త్యాగయ్య గీతామృతం – నాగయ్య నటనాద్భుతం

పొద్దున్నే అంటే, నాలుగు గంటలకు, లేచి సంధ్యోపాసన చేసి, దైవ ప్రార్ధన చెసి, నిర్మలమైన మనస్సుతో కూర్చుంటే, నాలోని భ్రమలు తొలగి, అహం అణగి, మదమాత్సర్యాలు నశించి, ఆకాశాన సందె చుక్క కనిపించింది. దాని అందానికి ముగ్ధుడనై నే నాకసము వైపు నా దృక్కుని సారించగా తారల తళుకు బళుకులు నన్నమితాశ్చర్యమునకు గురి చేసినవి. అప్పుడే నాకు నేనెంత చిన్న వాడిననే భావన కలిగినది.

ఈ అందమైన పృకృతిని సృష్టించిన ఆ భగవానునికి మ్రొక్క బోగా, “నన్ను కాదు నాయనా, నన్ను గూర్చి తెలుసుకున్న వారి గురించి ఆలోచింపుము.  నీ సత్యాన్వేషణ ఫలిస్తుంది,” అన్న మాటలు ఎక్కడినుంచో వినవచ్చాయి. ఎవరా అని ఆలోచింపక, ఆ మాటల సారాన్ని అవగతం చేసుకునే ప్రయత్నమున మునిగి నాను. అంత నాకొకటే భావన…

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్,
శివాది షణ్మతముల గూఢములన్,
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావముల నెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన వారెందరో మహానుభావులూ……ఆఆఆ…..

ఇక మనసాగలేదు. అందుకే ఆ త్యాగ బ్రహ్మని తలంచుచూ… నా ఈ చిరు ప్రయత్నమును ప్రారంభించాను.

నాగయ్య గారు నటించిన త్యాగయ్యని అప్పట్లో చూడని తెలుగు వారు ఉండి ఉండరు. మా నాన్నగారి మాటల్లోనైతే మా ఊళ్ళో వాళ్లు బళ్ళు కట్టుకుని మరీ చూసిన సినిమా అది. సినిమా అనే మాట తక్కువ. చిత్రరాజం… ఊహూఁ. చూద్దాం. ఏమంటామో చివరకు. నటీ నటుల గురించి చెప్పనవసరం లేదు. ఈ కళాఖండానికి కర్త, కర్మ, క్రియ అన్నీ చిత్తూరు వి. నాగయ్య. అంటే నాగయ్యగారు. (ఇప్పుడు దొరికే DVD/VCD ల మీద లేబెల్ అలాగే ఇస్తున్నారు).

ఆయన ప్రతిభ గురించి మాటలాడే సాహసం చేయను. కానీ అతి కొద్ది మాటలలో నా అనుభూతులను పంచుతాను. మొదటి సారి గా నేను ఒక వేమన సినిమాని చూశాను. నా వయసుకప్పటికి అది మహా విసుగు అనిపించింది. నటీ నటుల గురించి నేను చెప్పను. కానీ కొన్ని రోజులతరువాత నేను ‘భక్త పోతన’ సినిమా చూశాను. అందులో పోతన పాత్ర దారి శాంత గంభీరమైన నటన, సరళ గంభీరమైన గాత్రం, నన్ను ఏవేవో లోకాలకి తీసుకుని పోయి, మైమరపించి, అలా టీవీకి నన్ను కట్టి పడేసినాయి.

