Menu

సలక్షణమైన బాలల/కుటుంబ చిత్రం – ‘మొగ్గిన జడే’

కనీసం ఓ ఇరవై, పాతికేళ్ళ క్రితం, ప్రైవేటు చానెళ్ళు ఏవీ లేని రోజుల్లో దూరదర్శన్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం వివిధ భాషలకు చెందిన classic movies వచ్చేవి. అలాంటి సినిమాలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే దానికి చక్కని చిరునామా ‘Lok Sabha TV’ చానెల్. ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతాయి. అదే సినిమా మళ్ళీ మరుసటి రోజు (అంటే ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు పునఃప్రసారమవుతుంది.

ఇలాంటి చిత్రాల కోవలో ఒక రెండు వారాల క్రితం నేను చూసిన ఒక చక్కని కన్నడ సినిమా ‘మొగ్గిన జడే’ – అంటే ‘పూల జడ’ అన్నమాట. స్థూలంగా కథ ఇది. పదేళ్ళ చిన్నారి ప్రియకు ‘పూల జడ’ వేయించుకోవాలని ఎప్పటినుంచో చాలా కోరిక. వాళ్ల బామ్మను ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. కాని ఒక outsourcing company లో పనిచేసే ‘ఎంతో’ అధునాతన భావాలు గల (మోడ్రన్ భావాలు అనొచ్చు) వాళ్ల అమ్మకు ఇదంతా చాలా చాదస్తంగా అనిపిస్తుంది. ఆమె భర్త రాఘవేంద్ర ప్రియ ఇష్టానికి వ్యతిరేకం కాకపోయినా, భార్య మాటకు ఎదురు చెప్పలేడు. ఒక సంప్రదాయ కుటుంబంలో పెరిగిన తను మారే కాలంతో పాటు మారటానికి ప్రయత్నిస్తూ ఒక సంధియుగంలో ఉంటాడనవచ్చు. ఆ ఇంట్లో ప్రియతో పాటు, బామ్మ, తాతయ్య (రాఘవేంద్ర తల్లిదండ్రులు), వాళ్ల అత్తయ్య కొడుకు తన ఈడు వాడే ఉంటారు. కొన్నాళ్ల తర్వాత, స్వతంత్ర భావాలు గల రేఖ తన తల్లిదండ్రుల ప్రోద్బలంతో, భర్తను ఒప్పించి, ఒక అపార్టుమెంటులో వేరు కాపురం పెట్టిస్తుంది. రాఘవేంద్ర తల్లిదండ్రులు చాలా బాధపడతారు. కనీసం ప్రియనైనా తమతో ఉంచమని అంటారు. ప్రియకు కూడా బామ్మ, తాతయ్య, అప్పుడప్పుడూ తగవులాడుకున్నా, తన అత్తయ్య కొడుకు అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడే ఉంటాను అని అన్నా, తల్లిదండ్రులు ఆ పిల్లను వాళ్ళతో తీసుకువెళతారు. ఉద్యోగ బాధ్యతలతో ఎప్పుడూ సతమతమయ్యే తల్లిదండ్రులు ఆ అమ్మాయి బాగోగులను పదిహేను ఏళ్ల పనమ్మాయి నాగరత్న పైనే వదిలేస్తారు. కొత్త ఇంట్లో, కొత్త వాతావరణంలో తనతో ఆడుకునే వారెవరూ లేక ప్రియ చాలా ఒంటరిగా ఫీలవుతూ ఉంటుంది.

నిజానికి ప్రియకు పూలజడ వెయ్యాలని రోజూ ఇంటికి పూలు తెచ్చి ఇచ్చే పూలబ్బాయికి, తెల్లవారి ఎక్కువ పూలు తీసుకు రమ్మని ప్రియ బామ్మ ఒక రోజు చెప్పి ఉంచుతుంది. ఆ తెల్లవారే, కొడుకు, కోడలు ప్రియను తీసుకుని కొత్త ఇంటికి వెళ్ళిపోతారు. ప్రియకు పూలజడ వేసిన తర్వాత ఒక ఫోటో తీయించి తనకు ఇవ్వమని పూలబ్బాయి ఆవిడకు చెప్పి ఉంటాడు. అది చుట్టుపక్కల వాళ్లకు చూపిస్తే, తన వ్యాపారం ఇంకా బాగా సాగుతుందని అతని నమ్మకం. తెల్లవారి ఎక్కువ పూలు తీసుకు వచ్చిన పూలబ్బాయికి వద్దు అని చెప్పలేక, పూలన్నీ తీసుకుంటుంది వాళ్ల బామ్మ. అతను ఆ తర్వాత ఫోటో అడిగినా, ఇవ్వాళా, రేపు ఇస్తానులే అంటూ ఉంటుంది.

