Menu

నిశ్శబ్ద్

నిశ్శబ్ద్ – పోస్టర్ మీద ‘అతనికి 60, ఆమెకు 18’ అని రాసి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ కాస్త ఇరుకైనది. నిషబ్ద్ అసలు చాలా హైప్ లోంచీ, కాంట్రవర్సీ, ఈ సబ్జెక్ట్ మీద ఎప్పట్లాగే మీడియా లో చర్చల లోంచీ బోల్డంత ఆసక్తి కలిగిస్తూ థియేటర్లలో విడుదలయింది. ఇలాంటి ప్రేమ ని ఒప్పుకోలేని సమాజం సంకుచితమా, సమాజం హర్షించలేని ఆ ప్రేమ సంకుచితమా అని మనుషుల్లో కలిగే ఒక ఆలోచన కలిగించడానికి పనికి వస్తుంది.

నిజంగా చెప్పాలంటే, ప్రేమకు వయసు, కారణం.. ఇలాంటివన్నీ ఉండవు. సినిమాల్లో అయితే మరీ గ్లోరిఫై అయిన ప్రేమ – మొదటి చూపు లోనే ప్రేమ – ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి, చంపడం లేదా చచ్చిపోవడం, ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటాము గాబట్టి మనకవన్నీ అలవాటే. నిజ జీవితం లో ప్రేమ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా వయసు మళ్ళిన ఒక గృహస్థు (భార్యా, పిల్లలు కలవాడు) తన వయసులో కన్నా ఎంతో చిన్నదైన అమ్మాయిని ప్రేమించడం – ఆ అమ్మాయి, అతని కూతురి స్నేహితురాలు కావడం, ఇవన్నీ ఎంత అనూహ్యమైన విషయాలు ?

నిశ్శబ్ద్ మొదలయేసరికే విజయ్ (అమితాబ్) ఒక పర్వత శిఖరం కొన మీద నించుని ఉంటాడు – అక్కణ్ణించీ దూకి, ఆత్మ హత్య చేసుకోవడానికి. ఎందుకు – అంత కష్టం ఏమొచ్చిందీ అంటే – అతను చెప్పిన తన కధ ఈ నిషబ్ద్. ఒక నటుడిగా అమితాబ్ విలక్షణత, అతని భార్యగా నటించిన రేవతి మీనన్ ప్రతిభ ఈ సినిమాని చూడ చక్కగా తీర్చిదిద్దాయి.

కేరళ లో (మున్నార్) అందమైన పిక్చర్ పెర్ఫెక్ట్ పరిసరాల్లో విజయ్ (అమితాబ్), అమృతల (రెవతి) అందమైన పొదరిల్లు లాంటి ఇల్లు. విజయ్ ఒక ఫొటొగ్రాఫర్. వీళ్ళకి ఒక అందమైన కూతురు రీతు (ష్రద్ధా ఆర్య)! ఈ అమ్మాయి స్నేహితురాలే జియా. జియా ఒక ట్రబుల్డ్ టీనేజర్. ఈమె తల్లిదండృలు విడిపోయారు. తల్లి ఆస్ట్రేలియా లో ఒంటరిగా ఉంటుంది. జియా మాత్రం ఇండియాలో ఉండి చదువుకుంటూంది. ఈమె రీతూ తొ కలిసి, శలవులకు కేరళ రావడంతో కధ మొదలవుతుంది. రామూ శైలి లో జియా..(ఆస్ట్రేలియన్ పెంపకం గాబట్టి అనుకోవాలా) చిన్న చిన్న బట్టల్లోనే పరిచయం అవుతుంది. ఈ ఇద్దరు పిల్లల్నీ రీతూ తల్లి దండృలు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు. రీతూ, జియా ఇద్దరూ ప్రాణ స్నేహితులు. రీతూ కన్న, జియా చాలా పెంకిది, తెలివైనది. చురికైనది. తొందరలోనే, అందరితోనూ కలిసిపోతుంది.

