవరినైనా కాపలా పెట్టాలని తల్లిదండ్రులపైన వత్తిడి తెస్తుంది. తమ ఇంట్లో పని చేసే యాదమ్మను, కాపలా ఉండటానికి ఎవరైనా దొరుకుతారేమో చూడమని అడుగుతారు. ఈ పనికి ఎవరైనా దొరకటం కష్టమనీ, తన మనుమరాలే ఒకమ్మాయి ఉన్నదని, ఆ పిల్ల తలిదండ్రులు కాంట్రాక్టు పనిమీద బొంబాయి వెళ్తూ, పిల్లను తన దగ్గిర వదిలి వెళ్ళారని, ప్రస్తుతానికి ఆ అమ్మాయిని ఉంచుకోమని చెప్తుంది. అలా దాదాపు లయ ఈడే ఉన్న సత్తెమ్మ (బేబి రవీన) తోటకు కాపలా ఉండటానికి కుదురుతుంది. లయ తలిదండ్రులు ఆ అమ్మాయినీ చాలా ప్రేమగా చూసుకుంటారు. సత్తెమ్మ అక్కడికే పుస్తకాలు తెచ్చి చదువుకుంటూ, ఆ తోట అందాలను పూర్తిగా ఆస్వాదిస్తూ, ప్రతి గులాబీ పువ్వుతో ఊసులాడుతూ ఉంటుంది. లయ రోజూ పువ్వులన్నీ లెక్కపెట్టుకుని, ఎవరూ కోసుకుని వెళ్ళటం లేదు కదా అని నిర్దారించుకుంటూ ఉంటుంది. ఆ తోటను అంత జాగ్రత్తగా చూసుకునే సత్తెమ్మకు కూడా ఒక్క పువ్వు ఇవ్వదు. “ఇది నేను పెంచుకున్న తోట. ఇవి నా పూలు. నేనేవరికైనా ఎందుకివ్వాలి? నాకెవరైనా ఇచ్చారా?” అంటుంది. అంతకుముందు, లయ ఒక బంగళాలో గులాబీల తోట చూసి, లోపలికి వెళ్లి, ఒకే ఒక్క గులాబీ పువ్వు కోసినందుకే, ఆ ఇంటావిడ నానా మాటలనీ, “నీకు గులాబీలంటే అంత ఇష్టమైతే, నువ్వు సొంతంగా మీ ఇంట్లో తోట పెంచుకోవాలి, అంతేగాని ఇలా ఊరిమీద పడి వేరేవాళ్ళ తోటల్లోని పువ్వులు తెంపకూడదు. అందుకని నువ్వు దొంగవే” అంటుంది. అవే మాటలు ఆ అమ్మాయి మెదడులో పడిపోయి, తనూ అలాంటి కరుకైన మనస్తత్వాన్నే అలవరుచుకుంటుంది.

మునుపెన్నడూ లేని లయ ఈ వింతైన ప్రవర్తనకు తలిదండ్రులు విస్తుపోతారు. లయ ఎందుకింత స్వార్థపరమైన మనస్తత్వాన్ని అలవరచుకున్నదో వాళ్లకు ఎంత ఆలోచించినా అంతుపట్టదు. మరోవంక, తన ప్రియమైన స్నేహితురాలు తనతో మాట్లాడటం మానేసినందుకు (దానికి కారణం తనకొక్కదానికే తెలుసు) రమ్య తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది. తను కలుపుకుని మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా, లయ రమ్యను చూస్తూనే, మొహం తిప్పుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లల మధ్య వచ్చిన ఈ వైమనస్యం వాళ్ల పెద్దవాళ్ళను కూడా కలచివేస్తుంది.

ఇలా ఉండగా, ఒకరోజు లయ స్కూలు వాళ్లు ఒక పల్లెటూరికి పిక్నిక్ ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రులు లయను సైకియాట్రిస్టుకు చూపించాలని అనుకున్నా, అదే రోజు పిక్నిక్ కూడా ఉండటంతో, పోనీ ఈ పిక్నిక్కి వెళ్ళడం వల్లనైనా తనలో కొంత మార్పు వస్తుందని వెళ్లనిస్తారు. పిక్నిక్కులో కూడా, లయ రమ్యకు దూరదూరంగా మెసులుతుంది. అయినా రమ్య లయ వెనుక వెనుకనే తిరుగుతూ ఆరోజు బంగళాలోనుంచి పరుగెత్తగానే లయకూడా తన వెనుకే పరుగెత్తుకొస్తున్నదనుకున్నానని, అలా యజమానురాలి చేతికి చిక్కి తిట్లు తింటున్నదనుకోలేదని, సారీ చెప్పి మళ్ళీ తనతో మాట్లాడమని బతిమాలుతుంది. అయినా లయ గుండె కరగదు.

