Menu

Aditya 369 (1991)

సోమవారం ఉదయం ఖాళీగా ఉండి ఈటీవీ పెడితే, ఆదిత్యా-369 సినిమా వస్తోంది. చిన్నప్పట్నుంచీ ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం – ఎన్ని సార్లు చూసినా కూడా. ఇప్పుడు కూడా కాసేపు చూసాను. మన సినిమాల్లో ఇలాంటి తరహా సినిమాలు అరుదనే చెప్పాలి. సింగీతం శ్రీనివాసరావు అనగానే విలక్షణమైన థీములు, కొత్తగా ఉండే సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా ఆ ఆంచనాలను నిలబెడుతుంది. ఇటీవలే ఆదిత్య 369 కి సీక్వెల్ తీయాలి అనుకుంటున్నారని ఈనాడులో అనుకుంటా, చదివాను. ఈ నేపథ్యంలో ఓసారి ఈ సినిమాను తలుచుకుంటూ ఈ టపా. ఇప్పుడు ఇరవైల్లో ఉన్న వారిలో ఈ సినిమా చూడని తెలుగువారిని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చేమో. ఈ సినిమా పేరు వినని వారు ఈ వయసు తెలుగువారిలో అసలు ఉంటారా? అన్నది అనుమానమే నాకు. 🙂

కథ: రాజావర్మ అనే వ్యక్తి ప్రపంచంలో అరుదైన వాటినన్నింటినీ ఏదో ఒక మార్గంలో తన వద్దకి తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ ప్రయత్నంలోనే ఓ సారి ఒక మ్యూజియంలోని రాయలవారి కాలంనాటి వజ్రం ఒకదాన్ని అతని అనుచరులు దొంగిలిస్తూ ఉండగా కిశోర్ అనే బాలుడు చూస్తాడు. వాళ్ళు అది గమనించి అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా ఆ సమయంలో మ్యూజియం రోడ్డుపై వెళుతున్న కృష్ణకుమార్ కి చిక్కుతాడు. కిషోర్ మ్యూజియం దొంగతనం గురించి చెప్పినా కూడా అక్కడ అప్పటికే ఆ దొంగలు ఒక నకిలీ వజ్రం పెట్టేసి ఉండటంతో అతని మాటల్ని ఏవో ఊహలుగా కొట్టిపారేస్తారు అంతా. ప్రొఫెసర్ రాందాస్ ఒక టైంమెషీన్ తయారు చేస్తాడు. ప్రొఫెసర్ రాందాస్ కూతురు హేమ, కృష్ణకుమార్ ప్రేమించుకుంటారు. కొన్ని పరిస్థితుల్లో కిశోర్ తన స్నేహితులతో కలిసి టైం మెషీన్ ఎక్కుతాడు. సరిగ్గా అది కదిలే సమయానికి కృష్ణకుమార్, హేమలిద్దరూ ఆ పిల్లల్ని బయటకు తెస్త్రారు అందులోంచి. కానీ, వీళ్ళిద్దరు బయటపడే లోపు అది మూసుకుపోయి కదులుతుంది. వీళ్ళతో పాటు అందులోకి అనుకోకుండా చేరి స్పృహ కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉంటాడు. ఈ ముగ్గురూ కలిసి మొదట రాయలవారి కాలానికి, ఆ తరువాత భవిష్యత్ కాలానికి ప్రయాణం చేసి చివరికి మనలోకానికి వస్తారు. ఇక్కడ రాజావర్మ టైంమెషీన్ కోసం రాందాస్, కిశోర్ లని నిర్భంధించి ఉంటాడు. అతని నుంచి వీళ్ళిద్దర్నీ కృష్ణకుమార్ ఎలా కాపాడాడు? టైం మెషీన్ ఏమైంది? అన్నది క్లైమాక్స్.

కథ విషయంలో ఈ ఐడియా పూర్తిగా తెలుగువారి ఆలోచన అనలేము. వెల్స్ చాలా ఏళ్ళ క్రితమే “టైం మెషీన్” నవలలో ఇలాంటి ఓ యంత్రం గురించి రాసాడు. అందులో కూడా ఇలాగే ఆ యంత్రం ఎక్కి వేరే కాలానికి వెళ్ళడం వంటిది ఉంది. అయితే, ఆ ఆలోచన ఒకటి మాత్రం తీసుకుని ఈ సినిమాని తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా చాలా బాగా అల్లారు. (పిడకలవేట: దస్విదానియా-ఇకిరు మధ్య సంబంధం ఇలాంటిది అనిపించవచ్చు కానీ, పూర్తిగా ఇలాంటిది కాదు). కథ-మాటలు జంధ్యాల అని ఐఎమ్‍డీబీ లో చదివాను. సంభాషణలు చాలా బాగా కుదిరాయి. ఏ కాలానికి తగ్గ భాష ఆ కాలానికి వాడారు. ఎక్కడా సంభాషణల్లోని హాస్యం పాలు తగ్గలేదు. “వయొలిన్స్ తో ఎంత వయొలెన్స్ చేశారు రాజాగారు” వంటి డైలాగ్స్ ద్వారా పదాలతో కూడా బాగా ఆడుకున్నారు. రాయలవారి కాలం కథాభాగమంతా కూడా చాలా బాగా తీసారనిపించింది నాకు. పాత్రల వేషధారణ, మాట్లాడే పద్ధతీ -అంతా చాలా శ్రద్ధ తీసుకున్నారు. జనబాహుళ్యంలో ప్రాచూర్యం పొందిన అష్టదిగ్గజాల పద్యాలని సమయానుగుణంగా వినిపించారు.

