Menu

దోస్తానా

వారాంతంలో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూద్దామని అలా థేమ్స్ నది ఒడ్డున నడుస్తూ అనుకోకుండా తలెత్తి చూసేసరికి మా ఊరి సినిమా హాల్ దగ్గరున్నానని తెలిసింది. అప్పుడే సినిమా థియేటర్ లోనుంచి బయటకి వస్తున్న ఇద్దరు ఇంగ్లీషోళ్ళు నా దగ్గరకొచ్చి పిచ్చ పిచ్చగా బూతులు తిట్టడం మొదలుపెట్టారు. నేనేమి చేశానో అర్థం కాక తెల్లమొహమేస్తే, “నువ్వు దోస్తానా సినిమా చూడలేదా?” అన్నాడు. లేదండీ అన్నాను.నువ్వు చూసినా చూడకపోయినా మాకనవసరం. నువ్వు మా బాధ వినాల్సిందే అన్నాడు. సరే చెప్పండి అన్నాను.చెప్పడం కాదు ఈ ప్రశ్నలకు మాకు సమాధానాలు కావాలి చెప్పు అని నిలదీశారు.

ప్రశ్నలు:

ఎక్కడో ఉండే అమెరికా దేశం. అంత పెద్ద అమెరికాలో మైయామీ అనే పట్టణం. ఆ పట్టణంలో ఒక హాస్పిటల్ లో పని చేసే మగ నర్సు. అదే ఊర్లో ఫోటోగ్రాఫర్ గా పని చేసే మరొకడు. అనుకోకుండా వీళ్లిద్దరూ కలుసుకున్నారే అనుకో. ఆశ్చర్యం గా వీళ్లిద్దరూ ఇండియన్స్ అవ్వడం అసలు సాధ్యమా? ఒక వేళ అలా అయ్యారే అనుకో. వాళ్ళిద్దరూ ఒకే సమయంలో ఇల్లు కోసం వెతకడమేంటి. వాళ్ళిద్దరూ ఒకే ఇంటికోసం ప్రయత్నిస్తూ ఒకే టాక్సీలో ఎక్కడమేంటి? ఎక్కారే అనుకో. ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళకి ఆ ఇంటి ఓనర్స్ కూడా ఆశ్చర్యంగా భారతీయులే కావడం సాధ్యమా? పోనీ అలా కూడా సాధ్యం అయ్యిందే అనుకో. ఆ ఇంట్లోనే ఒక అందమైన అమ్మాయి కనిపించడం ఆమె వీరిద్దరికీ నచ్చడం మా సినిమాల్లోనూ ఉంటుంది కాబట్టి క్షమించెయ్యవచ్చు. కానీ ఆ అమ్మాయి కి బాస్ ఉంటాడే వాడు భారతీయుడు అవటం ఎలా సాధ్యం? పోనీ ఇది కూడా కో ఇన్సిడెన్స్ అనుకుందాం. ఆ బాస్ గాడు పోయి మరో కొత్త బాస్ వస్తున్నాడంటే వాడూ మీ వాడే. అసలిలా ఎలా సాధ్యం?కథ మీ దేశంలో జరుగుతోన్నట్టుగా అందరూ భారతీయుల్ని కథలో పెట్టినప్పుడు మీరిలా మైయామీ లో సినిమా తియ్యాల్సిన అవసరమేంటి?

టకా టకా వాళ్ళడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేదు కానీ “మీరెప్పుడైనా మైయామీ జెండా చూశారా?” అని వాళ్ళకే ఎదురు ప్రశ్న వేసి అక్కడ్నుంచి ముందుకి కదిలాను.

———————————————

కాఫీ విత్…

అక్కడ్నుంచి నడుస్తూ వుంటే ఏదో సినిమా షూటింగ్ కోసం ఇక్కడ లొకేషన్స్ కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఒక కెఫే లో కూర్చున్న బాలీవుడ్ దర్శక నిర్మాత కనిపించాడు. నన్నెక్కడ గుర్తు పడతాడో “come have coffee with me” అంటాడేమో అని భయపడ్తూ ఆయన వెనుక సీట్లో కూర్చున్నాను. ఆయన కాఫీ తాగుతూ ఎదో సీరియస్ గా రాసుకుంటున్నాడు. తొంగి చూశాను. ఆయన డైరీ రాసుకుంటున్నాడు. డైరీలు చదవడం నాకు వీక్ నెస్. ఇక ఏమీ చెయ్యలేక తొంగొ తొంగి చూస్తూ ఆయన డైరీ చదివాను. రైటింగ్ ఛండాళంగ ఉండటం వలన అలాగే అప్పుడప్పుడు ఆయన తల అడ్డం వస్తుండడం వలన పూర్తిగా చదవలేకపోయాను కానీ నేను చదివినా ఆయన డైరీ ఎంట్రీ లోని ఒక excerpt:

