Menu

శుభ సంకల్పం (1995)

నేను ఎట్టకేలకి “శుభసంకల్పం” సినిమా చూసాను. సినిమా రిలీజైంది 1995 లో. అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. చూసినట్లు గుర్తు ఉంది కానీ, సినిమా పూర్తిగా గుర్తు లేదు. ఇప్పుడు చూశాక సినిమా గురించి తప్పకుండా రాయాలనిపించింది, ఈ సినిమాని గురించి నేను చెప్పాలనుకున్నవి చాలా ఉండటంతో. 🙂

మొదట కథ క్లుప్తంగా – రాయుడు గారి నమ్మిన బంటు దాసు. రాయుడి మనవరాలు సంధ్య. దాసు, గంగల ప్రేమ తెలుసుకున్న రాయుడు వాళ్ళకి వివాహం జరిపిస్తాడు. దాసు రాయుడి డబ్బుని తన ఇంట్లో పెట్టి దాస్తాడు. దాన్ని కాపాడే ప్రయత్నంలో దాసు బామ్మ, గంగా ఇద్దరూ మరణిస్తారు. దాసు పసిబిడ్డతో మిగుల్తాడు. ఆ బిడ్డని తీసుకుని సంధ్య అమెరికా వెళ్ళిపోతుంది. దాసు ఇక్కడ రాయుడి వారసత్వాన్ని స్వీకరించి “రాయుడు సీ ఫుడ్స్” యజమాని ఔతాడు. నేను కథని ఇలా చెప్పినందుకు నన్ను నానా తిట్లూ తిట్టేవాళ్ళు చాలామంది ఉంటే ఉండవచ్చు గానీ, నిజం చెప్పాలంటే, ఇంతకంటే కథ ఏమీ లేదు అక్కడ. బెస్తవాళ్ళ జీవిత నేపథ్యం ఒక్కటి జోడించాలి ఈ కథకి. అంతే.

అయితే, నాకు ఈ సినిమా ఎందుకు నచ్చిందంటే ప్రధాన కారణాలు –

 • చాలా చోట్ల “దృశ్య కావ్యం” అన్న పదం ఈ సినిమాకి బాగా సూటవుతుంది అనిపించింది. దృశ్యాల్లో కవిత్వం పలికింది ఈ సినిమాలో.
 • పాటల చిత్రీకరణ చాలా చాలా బాగుంది. దానికి నేపథ్య సంగీతం కూడా అద్భుతం. సాహిత్యం సరేసరి. అందుకే మాటిమాటికీ పాటలొచ్చినా కూడా బోరు కొట్టలేదు ఎక్కడా.
 • సినిమాలో మంచి పొయెటిక్ అండ్ విజువల్ అపీల్ ఉంది
 • కమల్, ఆమని మరియు కె.విశ్వనాథ్ ముగ్గురూ చాలా బాగా నటించారు. కమల్ హాసన్ నాకు వీళ్ళందరిలోకీ మరీ మరీ నచ్చాడు.
 • కమల్, ఆమని మధ్య సన్నివేశాల్లో ఒకరిమీద ఒకరికి ఉండే ప్రేమ భావాన్ని చాలా బాగా చూపించారు. కొన్ని చోట్ల సంభాషణలు తక్కువ, సంగీతం ఎక్కువ.. ఇక్కడ సంగీతమే మాట్లాడుతుంది, కబుర్లు చెబుతుంది 🙂
 • ప్రియారామన్ ఆ పాత్రకి అతికినట్లు సరిపోయింది.
 • సంభాషణలు చాలా బాగున్నాయి

బాగా నచ్చిన దృశ్యాలు –

 • కమల్, ఆమని ఇద్దరూ తగాదా పడే సన్నివేశాలు. విశ్వనాథ్ ఆమనిని ఏదో రిపేర్ కోసం పిలిచినప్పుడు “నాకు పని రాదని ముందే చెప్పొచ్చుకదా” అన్న డైలాగు మళ్ళీ మళ్ళీ పలికినప్పుడు ఇద్దరి మొహాల్లోని హావభావాలు.
 • కమల్ ఆమనిని పడవ రిపేరు కోసం పిలిచినప్పుడు, ఒకానొక సందర్భంలో ఇద్దరు ఒకరికొకరు ఢీ-కొట్టుకున్నప్పుడు ఆమని: “పడవా… ” (పడవ ఎక్కడ అనే ఉద్దేశ్యం తో) కమల్: ఊహూ…పడను. అన్నప్పుడు చాలా నవ్వుకున్నాను.
 • విశ్వనాథ్ ని కలవడానికి కమల్ హాసన్ సైకిలేసుకుని వచ్చినప్పుడు ప్రియారామన్ తో “బాబుగారు పిలిచారట” అనడానికి “బాబుగారు… పగిలిందండి (కుండీ పగులుతుంది)… బాబుగారు… పడిందండి (సైకిల్ పడుతుంది)… బాబు గారు… తగిలిందండి (ఏదో తగుల్తుంది)…” అని చెప్పి చెప్పి చివరికి డైలాగు పూర్తి చేసిన దృశ్యం చాలా బాగా తీసారు.
 • విశ్వనాథ్ కమల్-ఆమని లను ఒకరంటే ఒకరికి ఇష్టమేనా అని అడిగే దృశ్యంలో మాటల్లేకుండా సంగీతమే మాట్లాడిన వైనం, వాళ్ళ కళ్ళలో పలికిన హావభావాలు.
 • కమల్ వాళ్ళ కొడుక్కి మీ అమ్మ లేదు అని చెప్పే సీన్ – చాలా కదిలించి వేసింది.
 • “ఎవరు ఇచ్చారమ్మా ఇన్ని అక్షరాలు.. అక్షరాలా వెనుక ఎన్ని అర్థాలు..” – ఈ భాగమంతా తీసిన దృశ్యం.
 • “గుడిలేని దేవత నడచిపోతా ఉంటే అడుగడుగూ దండాలు ఆ దారికి.” అంటూ కమల్ ప్రియారామన్ ని చూసే దృశ్యం
 • సినిమా మొదట్లోనే కమల్ చేసే మైమ్.

