Menu

‘రొమాంటిక్ కామెడీలు’-వాటి రూటే వేరు!!

“ఇరవై సంవత్సరాల లోపులో ప్రేమలో పడనివాళ్ళూ, అరవై సంవత్సరాలు దాటాక ప్రేమలో పడేవాళ్ళని ఓ కంట కనిపెట్టి ఉండాలంటారు..ఎందుకంటే వారు ఏదో మానసిక లోపంతో కాలం గడుపుతున్నట్లు లెక్క!” అని పెద్దలు చెప్తూంటారు.ఆవకాయి బిర్యాని రిలీజ్ అయ్యింది. త్వరలో ‘వినాయుకుడు’ తన ప్రేమ కథతో ధియోటర్స్ లోకి దూకనున్నాడు. అలా శేఖర్ కమ్ముల ఆనంద్ పుణ్యమా అని మళ్ళి రొమాంటిక్ కామిడీల వైపుకు తెలుగు పరిశ్రమ మెల్లి మెల్లిగా మళ్ళుతోంది.ఈ స్దితిలో…రొమాంటిక్ కామిడీ అనే జనరంజక జాతము (Popular Genre) పై సరదాగా ఓ సైటేస్తే…

భావనాత్మక అనుబంధాలు(రొమాంటిక్ రిలేషన్షిప్స్ కి వచ్చిన తంటా) కేంద్ర బిందువుగా ఉన్న హాస్య చిత్రాలే రొమాంటిక్ కామెడీలు. ఇవి ఎలా మొదలయ్యి జనరంజకం అయ్యాయీ అంటే…ప్రపంచ సినిమా ప్రారంభంలో వచ్చిన మూకీ చిత్రాలన్నీ ఎక్కువ శాతం కామిడి బిట్స్ గా ఉండేవి. కొత్తలో ఎగబడి చూసిన జనం తర్వాత కొంతకాలానికి అవి పాతబడిపోయిన భావం కలిగి బోర్ కొట్టసాగాయి. అప్పుడు మార్పు రావాల్సిన అవసరం ఉందని స్టూడియో అధినేతలు బుర్రల్లో సెర్చిలైట్స్ వేసుకుని వెతికారు.

ఇంతలోకి సినిమా మెల్లిగా బాల్యావస్దను వీడి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న గుర్తుగా మాటలు నేర్వడం, సాంకేతికం గా కొత్త అందాలు ప్రోగుచేసుకోవటం ప్రారంభించింది. అలాగే ప్రేక్షకులు సైతం తమని తాము మెల్లిగా ప్రధాన పాత్రధారిలో పోల్చుకుని చూసుకుని భావోద్వేగాలు అనుభవించటానికి అలవాటుపడుతున్నారు. వారిని పూర్తిగా తమ వైపు తిప్పుకోవటానికి పరవశుల్ని చేయటానికి కామిడీలు సరిపోవటం లేదని అర్ధం చేసుకున్నారు. అంతేగాక మానవ జీవితంలో అత్యంత ప్రాధాన్యత వహించే ప్రేమ,రొమాన్స్ లకు కామెడీలను జతకలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన ఓ కొత్త ఫార్ములాకు దారితీసింది. అయితే అప్పటికే సాహిత్యంలో ఇటువంటి ప్రయోగాలు జరగటం వీరికి బాగా ఉపకరించింది.

ఇంతకీ అంత కష్టపడి కనిపెట్టిన తంత్రం ఏంటంటే..

సాధారణంగా సినిమాలు అరిస్టాటిల్ పొయిటిక్స్ నాటి త్రి యాక్ట్ స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ…సంఘర్షణ-అడ్డంకులు-పరిష్కారం అంటూ విజయాలు సాధిస్తున్నాయి. దీన్ని బ్రేక్ చేస్తూ రొమాంటిక్ కామెడీ లు రూపొందాయి. ఈ డిజైన్ ముఖ్యంగా ఇలా సాగుతుంది.

