Menu

కాపీయా? ప్రేరణా? – ఓ సినిమా పాటా, నీ పేరేమిటి?

తీరిగ్గా ఉన్న ఒక సెలవురోజు సాయంత్రం వాలుకుర్చీలో కూర్చుని, రేడియోలోనో, టివిలోనో లేదా మీ టేప్ రికార్డరులోనో మీకిష్టమైన పాటొకటి వింటున్నారు. అందులోని రిథంకీ, సంగీతానికీ అనుగుణంగా మీకు తెలియకుండానే మీ కాళ్ళు నేలను తాటిస్తూ ఉన్నాయి (మెలొడీ ఐతే ‘మనసు పులకరిస్తుంది’ అనుకోవచ్చు). హఠాత్తుగా, ఎక్కడో ఒకచోట “అరె! ఈ ట్యూనును ఇదివరకెక్కడో విన్నట్టుందే.” అనుకున్నారు. మీ మెదడు పొరల్లోని ఆర్కివ్స్ లోకి వెళ్ళాక, ఆ ట్యూను ఎక్కడిదో మీకు అర్థమైంది. అంతే! అంతకుముందు “ఎంత మంచి ట్యూను కంపోజ్ చేశాడు” అని మీరు మెచ్చుకున్న ఆ సంగీత దర్శకుడే మీకిప్పుడు అంగుష్టమాత్రుడిగా కనిపిస్తున్నాడు.

కార్తీక్ శ్రీనివాసన్-ఫోటో:హిందూ దినపత్రిక నుంచి

కార్తీక్ శ్రీనివాసన్-ఫోటో:హిందూ దినపత్రిక నుంచి

ఇలాంటి అనుభవం ఎప్పుడైనా, ఎవరికైనా కలగవచ్చు. కాని ఎంతమంది దాని మూలాల్లోకి వెళ్ళి పరిశోధిస్తారు? “సినిమా పాటల్లో పెద్ద పెద్ద దూడలకే ఎవరూ కేర్ చెయ్యరని నాకు తెలుసు. నేను చేస్తాను.” అన్నారు శ్రీశ్రీ ఒకచోట. అలాగే కార్తీక్ శ్రీనివాసన్ అనే ఓ కుర్రాడు ఇలాంటి దూడల్ని తప్పించుకుని పోకుండా కట్టేసి మరీ బందెలదొడ్డిలో పెట్టాడు. ఆ బందెలదొడ్డి పేరే Inspirations in Indian Film Songs. క్లుప్తంగా ItwoFS (దాన్ని ‘ఐ-టు-ఎఫ్-ఎస్’ అని పలకాలట).

ఇది ఇప్పటి సంగతి కాదండి. 2001 ది. శ్రీనివాసన్ తండ్రి పాశ్చాత్య సంగీత ప్రియుడు. లాటిన్, స్పానిష్ సంగీతాన్ని ఎక్కువగా వినేవాడు. తను విన్న ఆ పాశ్చాత్య సంగీతానికీ, భారతీయ సినిమాల్లోని పాటలకూ మధ్యగల పోలికలను చెప్తూ ఉండేవాడు. ఈ సమాచారమంతా వృధా పోనివ్వడమెందుకులే అని శ్రీనివాసన్ అసలు పాటల, కాపీ పాటల ఆడియో క్లిప్సును ఒక ఫ్రీ సర్వర్లో అప్ లోడ్ చేస్తూ, ఆ లింకులను అంతర్జాలంలోని డిస్కషన్ గ్రూపుల్లో పేర్కొనేవాడు – అవి కాపీ ట్యూనులని చెప్పడానికి సాక్ష్యంగా. ఒకసారి నదీం-శ్రావణ్ సంగీతదర్శకత్వం వహించిన ‘ధడకన్’ అనే చిత్రంలోని రెండు పాటల బాణీలు మిడిల్ ఈస్ట్ పాటల బాణీలకు దగ్గరగా ఉండటం గమనించాడు. మెల్లిగా ఈ వార్త ఆనోటా ఆనోటా పాకి, ‘ఇండియా టుడే’ సెప్టెంబర్ 3, 2001 సంచికలో ఒక చిన్న కథనం రాస్తూ, కాపీ ట్యూన్స్ గురించి శ్రీనివాసన్ వెబ్సైటులో ఇచ్చిన లింకును పేర్కొన్నారు. సరే, ఇదేదో ఆసక్తికరమైన వ్యవహారమే అనుకున్న శ్రీనివాసన్ తనే ఒక సైటు ఎందుకు ప్రారంభించకూడదు అనుకుని www.itwofs.com అనే సైటు ప్రారంభించాడు.