అప్రస్తుతమైనా ప్రస్తుతమే ఇది. అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను. ‘బొబ్బిలిరాజా’ సినిమా చూసి, అందులో వెంకటేష్ నటనకి My మరిచి కొన్నాళ్ళు ఆ అనుకరణ చేసిన నాకు, ఈ వ్యక్తీ నటన నచ్చటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. (అదే నా జీవితం లోని తొలి, ఆఖరి అనుకరణ. ఎందుకో నాకు అనుకరణ అంత నచ్చదు. ఎప్పుడన్నా ప్రయత్నించినా పొత్తు కుదరదు). కానీ నాకు ఆశ్చర్యం కలుగలేదు. ఆ నటునిలోని మహత్తు అలాంటిది. అందుకే ఇంకొటేదో సినిమా వస్తుంటే చూశాను. అందులోనూ ఆ పోతనే. అంతే. నేను మళ్ళీ టీవీ కి అతుక్కుని పోయి చూసిన ఆ సినిమా ‘నాగయ్యగారి వేమన’.

నా వయసు వారికి ఆ రోజుల్లో ఉండే అభిమాన నటులు కాకుండా Break the Rules అంటూ నాకు అభిమానం లో ఒక కొంగ్రొత్త కోణాన్ని చూపించిన నాగయ్యకి నివాళిగా…

ఈ చిత్రానికి ‘ఎందఱో మహానుభావులు’ పని చేశారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది, ‘జపేశన్’ పాత్రధారి ఐన ‘ముదిగొండ లింగమూర్తి’ గురించి. అసలు మన ముందు ఆ జపేశనే ఉన్నాడా అనేటంత సహజమైన నటనని ప్రదర్శించారు. ‘ఏమిరా త్యాగూ’ అంటూ ఆయన చెప్పే డైలాగ్ అప్పట్లో వాళ్ల బడిలో ఎవరన్నా మాట వినక పోతే వాళ్ల మాష్టారు వాడేవారని మా గురువు గారు చెప్పేవారు. అంటే అంత నలిగి ఉంటుంది ఆ తరం వారి నోళ్ళలో. ‘సుకవి నిల్చు జనుల నాల్కల పైన…’ అని చిన్నప్పుడు చదువుకున్నాను. గొప్ప నటులు కూడా అంతే. వారి వారి మేనరిజాల వల్ల. (ఇప్పుడూ ఉన్నారు. అది నా బాధ్యత కాదు).

కానీ ఆ మాటలు త్యాగరాజ మహాకవి విషయంలో మాత్రం ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆయన సుకవే కాదు భక్త కవి కూడా. అంతేనా ఒక గొప్ప సృష్టి కర్త కూడా. ఎన్నెన్నో రాగాలని సృజియించిన సృజనశీలి ఆయన.

అంతటి ఆ మహా వాగ్గేయకారుని చరిత్రని తెరక్కెక్కించే సాహసానికి ఒడిగట్టారు నాగయ్యగారు. ఎంతో సాహసంతో, భక్తితో ఎన్నో విమర్శలు ఎదుర్కుని, ఖర్చుకోర్చి, తీసిన ఆ చిత్రం ఆయనని భక్తి చిత్ర నటునిగా అమరత్వాన్ని కలుగజేసింది.

త్యాగరాజ మహాకవి జీవితం లోని కొన్ని మధుర ఘట్టాలనూ, ఆయన మనకి ప్రసాదించిన గీతాలలో కొన్నింటిని, నాగయ్య గారు తనకే సాధ్యమైన శైలిలో మనకి అందజేసి మనలను ధన్యులని చేశారు. ఆయన గళం లో నుంచీ జాలువారిన ఆ త్యాగరాజ కృతులు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తాయో… ఆ చక్కని పద ఉచ్ఛారణ అంత మహత్తరంగా ఉంటుంది. (కొందరు పెద్దలు పాడినప్పుడు వారి పాండిత్య ప్రదర్శనే తప్ప హావ భావాలలో త్యాగరాజ హృదయాన్ని అందుకోలేక పోయారు. ఎన్నోసార్లు విని నేను చెపుతున్న మాట ఇది. ఆ భక్తి కూడా కానరాదు). కానీ నాగయ్యగారి ప్రత్యేకత అక్కడే మనలని కట్టి పడేస్తుంది. ఆయన లీనమై, మనని కూడా లీనం చేస్తారు. భక్తి తప్ప ప్రదర్శనా ధోరణులు ఎంతమాత్రం కానరావు. ఆ రోజుల్లోనే కారులో తిరిగిన భోగి ఐన ఆయన ఈ భక్తి యోగి పాత్రని అంత గొప్పగా పోషించారంటే ఎంత ఆశ్చర్యమో నాకు. చేసే పని మీద దృష్టి తప్ప అన్యం తెలియదేమో ఆ మహా నటునికి. తప్పు తప్పు. మహానుభావునికి. కేవలం నటించటమే కాదు. దర్శకత్వాన్ని కూడా నేరిపి, సంగీతాన్ని అందించి, గానామృతాన్ని పంచ గలిగారంటేనే ఆయన బహుముఖ ప్రజ్ఞ, శక్తి సామర్ధ్యాలూ, చేసే పని పట్ల అనురక్తీ మనకి అర్ధం అవుతాయి.

