The Bicycle Thief (Italian, 1948)

bicycle-thief

ఇది చాలా పేరు పొందిన క్లాసిక్ సినిమా. ఇటాలియను దర్శకుడు విట్టోరియా డిసికా 1948లో తీశాడు.

ఈ సినిమా గురించి (సంక్షిప్త కథ దగ్గర్నించీ లోతైన విశ్లేషణల దాకా) జాలంలో సంచులకొద్దీ సమాచారం ఉంది, కాబట్టి అవన్నీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యను. కేవలం, ఒక ప్రేక్షకుడిగా, ఈ సినిమా చూస్తుండగా నాకు కలిగిన భావాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.

సినిమా గురించిన కొన్ని మౌలికమైన వివరాలకి కింది సైట్లు చూడచ్చు.
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్
వికీపీడియా
రాజర్ ఈబర్ట్

సినిమా కళలో వాస్తవికత గురించి ఇదివరలో సెవెన్ సమురాయ్ సినిమా మీద రాసిన వ్యాస పరంపరలో కొంచెం చెప్పే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా అర్ధం చేసుకో వలసింది, వాస్తవికత అంటే .. సినిమాలో చూపించిన విషయాలు నిజప్రపంచంలో జరిగే అవకాశం ఉందా లేదా, కథ నమ్మేట్టుగా ఉందా, అని కాదు. కళలో వాస్తవికత అనేది ఒక దృక్పథం. కథలోని సంఘటనలని, పాత్రలని చూడ్డంలో ప్రేక్షకుల దృష్టిని నిర్దేశించే ఒక దృక్పథం. అటువంటి వాస్తవిక దృక్పథానికి ఈ సినిమా పరాకాష్ఠ.

ఇటువంటి సినిమాని ఆసాంతం శ్రద్ధగా చూడ్డానికి కొంచెం ఓపిక ఉండాలి. ఇది అందరికీ నచ్చేలాంటిది కాదు. సినిమా కథలో గానీ, కథనంలో గానీ, ప్రేక్షకుల ఉద్రేకాలని రెచ్చగొట్టే దినుసులు ఏవీ ఉండవు. మనం అలా వీధిన వెళ్తున్నామనుకోండి. ఒకతను, తన పదేళ్ళ కొడుకుతో అలా వెళ్తూ కనిపించాడు. మనకేదో ఆ క్షణానికి వేపకాయంత వెర్రెక్కి, బయల్దేరిన పని వదిలేసి, ఆ తండ్రీ కొడుకుల్ని ఫాలో అయి రోజంతా వాళ్ళ వెంట తిరిగితే ఎలా ఉంటుందీ? అలా ఉంటుందన్న మాట ఈ సినిమా.

మామూలుగా మనం ఒక కథ చదివినా ఒక సినిమా చూసినా అందులోని ఒక పాత్రతోనో, కొన్ని పాత్రలతోనో మమేక మవుతాం. ఆ పాత్రకి మంచి జరిగినప్పుడు ఆనందిస్తాం. కష్టాలొచ్చినప్పుడు బాధ పడతాం. క్లుప్తంగా, ఆ పాత్ర మనోభావాలి, భావోద్వేగాల్ని మనకి ఆపాదించుకుంటాం. అదే పేపర్లో ఒక శుభవార్తో దుర్వార్తో చదివినప్పుడు మనకి అలాంటి భావోద్వేగం కలగదు. టీవీలో వార్తలు చూసినప్పుడు కూడా.

వాస్తవిక దృక్పథంతో తీసిన సినిమా చూసినప్పుడూ ఇంతే. కథలో మనల్ని చలింపచేసే సంఘటనలు లేవని కాదు. భావోద్రేకాలు అస్సలు లేవని కాదు. సినిమా మొదటి ఫ్రేము నించీ చివరి ఫ్రేము దాకా, ముఖ్య పాత్రల ఆశలూ, ఆశయాలూ, దుఃఖాలూ, నిరాశలూ, నిట్టూర్పులూ చాలా ఉన్నాయి. కథలో వివిధ సన్నివేశాల్లో ఆయా పాత్రలు అనేక భావోద్వేగాలకి లోనవుతూనే ఉంటాయి. అది మనకి తెలుస్తూనే ఉంటుంది కూడా. ఎటొచ్చీ అవన్నీ మనలో ప్రతి స్పందనలు కలిగించవు, కానీ అయ్యో పాపం అనిపిస్తుంది.