  • కలవటం(హీరో,హీరోయిన్స్ వివిధ సందర్బాలలో కలవటం)
  • విడిపోవటం(విభిన్న కారణాలతో వాళ్ళు విడిపోవటం)
  • పొందటం(అన్ని ఇబ్బందులూ తొలిగి ఒకరినొకరు ప్రేమతో గెలవటం)

పై విథంగా తయారు చేసిన స్క్రీన్ ప్లే డిజైన్ ఇప్పటిదాకా రొమాంటిక్ కామిడీల్లో రాజ్యమేలుతోంది. ఎన్నో హృదయ సామ్రాజ్యాలు గెలుచుకుంటోంది.
ఇక ఇతర జాతము(Genre)ల కీ దీనికి తేడా

ఇతర జాతపు సినిమాల లో సాధారణంగా ప్రధాన పాత్రకు ఓ లక్ష్యం ఉంటుంది. అదే దర్శకోన్మఖ(director oriented) సినిమాల లోనయితే దర్శకుడే కథలో ఏం చేయాలన్నదానికి ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. ఆ దిసగా పావులు..అదే పాత్రలు నడుపుతూ తనకు తోచినప్పుడల్లా చెక్ చెపుతూ చక్కగా చదరంగం ఆడి వినోదింపచేస్తాడు. అదే రొమాంటిక్ కామిడీల దగ్గరకొచ్చేసరికి పాత్రలకు లక్ష్యం కాకుండా కథకు ఓ గోల్ పెడతాడు. విడిగా..విభిన్నంగా ఉన్న వీరిద్దరూ ఎలా కలుస్తారు.ఎలా జంటగా మారారన్నదే ప్రధానంశంగా కథనం నడుస్తుంది.

ఈ వినియోగప్రపంచంలో అవసరాలే మానవసంభంధాల్ని లీడ్ చేస్తున్నాయి.

సరిగ్గా ఈ అంశాన్ని తీసుకునే చాలా రొమాంటిక్ కామెడీలు తెరకెక్కుతున్నయి. ప్రధాన పాత్రలకు నిర్ధిస్టమైన అవసరాలను ఏర్పరిచి వాటిని అవతల పాత్రల అవసరాలతో ముడి పెట్టి ప్రేమ పుట్టే అవకాశాలను సృష్టించటం ఈ చిత్రాల ముడి వస్తువు. దరిదాపు చాలాసార్లు ప్రధాన పాత్రల మొదట కలయికలోనే సంఘర్షణ విత్తనం నాటి లవ్ కెమిస్ట్రీకి తెరలేపుతారు.ఎదుటి వ్యక్తి గురించి పదేపదే ఆలోచింప చేసే సంఘటన జరిగితే మనస్సు మెల్లిగా పూర్తిగా వారి ఆలోచనలతో నిండిపోతుంది. అదే ఎదుటి వ్యక్తి ఆపోజిట్ సెక్స్ అయితే ప్రేమ మొదలవుతుంది. ఈ సైకాలజీ థీమ్ ని బేస్ చేసకునే ఆ రకమైన సీన్స్ వర్కవుట్ చేస్తారు.

ఈ చిత్రాల ‘సోల్’ సీక్రెట్

ఇక ఈ చిత్రాల్లో సూపర్ హిట్ అయినవి బహిర్గత సంఘర్షణ మాత్రమే కాక అంతర్గత సంఘర్షణ ను స్పృశించేవే కావటం గమనించ తగ్గ అంశం. ఇంకా ఆ ప్రేమ వల్ల అతడు గాని ఆమె గాని ఏమైనా కోల్పోయారా అన్నది పొందుపరచటం మరో కీలక అంశం. ఆ కోల్పేయే అంసాలు మానసికంగా అయితే అహాలు, అలాగే అన్నదమ్ముల అనుబంధం, తల్లి తండ్రుల ప్రేమ,స్నేహ బంధం,ఇంకా ప్రాణం వంటివి ప్రధాన పాత్ర వహిస్ధాయి.

ఇక్కడికి ఇది…ఇంకా చదివే ఓపిక ఉంటే…రొమాంటిక్ కామిడీల పుట్టుక మన తెలుగు చిత్రసీమలో వచ్చిన రొమాంటిక్ కామిడీలయిన క్లాసిక్ మిస్సమ్మ,ఖుషి,ఆనంద్ వంటివి విశ్లేషిస్తూ చర్చించుకోవచ్చు..

ఈ లోగా మీరు చూసే రొమాంటిక్ కామెడీ సినిమాల్లో సరదాగా ఈ డిజైన్ ఉందేమోనని గమనించండి.

3 Comments