అయితే ఆమె లో ఏదో చైతన్యం తో విజయ్ (అమితాబ్) ఉత్తేజితుడవుతాడు. ఆమె కూడా అతని పట్ల తెలియని ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఇవన్నీ ఎవరికి వారు గమనించుకునే లోగానే, ఇద్దరూ ప్రేమ లో పడతారు. ప్రేమ లో పడటానికి మనలో ఏదో కావాలి. అది ఏమిటి – మనలో స్పందనల్ని ఒడిసిపట్టగలిగే ప్రేరణలని ఎదిరించి, ప్రేమ కోసమే ప్రేమించడానికి కూడా ఏదో అవసరం. అందరూ ప్రేమించలేరు. అయితే, సమాజంలో ప్రేమ కి ఒక బాధ్యత ఉంటుంది. ఒక భార్య కి భర్త అయి ఉండి, ఒక కూతురి తండ్రి అయి ఉండి, తన కూతురి వయసు పిల్లతో ప్రేమ లో పడటం న్యాయం కాదు. అయితే ఎవరూ కావాలని ప్రేమ లో పడరు.

అంతవరకూ తన భాద్యతలని ఎరిగిన మనిషిగా, ఎంతో హుందాగా, ఎంతో గౌరవంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి, తన వయసుని మరిచి, తన ముందున్న స్త్రీని ఒక స్త్రీ లాగా ప్రేమించడం, అదే తొలి ప్రేమ అన్నంతగా ప్రేమించడం సాధ్యమా..?

జియా ఖాన్ కూడా చాలా అందంగా – యవ్వనంతో మిసమిస లాడుతూ, కనిపించినా, పాత్ర పరంగా తన అంతరంగం లో దాగున్న అగ్నిపర్వతాలను కూడా చాలా బాగా ప్రదర్శించింది. జియా (పాత్ర పేరు కూడా అదే) ఒక ఫ్రీ బర్డ్. ఆమె అన్ని మానసిక అవసరాలనూ తీర్చడానికీ ఒక కుటుంబం అంటూ లేకుండా, ప్రేమను అనుభవించకుండా, బలవంతపు కఠినాత్మకత, కేర్లెస్ నెస్, తల్లి కున్న బాయ్ ఫ్రెండ్స్ ని చూస్తూ, తల్లి అనుభవాల్ని చూస్తూ ఏర్పరచుకున్న వ్యక్తిత్వం ఆమెది. అంతవరకూ ఆమె తొ మామూలుగానే ఉంటూ వచ్చిన తల్లి బాయ్ ఫ్రెండ్ కూడా – తనకు కాస్త వయసు రాగానే తననే ఆశించడాన్ని తీవ్రంగా అసహ్యించుకున్న వ్యక్తి – ఒక తెగిన గాలిపటం. ఇపుడు ఆమెకు ఆస్ట్రేలియా వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ‘అతను ‘ ఉంటాడు. తల్లి అతన్ని వొదులుకోలేదు.

ఇలాంటి అమ్మాయికి ఈ అరవయ్యేళ్ళ వృద్ధుణ్ణి చూసి ప్రేమ కలిగింది. అయితే, తను అనుభవిస్తున్న ప్రేమ వెనకున్న పరిమాణాల సంగతి ఆమెకు తెలియదు. ఆమెకు ప్రేమో / ఆకర్షణో కలిగింది. ఈ ప్రేమకి చలించిన విజయ్ – తన వయసునీ, వరుసనీ మరిచి, పిచ్చివాడైపోతాడు. అతను అలా చెయ్యకూడదు – అలా చెయ్యకూడదని జియాకు తెలియదు. ఆమె లో భారతీయత తక్కువ.

ఈ సినిమా లో రేవతి గురించి చెప్పుకోవాలి. రేవతి అంటేనే, చాలా మంచి నటి.. అని అందరికీ తెలుసు. ఒక సారి జియా వీళ్ళ ఫేమిలీ ఫోటోలు చూస్తూండగా, రేవతి చిన్నపుడు (పెళ్ళి కాక ముందు) భరతనాట్య ప్రదర్శన ఇచ్చినప్పటి ఫోటో కనపడుతుంది. అపుడు జియా ‘ఆంటీ.. మీకు డాన్స్ వచ్చా.. ?’ అంటే నవ్వి రేవతి ‘పెళ్ళయ్యాక మానేసాను ‘ అంటుంది. జియా.. ఎందుకు మానేసారు అని అడిగితే, ఆలోచన లో పడి.. ‘పెళ్ళయ్యాక, విజయ్ నే నా జీవితం. తరవాత రీతూ వచ్చింది.. ఇంకెక్కడ కుదురుతుంది ?’ అంటుంది. ఇంతగా కుటుంబం కోసం తన ఇష్టాఇష్టాలని వొదులుకుని, పూర్తిగా విజయ్ కే అంకితమైన భార్య ఆమె.