ఇక సినిమా గురించి చెప్పాలంటే ముందు ఆయన ఇచ్చిన వివరణని గురించి చెప్పాలి. కొంచం అటూ ఇటూ గా ‘This is not an historically accurate account. Many popular legends are taken into account. This is for dramatization’s sake.” అందుకే కొన్ని చరిత్రకందని విషయాలూ ఉన్నాయి ఆ చిత్రం లో. అందులో ముఖ్యమైనది… ‘నారద మహర్షి’ మారు రూపం లో ప్రత్యక్షం అయ్యే సన్నివేశం.

అంతకు మునుపు స్వరార్ణవం కొరకు త్యాగయ్య బాధ పడే సన్నివేశాలని ఎంతో హృద్యంగా చిత్రీకరించ బడినాయి. అర్ధరాత్రి పూట స్వర రచనకు పూనుకుని, సాధించలేక (శిష్యుడు ‘బాగుంది గురువుగారూ’ అన్నా ఆయన తృప్తి పడరు.) ఆ తరువాత ఒక రోజున ఆయన వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఎంతో దూరం నుండీ నేను మీ పాటను వినటానికి వచ్చాను. అని ఆయనను అడుగుతారు. అప్పుడు ‘రామానుగ్రహం పొందలేని మంద భాగ్యుని’ అని బాధపడటం, ఆ వ్యక్తి ఒక పోత్తమునిచ్చి ఆయనను పరిశీలించమనటం వెనువెంటనే జరిగిపోతాయి.

ఆయన పరిశీలించే సమయం లో ఆ సంగీత జ్ఞానం, సరస్వతీ కటాక్షం అక్షరాల రూపం లో అక్షరంగా ఆయనలో కలిసి పోవటం అప్పటి టెక్నికల్ స్టాండర్డ్స్ అనుసరించి అద్భుతమనే చెప్పాలి.

“ఎవరు స్వామీ మీరు?” అని అడుగగా ఆయనకు ప్రాప్తమైన సమాధానం… “మా అమ్మ వీణ వాయిస్తుంది.”

ఈ సమాధానం మరో మహానుభావుడు సముద్రాల రాఘవాచార్య (సముద్రాల సీనియర్) వ్రాసినది. ఈ చిత్రానికి వీరే సంభాషణలను కూర్చారు. వీరి గురించీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరు మా స్వగ్రామానికి చెందిన వారు.