అలా ఇప్పటికిందులో హిందీ, తమిళం, తెలుగు భాషలలోని సినిమాలకు చెందిన ఐదువందలకు పైగా కాపీ ట్యూనుల ప్రస్తావన ఉంది. వాటిల్లో హిందీ పాటల సంఖ్యే ఎక్కువ. శ్రీనివాసన్ పరిశోధన ప్రకారం ఈ ‘కాపీ ఆచారం’ నిన్నమొన్నటిది కాదట. గత అర్థ శతాబ్దంగా జరుగుతూ వస్తున్నదేనంటున్నాడు. కొత్త తరంలోని అనూమాలిక్, నదీం శ్రవణ్, ప్రీతం చక్రవర్తిలతో పాటుగా పాతతరంలోని ఆర్.డి. బర్మన్, ఓ.పి. నయ్యర్, రాజేష్ రోషన్ వంటివారూ ఈ జాడ్యం అంటించుకున్నవారే (‘మొదలైనవారు’ అని రెండు చోట్లా మీరే చదువుకోండి).

శ్రీనివాసన్ కృషి గురించి ఇప్పటివరకూ అనేక పత్రికల్లో ప్రస్తావించబడటమేకాక, ‘సి.ఎన్.బి.సి.’, ‘సి.ఎన్.ఎన్. -ఐ.బి.ఎన్’ వంటి టివి చానెల్స్ కార్యక్రమాలు నిర్వహించాయికూడా (ముఖ్యంగా సి.ఎన్.బి.సి లో కరణ్ థాపర్ కార్యక్రమం చూడండి). కాపీ ఆరోపణలున్న సంగీత దర్శకులు ఇచ్చిన వివరణలు ఆసక్తికరంగా ఉన్నాయి.
“ఇది ఒక సాఫ్ట్ వేర్ ప్రాబ్లం. నేను ఈ ట్యూనును ఆ సాఫ్ట్ వేర్ నుంచి తీసుకున్నాను. బహుశా ప్రిన్స్ కూడా అదే సాఫ్ట్ వేర్ని ఉపయోగించినట్టున్నాడు. – ఆదేశ్ శ్రీవాస్తవ్.

“ఒక హోటల్లో విన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాకు బాగా నచ్చింది. అదే మా మెదడులో ఉండిపోయింది.” – నదీం శ్రవణ్.

“ఒక మంచి పాటంటే, కేవలం కంపోజింగ్ మాత్రమే కాదు. దాన్ని ఎలా డిజైన్ చేసి, ప్రెజెంట్ చేస్తామనేది కూడా ముఖ్యం.” – ప్రీతం.

“Inspiration కి, plagiarism కి తేడా ఉంది. నా చాలా పాటలు పాశ్చాత్య బాణీలనుంచి ప్రేరణ పొందినవే. ఎస్.డి. బర్మన్, సలీల్ చౌధరీ, ఆర్.డి. బర్మన్ వంటి దిగ్గజాలు కూడా వీటికి అతీతులు కారు. కాని మేమంతా ఈ బాణీలను మన భారతీయ పద్ధతికి అనుగుణంగా మా సృజనాత్మకతను జోడించి తయారుచేశాం. ఇప్పటి సంగీతదర్శకులు లక్ష్మణరేఖలని దాటిపోయి, పాకిస్తానీ, అరబిక్, స్పానిష్ బాణీలకు జిరాక్స్ కాపీలను తయారుచేస్తున్నారు.” – బప్పీలహరి

ఈ విషయంలో మన తెలుగువాళ్ళూ తక్కువేం తినలేదండి. ఆర్.పి. పట్నాయక్, దేవా, మణిశర్మ, కోటి వంటి వాళ్ల ‘కృషి’ మీకు శ్రీనివాసన్ సైటులో కనిపిస్తుంది. కాకపోతే, అన్ని అనుకరణలూ ‘కాపీ’ కింద జమకట్టలేమని, కొన్ని నిజంగా ప్రేరణలేనని శ్రీనివాసన్ అంటున్నాడు. ఆ వివరాలన్నీ అతని సైట్లో చూడవచ్చు.

