Menu

‘ఆలోచన’కు అక్షరాభ్యాసం చేయించిన బి. నర్సింగరావు

‘ఆలోచన’కు అక్షరాభ్యాసం అన్న ఈ శీర్షిక పేరు చూడగానే “అంటే! అంతకుముందు వచ్చిన చిత్రాలు ఆలోచనలను రేకెత్తించేవి కావా?” అని ఆవేశానికి లోనవకండి. కావొచ్చు. కానీ, ఆ ఆలోచనలకూ, నర్సింగరావు రేకెత్తించే ఆలోచనలకూ చాలా తేడా ఉంది. ఏ సగటు తెలుగు సినిమాను తీసుకున్నా, అది తయారుచేయటానికి ముడిసరుకు (ఫార్ములా అని మనం అనేది) ఒకటే. ఒక హీరో, హీరోయిన్, ఏదో ఒక రూపంలో విలన్ లేదా విలనిజం – ఇవి తప్పకుండా కావలసిన దినుసులు. బిర్యానీలో ఆవకాయ కలుపుకుని తిన్నా, పులిహోరలో పిజ్జా నంజుకుని తిన్నా మనకిద్దరు ప్రేమికులు, ఓ విలన్ తప్పనిసరి. పాత్రలకు (హీరో, హీరోయినులకు అని చదువుకోవచ్చు) ఏ కష్టాలు, నష్టాలు, ఏ విధిరాతలు, ఏ ప్రారబ్దాలు సంభవించినా, చివర్లో ‘శుభం’ కార్డు పడేలోపు అవన్నీ ఎక్కడివక్కడ తెరమీదే పరిష్కారమైపోతాయి, అయిపోవాలి (లేకపోతే ఇంటికొచ్చాక ఆ రాత్రి మనకు నిద్ర పట్టదు – ముఖ్యంగా మన టికెట్ డబ్బులు వేస్టు అయ్యాయని మరో బాధ).  చెడ్డ వాళ్లు కూడా మంచివాళ్ళుగా మారిపోతారు చివర్లో. కాబట్టి మనం ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవటానికి ఏముంటుంది చెప్పండి? కథ కంచికి, మనమింటికి. ఒకవేళ ఎవరైనా మొండి దర్శకుడు ఉండి, సినిమా విషాదాంతం అని నిర్ణయించినా, అది ఇద్దరు గాఢ ప్రేమికుల కథైతే తప్ప అట్టాంటి ఇట్టాంటి వోళ్ళు చస్తే మనమెందుకు కేర్ చెయ్యాలండి? (దేవదాసు, మరోచరిత్ర, గీతాంజలి – హిట్; స్వాతికిరణం, హరివిల్లు – ఫట్)  సినిమాకి కథకంటే కూడా ఫార్ములాయే ముఖ్యం అని బలంగా నమ్మేవాళ్ళు మన దర్శక నిర్మాతలూ, మెజారిటీ ప్రేక్షకులూనూ. కాబట్టి ఆ లక్ష్మణ రేఖను దాటి బైటికి రావటమంటే ‘కామన్ సెన్స్’ కాస్తో కూస్తో ఉన్నవాడు ఎవడికైనా అది నిజంగా ఒక సాహసమే.

అలా సాహసం చేసిన డింభకుడే మన నర్సింగరావు. తెలుగు సినిమా ఫార్ములాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న తరుణంలో 1980 లో ‘గౌతమ్ ఘోష్’ తో కలిసి ‘మాభూమి’ చిత్రాన్ని నిర్మించాడు. (అందులోని ‘బండెనక బండికట్టి’, ‘పాలబుగ్గల జీతగాడా’ అనే పాటలు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి). అది సృష్టించిన అనూహ్య విజయంతో స్ఫూర్తిని పొంది, తనే స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ‘రంగులకల’ చిత్రం 1983 లో విడుదలై ప్రేక్షకుల, సినీ విమర్శకుల మన్ననలనందుకుంది. 1988 లో నిర్మించిన ‘దాసి’ చిత్రం ఎలాంటి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఇవే కాకుండా హైదరాబాదు నగరంపై నిర్మించిన ‘ది సిటీ’ అనే డాక్యుమెంటరీ (1987), మానవపరిణామ శాస్త్రం (ఆంత్రోపాలజీ) నేపధ్యంలో నిర్మించిన మరో డాక్యుమెంటరీ ‘మా ఊరు’ (1988) పొట్ట చేతపట్టుకుని నగరాలకు వలసలు పోయి భవననిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేసే గ్రామీణుల జీవితాలపై తీసిన ‘మట్టి మనుషులు’ (1990), తన కళా సృజనాత్మకతను జోడించి నిర్మించిన ‘ఆకృతి’ డాక్యుమెంటరీ (1991) – ఇలా రాశిలో తక్కువైనా, వాసిలో పేరెన్నికగన్న ఆణిముత్యాలు నరసింగరావును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకస్థానంలో నిలబెట్టాయి.  ఆయన సమీపగతంలో దర్శకత్వం వహించిన చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రసిద్ధ నిర్మాత డి. రామానాయుడు నిర్మించిన ‘హరివిల్లు’ (2003).  దర్శకత్వం ఒకటే కాకుండా, సహజంగా చిత్రకారుడు, సంగీతకారుడు, కవి, రచయిత కూడా ఐన నర్సింగరావు సినిమాకు సంబంధించిన ఈ శాఖల్లో తన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం కలిగింది.