ఈ సన్నివేశంలో చిత్రం ఏమిటంటే అప్పటి దాకా త్యాగరాజు పొందిన ఆవేదనంతా చేత్తో తీసేసినట్టుగా పోతుంది. అప్పుడు కలిగిన పులకరింతలో ‘శ్రీ నారదా మౌనీ’ అనే కీర్తనని పాడుతారు. మనకీ మనసు పులకరిస్తుంది. అరె! నారద మహర్షి ఇలాగే ఉంటారా? అని అనిపిస్తుంది. అతిశయోక్తి కాదు. ఒక్క సారి నారద మహర్షి రూపం (ఈ సినిమాలో వచ్చే క్షణకాలంలో) చూస్తే మన మనసులలో నుంచీ తొలగిపోదు. అనుభవించాలే గానీ వర్నించనలవిగాని ఆనందం కలుగుతుంది ఆ ఒక్క సన్ని వేషంతోనే. చారిత్రకంగా జరిగిందని చెప్పలేక పోయినా ఆ నారద మౌని అనుగ్రహం కలుగనిదే త్యాగ బ్రహ్మ ఇంతటి వ్యక్తిగా నిలిచేవారు కాదేమో. నా ఉద్దేశ్యం నాగయ్యగారు కూడా ఆ దేవర్షి అనుగ్రహం పొందారేమో!.

మరొక సన్నివేశం… “ఎందఱో మహానుభావులు” కీర్తన వచ్చే సమయంలో. ఆ సన్నివేశంలో ఎందఱో మహానుభావులు, సంగీత విద్వాంసులు ఒక సభలో కూడి ఉంటారు. త్యాగయ్య తన గురువు గారి ఆజ్ఞ మేరకు అచటికి వెళ్లి వారి ఆశీర్వాదములను, ఆనతిని (ఆయనే పాడమని కోరుతారు) పొంది ప్రారంభించే “ఎందఱో మహానుభావులు” అజరామరమై నిలిచి ‘పంచరత్నా’లలో ఒకటిగా కీర్తిని పొందగా, నాగయ్య గారి సన్నివేశ రూపకల్పన, imagination, గాత్రం, స్వరకల్పనా, తోటి నటుల నుంచీ తనకు కావలసిన effect ని పొందిన తీరూ, తెలుగు చిత్ర పంచరత్నాలలో ఒకటిగా చేశాయి.

త్యాగయ్య పాడటం అవగానే ఒక విద్వాంసుడు ‘బ్రహ్మానందం కలిగించారండీ త్యాగయ్య గారూ’ అనటం ఆ సన్నివేశంలో అక్కడి వారికే కాదు. చూసిన మనకి కూడా నాగయ్య గారు ‘బ్రహ్మానందాన్ని’ కలుగ జేశారు. అక్కడ త్యాగయ్య పాడే సందర్భంలో ఉన్నా వ్యక్తులు నిజంగానే లీనమైపోయి ఉంటారు. ఆ సహజత్వం చాలా అరుదు.

(సశేషం)

విన్నపం: చెప్పవలసినది ఇంకనూ ఇంత ఉన్నది కాన ఇప్పటికి ముగింపక తప్పదు.

ధన్యవాదాలు: దయచేసి వ్యాఖ్యలు తెలుగులో… అందులకు పెద్దలకి.

Filed Under: featuredleadభారతీయ సినిమావిశ్లేషణ

Tags: ,

Comments (16)

Trackback URL | Comments RSS Feed

  1. Sai Brahmanandam Gorti says:

    గీతా చార్య గారూ,

    మీరు రాసిన వ్యాసం బాగుంది.
    నేనూ మీ లాగే త్యాగరాజుని అమితంగా ఆరాధిస్తాను. మీరు చెప్పిన త్యాగయ్య సినిమానీ, బాపూ గారి త్యాగయ్యనీ చూసాను. బాపూ గారి త్యాగయ్య నాగయ్య సినిమాని కాపీ కొట్టినట్లుగా తీసారు. అందులో దేహముందంతే. ఎక్కడా హృదయం లేదు. నాగయ్య సినిమాలో నాగయ్య నటనొక్కటే ఆకట్టుకునే విషయం. నాకు ఈ సినిమాపై కొన్ని చారిత్రాత్మక అభ్యంతరాలున్నాయి. అది వేరే సంగతి లెండి. సెల్ఫ్ ప్రమోషన్ కాదు. వీలయితే ఈ క్రింది వ్యాసాలు చదవండి. దయచేసి మరోలా భావించవద్దు. అందులో మన తెలుగు త్యాగరాజు కనిపిస్తాడు. ఇది రాయడంకోసం తిరువయ్యారు వెళ్ళాను.