“నరుని బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన” సాగరసంగమం బిట్ ఇందులో సందర్భోచితంగా బాగా ఉపయోగించారు. నాకు ఎందుకో అర్థం కాలేదు. రెండు మూడు పాత్రల నోళ్ళలోంచి వచ్చాయి ఈ పాట వాక్యాలు. ఎందుకో కూడా అర్థంకాలేదు. అలా అనుకుంటూ ఉన్నప్పుడు – “గుండెలో రంపాలు కోతపెడతావుంటే పాత పాటను మళ్ళీ పాడుకుందామంది…” అని ఓ వాక్యం వినిపించడంతో ఉలిక్కిపడ్డాను నేను. దర్శకుడు ప్రేక్షకుడి సందేహాన్ని చదివేసి నివృత్తి చేసినట్లు అనిపించింది. 🙂 “కంటిపాపకు నేను లాల పోసే వేళ చంటిపాప…చంటిపాప… నీకు ఎవరినౌతానంది..”, “అన్నదేదో అంది ఉన్నదేదో ఉంది .. తలపైనా గంగ తలపులో పొంగింది” – ఇలాంటి వాక్యాలు వస్తున్నప్పుడు వినబడ్డ సంగీతం, కనబడ్డ హావభావాలూ చాలా బాగా కుదిరాయి. “”ఆది విష్ణు పాదమంటి..ఆకశాన ……కాశిలోన కాలుపెట్టి..కడలి గుడికి కదలిపోయె గంగా…” ఈ భాగంలోని సాహిత్యం లోని నిగూడార్థం ఏమిటో నాకు అర్థం కాలేదుకానీ, వినడానికి మాత్రం చాలా బాగుంది.

ఇన్ని చెప్పాక, నాకు నచ్చని విషయాలు చెప్పాలి కదా మరి:

 • ఆలీ పాత్ర, ఏవీఎస్ పాత్రా శుద్ధ దండగ అసలు. “దృశ్య కావ్యం” ఫీల్ లో ఉన్నప్పుడు మధ్యలో సంబంధం లేకుండా ఇవి రావడం చిరాకు పుట్టించింది. నిజంగా విశ్వనాథేనా ఇలాంటి పని చేసింది అనిపించింది. అక్కడ చెప్పుకోదగ్గ హాస్యమేమీ కూడా లేదు ఆ పాత్రల నుండి. సడెన్ గా ఏదో మామూలు సినిమాలోకి దిగిపోయిన ఫీలింగ్ వచ్చింది వాళ్ళు కనబడ్డప్పుడు
 • నిజానికి విశ్వనాథ్ కొడుకు – కోట శ్రీనివాసరావుల దృశ్యాలు కూడా ఈ సినిమా టెంపోకి తగినట్లు లేవు. ఏదో, మేనరిజం సృష్టించడం కోసం కోట పాత్రకి ఆ గ్యాస్ ట్రబుల మేనరిజం, మంగళ స్నానం పద్ధతి అవీ పెట్టినట్లు ఉంది. ఈ సినిమా ఫీల్ మొత్తంగా ఒకలా ఉంటూంది. ఇలాంటి సన్నివేశాల్లో మరోలా ఉంటుంది. తీపి మధ్య చేదులా, కారం మధ్య తీపిలా చాలా తేడాగా అనిపిస్తుంది ఈ సన్నివేశాల్ని చూడటంలో. మాస్ ని ఆకర్షించడానికి చాలా డెస్పరేట్ అయిపోయినట్లు అనిపించింది ఈ దృశ్యాలన్నీ చూస్తూ ఉంటే. నిజానికి, ఆ విలనిష్ ఎలిమెంట్ ని కథలో జొప్పించడానికి వేరే మార్గాలు చాలానే ఉన్నాయి.
 • ఆన్‍స్క్రీన్ రొమాన్స్ ఈ సినిమాలో చాలా వరకు సున్నితంగా చూపారు కానీ, కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటే, can’t romance onscreen be more implicit? అన్న సందేహం కలిగింది. ప్రతీదీ అంత explicit గా చెప్పనవసరంలేదేమో అనిపించింది. ఇదే సినిమాలో చాలా సీన్లలో అలాంటి సున్నితత్వం కనిపించి కొన్ని సీన్లలో కనిపించనందువల్లో, విశ్వనాథ్ అంటే ఇలా చేయడు అన్న నమ్మకం వల్లో కానీ – నాకు నిరాశ కలిగింది అలాంటప్పుడు. రొమాన్స్ కి వల్గారిటీ కి ఉన్న line of seperation ని ఈ సినిమా ఎక్కడా దాటలేదు కానీ, ఎందుకో అసంతృప్తి.

ఈ సినిమా చూసాకే అనుమానం కలిగింది నాకు – కె.విశ్వనాథ్ ఎందుకో ఒక టిపికల్ మాస్ తెలుగు సినిమాలా ఈ సినిమాని చేయాలనుకుని తాపత్రేయపడ్డాడేమో అని.

9 Comments
 1. మురళి November 5, 2008 /
 2. మురళి November 5, 2008 /
 3. Narahari November 5, 2008 /
 4. శంకర్ November 6, 2008 /
 5. sriram velamuri November 10, 2008 /
 6. venkat November 17, 2008 /