అలాంటి ప్రతిభా వ్యుత్పత్తులుకల నరసింగరావు చిత్రాలు మళ్ళీ చాలాకాలం తర్వాత చూసే అవకాశం మా డిల్లీ వాసులకు డిసెంబర్  20, 21 న (శని, ఆదివారాలు)  కలిగింది. నగరంలోని ‘సాహితి’ అనే ఉత్సాహవంతులైన యువకుల సంస్థ, ఇక్కడి ‘ఆంధ్రా అసోసియేషన్’ సహకారంతో ఈ చిత్రప్రదర్శనను ఉచితంగా ఏర్పాటుచేసింది. ‘ఉచితంగా’ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఉండటానికి ఢిల్లీలో మూడు, నాలుగు తెలుగువారి సాంస్కృతిక సంస్థలున్నాయి. ప్రతి శని, ఆదివారాల్లో తాజా, తాజా తెలుగు చిత్రాలను తెచ్చి ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ సినిమాలు చూడాలంటే టికెట్టే డెబ్బై, ఎనభై రూపాయలుంటుంది (ఇప్పుడింకా ఎక్కువే ఉందేమో తెలియదు. ఎందుకంటే నేను ఇక్కడ సినిమాలు చూడటం మానేసి చాలా కాలమైంది). అంత ఖర్చుపెట్టి చూసేంత విలువలు కూడా వాటిల్లో ఏమీ ఉండటంలేదు.

ఈ చిత్రప్రదర్శనకు నర్సింగరావు స్వయంగా హాజరు కావటమే కాకుండా, ప్రదర్శించిన నాలుగు చిత్రాలూ, ఆడిటోరియం లో ప్రేక్షకుల మధ్యన కూర్చుని ఆసాంతం చూడటం విశేషం. మొదటిరోజు ప్రదర్శించిన చిత్రాలు – ‘దాసి’, ‘మట్టిమనుషులు’.  రెండవరోజు ‘రంగులకల’, ‘హరివిల్లు’ ప్లస్ దర్శకునితో ప్రేక్షకుల ముఖాముఖీ కార్యక్రమం.  మొదటిరోజు చిత్రప్రదర్శననుంచి బైటికి వచ్చాక, ఇప్పటి తెలుగు చిత్రాలపట్ల ఒకావిడ వెళ్ళగక్కిన ఆక్రోశం మరచిపోలేనిది. ప్రేక్షకుల్లో చాలామంది నరసింగరావును అడిగిన ప్రశ్న ‘మీరు ఇంత మంచి దర్శకుడై ఉండి ఎందుకు తరచుగా ఇలాంటి సినిమాలు తీయటంలేదు?’ అని. మొదటిరోజు ప్రేక్షకులు ఓ మోస్తరుగా వచ్చినా, రెండవరోజు ఆడిటోరియం దాదాపు పూర్తిగా నిండిపోయింది.  విశేషం ఏమంటే, వచ్చిన ప్రేక్షకుల్లో చాలామంది నరసింగరావు చిత్రాల్లో కనీసం ఒక్కటైనా లోగడ చూసి ఉండటం. ఒక్క సినిమా చూసి ఆ దర్శకుడిని గుర్తుపెట్టుకున్నారంటే, ఆ దర్శకుడికి అంతకంటే కావలసిన గుర్తింపు ఏముంటుంది చెప్పండి.