ఆ పల్లెటూర్లో రైతులు తమ పొలాల్లోని, తోటల్లోని పండ్లు, ఫలాలు పిల్లలకు పంచి పెడతారు. తోట పాడుచేయకుండా ఎంతసేపన్నా ఆడుకోమంటారు. అవన్నీ వాళ్లు ఏమి ఆశించకుండా ఉచితంగా ఇవ్వడం లయను అబ్బురపరుస్తుంది. పొలాల్లో తిరుగుతూ దారి తప్పిన లయను ఆ ఊరి ఒక పిల్లవాడు వాళ్ల ఇంటికి తీసుకువెళతాడు. అక్కడ ఇంటిముందు, తాను ఎప్పటినుంచో కావాలని కలలుకంటున్న పసుపుపచ్చ గులాబీ మొక్కను చూసి లయ ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఇంతలొ లయ దారితప్పిందని తెలుసుకున్న టీచరు (ఆమె రమ్య తల్లి), రమ్య వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. లయను తీసుకుని తిరిగివెళ్ళే సమయంలో ఆ అబ్బాయి వాళ్ల వెనుకనే లయను పిలుస్తూ వచ్చి “నీకు ఈ పచ్చ గులాబీ ఆంటే ఇష్టం కదా, తీసుకో” అని ఇస్తాడు.

లయకు ఆశ్చర్యం వేస్తుంది. “అది మీ గులాబీ కదా. నాకెందుకు?” అంటుంది. “మాకు రోజూ చాలా గులాబీలు పూస్తుంటాయి. ఎవరికో ఒకళ్ళకు ఇస్తూనే ఉంటాం. ఎవరికీ ఇవ్వకపోతే వాడిపోతాయి. మాకు మళ్ళీ పూస్తాయికదా. తీసుకో” అంటాడు. లయకు ఆ మాటలు విని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పట్నాల్లో మనుషులకుండే స్వార్థపరమైన మనస్తత్వానికీ, పల్లెల్లో ప్రజలకు ఉండే నిష్కల్మషమైన మనస్తత్వానికీ ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. దాన్ని రమ్యకు ఇస్తుంది. “నీకు పచ్చ గులాబీ అంటే ఇష్టం కదా. నువ్వే ఉంచుకో” అంటుంది రమ్య. కాని అప్పటికే తీసుకోవటంలో కాకుండా ఇవ్వటంలోని ఆనందాన్ని గ్రహించిన లయ “నాకు పచ్చ గులాబీ ఇష్టమే, నువ్వూ ఇష్టమే” అని రమ్యను దగ్గరకు తీసుకుంటుంది. అక్కడితో మళ్ళీ ఇద్దరూ ఒకటవుతారు.

స్కూల్ ఢే ఫంక్షన్ లో తాము డాన్స్ క్లాసులో నేర్చుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ గీతానికి మిగతా పిల్లలతో కలిసి నృత్యం చేస్తారు. మనందరికీ తెలిసిన “Where the mind is without fear” అన్న గేయానికి ఓల్గా చక్కని తెలుగు అనువాదం చేశారు. అందులో పాల్గొన్న పిల్లలందరూ చక్కగా అభినయించారు. ఆ గీతం ఇలా సాగుతుంది.

ఎక్కడ మనస్సు నిర్భయమో

ఎక్కడ శిరసు సమున్నతమో

ఎక్కడ జ్ఞానం స్వతంత్రమో

ఎక్కడ విశ్వం ఎల్లలులేక విశాలమౌనో

ఎక్కడ పరిపూర్ణత అవిశ్రాంత అన్వేషితమో

ఎక్కడ వాక్కులు సత్యజనితములో

ఎక్కడ సహేతు సత్యప్రవాహం ఎడారిదారుల ఇంకనిదో

ఎక్కడ ఆలోచన, ఆచరణల మేధస్సు నిత్య విస్తారితమో

తండ్రీ! ఆ స్వేచ్చాతీరంలోనికి

మేల్కొలుపు నా దేశాన్ని

ఈ సినిమా లయ, రమ్య ఇద్దరూ ఈ పాటకు డాన్స్ నేర్చుకోవటంతోనే ప్రారంభమౌతుంది. రమ్య తల్లి (జ్యోతి రెడ్డి) డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. వాళ్లకు ఆ పాట అర్థాన్ని వివరిస్తూ ఆమె చెప్పిన మాటలతోనే ఈ సమీక్షను ముగిస్తే అర్థవంతంగా ఉంటుంది. చిత్రం సారాంశాన్ని కూడా ఈ మాటలు సరిగ్గా వ్యక్తీకరిస్తాయి.

