Menu

స్లమ్ డాగ్ మిలియనీర్

మరో ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్తే జమాల్ మాలిక్ రెండు కోట్ల రూపాయలు గెలుచుకుంటాడు. అతను ఇంత దూరం ఎలా రాగలిగాడు?

 • 1) అతను మోసగాడు
 • 2) అతను అదృష్టవంతుడు
 • 3) అతను మేధావి
 • 4) అది అతని తలరాత

’స్లమ్ డాగ్ మిలియనీర్’ అనే త్వరలో విడుదలవబోయే ఒక సినిమా పై ప్రశ్న తో మొదలవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఈ సినిమా కథ.

పరిచయం:గతంలో Trainspotting, Sunshine చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన Danny Boyle అనే బ్రిటిష్ దర్శకుడు పూర్తిగా ఇండియాలో నిర్మించిన ఒక ఆంగ్ల చిత్రం ’స్లమ్ డాగ్ మిలియనీర్’. వికాస్ స్వరూప్ రచించిన ‘Q and A’ అనే నవల అధారంగా Simon Beaufoy ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. త్వరలో (జనవరి, 2009) విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రేక్షకులూ మరియు విమర్శకుల మన్ననలు పొందడమే కాకుండా టొరాంటో చలనచిత్రోత్సవంలో ’పీపుల్స్ ఛాయిస్’ అవార్డు కూడా గెలుచుకుంది.

కథ: ఇది జమాల్ మాలిక్ అనే ఒక యువకుని కథ. ముంబాయిలోని ధారవి మురికివాడలో జన్మించి జీవితం ఆడించిన ఆటలో ఆచోటా ఈ చోటా తిరుగుతూ చివరికి ‘Who Wants to be a Millionaire?’ (కౌన్ బనేగా కరోడ్ పతి) అనే టెలివిజన్ షోలో పాల్గొని రెండుకోట్ల రూపాయలు గెలుచుకునే వరకూ వస్తాడు. మురికివాడలో పుట్టి పెరిగిన చదువూ సంధ్యలు లేని ఒక యువకుడు కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షోలో అన్ని ప్రశ్నలకూ ఎలా సమాధానం చెప్పగలిగాడు అనే అనుమానంతో పోలీసులతన్ని అరెస్టు చేస్తారు. తనకా ప్రశ్నలకు సమాధానాలు ఎలా తెలిసాయో అనే విషయాన్ని పోలీసులకి వివరించడమే ఈ సినిమా మూలకథ.

విశ్లేషణ: 2005 లో ‘Q and A’ అనే పుస్తకం మార్కెట్లోకి వచ్చినప్పుడే ఈ కథతో ఒక సినిమా వస్తుందనీ చాలామందే ఊహించారు. ఆ కథ ఎత్తుగడ అంత బావుంది. అనుకున్నట్టుగానే ఈ పుస్తకం తెరకెక్కింది. ఐతే అదృష్టమో దురదృష్టమో కానీ ఇలాంటి మంచి సినిమా ఒక పాశ్చాత్యుడు తీయాల్సి వచ్చింది. అది ఒక విధంగా బాధాకరమైన విషయమే అయినప్పటికీ Danny Boyle/Simon Beaufoy చేతిలో ఈ కథ అద్భుతంగా తెరకెక్కింది.

’Q and A’ ఆధారంగా ఈ సినిమా రూపొందించినప్పటికీ ఈ నవలకూ సినిమాకూ చాలా తేడాలున్నాయి. Simon Beaufoy చాలా నైపుణ్యంగా ఈ స్క్రీన్ ప్లే రూపొందించారు. ముఖ్యంగా నవలలో ఒక్కో ప్రశ్నకూ సమాధానంగా తన జీవితంలోని ఒక కథను చెప్తాడు ముఖ్యపాత్రధారి రామ్ మొహమ్మద్ థామస్ అనే యువకుడు. అయితే ఆ కథలు ఒక్కొక్కటి విడివిడిగా ఉంటూ సంపూర్ణత లోపించినట్టనిపిస్తుంది.కానీ సినిమాలో అలా కాకుండా కథ చాలా సాఫీగా సాగుతుంది. అలాగే అన్ని కథలనూ(ఎపిసోడ్స్) నీ చక్కగా ముడివేయడం ద్వారా అప్పటివరకూ సాగిన జమాల్ మాలిక్ జీవితాన్ని పరిపూర్ణంగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

