Menu

ఆస్ర్టేలియా

‘ఒక మూటలో పట్టేవాటి కన్నా ఎక్కువ నాదగ్గర ఏమీ లేవు. మనతో కూడా ఏమీ తీసుకెళ్ళలేం, మనగురింఛి చెప్పుకోడానికి ఒక కథ తప్ప’ అన్న అర్ధంలో ఒక మాట అంటాడు ‘ఆస్ట్రేలియా’ సినిమాలో డ్రోవర్ (హ్యూజ్ జాక్ మాన్) తన వాహనంలో డజన్ల పెట్టల సామన్లతో ప్రయాణం చేస్తున్న లేడీ సారా ఆష్లీ (నికోల్ కిడ్ మాన్)తో. ఒక మంచి మహాకావ్యం (epic) చూపిస్తానన్నాడు కదా అని కూర్చుంటే అరడజను కథలు కలగాపులగం చేసి, దానికి యింకొన్ని డజన్ల కొత్తదనం లేని సన్నివేశాలని (cliché) కలిపి మూడుగంటలు కూర్చో పెట్టాడు బజ్ లుహ్ర్మన్. మధ్యలో, కనీసం రెండు సార్లు సినిమా అయిపోయివుంటుదనుకుని లేవబోయి, నికొల్ కిడ్ మాన్ ఇంకా తెరమీద కనబడుతుంటే లేవడానికి మనసొప్పక వుండిపోయాను.

సినిమా మొదట్లో, రెండో ప్రపంచ యుద్ధంలో జపాను సేనలు పెరల్ హార్బరు మీద బాంబులేసేసాకా వెనక్కి వస్తూ ఆస్ట్రేలియాలోని ఉత్తర భాగంలో డార్విన్ అనే చిన్న పట్టణం మీద దాడిచేసారని చెప్పడంతో మొదలై, వెంటనే ‘దొంగిలించబడ్డ తరాలు’ (Stolen Generations) మీదకి మళ్ళుతుంది. ఆస్ట్రేలియాకి వచ్చిన తెల్ల మిషనరీలు, అక్కడి స్థానికులైన అబొరిజనల్ (Aboriginal) పిల్లల్ని ‘నాగరీకుల్ని’ చేయడానికి వాళ్ళకుటుంబాల నుంచి బలప్రయోగంతో విడదీసి వాళ్ళదికాని సంస్కృతిని వాళ్ళ మీద రుద్దడానికి తరతరాలుగా చేసిన దాడిని, దొంగిలించబడ్డ తరాలపేరుతో వ్యవహరిస్తారు. ఈ విధానాన్ని 1973లో ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టవ్యతిరేకం చేసింది.