కాపీ అనటం భావ్యమో, కాదో నాకు తెలియదుగాని, మన వెనకటి నలుపు-తెలుపు చిత్రాల యుగంలో కూడా కొన్ని తెలుగు చిత్రాల్లోని పాటల బాణీలు బెంగాలీ వంటి భాషాచిత్రాల్లోనుంచి తీసుకున్న సందర్భాలున్నాయి. దీనికి ఒక కారణం బెంగాలీ సాహిత్య ప్రభావం తెలుగువారిపైన బాగా ఉండటం (చాలామంది పాఠకులు ‘శరత్’ తెలుగు రచయితే అనుకునేవారట), కొన్నిబెంగాలీ సినిమాలు తెలుగులో కూడా చిత్రాలుగా రూపొందించడంవల్ల కావచ్చు. మచ్చుకి రెండు పాటలను ఇక్కడ పేర్కొంటున్నాను.

అసలు పాట: అమర్ సోప్నే….
చిత్రం: సాగరిక (1956) (బెంగాలీ)
గానం: శ్యామల్ మిత్రా
సంగీతం: రబీన్ ఛటర్జీ

http://www.youtube.com/watch?v=yTQVxXcHohY

తెలుగు పాట: నా హృదయంలో నిదురించే చెలీ
చిత్రం: ఆరాధన (1962)
గానం: ఘంటసాల
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు

http://www.raaga.com/channels/telugu/artist/Ghantasala_Venkateswara_Rao.html

అసలు పాట: కె తుమి అమారే దాకో
చిత్రం: అగ్నిపరీక్ష (1954)(బెంగాలీ)
గానం: సంధ్యా ముఖర్జీ
సంగీతం: అనుపం ఘటక్

http://uk.youtube.com/watch?v=nqRxRm_DXVw

తెలుగు పాట: పెను చీకటాయే లోకం
చిత్రం: మాంగల్యబలం (1958)
గానం: ఘంటసాల, సుశీల
సంగీతం: మాస్టర్ వేణు

http://www.musicindiaonline.com/p/x/Oq2_jSsId9.As1NMvHdW/

కొన్ని హిందీ సినిమా పాటల బాణీలు కూడా ఇలాగే యథాతథంగా మన తెలుగు సినిమాల్లో వాడుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కాని ఆ హిందీ పాట కూడా ఏదో ఒక విదేశీ పాట కాపీయే – కొన్ని సందర్భాల్లో. ఇలా చూస్తూ పోతే, నేతిబీరకాయలోని నేయిలా మన సంగీతంలోని ఘుమఘుమలు అసలైనవి కావని అర్థమై మనసు చివుక్కుమంటుంది.

23 Comments
 1. dnchari December 22, 2008 /
 2. shree December 22, 2008 /
  • venkat February 24, 2010 /
  • Kriz April 2, 2011 /
  • Kriz April 2, 2011 /
  • హెర్క్యులెస్ April 3, 2011 /
 3. శంకర్ December 22, 2008 /
 4. Sreenivas Paruchuri December 22, 2008 /
 5. శంకర్ December 22, 2008 /
 6. శివ బండారు December 22, 2008 /
 7. అబ్రకదబ్ర December 23, 2008 /
 8. నియంత December 23, 2008 /
 9. మేడేపల్లి శేషు December 24, 2008 /
 10. మేడేపల్లి శేషు December 24, 2008 /
 11. Sowmya December 24, 2008 /
 12. T K Venugopal December 25, 2008 /
 13. మేడేపల్లి శేషు December 26, 2008 /
 14. sriram velamuri January 24, 2009 /