పైన చెప్పిన మొదటి రకపు భావోద్వేగ చలనం మనలో కలిగినప్పుడు దాన్ని టచింగ్ .. లేక .. మూవింగ్ ఎక్స్‌పీరియన్స్ అనుకూంటాం. ఆ అనుభవం మనల్ని కదిలించింది అనుకుంటాం. ఇదంతా గుండెకి సంబంధించిన వ్యవహారం. వాస్తవిక దృక్పథంలో మనకి అనుభవమయ్యేది వేరు. అది మెదడుకీ, ఆలోచనకీ సంబంధించిన వ్యవహారం.

అంటే, కళ అనగానే ఉద్వేగ ఆధారితం మాత్రమే కాదు. దానికి ఆలోచనతో కూడా పని ఉంది. మానసిక ఉద్వేగం ఆలోచనని కప్పి ఉంచుతుంది. కాబట్టి కథన ప్రక్రియలో ఆ ఉద్వేగాన్ని పక్కకి పెట్టి, ఆలోచన రేకెత్తించే పద్ధతిలో కథనం నడపటం వాస్తవిక దృక్పథం తనకి తాను విధించుకున్న పరమావధి అనిపిస్తుంది.

ఈ ప్రపంచమొక పద్మవ్యూహం. ఇందులో మన అదుపులో లేని విషయాలు, అంశాలూ చాలా ఉన్నై. అవి మనల్ని తిన్నగా పోనియ్యవు. అటూ ఇటూ తోస్తూ ఉంటాయి. మన దారిలో అడ్డంకుల్ని పెడుతూ ఉంటాయి. అలాఅని మనం విధిచేతి కీలు బొమ్మలమూ కాము, భారమంతా విధి మీదనో ఆ పైవాడిమీదనో వేసేసి నీ చిత్తము నా భాగ్యము అనుకోడానికి. దాంతో, ఈప్రపంచంలో, ఈ జీవితంలో మనం వేసే ప్రతి అడుగూ ఒక పోరాటం. ఒక ఎడతెగని, అలుపెరుగని పోరాటం.

వోలు మొత్తమ్మీద ప్రపంచం బాగానే నడిచి పోతున్నట్టే ఉంటుంది. అదేదో ఆధునిక పద్యంలో చెప్పినట్టు బిస్మిల్లా ఖాన్ బిస్మిల్లా ఖాన్ లాగే షెహనాయీ వాయిస్తుంటాడు. కానీ నీ ఒక్కడి జీవితం మాత్రం అల్లకల్లోల మైనట్టు ఉంటుంది. నీకు కష్టపడి పనిచేసే తత్వం ఉంది. దురలవాట్లు కానీ వ్యసనాలు కానీ ఏం లేవు. దొరక్క దొరక్క ఒక ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగానికి సైకి లుండటం తప్పనిసరి. ఉద్యోగం మొదటి రోజునే నీ సైకి లెవరో దొంగిలించారు. రోము లాంటి మహా నగరంలో ఒక సైకిలు కోసం ఎక్కడని వెదుకుతావు? రక్షణ కల్పించేందుకు బోలెడు వ్యవస్థ ఉంది. కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ వల్ల నీకు పైసా ఉపయోగం లేదు. ఇంకో జత కళ్ళు తోడుంటే మంచిదని నీ ఏడేళ్ళ కొడుకునీ వెంటేసుకుని ఆ ఆదివారం నగరమంతా చెడతిరుగుతున్నావు. జనాల ఎవరి పనులూ ఆగిపోవట్లేదు. హోటళ్ళలో భోజనాలు, చర్చిలో ప్రార్ధనలు, నది వొడ్డున విహారాలు, సాకర్ ఆట వినోదాలు .. అన్నీ యథా ప్రకారం నడిచిపోతున్నాయి, ఒక్క నీ జీవితం తప్ప.

ఇలా చూస్తే ఈ వాస్తవిక దృక్పథం మనకి సులభంగా కనిపించని, భావోద్వేగం వల్ల మరుగున పడే ఏదో ఒక సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. అంతిమంగా మంచి కళ ప్రయోజనం సత్యాన్ని ఆవిష్కరించడమే గదా.

సినిమా గురించి రెండు మాటలు

  • ఈ సినిమాకి ఇటాలియన్ పేరు సైకిలు దొంగలు. ఈ బహువచనం కాస్తా ఆంగ్లంలో ఒక్క దొంగగా మారిపోయింది. ఈ మార్పులో దర్శకుడు ఉద్దేశించని ఒక నైతిక తీర్మానం చోటుచేసుకుందని, తద్వారా సినిమాని కొంచెం భావోద్వేగ దృషితో చూసే అవకాశం ఉన్నదని నాకనిపిస్తోంది.
  • ఇందులో ఆంటోనియో కొడుకు ఏడేళ్ళ బ్రూనోగా ఎంజో అద్భుతంగా నటించాడు. నేనిప్పటివరకూ చూసిన సినిమాలన్నిటిలో పిల్లల పాత్రల్లో ఇది అత్యుత్తమమైన నటన అనేందుకు నాకేమాత్రం సందేహం లేదు.
  • రోము నగర వీధుల దృశ్యాల్ని దర్శకుడు చిత్రీకరించిన తీరు కూడా అద్భుతం.

తాజాకలం

వాస్తవిక దృక్పథానికి మీరానాయర్ తీసిన సలాం బాంబే (Salaam Bombay) సినిమా, రోహింటన్ మిస్త్రీ నవల ఎ ఫైన్ బేలెన్స్ (A Fine Balance) మంచి ఉదాహరణలు. తెలుగులో యువరచయిత సురేష్ రాసిన టైటానిక్ అనే కథ ఈమాట జాల పత్రికలో దొరుకుతోంది.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

కొత్తపాళీ

రచయిత:

పుట్టిందీ, ఇంటరుదాకా చదివిందీ విజయవాడలో. మెకానికల్ ఇంజనీరింగు చదువు వరంగల్లో మొదలై, కాంపూరులో సాగి, ఫిలడెల్ఫియాలో ముగిసింది. ఫిలడెల్ఫియాలో రిట్జ్ సినిమా హాళ్ళలో పలు అంతర్జాతీయ సినిమాలు చూశాకే సినిమాల గురించి నాకో అభిరుచి ఉందని తెలుసుకున్నా. అందుబాటులోనే అంతర్జాతీయ సినిమాల విడియో షాపు ఉండటం ఈ అభిరుచి పెరగడానికి దోహదం చేసింది. అదే తరవాత ఏనార్బర్, మిషిగన్ లో కొనసాగింది. అన్ని రకాల సినిమాలూ చూస్తా ... లార్డాఫ్ ద రింగ్స్ నించీ పల్ప్ ఫిక్షన్ దాకా, ఇటు అర్జెంటీనా నించీ అటు జపాన్ దాకా .. ఒక పద్ధతి ప్రకారం చూడను. అభిమాన దర్శకులూ నటులూ అంటూ ఎవరూ లేరు. చాలా సార్లు చూసిన సినిమాల, దర్శకుల పేర్లు గుర్తుండి చావవు. సినిమా చూడంగానే నాకోసం నేను ఒక చిన్న రివ్యూ రాసుకోవాలని చాలా సార్లు అనుకున్నా గానీ ఆచరణలో పెట్టలేదు. ఇప్పుడు బ్లాగుల పుణ్యమా అని కొంత రెగ్యులర్ గానే చూసిన సినిమాల గురించి రాస్తున్నా. http://vinnakanna.blogspot.com

25 Comments to “The Bicycle Thief (Italian, 1948)”

  • This one movie that makes you fall in love with the characters. I was so wishing that he finds his bicycle.

  • Can We say “Pulp Fiction” also this kind of movie?

  • Pulp fiction is just the opposite of realistic film making.

  • Then what movie do you think in line with “Realistic film making” ?
    give me two names please?released recently…..

    • Of the recent movies Tamil movie Thavamai Thavamirundhu is realistic to certain extent. Though realistic movies come and go every year, very rarely such films are accepted and gain popularity.

  • First thanks to Mr k pali g..

    To publish your openion on Bicycle thiefs…As u mentioned in your essay some where..since begining i could not immerse in any character ..but ,i was very sympathatic towords lead character and his son`s character..This kid really throbed my heart with his out standing performence …

    But in the world cinema ..it was one di classics ..

    Venkat Balusupati

  • కొత్తపాళీ గారూ,
    మీ వ్యాసం చాలా బావుంది. చెప్పాల్సిన విషయాన్ని చిన్న వ్యాసంలోనే చెప్పగలిగారు.
    శ్రీ,
    మీకు ఈ సినిమా లాంటి సినిమాలు కావాలంటే ముందు ఈ సినిమా చరిత్ర కొంచెం తెలుసుకోవాలి.

    బైసికిల్ థీవ్స్ అనేది ఇటలీలో వచ్చిన నవ్య వాస్తవిక వాదపు (neo-realism) సినిమా. ప్రపంచంలో చాలా దేశాల్లో వచ్చిన సినిమా ఉద్యమాలలాగే ఇదీ ఒకటి. ఈ నవ్య వాస్తవిక వాదపు సినిమాలూ మరియు సాహిత్యంలో సామాన్య మానవులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తుంటారు. ఆ సాదా సీదా జీవితాల్లో జరిగే సాధారణ సంఘటనలు వాటి పర్యావసనాలతో కథ మొత్తం నడుస్తుంది. ఉదాహరణకు, బైసికిల్ థీవ్స్ లో ఒక రోజువారీ కార్మికుని జీవితంలో అతనికి అత్యంత అవసరమైన సైకిల్ పోతే ఏమవుతుంది అనే అంశంతో కథ నడుస్తుంది. అయితే సాధారణంగా ఈ సినిమాకంటే ముందు వచ్చిన చాలా ఇటాలియన్ సినిమాలు బాగా డబ్బున్న వాళ్ళ జీవితాల (ఇప్పుడు మన బాలీవుడ్ సినిమాల లాగా) ఆధారంగా కథలు చెప్పేవి. ఆ రోజుల్లో ఇటలీలో ’సినిమా’ అని ఒక పత్రిక ఉండేది. ఆ పత్రికలో పనిచేస్తున్న విస్కోంటి, అంటోనియానీ తో పాటు మరికొందరు అప్పట్లో వచ్చిన రొటీన్ ఇటాలియన్ సినిమాలపై తమ రాతల ద్వారా విమర్శించేవారు. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం ముగిసివుండడంతో ఇటలీలో పేదరికం ఎక్కువగా ఉండేది. సామన్య ప్రజలు ఉద్యోగాలు లేక కష్టాల్లో ఉండేవారు.

    అప్పటి పరిస్థుతులకు ఏ మాత్రం పొంతన లేకుండా వస్తున్న సినిమాలకు భిన్నంగా తక్కువ బడ్జెట్ లో సామాన్య మానవులు జీవితాలను తెరకెక్కించడంలో మొదట ప్రయత్నించింది రొసెలినీ అనే దర్శకుడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన ’రోమ్ ఓపెన్ సిటీ’ అనే సినిమాని మొదటి నవ్య వాస్తవిక వాదపు సినిమాగా చెప్తారు. ఈ సినిమా తర్వాత వచ్చిన ’బైసికిల్ థీవ్స్’ అప్పట్లో ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొని బాగా ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రం విజయవంతం కావడంతో అప్పట్లో చాలా మంది ఇటాలియన్ దర్శకులు ఈ తరహా సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఒక దశాబ్ద కాలం వరకూ ఈ ఉద్యమం కొనసాగింది. ఆ కాలంలో ఇటలీ పరిస్థుతులూ బాగుపడ్డాయి. అలాంటి సమయంలో ఇంకా ఇలాంటి పేద సినిమాలు జనాలకు ఎక్కలేదు. అదీ కాక పూర్తిగా వినోదాత్మకమైన అమెరికన్ సినిమాల వైపు ఆకర్షితులయ్యారు. దాంతో ఇటాలియన్స్ కూడా అలాంటి సినిమాలు తీయడం మొదలు పెట్టడంతో ఈ ఉద్యమం చల్లారిపోయింది.

    సత్యజిత్ రే లండన్లో ఉండగా బైసికిల్ థీవ్స్ చూడడం ద్వారానే వాస్తవికవాదపు సినిమాలవైపు ఆకర్షితులయ్యారు. అందుకే ఆయన మొదటి సినిమా పథేర్ పాంచాలీ లో ఈ ఛాయలు (సెట్లు మీద షూటింగ్ చేయకుండా నిజమైన లొకేషన్స్ లో షూట్ చేయడం, నటన వృత్తిగా ఉన్న వారిని కాకుండా non-actors ని ఉపయోగించడం…ఇలా) బాగా కనిపిస్తాయి.

    అలాగే బిమల్ రాయ్ తీసిన దో భీగా జమీన్ సినిమా కూడా నవ్య వాస్తవిక వాదపు సినిమా అంటారు. మన తెలుగులో ఈ మధ్య వచ్చిన కమ్లి లో ఎన్నుకున్న కథా వస్తువు వరకూ ఈ వాస్తవికవాద ఛాయలు కనిపించినప్పటికీ ఈ సినిమాని వాస్తవికవాద సినిమా అనలేమనిపిస్తుంది.

  • మంచి చరిత్ర పాఠం చెప్పారు వెంకట్. మీరు చెప్పింది నాక్కూడ ఉపయోగించింది, ఈ సినిమాని బేరీజు వేసుకోవడంలో.
    శ్రీ .. సలాం బాంబే కాక ఇటీవలి సినిమా ఇంకేదీ నాకు స్ఫురించడంలేదు.

  • చాలా బాగా విశ్లేషించేరండీ. ముఖ్యంగా ఇది ఎలాటి ప్రేక్షకులకి నచ్చుతుందో మొదటే చెప్పేయడం బాగుంది.

  • అయ్యా! కొత్తపాళీ గారూ:

    భలే మంచి సినిమా ఎన్నుకున్నారు. జాలంలో ఎంతో సమాచారం ఈ సినిమా పై ఉన్నా, ఇక్కడ అది మీరు తెలుగు రాస్తే మేం మళ్ళీ జాలంలో వెతకనక్క లేదు కదా!

    పథేర్‌పాంచాలి సినిమాకి ఈ సినిమాకి ఉన్న సంబంధం చెప్పాలి. అది 1950 సంవత్సరం. సత్యజిత్ రాయ్ అప్పటికి ఇంకా సినిమాల్లోకి రాలేదు. అప్పటికి తను పని చేస్తున్న అడ్వటైజ్‌మెంటు కంపెనీ పని మీద, భార్యతో కలిసి మూడు వారాలు ఓడలో ప్రయాణం చేసి, లండన్ చేరుకున్నాడు. లండన్ వెళ్ళిన మూడు రోజుల తరవాత, “బైస్కిల్ థీవ్స్” సినిమా చూసాడు. ఎప్పటికైనా పథేర్‌పాంచాలి సినిమా తీస్తే, బైసికిల్ థీవ్స్ లాగా సహజంగా ఉండే లొకేషన్స్‌తోపాటు ఎవ్వరికీ అంతగా తెలియని నటీనటులతో తియ్యాలని నిర్ణయించుకున్నాడు.

    ఆరు నెలలు పాటు రాయ్ లండన్లో ఉన్న కాలమంతా బైసికిల్ థీవ్స్ సినిమా చాలా బలమైన ముద్ర రాయ్ మీద వేసింది. అప్పటి ఉద్యోగానికి స్వస్తి పలకటానికీ, రాయ్ సినిమాల్లోకి రావటనికి ప్రేరణ ఈ సినిమా!

    లక్ష్మన్న

  • మంచి సినిమాని పరిచయం చేశారు. Thanks!

    కొంచెం సొంతడబ్బా: ఈ సినిమా సొంత DVD కాపీ వుంచుకోవాలని నాకో పెద్ద కోరిక. జర్మనీలోనేమో దిగుమతైన డి.వి.డి. లు బోలెడు ఖరీదు. సరే యిప్పుడు ఇంగ్లాండులో వుంటున్నాను కదా, అక్కడ కాస్త చవగ్గా దొరుకుతుందేమో అని చూస్తే అక్కడ classics కింద పెట్టేసి రేటు కొండెక్కించారు. మిత్రులిద్దరు Netలో ఉచితంగా download చేసుకునే మార్గం చెప్తామన్నారు కానీ, ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు. ఏమైతేనేం, ఆగస్టులో ఒక రెండు పుస్తకాలు కొనడం తగ్గించి ఈ సినిమా కొనేశాను.

    సరే, ఈ సినిమా ఆధారంగా తెలుగులో ఒక సినిమా వచ్చింది. దాని పేరు చెప్పగలారా! ఇక్కడ వ్యాసాలు రాసే ఒకాయనకు already చెప్పాను. ఆయన జవాబు రాయడానికి అనర్హుడు :-)

    అలాగే, ఈ సినిమాకి, షావుకారు సినిమాకి ఏమైనా సంబంధం వుందని యెవరైనా అనుకుంటున్నారా?

    – శ్రీనివాస్

  • ఆ రోజుల్లో ‘బూట్ పాలిష్’ కూడ వచ్చింది, కొంతవరకు ఒక ఇటాలీన్ సినిమా Shoeshine ఆధారంగా. దానిని రురించి కూడా ఎప్పుడైనారాస్తారా. ఈ రివ్యూలో చాలా పొగిడారు review from Time magazine.

  • Thanks venkat…!!! Now I got the POINT…!!!

  • మంచి పరిచయం. ఈ సినిమా గురించి ఎంతో విన్నా ఇప్పటి వరకూ చూడలేదు.

  • ‘మనం అలా వీధిన వెళ్తున్నామనుకోండి. ఒకతను, తన పదేళ్ళ కొడుకుతో అలా వెళ్తూ కనిపించాడు. మనకేదో ఆ క్షణానికి వేపకాయంత వెర్రెక్కి, బయల్దేరిన పని వదిలేసి, ఆ తండ్రీ కొడుకుల్ని ఫాలో అయి రోజంతా వాళ్ళ వెంట తిరిగితే ఎలా ఉంటుందీ? అలా ఉంటుందన్న మాట ఈ సినిమా.’
    సినిమా చూసేప్పుడు కలిగే ఫీలీంగ్‌ని ఒక్క మాటలో బాగా వెలిబుచ్చారు.

  • ఈ సినిమాలో ప్రతి బిట్ నాకు నిజజీవితానికి చేరువగా అనిపించింది. అంతకు మించి నేనేం చెప్పలేను. తరువాత తెలిసింది దీన్ని neo-realistic సినిమా అంటారని.
    @పరుచూరి శ్రీనివాస్ గారు: ఏ సినిమా అండి అది? :)

  • kotta pali garu,
    manchi cnemanu gurtu chesaru. thanks

  • nivas గారు,

    దయచేసి తెలుగు లిపిలోనే వ్రాయటానికి ప్రయత్నించండి. లేదా శుద్దాంగ్లం లోనే వ్రాయండి. అదీ మంచిదే. తప్పేమీలేదు. ఆంగ్ల పదాలను ఆంగ్లం లో ఉంచినా పర్లేదు కానీ… తెలుగు పదాలను ఆంగ్ల లిపిలో ఉంచితే మనసుకు కష్టం గా ఉంది. అన్యదా భావించ వద్దు.

    గీతాచార్య.

  • నేను ఈ చిత్రాన్ని నిన్ననే చూసాను.చాలా నచ్చింది. సినిమాను చాలా బాగా ముగించారు. నాకు కెమరా వర్క్ చాలా నచ్చింది.ఈ సినిమాను సజ్జెస్ట్ చేసినందుకు క్రుతఙ్నతలు.

  • ఈ సినిమాలాగనే తమిళ్లో ఫొల్లాదవన్(ధనుష్ హిరో) అని సినిమా వచ్చింది. ఐతే అక్కడ పక్కా మాస్ సినిమాగా తీసారు. దొంగతనం అవ్వడం మాత్రమే కాఫి కొట్టారు.

  • పరుచూరి శ్రీనివాస్ గారు ఈ సినిమా డివిడిని సంపాదించడానికి ఎంత కష్టపడిందీ చెప్పారు. నేను కూడా ఈ సినిమా డివిడి ఎక్కడ దొరుకుతుందా అని అంతర్జాలం అంతా గాలించాను. ఒక్క అమెజాన్ వారి వెబ్సైటులో తప్ప, ఈ సినిమా ఊసు ఎక్కడా లేదు. ఉపయోగించిన డివిడిలు, కొత్త డివిడిలు మొత్తంమీద ఒక 25 డాలర్లు మనవి కావనుకుంటే తెప్పించ వచ్చు. సరే అని చూస్తె, అమెజాన్ వారు వాళ్ళ ఉత్పత్తులు పంపే దేశాల జాబితాలో ఇండియా లేదు. ఇక ఇలా పని కాదనుకొని, అమెరికాలో ఉన్నా మా పిన్ని కొడుక్కి నువ్వు ఎలాగైనా ఈ డివిడి పంపాలని చెప్పాను (నేను వాణ్ని అమెరికానుంచి తెమ్మని చెప్పిన మొట్టమొదటి వస్తువు). అలాగే, నువ్వు డబ్బు ఏమి చెల్లించనక్కరలేదు, తప్పకుండా పంపుతాను అని వాడు నాకు ప్రామిస్ చేశాడు. ఇప్పటికి మూడు నెలలు అయినా, నాకు అది రాలేదు. నా అదృష్టం బాగుండి, ఒక రోజు బొంబాయిలో ఉన్న Enlighten Film Society అనే సంస్థ వారు ఇలాంటి World Classic Movies కొన్నింటి డివిడిలు వెలువరించారని అంతర్జాలంలో ఒక చిన్న వార్త చదివాను. వెంటనే వారి వెబ్సైటు చూశాను. ఆ సినిమాల లిస్టులో Bicycle Thieves కూడా ఉంది. నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే నాలుగు వందల రూపాయలు పంపించి ఆ సినిమా డివిడి పోయిన వారమే తెప్పించుకున్నాను. ఇప్పటికి మూడు సార్లు చూశాను. ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంది. ప్రింటు చాలా స్పష్టంగా ఉంది. 1948 నాటి సినిమా అంటే నమ్మేట్టు లేదు. Enlighten వారు ఇలాంటి సినిమాల డివిడిలు మరో తొమ్మిది వేశారు. వారి చిరునామా http://www.enlighten.co.in

    - మేడేపల్లి శేషు, కొత్త డిల్లీ

  • ఇవ్వాళ మరొక్క సారి చాలా తీరిగ్గా ఈ వ్యాసం చదివాను.ఎవరన్నారో సరిగ్గా గుర్తు లేదు గానీ,ఎక్కడో చది్విన మాట మాత్రం ఈ సినిమా ఒక జీవితమంత అన్నది మరోసారి స్ఫురణకు వచ్చింది.
    మహా దర్శకుడు అకిరా కురసవ Joseph I Anderson, Donald Richie రాసిన Japanese Film Art and Industry కి తను రాసిన ముందుమాటలో ఇలా అన్నారు,” in 1951 when i received Venice prize for Rashoman,i remarked that i would have been still happier, and the prize would have had more meaning,if i had made and honored for showing something as much of present day Japan as Bicycle Thieves showed of modern Italy.And today still i feel the same at i did then,because Japan produces contemporary -life films of the caliber of De Sica
    picture at the same time that it also produces those period films…”.
    గతంలో ఒక ఫిల్మ్ సొసైటీ వారు ఈ చిత్రప్రదర్శన ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు(విశాఖపట్నం)లో కానీ ప్రింటు నాణ్యత బాలేదని విరమించారు.ఎప్పటికి ఈ సినిమాని పూర్తిగా చూడగలనా ఆన్నదొక ప్రశ్నగా మిగిలి పోయింది నాకు.
    వ్యాసకర్త “కథన ప్రక్రియలో ఆ ఉద్వేగాన్ని పక్కకి పెట్టి, ఆలోచన రేకెత్తించే పద్ధతిలో కథనం నడపటం వాస్తవిక దృక్పథం తనకి తాను విధించుకున్న పరమావధి అనిపిస్తుంది” ఈ ఒక్కవాక్యం తో చిత్ర అంతఃసారాన్ని ఎంతోఒడుపుగ ఒడిసిపట్టుకున్నారు,మరిన్ని రచనలు తన నుంచి మనం ఎదురు చూశేలా చేసారు.ధన్యవాదా్లు.

  • మంచి వ్యాసం, చిత్రం చివర సన్నివేశం అధ్బుతంగా ఉంటుంది. హిదరాబాదులో సినీమాపారడిసో లో DVD దొరుకుతుంది.

  • ఇప్పుడే ఈ సినిమా చూడడం ముగించాను. ముందుగా – ఇంత మంచి సినిమా గురించి తెలియజేసినందుకు కొత్తపాళీ గారికి ధన్యవాదాలు. మీ వ్యాసం చదవకుంటే ఈ సినిమా ఎప్పటికి చూసేవాడినో!!

    ‘సైకిలు పోవడం’ అన్న అంశాన్ని తీసుకొని ఒక గొప్ప చిత్రాన్ని తీయవచ్చునని ఆలోచన వచ్చిన దర్శకుడికి జోహార్లు. కొన్ని దృశ్యాలు కదిలించేలా ఉన్నాయి. ముఖ్యంగా సైకిలు కొనడానికి కథానాయకుడి భార్య సహకరించడం, కొన్న తర్వాత ఆమెలో ఆనందం, తండ్రి-కొడుకుల మధ్య సన్నివేశాలు మొదలయినవి. పరిస్థితుల ప్రభావం, పేదరికం మనిషి జీవిత గమనాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతాయో క్లైమాక్సులో కళ్ళకు కట్టినట్టు చూపించబడింది.

    హీరోగా నటించిన నటుడికి ఇది మొదటి సినిమా అని, అప్పటికి అతడు ఒక ఫ్యాక్టరీ వర్కర్ అని నమ్మలేకపోతున్నా!! చిన్నపిల్లవాడి నటన అత్యద్భుతము. ఆకతాయి పనులు చేస్తూ పెద్దవాళ్ళకు ఇబ్బంది కలిగిస్తూ (ఒక్కొసారి చిరాకు పుట్టించే) పాత్రల్లో పిల్లలను చూసి చూసి ఈ సినిమాలో కుర్రాడు కూడా ఆ బాపతేనేమో, ఎక్కడ తప్పిపోయి, ఏ గొడవ తెస్తాడో అనుకుంటూ చూసాను. నిజానికి ఈ సినిమాకు ఉన్న ఇద్దరు హీరోల్లో ఈ కుర్రాడు కూడా ఒకడు అని చెప్పాలి. ఎంత బాగా నటించాడంటే, To Kill A Mockingbird సినిమాలోని ఇద్దరు బాలనటులను, ఛార్లీ ఛాప్లిన్ నటించిన The Kid లొ బాలుడిని గుర్తుకు తెచ్చాడు.

    ఇంత మంచి సినిమా వీక్షించడానికి కారణమయిన కొత్తపాళీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు!

  • chala hrudhyagam ga untundi

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories