Menu

సినీనటి భూమిక ‘మాయానగర్’

సినీనటి భూమిక నేతృత్వంలో ఒక సినిమా పత్రిక వస్తుందని కొన్ని పత్రికలు,వెబ్ సైట్లూ కొన్నాళ్ళనుంచి హోరెత్తిస్తున్నాయి.ఫలానా వారు వచ్చి ఆవిష్కరించారని మరలా హోరు మొదలయ్యాక,పెద్ద అంచనాలు లేకపొయినా ప్రారంభసంచికను దాచుకోవచ్చు కదా అని ఎప్పుడూ పత్రికలు కొనే షాపులో అడగ్గా మొదటి సంచిక అయిపోయిందండి,సెకండ్ ఇష్యూ ఉంది పట్టుకెళ్తారా అన్నారు వారు.సరే అని తీసుకొచ్చి తాపీగా చదివాను.పత్రిక పేరు‘మాయానగర్’గ్లాజీ పత్రిక,గ్లేజుడ్ పేపరు మీద కళ్ళు జిగేల్ మనిపించేలా ఉన్న ముద్రణ,ఇవ్వాళ మార్కెట్ లో ఉన్న చాలా సినిమాపత్రికల కన్నా మెరుగనిపించింది.

పాతకాలపు నాటి సినిమా పత్రికల విలువలను కొంతమేరకన్నా కొనసాగిస్తున్న ‘సితార’పత్రికను మినహాయిస్తే దాదాపు మిగిలిన సినిమా పత్రికలన్నీ ఒకే మూసలోనే ఉంటాయి,అదేమి చిత్రమో గాని! మాయానగర్ రెండో సంచిక కాబట్టి సహజంగానే పత్రికావిష్కరణ వివరాలు.అతిధులచిత్రాలు సింహభాగం ఆక్రమించాయి,అది సంప్రదాయం కూడా.
ఇవ్వాళ మనకు దొరుకుతున్న తెలుగు సినిమాపత్రికలలో స్థూలంగా కొన్ని రకాలున్నాయి.సితార లాగ అన్ని వార్తలూ,వివరాలు ఇచ్చేవి,అక్కడేదో జరుగుతుంది మేము మీకోసం కష్టపడి ఆ వివరాలన్నిటినీ మీకందిస్తునాం అని ఆయాసపడిపోయేవి కొన్ని,అచ్చం గా అభిమానులకోసం వెలువడుతున్నవి కొన్ని,కొన్ని సినిమాల విడుదలప్పుడు మాత్రం విపణివీధిలో కనిపించి మాయమయ్యేవి మరికొన్ని,ఇవి కాక కాసిని సినిమా కబుర్లు మరికాసిని సాఫ్టు పోర్న్ కధలతో పాఠకులను ఆకట్టుకోవాలని యత్నించేవి మరొక విభాగం ఉంది.

‘మాయానగర్’ఈ విభజనకు అతీతంగా అత్యంతసమగ్రసినిమాపత్రికలాపాఠకులను అలరిస్తుందేమో చూద్దాం.

రెండవ సంచికలో వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక పూర్తి పేజీకి సరిపడా నలుపుతెలుపుల్లో ఒక ఛాయాచిత్రం,మరొక పేజీ మొత్తం ఇంటర్వ్యూ ప్రచురించారు.అలాగేమహానటి సావిత్రికి అక్షరనీరాజనం,ఆమె లేదు..ఆమె జ్ఞాపకాలు తప్ప అన్నవ్యాసంతోపాటు మంచి ఫొటోలు ఇచ్చారు.ఇక భూమిక,గీతరచయిత చిన్నిచరణ్,కెమెరామాన్ పి.జి.విందాలను గూర్చి ఒక్కొక్క పేజీ పిచ్చాపాటీ,రేలంగి ని తెలుగుతెరపై తొలి పద్మశ్రీ అని అభివర్ణిస్తూ ఒక చక్కని ఆర్టికల్ ప్రచురించారు.

అయితే తారాగణాన్ని వారివారి బిరుదులతో సహా వర్ణించటం,సెంటర్ స్ప్రెడ్ లో ఒక అర్ధనగ్నచిత్రాన్ని ముద్రించటం మూస ధోరణికి మాయానగర్ ను కూడా కట్టిపడేస్తున్నాయి అనిపిస్తుంది.రెండవ సంచిక కాబట్టి సినిమావారి పరిభాషలో మరింత ‘ఇంప్రొవైజేషన్’ కు అవకాశముంది.కాకుంటే మిగతాపత్రికల నుంచి ‘మాయానగర్’కు ఉన్న ప్రధాన వ్య్తత్యాసం ఏంటంటే ఆన్ లైన్ సంచిక మాయానగర్.కామ్ లో ఆంగ్లవెర్షన్ కూడా లభ్యమవటం.కానీ పీడీయఫ్ ఫార్మాట్ లో కాక ఫ్లాష్ ప్లేయర్ రూపంలో ఉండటం పాఠకులకు కాస్త ఇబ్బంది కలిగించే అంశం,పైగా సదరు స్కానింగ్ సక్రమంగా చెయ్యక పేజీ మీద షాడో పరుచుకు పోయింది.

మంచి అభిరుచి కలిగిన అభినేత్రి భూమిక ఆధ్వర్యంలో వెలువడుతున్న పత్రిక కూడా ఉత్తమస్థాయి కి చేరాలని మనమూ ఆకాంక్షిద్దాం.డౌన్ టౌన్ పబ్లికేషన్స్ సంస్థ నుంచి వస్తున్న ఈ పత్రికకు భరత్ ఠాకూర్ ఛైర్మన్ కాగా,రవికుమార్ పనస సంపాదకుడు.పత్రిక వెల పది రూపాయలు.

5 Comments
  1. శివ బండారు December 20, 2008 /
  2. cbrao December 20, 2008 /
  3. Rajasekhar December 23, 2008 /