    http://www.eemaata.com/em/issues/200809/1337.html

    http://www.eemaata.com/em/issues/200811/1279.html

    తంజావూరూ సరస్వతీ మహల్ లైబ్రరీకి వెళ్ళి అనేక పాత పుస్తకాలు కొన్ని రిఫర్ చేసి మరీ రాసాను. త్యాగరాజుని హరిదాసుగా మలిచేసారన్న్నదే ఇప్పటికీ నా బాధ.

    సాయి బ్రహ్మానందం గొర్తి

  2. శ్రీ లక్ష్మీ కళ says:

    గీతాచార్యా,

    మీ వ్యాసం చాలా అందంగా ఉంది. నాగయ్య తన భక్తిపూర్వక నటనతో త్యాగయ్య ఆత్మను పట్టుకుంటే… మీరు నాగయ్య మీ చక్కని వ్యాసంతో నాగయ్య ఆత్మను పట్టుకున్నారు. నారద ఉని సన్నివేశాన్ని చాలా అందంగా వర్ణించారు. మీకు ఇలాంటి భావనలను అందించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు.

    కానీ ఇంత మంచి వ్యాసంలో ఒక్కటే చిన్న లోపం. కొన్ని చోట్ల consistency of language లేదు. ఈ ఒక్క దానినీ తగ్గించుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.

    ఈ చిత్రం గురించి కొన్ని విమర్శలూ ఉన్నాయి. అవి మీకు తెలుసా? ఈ లింక్ చూడండి. మీ తరువాయి భాగానికి పనికి వస్తుందేమో. ఏమో మీరు ఏ twist ఇస్తారో మరి:-). పూర్వానుభవం.

    http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/ebc6cc17c6d488a365256f230033072d/$FILE/Te250175.pdf

    @ నవతరంగం: The second photo is very nice. It’s apt to the post. Your selection is great.

  3. Sowmya says:

    ఓ నేను ఈ సినిమా గురించి రాద్దామనుకుంటూ ఉన్నాను…మీరు ఇంతలో రాసేసారు. సరేలెండి, నేను మరో వ్యాసం రాస్తాను. మీ అంత బాగా ఎలాగో రాయలేను కానీ, అది చదివిన వారి ద్వారా మీకు మరింతమంది అభిమానులు ఏర్పడతారు.. ;)

  4. శ్రీ లక్ష్మీ కళ గారు మీరిచ్చిన లంకె పనిచెయ్యటం లేదండి :(

  5. చండీదాస్ says:

    గీతాచార్య గారూ,

    మీరు బాగా రాస్తారు, పొయెటిక్ గా, ఫిలసాఫికల్ గా…

    అయితే మీలో స్వోత్కర్ష ఎక్కువ…ఆవుకథలాగా… పెళ్ళిపుస్తకం సినిమాలో గుమ్మడి ‘ నేనూ..’ అన్నట్టు! మీ ప్రతి వ్యాసంలో మీ గురించి ఏదో ఒక కొత్త విషయం తెలియజేస్తూనే ఉంటారు.Spare Us!

    ఇక లక్ష్మీకళ గారు… మీ వ్యాసం వచ్చీరాకముందే వ్యాఖ్యతో తయారు… it’s obvious that she is your alter ego.

    మీ టాలెంట్ ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తాను.

  6. చండీదాస్ గారు,వ్యాసకర్త తనరచనలో కనీసపు స్వవిషయాలను ప్రస్తావించవచ్చు అని నా అభిప్రాయం.