“…….నేను అనుకున్నది ఒక్కొక్కటీ సాధిస్తున్నందుకు ఆనందంగా వుంది. ఘజనీ ఘోరీల తర్వాత భారతదేశ సంస్కృతిని దోచుకున్న వాళ్ళలో నా పేరు మొదట ఉంటుందని తెలిసి ఆనందంగా వుంది…..ఎందుకో తెలియదు నాకు అప్పుడప్పుడూ బాధ వేస్తుంది. నేను చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యలేకపోతున్నాను. కాలేజీ కుర్రాళ్ళను విజయవంతంగా పాడు చెయ్యగలిగాను. విదేశాల్లో మన వాళ్ళ జీవితాలు ఎంత భారీగా ఉంటాయో అని ఒక భ్రమ కలిగించి అందరికీ విదేశీ వ్యామోహం కలిగించగలిగాను. మన వాళ్ళు మన దేశంలోనే ఏమీ సాధించలేకపోయినా విదేశాల్లో ఫుట్ బాల్ ఆటగాళ్ళగా…….సినిమాలో అక్రమ సంబంధాలను పెద్దగా ఆదరించలేదని నాకు బాధ వేస్తుంది. అయినా కూడా సంతోషమే….నా సినిమాల్లో అమ్మాయిలను మగవాడి ఆటవస్తువులుగా బాగా చూపించగలిగాను……..ప్రీ మేరిటల్ సెక్స్ కూడా బాగానే ప్రమోట్ చెయ్యగలిగాను. దోస్తానాతో నేను మరో మెట్టు ఎక్కినట్టే….యా….నేను ఇలాగే సినిమాలు తీస్తాను. మన సంస్కృతి సంప్రదాయాలనే ముసలి పీనుగల పీకలపై కి రాబందుల్లా నా సినిమాలు వదిలి ఈ దేశాన్ని లిబరేట్ చేసి యువతకి శక్తినిస్తాను….ఆడిపాడేలా చేస్తాను…….వాళ్ళు బాధ్యత మర్చిపోయి …..”

—————————————-

ఆస్కార్ వైల్డ్

భారతదేశ ప్రియతమ సినిమా నిర్మాత/దర్శకుడి డైరీ చదివిన షాక్ లో ఎక్కడ తిరుగుతున్నానో, ఏం చేస్తున్నానో తెలియని గందరగోళంలో ఊరంతా తిరుగుతూ మా ఊరి జైలు పక్కనున్న పార్క్ కి చేరుకుని అక్కడున్న బెంచీలో కూలబడ్డాను. తలొంచుకుని ఆలోచనల్లో పడుంటే పక్కనెవరో కూర్చున్నట్టనిపించి తలెత్తి చూశాను. పక్కనెవరో ఇంగ్లీషు ముసలాయన కూర్చుని నా వైపే చూస్తున్నాడు. ఏంటని అడిగాను. నీ గురించే ఎదురుచూస్తున్నా అన్నాడాయన. ఏంటి సంగతి అన్నాను.దోస్తానా గురించి అన్నాడాయన. ఇప్పుడో అప్పుడో పోయేలా ఉన్న ఈ ఇంగ్లీషు ముసలాడికి దోస్తానాతో ఏమొచ్చిందా అని నేను అనుమానపడ్తుంటే, నేనేవరో తెలుసా అడిగాడాయన. నాకెలా తెలుస్తుందని తలూపాను. నా పేరు ఆస్కార్ వైల్డ్. నేనొక రచయితను. ఇప్పుడు నువ్వు కూర్చున్న పార్క్ నా జ్ఞాపకార్థం నిర్మించిందే అన్నాడు. నాకు భయమేమీ వెయ్యలేదు. ఐతే ఏంటన్నట్టు చూశాను.ఆయన మొదలు పెట్టారు.

“దేశ దేశాల్లో స్వలింగ సంపర్కులు తమ హక్కుల కోసం ఎలా పోరాడుతున్నారో నీకేమైనా తెలుసా? అసలు ఒకప్పుడు స్వలింగ సంపర్కం నేరమని చెప్పి అలాంటి వారిని జైళ్ళలో పెట్టే వారని తెలుసా?  ఈ మధ్య జనాలందరూ స్వలింగ సంపర్కులను మరీ హీనంగా చూడటం లేకపోయినా ఇప్పటికీ అలాంటి వారిని సమాజం వెలి వేసినట్టు చూస్తూనే ఉందని తెలుసా? పోనీ, స్వలింగ సంపర్కుడయినందుకు నన్ను జైల్లో పెట్టి ఘోరంగా హింసించారనైనా తెలుసా?” అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మళ్ళీ మొదలుపెట్టారు.

“ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాల్లో స్వలింగ సంపర్కులు తమకి దక్కాల్సిన గౌరవం కోసం ఎన్నో కష్టాలనుభవిస్తుంటే మీ దేశంలో మాత్రం గే సంస్కృతి ని కామెడీ చేస్తూ సినిమాలు తీయడం ఒక వింతైతే, అసలే మాత్రం వ్యతిరేకత లేకుండానే మీరు ఆ సంస్కృతిని మీ జీవితాల్లోకి ఆహ్వానించడం కూడా వింతగా వుంది. ఎందుకిలా జరుగుతోందా నీకేమైనా తెలుసా?” అని అడిగాడు ఆస్కార్ వైల్డ్.