నర్సింగరావు చిత్రాలంటే అవార్డు చిత్రాలు అనే అపప్రథ ఒకటి మన సగటు తెలుగు ప్రేక్షకుల్లో బలంగా పాతుకుపోయింది. నర్సింగరావు అనే కాదు, సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, శ్యాం బెనెగల్, అపర్ణాసేన్, ఆదూర్ గోపాలక్రిష్ణన్ ఇలా ఎవరి పేరు చెప్పినా, మన వాళ్లు ముఖం మాడుస్తూ ఉంటారు. ‘రామా’ అంటే బూతుగా వినబడినట్టు, అవార్డు చిత్రం అంటే, అదేదో అంటరానిదిగా చూస్తుంటారు. అంతేగాని, అందులో అసలు ఏముంది అని చూసే ఓపిక, తీరిక మనవాళ్ళకు లేదు. సినిమా అంటే మనవాళ్ళకు – ఏనుగు తోకంత కథ, కాస్తంత వెకిలి హాస్యం, కొంచెం ఓవర్ డోసులో శృంగారం, హాలీవుడ్ సాంకేతిక స్థాయిలో ఫైట్లు ఇవన్నీ కలగలిసిన ప్యాకేజీ. (‘అందరూ అలా ఉండరండీ’ అంటూ మీరు వెంటనే కోపం తెచ్చేసుకోకండి మరి.  అందుకే ‘సగటు ప్రేక్షకులు’ అనే మాట వాడాను) (‘ఆ సినిమాలు మహా స్లోగా ఉంటాయండీ’ అంటారా? మరి ఈ రోజుల్లో మనవాళ్ళు జీడిపాకంలాగా సాగే టి.వి. సీరియళ్ళు ఎలా చూస్తున్నారు? టి.వి. ముందు కూర్చుంటే, అసలు వీడు డైలాగు ఎప్పుడు చెప్తాడురా బాబూ అనిపిస్తుంది).  ‘పదుగురాడు మాట పాడియై ధరచెల్లు’ అన్న రీతి ఇటువంటి చిత్రాలకు మొదటినుంచీ అలాంటి ముద్ర ఒకటి జనసామాన్యంలో పడిపోయింది.  అంతకుమించి మరేం లేదు.

నర్సింగరావు సినిమాల్లోని కథలు సమాజంలో మనచుట్టూ ఉండే మామూలు మనుషుల జీవితాలకు సంబంధించినవే. ‘రంగులకల’ ఒక చిత్రకారుడి జీవితంలోని మానసిక అంతర్మథనాన్ని, సమాజంతో అతనికిగల  సంబంధాన్ని ఒక వినూత్నమైన రీతిలో చెప్పిన కథ. నేనీ సినిమాని 1983 లో రిలీజ్ అయినప్పుడే హైదరాబాదులో చూసి కొత్తరకంగా ఉందనుకున్నాను. సినిమాలో అర్థం కాకపోవడానికేమీ నాకు కన్పించలేదు. అందులోని పాత్రలు మనచుట్టూ ఉండే మనుషులవే. రూప, నారాయణరావు, సాయిచంద్, కాకరాల, ఆర్టిస్టు చంద్ర ముఖ్యపాత్రల్లో నటించారు. ఇందులో గద్దర్ పాడిన మూడు పాటలూ ప్రత్యేక ఆకర్షణ (ఒక పాటలో మాత్రం ఆయన కనిపిస్తారు).  పాటల రచన దేవిప్రియ. సంగీతం నర్సింగరావుదే. ఇందులో వాడిన paintings ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠానివి. వైకుంఠం ‘మాభూమి’, ‘దాసి’, ‘మట్టిమనుషులు’ చిత్రాలకు కూడా కళాదర్శకత్వం వహించారు. అప్పట్లో  హైదరాబాదు ‘కళాభవన్’ లో ‘రంగులకల’ చిత్రానికి వాడిన కాస్టూమ్స్, స్క్రిప్టు మొదలైన వాటితో ఓ ప్రదర్శన కూడా పెట్టారు.

‘దాసి’ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణ భూస్వామ్య వ్యవస్థలోగల జోగినులవంటి దురాచారానికి సంబంధించినది. ఆనాటి సమాజంలో ఒక మామూలు దళితజాతి స్త్రీ ఎలా కొద్దిమంది భూస్వాముల భోగ్య వస్తువుగా మారి కట్టుబానిస బ్రతుకు గడిపినదీ ఈ చిత్రంలో శక్తిమంతంగా చూపెట్టబడింది. తెలంగాణా చరిత్ర గురించి తెలిసిన వాళ్లకు ఇదేమంత వింతగా కనిపించదు. ‘దాసి’ చిత్రం నటిగా అర్చనకూ మంచి పేరు తెచ్చింది. దొరగా భూపాల్ రెడ్డి, చిన్న దొరసానిగా రూప సహజంగా నటించారు.  నల్లగొండ జిల్లాలోని ఒక పల్లెటూరు గడీలో (దొరల ఇల్లు) రియల్ లోకేషన్స్ లో తీశారీ సినిమాని.  అప్పట్లో ఈ చిత్రాన్ని దూరదర్శన్ లో చూసి ఈనాటికీ గుర్తుపెట్టుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

ఇక ‘మట్టిమనుషులు’ పల్లెలనుంచి బ్రతుకుతెరువుకై బస్తీలకు చేరి భవననిర్మాణ పనుల్లో కూలీలుగా మారి జీవితాలు గడిపే పేదప్రజల కథ. అర్చనతోపాటు హిందీ నటి నీనాగుప్తా కూడా ఇందులో నటించింది.

