Menu

Awaara (1951)

“ఆవారా” – చిత్రానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదేమో అన్న అనుమానం ఓ పక్క ఉంది కానీ, నాలాంటి వారు ఈ చదువరుల్లో ఉండే ఉంటారన్న నమ్మకమే నా చేత ఈ వ్యాసం రాయిస్తోందనుకుంటాను. “ఆవారా” 1951 నాటి బాలీవుడ్ చిత్రం. నిర్మాత, దర్శకుడు : రాజ్ కపూర్, కథ-సంభాషణలు: కె.ఎ.అబ్బాస్, వీ.పీ.సాథే, సంగీతం: శంకర్-జైకిషన్. తప్పక చూడవలసిన బాలీవుడ్ సినిమాల జాబితాలలో ఆవారా పేరు తరుచుగా కనిపిస్తూ ఉండేది నాకు. కానీ, ఆవారా అంటే “ఆవారా హూ..” పాట తప్ప ఇంకేమీ తెలీదు నాకు. ఆ పాట వీడియో కూడా మొదట మొన్న సినిమా చూస్తున్నప్పుడే చూశాను.

కథ: కథ ఓ కోర్టు సీనుతో మొదలౌతుంది. ఆ దృశ్యంలో ముద్దాయి రాజ్ (రాజ్ కపూర్) తాను నేరస్థుడననీ, ఖూనీకోరుననీ, తనని ఉరితీయమనీ కోర్టు వారితో అన్నప్పుడు రాజ్ తరపున వాదించేందుకు రీటా (నర్గీస్) వస్తుంది. జడ్జి రఘునాథ్ (పృథ్వీరాజ్ కపూర్) ఈ కేసుకి సంబంధించినంత వరకూ జడ్జి బాధ్యత పక్కన పెట్టి బోనులో ఉంటాడు. ఇక్కడ రీటా రాజ్ పరిస్థితి ఏమిటి? అతను ఎలా నేరస్థుడు కాడో చెప్పడం మొదలుపెడుతుంది. ఫ్లాష్ బ్యాక్- కథా సమయానికి ఓ పాతికేళ్ళముందు రఘునాథ్ భార్యని అతను శిక్ష విధించిన జగ్గా అన్న దొంగ కిడ్నాప్ చేస్తాడు. నాలుగురోజుల్లో ఆమెని అతను వదిలిపెట్టేసినా కూడా రఘునాథ్ మనసులో ఆమె గురించి అనుమానం ఏర్పడి, ఆమె గర్భవతి అని తెలిసీ ఆమెని ఇంటి నుండి గెంటేస్తాడు. ఆమె తన పిల్లవాడిని కష్టపడి చదివిస్తూ ఉంటుంది. అతడికీ, రఘునాథ్ స్నేహితుడి కూతురు రీటాకూ మంచి స్నేహం ఏర్పడుతుంది. కానీ, కాలక్రమంలో ఆ అబ్బాయి పరిస్థితులకి ఎదురీదలేక దొంగగా మారతాడు. “ఆవారా” గా తిరుగుతూ ఉంటాడు. పన్నెండేళ్ళ తరువాత రీటాని మళ్ళీ కలుస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. “ఆవారా” రాజ్ దొంగతనాలు అవీ మానేసి కష్టపడి పనిచేద్దామనుకుంటాడు కానీ సమాజం అతన్ని అలా మారనివ్వదు. చివర్లో అతను జగ్గాని హత్య చేసి జైలుకి వెళతాడు. ఆ సమయంలోనే అతనికి తన తండ్రెవరో తెలుస్తుంది. తల్లికి తండ్రి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా తండ్రిని చంపుదామనుకుంటాడు రాజ్. ఆ ప్రయత్నం లో మళ్ళీ పట్టుబడతాడు. కథ మళ్ళీ మొదటి కోర్టు సీను వద్దకి వెళ్తుంది. రీటా రాజ్ తరపున వాదిస్తూ రఘునాథ్ కి తన పొరపాటు తెలిసేలా చేస్తుంది. రాజ్ జైలుకి వెళతాడు, రీటా అతని కోసం ఎదురుచూస్తానంటుంది. అదీ కథ.

ఈ సినిమా నాకు నచ్చింది. అందుకు ప్రధాన కారణం సంభాషణలు కావొచ్చని అనిపిస్తోంది. ఒక్కోదగ్గరి డైలాగులు, అవి పలికిన విధానమూ అలా గుర్తు ఉండిపోయాయి. ముఖ్యంగా మూడు సన్నివేశాలు బాగా గుర్తు ఉండిపోయాయి. బహుశా ఈ మూడే ఈ సినిమాని అర్థంచేసుకోడానికి బాగా దోహదపడే సన్నివేశాలేమో. మొదటిది – లీలా చిట్నిస్ ను అపహరించిన జగ్గా “దొంగ కొడుకు దొంగే కావాలా?” అన్న ప్రశ్న లేవనెత్తిన దృశ్యం. రెండవది – మారిన రాజ్ ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ అతను ఒకప్పుడు దొంగ అన్న కారణం చేత అతని ఉద్యోగాన్ని తొలగించినపుడు – “మారాలనుకున్న దొంగలకి ఎక్కడా పనివ్వకపోతే వాళ్ళు ఎలా మారతారు?” అని రాజ్ ప్రశ్నించిన దృశ్యం. మూడవది – కోర్టు దృశ్యంలో జడ్జి రీటాతో – “చట్టానికి హృదయాన్ని గురించిన ఆలోచన ఉండదు” అంటే రీటా -“హృదయానికి కూడా ఏ చట్టం గురించిన పట్టింపూ ఉండదు” అని జవాబిచ్చిన దృశ్యం. ఇవి కాక నాలుగవది ఉంది – అది రీటా రాజ్ ఎందుకు అపరాధి కాలేడు – అసలు ఇలాంటి పరిస్థితులు ఎదురవడానికి ఉన్న మూలాలు ఏమిటి? అన్నవి విశ్లేషిస్తూ చేసే వాదన.