సమాధానంగా “సార్, మీరు అన్నదాంట్లో చాలా నిజం వుంది. మా దేశంలో ఇలా జరగడానికి కారణం దోస్తానా అనే సినిమా dared to push the envelope in its own way. It brought homosexuality out of the closet. ఇలాంటి సినిమాల వల్ల మా దేశం చాలా అభివృద్ధి చెందింది గా మేము భావిస్తున్నాము” అని చెప్పాను.

“అయితే అప్పట్లో ఫైర్, గర్ల్ ఫ్రెండ్ సినిమాలో స్త్రీల స్వలింగ సంపర్కాన్ని చూపిస్తే రచ్చ చేసిన మీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎందుకు ఇలా సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు ఎన్వలప్ ని పుష్ చెయ్యలేదా?” అని అడిగాడు ఆయన.

“ఎక్కడైనా ఎప్పుడైనా మా దేశంలో పురుషులదే ఆధిక్యత. అన్నీ తెలిసిన మీకు నేనా విషయం చెప్పాల్సిరావడం బాధగా వుంది.” అని చెప్పి ఇంటికి తిరిగివచ్చాను.

————————————————–

రుద్దుడు

ఇంటికి తిరిగొచ్చి దోస్తానా గొడవ కాసేపు మర్చిపోదామని టివి పెడ్తే xyz ఛానెల్ లో ఆసక్తికరమైన ఒక ప్రోగ్రామ్ వస్తోంది. ఇందులో ఒక ప్రఖ్యాత సైంటిస్ట్ ’రుద్దుడు థియరీ’ గురించి వివరిస్తున్నారు. ఈ రుద్దుడు థియరీ ప్రకారం మీడియా ఒక మసాజ్ పార్లర్ లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు.

మీడియా మనల్ని సోఫాల్లో కూర్చోబెట్టి సమ్మగా మసాజ్ చేస్తుంటే మనం హాయిగా కూర్చుని వినోదం పొందుతున్నామనే భ్రమలో ఉండగా ఈ మసాజ్ తో మన మెదళ్ళలో మనకి అనవసరమైన మెసేజ్ లు పెడ్తుందని ఉదాహరణలతో నిరూపించారు.

ఈ ప్రోగ్రాం లో చెప్పిన ఒక మంచి ఉదాహరణ:

“కొన్నేళ్ళ క్రితం బిగ్ బి అనే పెద్ద బాలీవుడ్ స్టార్ కుమారుడు సినిమా రంగంలోకి తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈయన మొదట్లో నటించిన సినిమాలు చూసి జనాలు జడుసుకున్నారు. అయితే అంత పెద్ద స్టార్ కొడుకు సినిమాలు ఫ్లాప్ అవ్వడం భరించలేని భారతీయ మీడియా రుద్దుడు కార్యక్రమం మొదలుపెట్టింది. అలా నాలుగైదేళ్ళు రుద్దే సరికి జనాలు నెమ్మదిగా మారిపోయారు. ఇప్పుడు ఆ బడా స్టార్ పుత్ర రత్నం మరో బడా స్టార్ అయి కూర్చున్నాడు.

అలాగే చొక్కా విప్పి కండలు చూపించడం తప్ప మరో విషయం తెలియని ఒకతన్ని తీసుకొచ్చి మీడియా రుద్దుడు కార్యక్రమ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ నటుడు మరో బడా స్టార్. అంతెందుకు అప్పుడెప్పుడో మిస్ వర్ల్డ్ గా అన్నికైన ఒకమ్మాయిని చూసి బాబోయ్ ఈవిడ మిస్ ఇండియానా అనుకున్నా ప్రజల పై రుద్దుడు కార్యక్రమం బాగా పనిచేసి ఆవిడనే ఇప్పుడు అతిలోక సుందరి అనిపించేలా చేయడంలో కూడా మీడియా విజయవంతంగా తన పని పూర్తి చేసిందని” ఈయన చెప్పుకొస్తూ, ఈ రుద్దుడు థియరీ వల్లనే దోస్తానా అనే సినిమా పెద్ద హిట్ అయిందని కూడా అనుమానించారాయన.

—————————————

ఇలా దోస్తానా అనే ప్రజాదరణ పొందిన భారతీయ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో కదా అని ఆలోచిస్తూ నిద్రకుపక్రమించాను.

12 Comments
  1. j.suryaprakash December 2, 2008 /
  2. శంకర్ December 2, 2008 /
  3. ravi December 2, 2008 /
  4. sasank December 3, 2008 /
  5. Sreeram December 3, 2008 /
  6. Nisheedhi December 4, 2008 /
  7. కొత్తపాళీ December 5, 2008 /
  8. chandru December 16, 2008 /
  9. srinivas goud December 19, 2008 /