Menu

త్యాగయ్య (1946)

త్యాగయ్య (1946) సినిమా చూశాను. ఈ సినిమా గురించి ఇదివరలో చాలా విని ఉన్నాను. నాగయ్య గారు హీరోగా వేసిన సినిమా ఏదీ నేను చూడలేదు ఇప్పటిదాకా. కనుక, ఆ కుతూహలం వల్ల కూడా ఈ సినిమా దొరగ్గానే మరోసారి ఆలోచించకుండా చూసేసాను. తప్పక చూడవలసిన సినిమా, కాస్త ఓపిగ్గా చూడవలసినది కూడానూ. అరవై సంవత్సరాల క్రితం నాటిది. ఇప్పటి సినిమాలతో పోలిస్తే మెల్లగా సాగుతుంది మరి! సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడే తమ సినిమా కథకి పూర్తి చారిత్రక ఆధారం ఏదీ లేదని విన్నవించుకున్నారు. బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా నేను ఇలాంటి ఒక నోటీసు ఇలాంటి కథలకి చూడటం. ఈ సినిమా గురించి ఇదివరకే నవతరంగం లో ఓ వ్యాసం వచ్చింది కానీ, second opinion కోసమన్నమాట ఈ వ్యాసం 🙂

కథ విషయానికొస్తే, త్యాగయ్య కథ తెలుగు వారందరూ వినే ఉంటారు. కనుక ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు అనుకుంటాను. ఇందులో కథ మొదలయ్యేనాటికే త్యాగయ్య పాటలు పాడుతూ వీథుల్లో తిరగడం ఉంటుంది. అతను మరణించేవరకూ జరిగిన జీవితంలోని ముఖ్యాంశాలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు అంతా నాగయ్యే. కథా రచనలో కూడా ఆయన పాలుపంచుకున్నారని imdb చూసాక తెలిసింది. ఇవన్నీ కాక సినిమాలో త్యాగయ్యగా టైటిల్ రోల్ వేయడం, తన పాటలు తానే పాడుకోవడం అదనపు బాధ్యతలు! amazing! ఇలా ఆల్‍రౌండర్లు లేరని కాదు. ఇంతకంటే versatile వాళ్ళు లేరనీ కాదు. కానీ, ఉన్నంత మాత్రాన నాగయ్యగారిని తక్కువ చేయలేం కదా!

కథనం విషయంలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే భాష చాలా సరళంగా ఉండటం. నేను సినిమా చూసేముందు ఇందులో ఏ గ్రాంధికపు భాష వాడతారో, అది మనకు అర్థమౌతుందో లేదో అని భయపడుతూ ఉన్నాను. కానీ, భాష చాలా సులభంగా, మనం మాట్లాడుకునే భాషలాగే ఉంది. ఇదివరలో మరువూరి కోదండరామిరెడ్డి గారు త్యాగయ్య కీర్తనల మీద రాసిన పుస్తకం చదివి ఉండటంతో నేను సహజంగానే అందులో చదివిన కథలు ఇందులో ఎక్కడెక్కడ కనిపిస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నాను. అవి కనిపించగానే అనుభవించిన థ్రిల్ ని వర్ణించడం కష్టం. ఈ సినిమా వేగానికి “మధురానగరిలో” పాట చిత్రీకరణ మాత్రం చాలా స్పీడ్ అని చెప్పాలి. పిల్లలతో చాలా బాగా చేసారు. నాకు నారదుడిచ్చిన పదార్ణవం చదువుతున్నప్పుడు అక్షరాలు త్యాగయ్య మస్తిష్కంలోకి వెళ్ళిపోయే దృశ్యం చాలా బాగా తీసినట్లు అనిపించింది. గీతాచార్య గారి వ్యాసంలో అన్నట్లు, అరవై ఏళ్ళ క్రితానికి అది టెక్నలాజికల్లీ వెల్ టేకెన్ అనే చెప్పాలేమో. అంతే కాక, త్యాగయ్య పగలు రాత్రనకా దాకా మేలుకుని పాట కంపోజిషన్ గురించి ఆలోచిస్తూ ఉండే దృశ్యాలు వంటి వాటిలో నాగయ్యని చూస్తూ ఉంటే అది సినిమా అన్న విషయం మర్చిపోయాను నేను. ఆయన అంత సహజంగా చేసారు.