నుల్హా (బ్రాండన్ వాల్టర్స్) అనే పిల్లవాడికి ‘కింగ్’ జార్జ్ అనే అతని తాత ప్రకృతిలో మనిషి మనుగడకి అవసరమైన విద్య నేర్పుతుండడంతో కథనం మొదలవుతుంది. ఈ పిల్లవాడి తల్లి అబొరిజనల్ స్త్రీ. ఆమెకీ, ఆమెని బలవంతంగా లోబరుచుకున్న తెల్లవాడికీ – ఫ్లెచర్ కి – పుట్టిన సంతానం నుల్హా. అతని లాంటి వాళ్ళని అధికారులు చూస్తే బంధించి తీసుకుపోతారు. కింగ్ జార్జ్ మనవడికి చేపలుపట్టడం, పాటలూ నేర్పుతుండగా ఒక తెల్లవాడి హత్య జరుగుతుంది. ఈలోపు ఇంగ్లాండ్ లో వున్న లార్డ్ ఆష్లీ భార్య సారా, భర్త ఆస్ట్రేలియానుంచి తిరిగిరాకపోవడానికి కారణం నిజంగా అతను తన పశువుల్ని డార్విన్ కి తోలుకెళ్ళి అమ్మడానికి కాదని, అక్కడి ఆడవాళ్ళకోసం వుండిపోయాడని అనుమానంతో భర్త వారిస్తున్న వినకుండా అస్ట్రేలియా వస్తుంది. ఆయన, తనకి డార్విన్ రావడం కుదరక తన స్నేహితుడు డోవర్ ని భార్యని ఫారెవే డౌన్స్ కి తీసుకురావడానికి పంపుతాడు. ఆ తరవాత, మనం చాలా సినిమాల్లో చూసేసిన సన్నివేశాలే – స్వతంత్రేచ్ఛే తప్ప ఏమీకోరని అందగాడైన భార్య చనిపోయిన పేదవాడికి, అంతకంటే అందగత్త అయిన స్నేహితుడులాంటి గొప్పవాడి భార్యకి భవిష్యత్తులో ప్రేమ బంధ ఎర్పడాలంటే ముందు ఏమేమి జరగాలో అవన్ని – జరిగాక యింటికొచ్చి, హతుడైన భర్తని చూసి ఎస్టేట్ ని ఏదో ఒక ధరకి ఆస్ట్రేలియా భీఫ్ వ్యాపారంలో రారాజుగా వెలుగుతున్న కార్నేకి అమ్మి వెనక్కి వెళ్ళిపోదామనుకుంటుంది సారా. ఆ రాత్రి నుల్హా ద్వారా ఎస్టేట్ లో పనిచేసే ఫ్లెచర్ కుట్ర తెలుసుకుని ఫ్లెచర్ ని పనిలోంచి తీసేస్తుంది. పశువుల్ని కార్నేకి అమ్మకుండా ఎలాగైన డార్విన్ తీసుకువెళ్ళి సైనికులకి ఆహరం కోసం పశువులు కొనాలనుకుంటున్న ఆర్మీకి అమ్మడానికి నిశ్చయించుకుని నుల్హా, కింగ్ జార్జ్, డ్రోవర్ మొదలైన వాళ్ళ సహాయంతో ప్రత్యర్ధులు సృష్టించిన అవరోధాలు దాటుకుని డార్విన్ కి తీసుకువెళ్ళి ఆర్మీకి అమ్ముతుంది. ఈ లోపు డ్రోవర్ మీద ప్రేమ కలగడం, పిల్లవాడు నుల్హా మీద అభిమానం పెరగడం, అతన్ని పెంచుకోవాలనుకోవడం వగైరా సన్నివేశాలు జరగుతాయి. సినిమా అయిపోయిందేమోనని భ్రమ కలుగుతుంది.

తరవాత కథ డ్రోవర్, సారా దగ్గర, వేసవిలో తన రవాణా వ్యాపారానికి అడ్డుపడననే హామీ తీసుకుని సహజీవనం ప్రారంభిస్తాడు. సారా, డ్రోవర్ల పనితనం, మంచితనంతో ఫారవే డౌన్స్ లో గొప్పగొప్ప మార్పులు వస్తాయి. సారా నుల్హాని పెంచుకుంటుంది. అది తెలిసీ, స్థానిక పోలీసులు ఆమె మంచితనం వల్ల దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు, మనకీ సినిమా చివరికి వచ్చిందోమోనన్న ఆశ చిగురిస్తుంది. ఈ లోపు ఫ్లెచర్, కార్నేని చంపి అతని కూతుర్ని పెళ్ళి చేసుకుని ఆతని వ్యాపారాలకి నాయకుడై సారా ఫారెవే లాండ్స్ మీద కన్నువేసి ఆమెని వెళ్ళగొట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు, పిల్లవాణ్ణి పోలీసులు పట్టుకుపోతారు, డ్రోవర్ కి, సారాకి గొడవలు జరుగుతాయి, మనకి సినిమా అయిపోతుందన్న ఆశ అడుగంటుతుంది.

జపాను వాళ్ళ బాంబుదాడి, ఆ యుద్ధంలో సారా, డ్రోవర్, నుల్హా, ఫ్లెచర్, కింగ్ జార్జ్ వగైరాలు ఏం చేసారు, మిగిలారా, కడతేరారా, సారా నుల్హాని పెంచుకోగలిగిందా, తాత దగ్గరకి పంపిందా లాంటి వన్నీ తరవాతి ముఫై నిమిషాల క్లైమాక్స్ లో చూడచ్చు.

