Menu

Waltz with Bashir

పరిచయం:

మన విజయవాడకు చెందిన ఒకాయన ఉన్నాడు. పేరు చాలా డిఫరెంట్ గా వుంటుంది. సినిమాల గురించి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. ఆయన పేరు ’డిఫరెంట్ జాక్సన్’. (చెప్పానుగా డిఫరెంట్ గా వుంటుందని 🙂 )

ఈయన రచించిన ఒక పుస్తకం పేరు “సినిమాలు చూడండి: సమస్యలు మర్చిపోవడానికి కాదు పరిష్కరించుకోడానికి”. అప్పుడెప్పుడో మరేదో పుస్తకం కోసం వెతుకుతుంటే అనుకోకుండా తగిలిందీ పుస్తకం. ఇదేదో డిఫరెంట్ గా వుందనుకున్నా కానీ చదివిన పాపాన పోలేదు కానీ ఆ డిఫరెంట్ జాక్సన్ ని మాత్రం కలుసుకోవాలని ఆసక్తితో ప్రయత్నించాను కానీ కుదర్లేదు.

ఇంతకీ ’Waltz with Bashir’ కి ఈ డిఫరెంట్ జాక్సన్ కి సంబంధమేమిటా అనేది మీ అనుమానమనీ నాకూ తెలుసు. అందుకే అసలు విషయానికొస్తున్నా. డిఫరెంట్ జాక్సన్ తన పుస్తకంలో సినిమా అనే ప్రక్రియ ’మన సమస్యలను మర్చిపోవడానికి కాకుండా మన సమస్యలు తీర్చుకొనే ఒక పరికరంగా వాడుకోవచ్చా’ అనే ప్రశ్న ను లేవనెత్తినట్టే ’Can films be therapeutic?’ అనే ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ’Waltz with Bashir’ అనే సినిమా.

అసలేంటీ సినిమా:ఇది ఒక ఇజ్రాయిలీ సినిమా. ఈ సంవత్సరం వచ్చిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. (కావాలంటే రోటెన్ టొమాటోస్ లో 93/100 రేటింగ్ చూడండి, IMDB లో 8 కి పైగా ఉన్న రేటింగ్ చూడండి.) కథంటూ పెద్దగా చెప్పుకోడానికేమీ ఉండదు. అంటే అలా అని ఏదో ఒక విషయాన్ని పట్టుకుని సాగదీసే ప్రయత్నం కాదీ సినిమా. కథెందుకు లేదన్నానంటే ఇది ఫిక్షన్ కాదు కాబట్టి. ఇది ఒక డాక్యుమెంటరీ యానిమేషన్ సినిమా.

డాక్యుమెంటరీలు చూడడమే కష్టమనుకుంటే అదీ యానిమేటెడ్ డాక్యుమెంటరీ ఏంటా అనుకున్నాను నేను కూడా. కానీ సినిమా చూసాక నాకనిపించిందేంటంటే ఈ సినిమా ఇలా కాకుండా మరే విధంగానూ తీయకూడదు అని.

ఇక ఈ సినిమాలో చర్చించిన విషయానికి వస్తే ….

ఈ సినిమా దర్శకుడు ఆరీ ఫోల్మన్ ఒకప్పుడు ఇజ్రాయిల్ సైన్యంలో పనిచేసివుంటాడు. తనతోపాటు ఒకప్పుడు సైన్యంలో పనిచేసిన స్నేహితుడొకడు తను సైన్యంలో ఉండగా చేసిన ఒక పని తనని ప్రతిరోజూ కలలరూపంలో వేధిస్తోందని చెప్తాడు. ఆ సందర్భంలోనే ఫోల్మన్ సైన్యంలో ఉండగా జరిగిన అనుభవాల గురించి అడుగుతాడు ఆ మిత్రుడు. ఆశ్చర్యమేమిటంటే పాతికేళ్ళ క్రితం పాల్గొన్న యుద్ధపు జ్ఞాపకాలేవీ ఫోల్మన్ కి గుర్త్తుకి రావు కానీ కొద్ది కొద్దిగా గుర్తున్న కొన్ని సంఘటనలు/దృశ్యాలు మాత్రం అతన్ని కలతకు గురిచేస్తాయి, యుద్ధసమయంలో అసలేం జరిగిందో తెలుసుకోవాలనే తపనను కలుగచేస్తాయి. ఈ విషయం తెలుసుకుందామనే ఆ యుద్ధంలో తనతోపాటు పాల్గొన్న ఇతర ఇజ్రాయిలీ సైనికులను కలుసుకొని వారి ద్వారా ఆ యుద్ధం తాలూకా విషయాలను తెలుసుకోవడమే ఈ సినిమాయొక్క ఉద్దేశం.

కొన్ని అనుభవాలు:

నేనీ సినిమా గురించి రాసుకుంటూ పోతే చాలానే రాయొచ్చు. కానీ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమాలోని కొన్ని విషయాలు చెప్పి వారి viewing experience ని పాడు చెయ్యడం ఇష్టం లేదు. అలా అని చెప్పకుండా కూడా వుండలేను. మంచి సినిమా వెళ్ళి చూడండి అని చెప్పేస్తే చాలదు కదా. ఎందుకు ఈ సినిమా చూడాలో చెప్పాలి.కానీ చెప్పకూడదు అందుకే ఈ సినిమా గురించి కంటే ఈ సినిమా చూసిన తర్వాత నా అనుభవాలు మాత్రం చెప్తాను.

ఈ సినిమా చూసి బయటకొస్తూ నా పక్కనున్న మిత్రునితో ఎలా ఉంది అని అడగబోయాను. అతను సారీ ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పి వెళ్ళిపోయాడు. నేనూ అంతే చాలా సేపు ఎవర్తోనూ మాట్లాడకుండా కొన్ని గంటలు గడిపాను. ఆ సమయంలో నాకసలెప్పుడూ గుర్తులేని ఒక అనుభవం నాకు గుర్తొచ్చింది (ఈ సినిమాలోలాగే).

చిన్నప్పుడు నాకొక వాక్ మ్యాన్ ఉండేది. దాన్నొక భారీ అడాప్టర్ కి తగిలించి రోజంతా పాటలు వినడం అలవాటు నాకు. కానీ ఆ అడాప్టర్ ఎంత పెద్దదంటే ప్లగ్ లో సరిగా నిలబడేది కాదు. అందుకే ఒక్కోసారి నేను నిలబడి దాన్ని ప్లగ్ లో నిలబెట్టి పాటలువినేవాడ్ని. ఒక రోజు ఏమయ్యిందంటే నేను ఆదమరిచి పాటవింటూ ఆ ప్లగ్ ని వదిలేశాను. అది కిందపడి ముక్కలయింది. ఎలాగో అన్నింటీనీ పోగు చేసి తిరిగి ప్లగ్ లో పెట్టి చూశాను. బాగానే పని ఛేసింది. అయితే అది పని చేయాలంటే అలాగే పట్టుకు నిలబడాలి. సరే అని పట్టుకునిల్చునే పాటలు వింటూ మైమర్చిపోయాను. ఆ తర్వాత ఏమైంద తెలియదు నేను నేల మీద పడివున్నాను. బహుశా నాకు కరెంట్ షాక్ కొట్టుండొచ్చు. కానీ ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే 1)అడాప్టర్ పగలగొట్టినందుకు 2) కరెంట్ షాక్ కొట్టించుకున్నందుకు, నన్ను కొడ్తారనో తిడ్తారనో ఆ విషయాన్ని నేను నా మెమరీలోంచి తీసేసాను పూర్తిగా. ఈ సినిమా చూసాక కానీ నాకా విషయం గుర్తు రాలేదు. నా ఈ అనుభవాన్ని ఒక యుద్ధంలో పాల్గొన్న సైనికుడి అనుభవంతో పోల్చాలన్న ఉద్దేశం కాదు కానీ మన మెమరీ ఎలా పని చేస్తుందీ అనే అంశం ఈ సినిమాలో ఒక కీలకాంశం కాబట్టి మాత్రమే ఇక్కడ ఈ ప్రస్తావన చెయ్యాల్సి వచ్చింది. (ఇప్పటికైనా వ్యాసం మొదట్లో చెప్పిన జాక్సన్ గారి రచనలకీ ఈ సినిమాకీ ఉన్న సంబంధం అర్థమైందనే అనుకుంటా.)

మరో అనుభవం. మా కొలీగ్ ఒకావిడ ఈ సినిమా చూసివచ్చింది. అందరూ ఎలా ఉందని అడుగుతున్నారు. ఆవిడ బావుందని చెప్పలేకపోతుంది. కానీ ఈ సినిమా అందరూ చూడాలనీ చెప్తుంది. వింటున్న వాళ్ళేమో కన్ఫ్యూజ్డ్. ఆమె అప్పుడెలా ఫీలయిందో ఈ వ్యాసం రాస్తుంటే నాకు తెలుస్తుంది. నేను కూడా ఈ సినిమా బావుందని అనటం లేదు. అలా అని బాగోలేదనీ అనటం లేదు. ఇది హిట్/ఫ్లాప్, బావుంది/బావోలేదు లాంటి వాటికి అతీతమైన సినిమా.

My rating:10/10

తప్పక చూడాల్సిన సినిమా.

3 Comments
  1. srikanth November 26, 2008 /
  2. ravi February 2, 2009 /