“ప్రపంచమంతా సరిహద్దులనేవి లేకుండా ఒకటైపోవాలి. ఇది నాది, ఇది నీది అనే ధోరణి ఉండకూడదు. అన్నీ అందరివీ. ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి. మనసులు ఇరుకుగా, స్వార్థంగా ఉండకూడదు. అప్పుడు ప్రపంచం ఎంతో బాగుంటుంది. మనుషులందరూ ఆనందంగా ఉంటారు.”

వందేమాతరం శ్రీనివాస్, కన్నబాబు చక్కని సంగీతాన్ని సమకూర్చారు. మధు అంబట్, పి. రాజన్ల కెమెరా పిల్లల, పెద్దల భావాలను చక్కగా చూపించింది. పిల్లలందరూ చక్కగా అభినయించారు. పిల్లల స్కూలు వాతావరణం, వాళ్ల అమాయకత్వం, వాళ్లు చేసే అల్లరి మనసును ఆహ్లాదపరుస్తాయి. పిల్లలే కాదు, పెద్దలు కూడా చూసి ఆనందించాల్సిన చిత్రం ఇది.

2007 లో అక్కినేని కుటుంబరావు గారు “అమూల్యం” (అదీ ఓల్గా గారి కథే) అనే మరో చిత్రాన్ని నిర్మించారు. దానికీ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లభించింది. అందులో కూడా వర్షిణి ప్రధాన పాత్రలో నటించి అవార్డు తెచ్చుకుంది. ఆ సిడి నాకింకా లభ్యం కాలేదు.

చివరగా ఒక్క మాట. ఇలాంటి చిత్రాల్ని ‘బాలల చిత్రాలు’ అని వర్గీకరించటం నాకెందుకో నచ్చదు. ఆ చిత్రాలు పెద్దలు కూడా చూసి ఆనందిస్తున్నప్పుడు ‘బాలల చిత్రాలు’ అని ఇంకా అనటమెందుకు? అలా అని వాటిని తక్కువ చూపు చూస్తున్నామేమో. నిజానికి ఎన్నో అధ్వాన్నమైన మసాలా చిత్రాలకంటే, ఈ చిత్రాలే కొంత అర్థవంతంగా ఉంటాయి. ఉదాహరణకు, పోయిన వారం ‘నవతరంగం’ లో సమీక్షించిన The Way Home అనే కొరియా చిత్రం గురించి చదివిన తర్వాత, ఎంతోమంది అందులోని కథతో తమని తాము identify చేసుకున్నారు. పిల్లలనుంచి సహజమైన నటన రాబట్టుకోగలిగే మంచి దర్శకుల చేతిలో పడితే, ఇలాంటి కథలు చక్కని చిత్రాలుగా రూపొందుతాయి అనటంలో సందేహం లేదు.

ఎందుకు నరుక్కుంటారో, ఎందుకు హత్యలు చేసుకుంటారో, ఎందుకు మనుషులు అనైతిక సంబంధాలు ఏర్పరచుకుంటారో అర్థంగాని, అర్థం చేసుకోలేని పిల్లలకు, తలిదండ్రులు, బంధువులు అలాంటి సినిమాలకు తీసుకు వెళ్ళకుండా, ‘గులాబీలు’ వంటి మంచిని ప్రబోధించే చిత్రాలు చూపిస్తే, వాళ్ల మనసులు నిజంగానే, పూవులంత మృదువుగా ఎదుగుతాయనటంలో సందేహం లేదు.

——————————————-

‘గులాబీలు’ నవలనుంచి ఓల్గా గారు స్వయంగా చదివిన భాగాలను కూడా మీరు ఇక్కడ వినవొచ్చు.

గులాబీలు-ఓల్గా-పేజీ28-30

గులాబీలు-ఓల్గా-పేజీ64-68

11 Comments
  1. మురళి December 11, 2008 /
  2. మేడేపల్లి శేషు December 11, 2008 /
  3. శంకర్ December 11, 2008 /
  4. వినయ్ December 11, 2008 /
  5. చావా కిరణ్ కుమూర్ December 12, 2008 /
  6. ప్రదీప్ December 12, 2008 /
  7. రెండుచింతల భానుప్రసాద్ December 12, 2008 /
  8. P.Narasimha Murthy December 14, 2008 /
  9. Mohana July 22, 2013 /