ఔట్ బేక్ లాండ్ స్కేప్, మంచి ఫొటొగ్రఫీ, నేపథ్య సంగీతం, నికొల్ కిడ్ మాన్ నటన యిలా, సాంకేతికంగా ఎన్ని హంగులు వున్నా, ఎపిక్ తీయాలనే తాపత్రయంలో విస్తృతమైన పరిధిలో కథ తీసుకుని, దాన్నినడిపించడంలో తీవ్రంగా వైఫల్యం చెందడం ఈ సినిమాలో కనిపిస్తుంది. విస్తృతమైన విషయాన్ని ఎంచుకున్న ప్రయోక్తకి తను వ్యక్తం చేయదలచిన అభిప్రాయాలపట్ల వుండవలసిన తాత్వికమైన స్పష్టత కనబడదు. ఉదాహరణకి అబరొజినల్ మనుషుల్ని బలవంతంగా తీసుకువెళ్తున్న తెల్లవాళ్ళు ఆ సంస్కృతికి చేస్తున్న అపకారం లాంటిదే, మంచివాళ్ళు – సారా లాంటి వాళ్ళు – నల్హా పట్ల ప్రేమతో అతన్ని తాత దగ్గరకు వెళ్ళకుండా ఆపడం కూడా అన్న డ్రోవర్ అభిప్రాయం, అతనికీ, సారాకి మధ్య ఒక ఘర్షణకి కారణం. మంచి దర్శకుడు అలాంటి వైరుధ్యలకి వున్న సామర్ధ్యాలని డ్రామాకి బాగా వుపయోగించుకోగలుగుతాడు.

లుహ్ర్మన్ కి సహజత్వం పట్ల అంత పట్టింపుకూడా వున్నట్టులేదు. పాత్రల పరివర్తనలు పెద్ద మోటివేషన్ లేకుండానే జరిగిపోతుంటాయి. ఈ సినిమా కథనంలో సృజనాత్మకత వెతకాలనుకునే వాళ్ళు చాలా కష్టపడాల్సిందే. ప్రతి సన్నివేశం అంతకుముందు ఎక్కడే చూసినట్టే అనిపిస్తుంది, బహుశా లుహ్ర్మన్ ఉద్దేశించిన ప్రేక్షకులు పాతసినిమాలు చూడని టీనేజర్స్ కావచ్చు. అయితే అస్ట్రేలియన్ లాండ్ స్కేప్ ని యింత సమర్ధవంతంగా వుపయోగించుకున్న చిత్రం యిదేకావచ్చు.

ఈలాంటి సినిమాలని థియేటర్ లోనే చూడాలి, అప్పుడే వైల్డ్ అస్ట్రేలియా సౌందర్యం పూర్తిగా కనపడడం మాత్రమే కాక, మధ్యలో లేచి వెళ్ళగలిగే అవకాశం కూడా తక్కువగా వుంటుంది. నావరకైతే, నికొల్ కిడ్ మాన్ అద్భుతమైన పాత్రధారణ వుంది కనక, యింకోసారి చూడాల్సివస్తే కూడా పెద్దగా విచారించను.

దర్శకత్వం: బజ్ లుహ్ర్మన్
నిర్మాతలు: బజ్ లుహ్ర్మన్, కేథరిన్ నాప్మన్, జి. మాక్ బ్రౌన్
చిత్ర రచన: బజ్ లుహ్ర్మన్, రోనాల్డ్ హార్వుడ్, స్ట్రాట్ బీయాట్టి, రిచర్డ్ ఫ్లాన్గన్
నటులు: నికోల్ కిడ్ మాన్, హ్యూజ్ జాక్ మాన్, బ్రాండన్ వాల్టర్స్
విడుదల: నవంబరు 26 2008

–రమణ (స్వగతాలు)

One Response