‘హరివిల్లు’ చిత్రం క్యాన్సర్ బారినపడి మృత్యుముఖంలో ఉన్న ఓ పిల్లవాడి నిరాశామయ జీవితంలో అదే వయసుగల ఓ అమ్మాయి ప్రవేశించి అతని చివరిరోజుల్ని ఎలా ఉత్సాహభరితం చేస్తుందో చెప్పే కథ. బాల పాత్రల్లో మాస్టర్ శుభాకర్, బేబి నిత్య, శుభాకర్ తల్లిదండ్రులుగా భానుచందర్, హరిత నటించారు. నిర్మాతగా రామానాయుడుకి, దర్శకుడిగా నర్సింగరావుకూ ఇది మొదటి బాలల చిత్రం. అవార్డులు అవీ లభించినా ఆర్థికంగా విజయం సాధించలేదు. ఈ సినిమాలోని మృత్యువు అనే అంశాన్ని కనుక మరిచిపోతే, ఈ రోజుల్లో పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో చాలా సింగిల్ చైల్డ్ ఫ్యామిలీల్లో పిల్లలు ఆడుకోవటానికి, అభిప్రాయాలు పంచుకోవటానికి ఒక తోబుట్టువు లేక ఇలాంటి నిరాసక్తమైన ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారని నేను నర్సింగరావు గారితో అన్నాను. పోట్లాడుకున్నా సరే, వాళ్ళకు మరొక తోడు ‘పిల్లలే’ ఉండాలి.  అది వాళ్ల సరైన మానసిక పెరుగుదలకు ఒక పాజిటివ్ పాయింటుగా దోహదపడుతుందనేది నా అభిప్రాయం (‘పథేర్ పాంచాలి’లో అపు, దుర్గల అనుబంధం గుర్తుచేసుకోండి). నా అభిప్రాయంతో ఒకావిడ విభేదించారు. ఆమెకూ ఒక్క కూతురేనని, కాని తన విషయంలో అలాంటి సమస్యేం లేదని అన్నారు.

చిత్రప్రదర్శన తర్వాత జరిగిన ‘ముఖాముఖి’ కార్యక్రమంలో తన సినిమాల గురించి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నర్సింగరావు సమాధానాలిచ్చారు. సమాజంలో జరుగుతున్న పరిణామాల్నే తన చిత్రాల్లో చూపించానని, తన సినిమాలు సగటు తెలుగు సినిమాల్లా సందేశం ఇవ్వడమో, పరిష్కారం చూపించడమో చేయకపోయినా, వ్యవస్థలోని లోపాల్ని ప్రశ్నిస్తాయని అన్నారు. తన ముప్ఫై ఏళ్ళు పైబడ్డ కళారంగ అనుభవంలో గ్రామాలనుంచి బస్తీలవరకు తను చూసిన దృశ్యాలు, అనుభవాలే తన సినిమాలలో మూల కథాంశాలుగా ఉన్నాయన్నారు. అవార్డుల కోసమే తను సినిమాలు నిర్మిస్తానన్న వాదనను ఖండిస్తూ, తన సినిమాలు బాగున్నాయని అవార్డులిచ్చారని, అవి తను తెచ్చుకున్నవి కావని, అనేక భాషల సినిమాలు న్యాయనిర్ణేతల ముందుకు వస్తుంటాయని, వాటిల్లో ఉత్తమమైనవి ఏవో వారే నిర్ణయిస్తారని అన్నారు. తన చిత్రాల్లో లోపాలు ఉండవని తాను చెప్పననీ, తానేమీ పర్ఫెక్ట్ మాస్టర్ని కాననీ అన్నారు.

చాలామంది నర్సింగరావు చిత్రాలు మిగతా చిత్రాలలాగా సిడిలు, డివిడిల రూపంలో దొరకనందున మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం కలగటంలేదని అన్నారు. త్వరలో అవి డివిడిల రూపంలో తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తన తదుపరి చిత్రాన్ని 2009 లో ‘సురభి’ నాటక కంపెనీకి సంబంధించిన కథాంశంతో నిర్మిస్తున్నానన్నారు.

త్వరత్వరగా ఎటువంటి చెత్తనైనా ప్రేక్షకులపైకి వదిలేసి ఎప్పుడెప్పుడు గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కుదామా అని ఆదుర్దాపడే దర్శకులు, నటులు ఉన్న తెలుగుచిత్ర సీమలో, నిజాయితీగా నాలుగు చిత్రాలే తీసిన (ముప్ఫై ఏళ్లలో) నర్సింగరావు అభినందనీయుడు.

6 Comments
  1. శంకర్ December 28, 2008 /
  2. గిరి December 28, 2008 /
  3. రెండుచింతల భానుప్రసాద్ December 28, 2008 /
  4. Anuradha Nippani December 30, 2008 /