  7. గీతాచార్య,
    మీ వ్యాసం సమగ్రంగా నాలాంటి ..కనీస పరిజ్ఞానం గల పాఠకులను అలరించేలా ఉంది.మళ్ళి ఇంకోసారి చదువుతాను.

    సౌమ్య,
    మీరు బాపు త్యాగయ్య గురించి రాయండి. ఎలాగూ విమర్శించకుండా రాయలేరు.(బాపు గారే బోలెడు జోకులేసుకున్నారు దానిమీద) మీకు ఇప్పుడున్న అభిమానులకు మరికొంత మంది తోడవుతారు అప్పుడు.

  8. అమ్మా లక్ష్మీ కళ గారూ! మీరు ఈ ఇగోఇస్ట్ ని ఆల్టర్ ఇగోఇస్ట్ ని చేశారు. నేను బాగా వ్రాయగాలనో లేదో నాకు తెలుసు. అర్ధం అయ్యేట్టు వ్రాస్తే ఒక సమస్య. లేకుంటే ఇదిగో మీ లాంటి సోఫిస్టికేటేడ్ దాడులు. ఇవి వ్యక్తిగత దాడులకన్నా ప్రమాదకరం. కొంపదీసి ఇది Peter Keating కి Dominique ఇచ్చే బూస్ట్ అప్ కాదు కదా! (నేను కీటింగ్ ని కాదు. అదీ నాకు తెలుసు).

    నా పైన ఏమన్నా కోపం ఉంటే ఎదురుగా వచ్చి తేల్చుకోవచ్చు కదా? మీ వల్ల నా కష్టానికి కళ తప్పకుండా ఉండాలని దేవుని ప్రార్ధిస్తూ… ;-(

    బాగాలేవన్నా మంచిదే. ఇంకొంచం ప్రయత్నించవచ్చు. నాలుగైదు గంటలు కష్టపడి వ్రాసుకున్న ఈ చిన్న టపాకి మీ వల్ల ఇదో సమస్య. దయచేసి మీ ప్రోత్సాహాన్ని మిగిలినవారికీ అందించి, నన్ను నా మానాన వదిలేయండి.

  9. సాయి బ్రహ్మానందం గారు,

    మీది సెల్ఫ్ ప్రమోషన్ అని నేనైతే అనను. మీ గురించి మీరు సమాచారం ఇవ్వందే ఆ విలువైన సమాచారాన్ని నాకు ఎవరు అందించగలరు. సరస్వతీ మహల్ గ్రంధాలయానికి వెళ్లి మరీ మీరు పడ్డ కష్టం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. ఆ గ్రంధాలయ దర్శన భాగ్యం నాకు ఏడాది క్రితం కలిగింది. చాలా విలువైన సమాచారం అందు నిక్షిప్తమై ఉన్నది.

    నెనెర్లు. ఇక ఇంతకన్నా ఏమీ చెప్పలేను. మీ ఆర్టికిల్ ని చదివే పనిలో ఉన్నాను.

  10. చండీదాస్ గారు,

    You are entitled to your opinion. But I, it’s ఐ, know the truth.

    మీ ప్రశంసకు నెనెర్లు.

  11. సుజాత గారు,

    Thanks.

    @soumya garu,

    నేను వ్రాసిన దాన్ని మీరు వ్రాయాలనుకోడం…? I’m flattered. మీరు చాలా సీనియర్లు. సుజాత గారి అవిడియా ఏదో బాన్దనుకుంటా. అప్పుడు నేనూ మీ అభిమానుల లిస్టు లో చేరిపోతా.;-)

  12. రమణ says:

    త్యాగయ్యకి చాలా గొప్ప సంగీతం కూర్చారు నాగయ్యగారు, చాలా గొప్పగా నటించారు. IMHO, పోతనా, వేమనల పక్కన త్యాగయ్యని చూస్తే, ఒక గొప్ప కళాకారుడు, గొప్ప ప్రయోక్త (దర్శకుడు) సమిష్టిగా కలసి చేసిన సృష్టికి, కళాకారుడు ఒంటరిగా చేసిన సృష్టికి వున్నతేడ కనిపిస్తుందనిపిస్తుంది.

  13. Sowmya says:

    నేను బాపు త్యాగయ్య చూడనిదే!!
    ఈ త్యాగయ్య గురించే రాస్తాను. అది నా perspective..అంతే.

  14. శ్రీ లక్ష్మీ కళ says:

    చండీదాస్ గారు,

    మీకు నన్ను కలవాలని ఉంటే ఈ క్రింది చిరునామాలో కలవ వచ్చు.

    ఎటర్నల్ ఓల్డ్ ఏజ్ హోం, మనసాదేవి ఆశ్రమ్, పంచ కుల.

    అక్కడకి తేలికగానే చేరుకోవచ్చు. మీరు అనే స్వోత్కర్ష అనుకరణ గురించైతే అది నా కొరకు వ్రాసినది కావచ్చు. ఎందుకంటే గత టపా లో ఈ కుర్రాడికి నేను పరోక్షం gaa సిడ్నీ షెల్డన్ గురించి చెప్పటం జరిగింది. అది కాకపోతే ఇక అతనికే తెలియాలి.

    గీతాచార్య గురించి నేను చూసే పది పదిహేను రోజులు కాలేదు. మీరే అన్నట్టుగా పోఎటిక్ గా, ఫిలసాఫికల్గా… చెప్పే బదులు ఇతను రాసే బ్లాగులని ఓపికగా వెతుక్కుని తీరికగా చదవండి. ఎందుకు నేను appreciate చేస్తానో అర్ధం అవుతుంది. interest ఉంటే వెతుక్కునే. ఇలాంటి వ్యాఖ్యలు బాధిస్తాయి.

    Read the article about the movie ’sumangali’. without knowing anything about it, he wrote an excellent article. he has a sound philosophical base. He utilized it well to develop the essay.

    మరొక్క మాట చెప్పిముగిస్తాను. ఇతను రాసినవి చదివిన తరువాత నిజంగానే మీరు చెప్పే విధం గా (చేయడు. He looks to be an egoist) అంత ఆబ్వియస్ గా ఉండటం అసాధ్యం.

    @ సౌమ్య: ;-)

    @గీతాచార్య:

    మీరు రాసిన వ్యాఖ్యకు నేను బాధ పడటం లేదు. మీ కోపాన్ని అర్ధం చేసుకోగలను. బాగా హార్ట్ అయినట్టున్నారు. Don’t give a damn to such comments. :-)

  15. మేడేపల్లి శేషు says:

    బ్రహ్మానందంగారు తిరువయ్యారు వెళ్లి పరిశోధన చేసినట్టుగానే, త్యాగరాజు స్వగ్రామమైన “కాకర్ల” (ప్రకాశం జిల్లాలో ఉంది) వెళ్లి ఒకాయన (బహుశా ఎన్నారై) త్యాగరాజు పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశోధన చేశారు (ఆయనా కాకర్ల వంశస్తుడే). ఆయన వ్యాసం ఒకసారి (చాలా రోజుల క్రితం) అంతర్జాలంలో చదివాను. అది మరెవరైనా చదివి ఉంటే, చెప్పగలరా? (తర్వాత అంతర్జాలంలో వెతికితే, దొరకలేదు)
    -శేషు, కొత్త డిల్లీ

  16. very well executed.

    (కొందరు పెద్దలు పాడినప్పుడు వారి పాండిత్య ప్రదర్శనే తప్ప హావ భావాలలో త్యాగరాజ హృదయాన్ని అందుకోలేక పోయారు. ఎన్నోసార్లు విని నేను చెపుతున్న మాట ఇది. ఆ భక్తి కూడా కానరాదు).

    I hope I understand at whom you targeted this criticism. The Nadada Scene is one of the best executed in the film history.

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.