చాలా వరకూ ఫ్లాష్ బ్యాక్ లో సాగే కథనం కొంత జమాల్ మాలిక్ జీవితంలోని ఎపిసోడ్స్, కొంత కౌన్ బనేగా కరోడ్ పతి టెలివిజన్ కార్యక్రమం, కొంత పోలీస్ స్టేషన్లో విచారించే సన్నివేశాల మధ్య ఇంటర్ కట్ చేస్తూ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.

ఇక నటీనటుల నటన చాలా బావుంది. అమితాబ్ లేదా షారూక్ ఖాన్ కౌన్ బనేగా కరోడ్ పతి నిర్వాహకుడుగా నటిస్తారని ముందే అనుకున్నా వారు అంగీకరించకపోవడంతో అనిల్ కపూర్ ఆ పాత్ర పోషించారు. ఆయన ఆ పాత్రకు తగిన న్యాయం చేశారు. నాకైతే ఇప్పటికే అమితాబ్ ని టీవిలో చాలారోజులు ఈ పాత్రలో చూసిఉండడం వల్ల ఆయన నటన చాలా ప్రిడిక్టబుల్ గా ఉండేది. ఆ విధంగా అనిల్ కపూర్ చే ఈ పాత్ర పోషింపచేయడం ద్వారా మంచి నిర్ణయం అనిపించింది.

రహమాన్ సంగీతం చాలా బావుంది. ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్ కూడా రావొచ్చని అంటూన్నారు. సినిమాటోగ్రఫీ, ఏడిటింగ్ కూడా చాలా బావున్నాయి. ముఖ్యంగా ముంబాయిని చాలా బాగా కాప్చర్ చేశారు.

ముగింపు:పూర్తిగా ఇండియాలో నిర్మించబడిన ఈ అంగ్ల చిత్రం ఈ సంవత్సరంలో వచ్చిన అత్యంత వినోదాత్మక చిత్రాల్లో ఒకటి.ఈ సినిమా కేవలం మురికివాడల నుంచి వచ్చిన ఒక నిరక్షరాస్య యువకుడు రెండు కోట్లు ఎలా గెలుచుకున్నాడనే కథనే కాకుండా, ఒక లవ్ స్టోరీ, ఒక అన్న దమ్ముల అనుబంధం, ఒక మాఫియా కథ ఇలా ఎన్నో ఆసక్తికరమైన కథలను కూడా నేర్పుగా ఈ కథలో చొప్పించారు. ఈ విధంగా మన దర్శకులు ఎప్పుడూ చెప్తుండే ’నవరసభరితమైన సినిమా’ గా ప్రతి ఒక్కరినీ తప్పక అలరించితీరుతుంది.

మిస్సవకండి. తప్పకచూడండి.


18 Comments
 1. నీషీ November 13, 2008 /
 2. venkat November 13, 2008 /
 3. Jonathan November 13, 2008 /
 4. కొత్తపాళీ November 13, 2008 /
 5. అబ్రకదబ్ర November 13, 2008 /
 6. శంకర్ November 13, 2008 /
 7. నవీన్ గార్ల November 14, 2008 /
 8. Hari Prasad November 15, 2008 /
 9. sujata November 15, 2008 /
 10. thinkfloyd November 17, 2008 /
 11. Hari Charana Prasad November 19, 2008 /
 12. Sowmya November 22, 2008 /
 13. ఆత్రేయ January 21, 2009 /
 14. VaRuN A September 17, 2010 /