పాత్రధారులందరూ ఆయా పాత్రలకి భలే సరిపోయారు. పాత్రల ఎన్నిక ఎలా చేసారో గానీ, సరిగ్గా చేసుకున్నాను. నాగయ్య గారైతే త్యాగయ్య ఇలాగే ఉండేవారేమో అన్న భ్రాంతిని కలిగించారు. త్యాగయ్య కీర్తనలంటే నాకు చాలా ఇష్టం – లిరిక్స్ పరంగా వాటిలో కొట్టొచ్చినట్లు కనబడే భక్తి, ప్రేమాభిమానాలకి. గానం పరంగా అవతలివైపు పాడే మనుష్యుల్ని బట్టి వినగలను, కొంతమందివి మరీ మరీ వినగలను. త్యాగయ్య సినిమాలో వచ్చిన పాటల్లో నాకు అన్నీ అలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా నచ్చకపోయినా కూడా చాలావరకు నచ్చాయి. ముఖ్యంగా – “ఎందరో మహానుభావులు” చాలా నచ్చింది. ఆ పాట అక్కడొస్తుందని నేను ముందే ఊహించడం వల్ల కాబోలు, ఇంకా నచ్చింది. త్యాగయ్య భార్య ధర్మాంబ పాత్ర ధరించిన నటి బి.జయమ్మ, జపేశనుడి భార్య కమలాంబ పాత్ర నటి హేమలతా దేవి- ఇద్దరూ ఆయా పాత్రలకి సరిగ్గా సరిపోయారు. జపేశనుడి భార్య పాత్రధారిణిని చూస్తే ఆ కాలానికి సూర్యకాంతం ఉండి ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపించింది. నిజానికైతే, రివర్సులో చెబుతారేమో – సూర్యకాంతం అవిడ తరువాతి తరం కనుక. కానీ, నేను మొదట నుంచీ చూసింది సూర్యకాంతాన్నే కనుక, నా పోలిక ఇలా వెనుక నుండి ముందుకెళ్ళింది (మీ నాన్న నీలాగే ఉన్నారు అన్నట్లు … 🙂 ) నర్తకి చపలాక్షి పాత్రధారిణి నృత్యం మాత్రం నాకు అసలు నచ్చలేదు. శరీర కదలిక వీలైనంత తక్కువ ఉంది. దానికి తోడు ఆ పేరు నాకు కాస్త వింతగా అనిపించడంతో, ఆమె ఉన్న భాగమంతా నాకు హాస్యాన్ని పంచినట్లైంది. సినిమా చూసాక త్యాగయ్య కథ మీద బానే అవగాహన కలుగుతుంది ప్రేక్షకులకి. ఆ విధంగా ఈ సినిమా సందేశం ప్రేక్షకులని చేరినట్లే కదా!

త్యాగయ్యకు ముందు శాస్త్రీయ సంగీతం పరిస్థితి ఏమిటీ అన్నది నాకు ఈ సినిమా చూసేముందు తెలియదు. ఈ సినిమా చూసాక కూడా కాస్త గజిబిజిగా ఏదో అర్థమైంది కానీ, సరిగా తెలియలేదు. ఈ సినిమాలో ఆ విషయాన్ని తెలిపే దృశ్యాలలో నాబోటి పామరజనానికి అర్థమయ్యేంత స్పష్టత లేదేమోనని అనిపిస్తోంది ఇప్పుడు. లేక, “అన్నీ సినిమాలో చెప్పరు…చారిత్రక నేపథ్యం మనకి తెలిసి ఉండాలి” అన్న వాదనతో సరిపుచ్చుకోవాలో! సినిమా మేకింగ్ పరంగా ఆలోచిస్తే, ఈ సినిమాని ఇప్పుడు తీస్తే ఎలా ఉంటుందా అన్న ఊహ కలిగింది. రెండుగంటల్లోనే కథ అయిపోతుంది ఏమో. ముందే చెప్పినట్లు, నాకు ఈ సినిమాలో అన్నింటికంటే నచ్చింది సంభాషణల్లోని సరళత్వం, సూటిదనం. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు అలా ఉండటం మరీ అంత తేలికైన విషయమేమీ కాదేమో. మొత్తానికి, its an interesting movie to watch. ఇప్పటి సినిమాలు చూసీ చూసీ ఇది మరీ మెల్లగా సాగినట్లు ఉండొచ్చేమో కానీ, అయినప్పటికీ ఎక్కడా బోరు కొట్టడం అన్న భావనైతే కలగదు అని చెప్పగలను. త్యాగయ్య గురించి ఇది కాక 1980 లలో వచ్చిన సినిమా గురించి విన్నాను, చూసినట్లు కూడా లీలగా గుర్తు ఉంది, టీవీలో వస్తే. ఈ రెండూ కాక వేరే ఏవన్నా సినిమాలుంటే తెలుపగలరు. తమిళులు త్యాగయ్యమీద సినిమా తీసే ఉండాలని నా నమ్మకం, కర్ణాటక సంగీతాన్ని పోషిస్తున్నారు కనుక.

17 Comments
 1. venkat November 28, 2008 /
 2. మేడేపల్లి శేషు November 28, 2008 /
 3. Sowmya November 28, 2008 /
 4. మేడేపల్లి శేషు November 28, 2008 /
 5. గీతాచార్య November 29, 2008 /
 6. సాయి బ్రహ్మానందం గొర్తి November 30, 2008 /
 7. మేడేపల్లి శేషు December 1, 2008 /
 8. శ్రీ లక్ష్మీ కళ December 1, 2008 /
 9. పరుచూరి శ్రీనివాస్ December 1, 2008 /
 10. Sai Brahmanandam Gorti December 1, 2008 /
 11. పరుచూరి శ్రీనివాస్ December 2, 2008 /
 12. Sowmya December 2, 2008 /
 13. పరుచూరి శ్రీనివాస్ December 2, 2008 /
 14. Sowmya December 2, 2008 /
 15. sriram velamuri December 3, 2008 /
 16. పరుచూరి శ్రీనివాస్ December 4, 2008 /