విజయ్ గా అమితాబ్ – తప్పు ఒప్పుల సంఘర్షణల మధ్య ఊగిసలాడినా.. జియా వైపే మొగ్గుతూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో రీతూ కు తండ్రికీ, తన స్నేహితురాలికీ మధ్య ఉన్న ‘అనుబంధం’ గురించి అనుకోకుండా తెలుస్తుంది. తండ్రికి తల్లి కాకుండా వేరే ఎవరితోనో ‘ప్రేమ ‘ ఉందని తెలిస్తే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది ? రీతూ గా ష్రద్ధా ఆర్య నటన చాలా బావుంది. ఈ అమ్మాయి, ఈ విషయాన్ని తల్లికి చెప్పలేక, తండ్రితో మాట్లాడలేక, (జియా తో మాత్రం మాటాడటం మానేస్తుంది) ఎంత తల్లడిల్లిపోతుందో చూస్తే జాలి కలుగుతుంది. ఆఖర్న తల్లికి జియాని పంపెయమ్మా.. తను మనింట్లో ఉండొద్దు ! అని చెప్తే, అమృత కి అసలు విషయం అర్ధం కాదు. ”మీరు ఫ్రెండ్స్ కదా – అలా కోపం వస్తే ఆమెని వెళ్ళిపోమంటారా ఎవరైనా..?” అని సర్దేస్తుంది. ఈ పాత్ర లో రేవతి ఎంత చక్కగా ఒదిగిపోయిందంటే, ఆమెకి భర్త మీద లేశమాత్రమైనా అనుమానం ఉండదు. అసలు వీరిద్దరి మధ్యా జరుగుతున్నది రేవతి కి మాత్రం కనిపించదు – అనిపించదు.

ఈ పరిస్థితుల్లో ఆపధ్బాంధవుడిలా శ్రీధర్ (నాజర్) (అమృత సోదరుడు) ప్రవేశిస్తాడు. రీతూ తన హోం ట్రూత్ ని మామయ్య కి చెప్పడం, ఆయన విజయ్ తో (అమితాబ్) తో ఈ విషయం డిస్కస్ చెయ్యడం (జియా ఇంకా చిన్నపిల్ల ! ఆమె ఒక వేళ నిన్ను నిజంగా ప్రేమించిందే అనుకో – నీ వయసు కు నువ్వు ఆమెకు ఎలాంటి జీవితాన్నివ్వగలవు ? ఆమె ను ప్రేమించి, ఆమె ఫ్యూచర్ కు నువ్వు అన్యాయమే చేస్తున్నావు అని వాదిస్తాడు శ్రీధర్) చివరికి రేవతి కి కూడా సంగతి తెలియడం.. ఆమె భర్తని అసహ్యించుకోవడం..(అది చూసి తీరాల్సిన సీన్) చివరికి సమాజపు, కౌటింబికపు భాద్యతల పరంగా విజయ్ – జియాని పిలిచి, ‘నేను నిన్ను ప్రేమించడం లేదు – నీది ఎడాలసెంట్ వయసు అందుకే నీకు అలా అనిపిస్తూంది. నువ్వు నా ఇంటి నుంచీ వెళిపో. నీ ముఖం కూడా చూపించొద్దు. ఏదో కాస్త ప్రేమ గా మాట్లాడితే అది నిజం ప్రేమ అనుకుంటావా..” లాంటి ఏవో మనసు విరిచే మాటలని, ఆమెను ఇంటినుంచీ వెళ్ళగొట్టడం – తో ఈ గొడవ సద్దుమణుగుతుంది. ఈ నిరాకరణ ని ఎదుర్కోవడానికి జియా కు ఎంత ధైర్యం కావాలి ? జియా విజయ్ ని బ్రతిమాలుతుంది. ‘నిన్ను చూడకుండా ఉండలేను ‘ అంటుంది. కానీ అమితాభ్ కాఠిన్యాన్ని చూసి, గుండె చెదిరి – ఏడుస్తూ వెళిపోతుంది. ఈమెను ప్రేమించే బాయ్ ఫ్రెండ్ (ఆమె ఇష్టపడదు) ఆఫ్తాబ్ శివ్ దాశానీని పిలిచి అతనికి ఆమెని అప్పగించేస్తాడు విజయ్.

ఈ చిన్ని ఎపిసోడ్ ముగిసాక, విజయ్ ఒంటరి అయిపోతాడు. అతనితో భార్య మాటలాడదు. (ఆమె విశ్వాసాన్ని అతను కోల్పోయాడుగా) కూతురు అసహ్యించుకుంటుంది. జియా లేదు. వెళిపోతున్న జియా ఎంత హర్ట్ అయిపోయి వెళిపోయిందో అదే గుర్తొస్తూ.. ఆమె లేక బ్రతకలేక, ఆ కొండ కొమ్మున నించుని ఉంటాడు అమితాబ్. కానీ చాలా సేపు, ఆమె ని తలచుకుని రోదిస్తూ.. పొద్దు పోయేదాకా గడిపి, ఇంటికొస్తాడు. Sridhar (నాజర్) ‘ఇంత వరకూ ఎక్కడికెళ్ళావు విజయ్?’ అని అడిగితే, ‘చావడానికీ అని నిర్లిప్తంగా చెప్పి – ‘కానీ చావలేకపోయాను. జియాని తలచుకుంటూ.. ఆ విరహ బాధలో ఇంకొన్నాళ్ళు ఆమె కోసం బాధపడుతూ బ్రతకాలనుంది – అందుకే ఇంటికొచ్చేసాను ‘ అంటాడు. అప్పుడు విజయ్ లో ఉన్న ప్రేమ తీవ్రత అర్ధం అవుతుంది. అంతే..! ఇదే ముగింపు.

అయితే, రాం గోపాల్ వర్మ కి కొంచెం ప్రేక్షకులను ఆకర్షించడానికి కాస్త ఉత్సాహపడే లక్షణం – ఈ సినిమాని కొంచెం (కొంచెమే లెండి) చతికిలపరిచాయి. కొన్ని సార్లు ప్రేమ ని కొంచెం మంచిగా చూపించాలి. సౌందర్యానికీ, పొడుగు కాళ్ళకూ, స్కిన్ షో కూ కొంచెం ఎక్కువ మోతాదులో ప్రాముఖ్యత ఇస్తే, జియా ఖాన్ ని తడిపి, చిన్న బట్టల్లో చూపితే – అది చూసి అమితాబ్ కు ప్రేమ కలగడం – ఇవి కొంచెం చీప్ గా అనిపిస్తాయి. సినిమా లో జియాఖాన్ కాళ్ళు చూసీ చూసీ విసుగు పుడుతుంది. అసలు జియా ఖాన్ ముఖం చూస్తేనే చిరాకు వచ్చేంత వరకూ చూపించి, చివరి అర్ధ గంట లో మాత్రం మంచి నటన చూపించాడు. ప్రేమ ఒక ఉత్కృష్టమైన భావన. దీన్ని అంతకన్నా తక్కువగా చూపిస్తే, అది కన్విన్సింగ్ గా ఉండదు.

విజయ్ పాత్ర లో అమితాబ్ కాకుండా ఇంకోరెవరైనా ఉంటే సినిమా తేలిపోయి ఉండేది. నిస్సహాయమైన ఒక వృద్ధ ప్రేమికుడి గా విజయ్ ‘జియా జ్ఞాపకాలలో నైనా జీవించాలని ఉంది..’ అన్నప్పుడు పురుషుని ప్రేమ ఎంత లోతైనదో అర్ధం అవుతుంది. మన సమాజం లో – ఒక వయసు రాగానే పెద్దలు కుదిర్చిన పెళ్ళీ.. పెళ్ళి అయిన కొన్నాళ్ళకి పిల్లలూ – ఇవి మనుషులకి తప్పని చిక్కుముళ్ళు. వీటికి వ్యతిరేకంగా ఏ ఒక్కటి జరిగినా సమాజం లో అలజడి మొదలవుతుంది. ‘ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు ‘? ‘ఇంకా ఎందుకు పిల్లలు కనలేదు ?’ ‘ఇంకా ఎందుకు మీ పిల్లలకి పెళ్ళి చెయ్యలేదు ?’ ఇలా ప్రశ్నలు – వీటికి సమాధానం ఏముంది ? పెళ్ళి బయట ప్రేమ అంటే సమాజం (family) ఊరుకుంటుందా ? అయినా ఒక కుటుంబాన్ని కలిపి ఉంచే నమ్మకం, విశ్వాశం, ప్రేమ, ఇవన్నీ ఏమిటి ? ఈ ఏక్సిడెంట్ ల తరవాత ఆ ముగ్గురు కుటుంబ సభ్యులూ బాధితుల్లా ఒకరి కొకరు దూరమయిపోయి – తట్టుకోలేని నిశ్శబ్దం లో మిగిలిపోతారు.

–సుజాత పాత్రో

3 Comments
  1. Sai Brahmanandam Gorti November 11, 2008 /