నటీనటుల పరంగా చూస్తే, ప్రధానంగా నాకు నచ్చింది – పృథ్వీరాజ్ కపూర్. అతని ఆహార్యం, ముఖ కవళికల్లోనే ఆ పాత్ర స్వభావం తెలిసిపోయేంతగా నటించారు. తరువాత లీలా చిట్నిస్ – రాజ్ కపూర్ తల్లి పాత్రధారి. రాజ్ కపూర్ కొన్ని దృశ్యాల్లో మాత్రమే బాగా అనిపించాడు నాకు. రాజ్ కపూర్-నర్గీస్ ల జంట గురించి వినడమే కానీ, తెరపై చూసింది లేదు నేనెప్పుడూ. ఇద్దరి జోడీ బాగుంది. జగ్గా పాత్రధారి కె.ఎన్.సింగ్ ని చూడగానే విలన్ లాగా అనిపిస్తాడు – అతని మొహంలో అలాంటి భావమే కనిపిస్తుంది సినిమా ఆద్యంతమూ. ఇక సంగీతం విషయానికొస్తే – నాకు ఇవి మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినే పాటల్లాగా అనిపించించలేదు – “ఆవారాహూ” తప్ప. కానీ, అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా సందర్భాన్ని బట్టి వచ్చే పాటలు కనుక సాహిత్యం కూడా తగినట్లు ఉంది. పదాలు కూడా సింపుల్ గా ఉండటం నాకు నచ్చింది.

ఈ సినిమాలోని ఆవారా పాత్రని రాజ్ కపూర్ చార్లీ చాప్లిన్ నుండి ప్రభావితమై మలచాడంటారు. సినిమాలోని కొన్ని దృశ్యాలు – ముఖ్యంగా “ఆవారా హూ” పాటలో రాజ్ కపూర్ నటనా, నవ్వూ – ఇదంతా చాప్లిన్ ని పోలినట్లే అనిపిస్తాయి. కానీ, ఈ పాత్రలో ఓ భారతీయత ఉంది. రాజ్ లాంటి వారు మనకు రోజులో కనిపిస్తూనే ఉంటారు. ఇదే కాన్సెప్ట్ తో తెలుగులో ఓ సినిమా వచ్చింది. ఎన్‍టీఆర్, జమున ఉంటారు. “ఓహో గులాబి బాలా” పాట ఉంటుందాసినిమాలో. “మంచి మనిషి” అనుకుంటా పేరు. అంటే, ఆవారా కి రీమేక్ అని కాదు. ఓ గౌరవనీయ వ్యక్తి కొడుకు చిన్నప్పుడు తప్పిపోయి దొంగ కావడం, తన చిన్నప్పటి స్నేహితురాల్ని ఓ దొంగతనం సందర్భంగా కలిసి తరువాత ఇద్దరు ప్రేమించుకోడం, ఇతను మారడానికి ప్రయత్నించడం – ఇలాంటి దృశ్యాలన్నీ ఆ సినిమాలో కూడా ఉన్నాయి. ఎటొచ్చీ, ఈ తెలుగు సినిమా నేను ఎప్పుడూ పూర్తిగా చూడలేదు కనుకా, ఈ సినిమాలో జగ్గయ్య రూపంలో ఇంకో హీరో ఉన్నాడు కనుకా – ఇది ఆవారా నుండి కాపీ కొట్టారని అనలేను. “ప్రేరణ” అని అనగలను 😉 (ఏమిటో ఖర్మ! ఏ సినిమా చూసినా అందులో దృశ్యాలు ఇంకో సినిమాలో కాపీ కొట్టినట్లు తెలుస్తోంది ఈ మధ్య!!!)

ఈ సినిమాలో మరీ నాటకీయంగా అనిపించే దృశ్యాలు బోలెడున్నాయి. కానీ, దాదాపు అరవై ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఇది అన్న విషయం దృష్టి లో ఉంచుకోవాలి. అది మనసులో ఉంచుకుంటే తప్ప ఈ సినిమాలోని watchability ని పూర్తిగా ఒప్పుకోగలగడం కష్టం. బ్లాక్ అండ్ వైట్ కనుకే ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా అనిపించిందేమో అని నా అనుమానం. బహుశా కలర్ లో అయితే, ఇంత visual appeal ఉండేది కాదని నా అభిప్రాయం. మొత్తానికి నేనూ ఆవారా చూసేసాను. మంచి ఎంటర్‍టైనింగ్ సినిమా.

5 Comments
  1. venkat December 4, 2008 /
  2. పరుచూరి శ్రీనివాస్ December 4, 2008 /
  3. సౌమ్య December 5, 2008 /
  4. RAMACHARY BANGARU December 21, 2008 /