బాలకృష్ణ రాయలవారి పాత్రలో చాలా బాగున్నాడు. కృష్ణకుమార్ పాత్రలో బానే ఉన్నా కూడా, ఇంకెవరన్నా ఉంటే బాగుండేదనిపించింది నాకు ఎందుకో గానీ. తరుణ్ ఇప్పుడీ సినిమా చూస్తూ ఏమనుకుంటూ ఉంటాడో. అసలు సీక్వెల్ తీస్తే తరుణ్ నే హీరోగా పెట్టొచ్చు కదా? తెనాలి రామకృష్ణుడి పాత్రలో చంద్రమోహన్, ఆస్థాన నర్తకి పాత్రలో సిల్క్ స్మిత, కానిస్టేబుల్ గా సుత్తి వేలు, అతని ప్రేయసిగా నర్తకి పరిచారికగా శ్రీలక్ష్మి- అందరూ బాగా నటించారు. ఈ భాగంలో ఉన్న హాస్యంలో రెండు కాలాల మధ్య ఉన్న తేడాలని కామికల్ గా చూపే ప్రయత్నం చేసారు. ఉదాహరణకి – “అచ్చ సంస్కృతమున పళ్ళనే ఫ్రూట్స్ అందురు” వంటి డైలాగులు, అక్కడ సుత్తివేలు, పొట్టి ప్రసాద్ ల మధ్య కనబడ్డ హావభావాలు విన్న, కన్నవారు ఎవరైనా నవ్వక మానరు. టిపికల్ జంధ్యాల మార్కు డైలాగులు.

సంగీతం – అసలు ప్రత్యేక టపా రాయాల్సిందే ఈ సినిమా పాటల గురించి. “సెంచరీలు కొట్టే వయసు మాది”, “రాస లీల వేళ…రాయబారమేల”, “జాణవులె..నెరజాణవులె”, “సురమోదము…”, “చిలిపి యాత్రలో…” – ఒక్కోపాట ఒక్కో రకమైనది. “రాసలీల వేళ” పాట ఎంత నెమ్మదిగా…సాఫ్ట్ గా సాగుతుందో, “చిలిపియాత్రలో”పాట అంత బీట్ తో ఉంటుంది. “సెంచరీలు కొట్టే…” పాటలోని ఊపే వేరు. సినిమా వచ్చి పదిహేడేళ్ళౌతూ ఉంది ఇంకా ఈ పాటలు జనాలు గుర్తుంచుకునే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే పాటల్లోని సాహిత్యం.. “మాటే మౌనమై మాయజేయనేలా…” (రాసలీల వేళ) వంటి వాక్యాలు నన్ను ఐతే రోజుల తరబడి వెంటాడాయి. “మేఘమాలనంటుకున్న ఆంటెనాలతో, మెరుపుతీగ మీటి చూడు తందనాలతో..” (సెంచరీలు కొట్టే) వంటి ప్రయోగాలు తమాషాగా అనిపిస్తాయి ఇప్పటికి. ఇళయరాజా సంగీత దర్శకత్వం చేసిన సినిమాల్లో అత్యుత్తమైన సినిమాల్లో ఈ సినిమా సంగీతం ఒకటి అని చెప్పవచ్చేమో. సురమోదము పాట లోని పిక్చరైజేషన్, అసలు ఆ ఐడియా, అక్కడి దృశ్యాలన్నీ చాలా బాగా తీసారు.

మొత్తానికి ఆదిత్య 369 తెలుగులోని వైవిధ్యభరితమైన చిత్రాల్లో ఒకటి. దాని రెండో భాగం ఎలా ఉంటుందో మరి చెప్పలేం కానీ, ఇలాంటి ఒక సినిమా 2009 లో తీయాలంటే, అది సాధ్యపడుతుందా? ఇలాంటి తారాగణం, ఇలాంటి కథ-సంభాషణలు, సంగీతం, స్క్రీన్ ప్లే చేయగల కాంబినేషన్ ఒకటి దొరుకుతుందా అంటే చెప్పలేం.

16 Comments
 1. Motorolan December 2, 2008 / Reply
 2. shree December 2, 2008 / Reply
 3. వెంకటాచలపతి December 2, 2008 / Reply
 4. చావా కిరణ్ కుమూర్ December 2, 2008 / Reply
 5. laxmi December 2, 2008 / Reply
 6. అబ్రకదబ్ర December 2, 2008 / Reply
 7. sambireddy December 2, 2008 / Reply
 8. శంకర్ December 2, 2008 / Reply
 9. pappu December 2, 2008 / Reply
 10. ప్రపుల్ల December 3, 2008 / Reply
 11. sriram velamuri December 3, 2008 / Reply
 12. cyno December 4, 2008 / Reply
 13. Kiran December 6, 2008 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *