Menu

శుభలేఖ (1982)

విశ్వనాథ్ సినిమాల్లో నాకు విపరీతంగా నచ్చిన సినిమాల్లో శుభలేఖ మొదటి ఐదింటిలో ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా చాలాసార్లే చూసాను కానీ, ఈ మధ్యే మళ్ళీ చూసాను. చూసాక, ఈసారైనా దీని గురించి నా అభిప్రాయాలు రాయాలనిపించింది. నేను ఇంజినీరింగ్ చేసేరోజుల్లో మా కాలేజీ విద్యార్థుల్లో రచనాసక్తి ఉన్నవారికి ఓ వెబ్సైటు ఉండేది. అందులో దీని గురించి ఇంగ్లీషులో రాసానోసారి. కానీ, ఇప్పుడాసైటూ లేదు, ఆ వ్యాసం ఏమైందో అంతకంటే తెలీదు.

సరే, విషయానికొస్తే, వరకట్నానికి వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది. కథ విషయానికొస్తే, మూర్తి(చిరంజీవి) ఓ హోటెల్ ఉద్యోగి. అంతే కాక మంచి డాన్సర్, మాటకారి, స్నేహభావం కల వ్యక్తి. సుజాత (సుమలత) బాగా చదువుకుని ట్యూటర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె చెల్లెలు లక్ష్మి(తులసి). ఆదిశేషయ్య(సత్యనారాయణ) ఓ రాజకీయనాయకుడు. మోహన్(గిరీశ్), మురళి(’శుభలేఖ’ సుధాకర్) అతని పిల్లలు – ఒకరు డాక్టరు, ఒకరు ఇంజినీరు. వీరిద్దరికీ భారీగా కట్నాలు తీసుకోవాలన్నది ఆదిశేషయ్య ఆలోచన. అతని వద్దకు సుజాతను మోహన్ కు చేసుకొమ్మని అడగడానికి వెళతాడు ఆమె తండ్రి జగన్నాథం (జె.వి.రమణ మూర్తి). తరువాత జరిగిన పెళ్ళిచూపుల తంతులో కట్నం విషయంలో వచ్చిన తగాదాల వల్ల సుజాత ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది, ఆమెకి మూర్తి ఆశ్రయం కల్పిస్తాడు. వీళ్ళిద్దరూ ఓ ఇంట్లో కలిసి జీవిస్తూ ఉంటారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న ఇద్దరూ ఒకే కంపెనీలో చేరతారు, మూర్తికి ఓ కంపెనీ ఎం‍డీ తెలిసి ఉండటంతో. ఇంతలో ఆదిశేషయ్య ఇష్టానికి విరుద్ధంగా, కానీ కట్నం లేకుండా లక్ష్మికి, మురళికి పెళ్ళి జరుగుతుంది. సుజాతకి తమ ఎం‍డీ తగిన వ్యక్తని భావించి అతన్ని పెళ్ళికి ఒప్పిస్తాడు మూర్తి. కానీ, సుజాత మూర్తిని ఇష్టపడుతుంది. కథ చివరలో మూర్తీ-సుజాతల పెళ్ళి జరుగుతుంది. ఆదిశేషయ్య కు ఎదురుతిరిగి అతని పెద్ద కొడుకు మోహన్ కూడా ఓ విధవరాలిని పెళ్ళి చేసుకుంటాడు.

నా మటుకు నాకైతే ఈ కథ వింటూ ఉంటే ఆర్టు సినిమా కథలా ఉంది. కానీ, సినిమా చూస్తున్నంత సేపూ, నాకు ఆ భావన ఒక్కసారి కూడా కలగలేదు ఇన్నాళ్ళలో. కారణం – ప్రధానంగా సంభాషణలు, హాస్యం, నటీనటుల ప్రదర్శనా, కథనం మరియు సంగీతం అని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడూ. ఇలాంటి ఓ సినిమాని సత్యజిత్ రాయ్ మార్కు సినిమా అనేయవచ్చు ఉత్త కథ మాత్రం విన్నామంటే 🙂 కానీ, ఈ సినిమా ఎంటర్‍టైనర్ కాదు అని ఎవరనగలరు? ఓ పక్క ఓ సాంఘిక ప్రయోజనాన్ని కోరుతూనే సినిమాని మామూలుగా అందర్నీ అలరించే సినిమాగా ఎలా తీయొచ్చో అనడానికి ఈ సినిమా ఓ మంచి ఉదాహరణ నా అభిప్రాయంలో. వరకట్న సమస్య ని, చిన్న వయసులోనే వితంతువైన ఓ ఆడపిల్ల జీవితాన్ని గురించిన సమస్యనీ – ఎంత వివరంగా చర్చించారో, దానికి తగ్గ పరిష్కారాలని కూడా తగినంత సూచించారు. అలాగే, సమాజానికి ఎలాంటి యువతీ-యువకులు అవసరమో, ఎలాంటి ఆలోచనా ధోరణి యువతలో ఉండాలో అన్న విషయాల్లో విశ్వనాథ్ అభిప్రాయాలని మూర్తి, సుజాత, లక్ష్మి పాత్రల్లో కళ్ళకి కట్టినట్లు చూపారు. ఈ సినిమాలో ఒక్కో పాత్రకీ ఒక్కో స్టేట్‍మెంట్ ఉంది. ప్రతి పాత్రనీ చాలా శ్రద్ధగా మలచినట్లు తోస్తుంది నాకు.

నాకు బాగా నచ్చిన దృశ్యాలు –
౧- మొదట్లో చిరంజీవి కుక్కకు భయపడుతూ చేసే డాన్సు
౨. బ్యాంక్ లో చిరంజీవికీ, అక్కడి ఉద్యోగికి నడిచే ఐయాం సారీ సీన్
౩. హోటేల్లో సుమలత చెప్పు పోయినప్పుడు… చిరంజీవి ఆమెకి వేరే ఏవో ఎక్స్‍ట్రా ఆర్డర్లు తెచ్చిస్తే డబ్బులున్నాయో లేదో చూసుకునే సీన్
౪. సర్వర్ రూమ్ లో చిరంజీవి పాట
౫. సత్యనారాయణ సన్మాన సమయంలో హోటెల్ వర్కర్లు అతనికి సన్మానం చేసే విధానం
౬. తులసి సత్యనారాయణ ని మాటల్తో హింసించే దృశ్యాలు

ఈ సినిమాలో పాటలు నాకు చాలా నచ్చాయి. “విన్నపాలు వినవలే”, “నెయ్యములల్లో నేరేళ్ళో..” – అన్నమాచార్య కీర్తనలు సినిమాలో చాలా బాగా వాడుకున్నారు. “ఐతే, నిజమైతే”, “రాగాల పల్లకిలో కోయిలమ్మా!”, “నీ జడకుచ్చులు” – ఈ మూడు పాటలు కూడా నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా – “నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు గనుక” అన్న ప్రయోగం ఐతే మరీ ఇష్టం. అక్కడక్కడా వచ్చే నేపథ్య సంగీతం కూడా చాలా నచ్చింది నాకు. ఈ పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటాయి. అలాగే, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య – వీరి హావభావాలు కూడా ఈ సినిమాలో నాకు చాలా చాలా నచ్చాయి. సుమలత ఆ పాత్రకి అతికినట్లు సరిపోయింది. చిరంజీవి కూడానూ. పాత్రలకి నటీనటుల్ని ఎన్నుకోడం కూడా ఓ కళే! అది ఈ సినిమాలో మరింత బాగా అర్థమౌతుంది.

మొత్తానికి ఈ సినిమా నేను చూసిన సాంఘికాలలో, సామాజిక స్పృహ ఉన్న సినిమాల్లో నాకు బాగా నచ్చిన వాటిలో ఒకటి. సందేశాత్మకంగా ఉంటూనే ఎంటర్‍టైనింగ్ గా ఉండటం అన్ని సినిమాల్లోనూ జరగదు, అందరూ ఆ పని చేయలేరు కూడానూ. ఇలాంటి ఓ సినిమా తెలుగులో మళ్ళీ వస్తుందా అసలు? అన్న అనుమానం ఓ పక్క పీడిస్తూనే ఉంది నన్ను. అందుకోసం మరో విశ్వనాథే అవసరంలేదు. కాస్త అభిరుచి ఉండి, సామాజిక స్పృహ ఉన్న సృజనాత్మకుడైన దర్శకుడికి సరైన ప్రోత్సాహం లభిస్తే చాలేమో. లేక, నేను చెప్పిన ఆ మూడూ ఒకరిలో ఉండటమే కష్టమైపోయిందా ఇప్పుడు?? ఏమో!! నిజానికి ఈ సినిమా గురించి ఇంకా ఇంకా రాయొచ్చేమో కానీ, నిడివి మరీ ఎక్కువౌతుందేమోనని ఆపేస్తున్నా… 🙂

7 Comments
  1. రిషి November 18, 2008 /
  2. కొత్తపాళీ November 18, 2008 /
  3. Shekar November 19, 2008 /
  4. మురళి November 19, 2008 /
  5. pappu November 21, 2008 /