Menu

గమ్యం చేరని..’దొంగల బండి’

ఈ సినిమాలో ఓ ఫన్నీ సీన్ (దర్శకుడి అభిప్రాయం) ఉంటుంది. అడవిలో దొంగలంతా వెళ్తూంటారు. ఇంతలో హఠాత్తుగా పులి గాండ్రింపు వినపడుతుంది.దాంతో అందరూ భయపడి ప్రక్కనున్న చెట్లు గబగబా ఎక్కేస్తారు. అయితే అందులో ఒకడైన అల్లరి నరేష్ మాత్రం ఎక్కడు. కారణం ఏమిటి అంటే మీరు భయపడతారో లేదో టెస్ట్ చేద్దామని నేనే పులి గాండ్రింపుని మిమిక్రీ చేసాను అంటాడు. దాంతో అంతా నరేష్ ని తిట్టుకుంటూ చెట్లు దిగుతారు. సరిగ్గా ఈ సినిమా పరిస్ధితీ అలానే ఉంది. దొంగలంతా అడవుల్లో ఎప్పుడో దాచిన నిధిని దోచుకోవటానికి ఓ రైలు బండిలా బయిలుదేరితే భలే గమ్మత్తుగా..కామెడీగా ఉంటుంది కదా అని మనం ఏవేవో ఊహించుకుని ధియేటర్ కి వెళితే అంతా ఉత్తుత్తినే ..అడవిలో ఏం జరగదు..ఆసక్తి రేపటం కోసం ఆ నేపధ్యం తీసుకున్నాం అంతే అని తేల్చేసారు. అప్పుడు మన పరిస్ధితీ ఆ చెట్లు ఎక్కి దిగిన వాళ్ళ స్థితే…

ఎప్పుడో నవాబుల కాలంలో తమ తాతలు దొంగిలించి దాచిన నిధిని వారి మనువలు ఒక్కటై ఎలా తిరిగి సాధించుకున్నారనేదే ఈ చిత్ర కథ . నైజాం నవాబులు తమ సంస్ధానాన్ని భారత్ లో విలీనం చేసేటప్పుడు సంపదను రహస్యంగా దాచి కాపాడుకోవాలనికుంటారు. అప్పుడు ముగ్గురు దొంగలు (అలీ,ఎమ్మెస్ నారాయణ,వేణు మాధవ్) దానిని దారిలోనే కొట్టేసి ఆ అడవిలోనే దాచి ఆ స్ధలం చేరుకునే మార్గాన్ని మ్యాప్ రూపంలో గీసుకుంటారు. అంతేగాక నమ్మకం కోసమో(కధ నడవటం కోసమో,మన టైమ్ బ్యాడ్ అయ్యో) దానిని మూడు ముక్కలు చేసుకుని తలా ఒకరి దగ్గరా భద్రపరుచుకుని విడిపోతారు. తర్వాత కాలంలో వారు మనుమలు కృష్ణ(అల్లరి నరేష్),ఐశ్వర్య(తాన్య),డాన్ (డబుల్ వేణు మాధవ్) దొంగల్లా పెరిగి పెద్దయి ఆ నిధి అన్వేషణకోసం బయిలుదేరతారు. మరో ప్రక్క మనం ఊహించినట్లు గానే కృష్ణ,ఐశ్వర్య ప్రేమలో పడతారు. ఇక ఆలా విడిపోయి ఎక్కడెక్కడో ఉన్న ఆ దొంగల వారుసులంతా ఎలా కలిసారు,అడవికి ఎలా బయిలుదేరారు అనేది ఫస్టాప్ అయితే అడివిలో ఏం సాహసాలు చేసి ఆ నిధిని సంపాదించారన్నది సెకెండాఫ్.

అయితే అడవిలో ఆ దొంగలు ఏం చేసారనగానే మీ ఊహా శక్తికి పదును పెట్టి ఏమేమో ఊహించుకోవాల్సిన పనిలేదు. వాళ్ళు అడివిలో అలా టెంట్ వెనక్కి వెళదామా అనే డబుల్ మీనింగ్ డైలాగులు వేసుకోవటం,తినటం,పడుకోవటం,నడవటం తప్ప ఏం చేయరు.దాంతో అసలు కావాల్సిన విషయం లేకపోవడమే మైనస్ గా మారి మహా నసగా తయారయ్యింది. ఇక నో లాజిక్‌ ఒన్లీ ఫన్‌ మేజిక్‌.. అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా ఓసెన్ లెవన్ ప్రేరణతో చేసినట్లనిపిస్తుంది.

అలాగే ఫస్టాఫ్ పూర్తయ్యే సరికే హీరో,హీరోయిన్ ప్రేమ ఎపిసోడ్ పూర్తయిపోతుంది. అలాగే ఎక్కడెక్కడో ఉన్న దొంగల మనమలంతా కూడా ఒకటవుతారు..చేరాల్సిన ప్లేస్ అయిన అడవికి వచ్చేస్తారు. ఇక మిగిలింది నిధిని సంపాదించటమే. అయితే ఆ నిధి అన్వేషణలో ప్రతికూల శక్తులు అడ్డంగా వచ్చి సవాల్ విసిరితే మజాగా మిగిలిన కథ నడిచేది. అయితే అలా జరగలేదు. కథలో సంఘర్షణ కొద్దిగా కూడా లేకుండా పోయింది. దాంతో బోర్ స్టార్ట్ అయింది. అలా సినిమాకు ప్రాణమైన ఆ మిడిల్ పేజ్ ని అలీ చెత్త కామెడీ,నరమాంస భక్షకుల పాచి కామెడి ఎపిసోడ్లతో నింపేసారు. అంతే ఫినిష్.

ఇక ఇలాంటి సినిమాల్లో ప్రధాన పాత్రలకు ఇన్నర్ కాంప్లిక్ట్ ఉండి ఒక్కో సంఘటనకు వారిలో వచ్చే మార్పు చూపిస్తే బాగుంటుంది. పోనీ అలా కాకపోయినా చివరలో పరాయి సొమ్ము పాము వంటిదనో..లేక దొంగతనం తప్పనో చిన్న నీతి ఉన్నా నచ్చుతుంది. అలా కాకుండా దొంగలు ఏదో తమ ఆస్ధి అన్నట్లు ఆ నిధిని దోచుకుపోతుంటే..మనకు కరెక్టే అనిపించదు. అలాగే దొంగలు ఈ నిధి అన్వేషణలో దాన్ని కాక తమ జీవితానికి సంభందించిన మరో ట్రెజర్(నిధి) ని ఆవిష్కరించుకుంటే బాగుండేదనిపిస్తుంది.

ఇక అల్లరి నరేష్ కి ఇలాంటి దొంగ క్యారెక్టర్స్ కొట్టిన పిండే. మొన్నే బ్లేడు బాబ్జీ లో చేసేసాడు(దానికీ కథ,మాటలు ఈ దర్శకుడే). అలాగే హీరోయిన్ గా కొత్త అమ్మాయి తాన్యా యధా శక్తి గ్లామర్ ని ఒలికించింది. మిగతా కామిడీ ప్యాడింగ్ అంతా ఎప్పటిలాగే సీన్ బాగున్న చోటల్లా నవ్విస్తూ మిగిలిన చోట సహనాన్ని పరీక్షించారు. ఫైనల్ గా రచయిత నుండి దర్శకుడుగా మారిన వేగిశ్న సతీష్ దర్శకుడుగా సక్సెస్ అని చెప్పాలి( అయితే డైరక్టర్ అనే వారికి కథా,కథనాలు సరైనవి ఎన్నుకోవాల్సిన భాధ్యత కూడా ఉందనే కండీషన్ లేకపోతేనే). ఇక రైటర్ గా ఫెయిల్యూర్ అనిపిస్తాడు.మంచి కథ ఉంటే హిట్ సినిమా గ్యారెంటీగా తీస్తాడని భరోసా ఇచ్చేలా చేసాడు. అయితే ఇవివి ప్రభావం చాలా ఉందని బూతు డైలాగులు,సన్నివేశాలు చెబుతాయి. కెమెరా,ఎడిటింగ్ బాగున్నాయి. సంగీతం ఓకె.

మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమాకి బోరు కొట్టి వెళితే జీవితం కన్నా బోర్ కొట్టేవి చాలా ఉన్నాయన్న ధైర్యం వచ్చేస్తుంది. అలాగే ఈ సినిమా బాగుంది అనిపించాలంటే ఫస్టాఫ్ చూసి మొహమాటం లేకుండా వచ్చేయటం ఒకటే మార్గం.

సంస్థ: జి.యస్‌.కె.నెట్‌వర్క్‌
నటీనటులు: నరేష్‌, తాన్య, మలిష్కా, జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్‌, గీతాసింగ్‌, మాస్టర్‌ భరత్‌ తదితరులు
కెమెరా:అరుణ్ కుమార్
ఆర్ట్ : రమణ
సంగీతం :వల్లూరి రాజశేఖర్‌
కధ,స్క్రీన్ ప్లే,మాటలుదర్శకత్వం: వేగేశ్న సతీష్‌
నిర్మాత: జి.యస్‌.కె.నాయుడు
విడుదల:డిసెంబర్ పన్నెండు 2008

6 Comments
  1. ceenu December 13, 2008 /
  2. hemachendra December 13, 2008 /
  3. శంకర్ December 13, 2008 /
  4. kumar December 15, 2008 /
  5. శ్రీరాం April 22, 2009 /