చివరికి ఒక రోజు, పూలు తీసుకుని పెద్ద పూలజడ అల్లి, కొన్ని తినుబండారాలు అవీ తీసుకుని, రాఘవేంద్ర తల్లిదండ్రులు కొడుకు ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్ళేసరికి కుటుంబం మొత్తం ఎక్కడికో వెళ్లి ఉంటారు. ఇంట్లో పనమ్మాయి నాగరత్న ఒక్కతే, టివి చూస్తూ ఉంటుంది. చేసేదేమీ లేక, ఆ పూలజడ ప్రియకు వెయ్యమని, తన కొడుక్కు ఇష్టమైన తినుబండారాలు చేశానని, అవి అతనికివ్వమని రాఘవేంద్ర తల్లి నాగరత్నకు ఇస్తుంది. భార్యాభర్తలిద్దరూ తిరుగుముఖం పడతారు.

నాగరత్నకు ఆ పూలజడ చూడగానే, కోరికలు పూరి విప్పుతాయి. ఆ పూలజడను తన సిగలో అలంకరించుకుని, అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. వెంటనే దాన్ని తనతో ఇంటికి తీసుకువెళ్ళి, జడను అలంకరించుకుని, మంచి ఫోటో తీయించుకుంటుంది. అంతేగాక, తన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలకు కూడా దాన్ని అద్దెకు ఇచ్చి, ఫోటోలు తీయిస్తుంది. మళ్ళీ ఏమీ ఎరగనట్లు, దాన్ని తిరిగి తెచ్చి, రాఘవేంద్ర వాళ్లు రాగానే, అతనికిస్తుంది. తినుబండారాలలోనుంచి కూడా కొన్ని తీసి దాచుకుని తింటూ ప్రియ ‘ఏమి తింటున్నావక్కా, నాక్కూడా కొంచం పెట్టవా’ అని అడిగితే, గిల్లి గిల్లి ‘మా బామ్మ చేసింది’ అని కొంచం పెడుతుంది. నాగరత్న పూలజడ, మిఠాయిలు ఉన్న సంచీ ఇవ్వగానే, ఎంతో మురిసిపోయిన రాఘవేంద్ర, తల్లిదండ్రులు వచ్చిన సమయంలో తాము ఇంట్లో లేనందుకు చాలా బాధపడి, అవి భార్యకు చూపిస్తే ఏదో ఒక పోల్లుమాట అంటుందని, దాన్ని బీరువాలో దాస్తాడు. పూలజడ వేసుకుని దిగిన ఫోటోలను నాగరత్న దగ్గిర చూసిన ప్రియ తన బామ్మ కూడా తనకు పూలజడ వేస్తానని ప్రామిస్ చేసిందని, కాని ఇప్పుడు తాము ఇక్కడికి వచ్చేశారు కాబట్టి, తన కోరిక తీరలేదని వాపోతుంది. కాని నాగరత్న ఫోటోలో ఉన్న పూలజడ తన బామ్మ తనకోసం తయారుచేసి తెచ్చినదే అని ఆ పాపకు తెలియదు.

ఇంట్లో ఒంటరితనం అనుభవిస్తున్న ప్రియకు, వాళ్ల ఇంటి ముందరికి వచ్చి వీధిలో ఆటలాడుతున్న దొమ్మరి వాళ్ల పిల్లలతో స్నేహం కుదురుతుంది. అప్పుడప్పుడూ వెళ్లి, వాళ్ల ఆటలు చూస్తూ, వాళ్ల డప్పు చప్పుడు చేస్తూ ఉంటుంది. పూలజడను బీరువాలో పెట్టి మారిచిపోయిన రాఘవేంద్ర, హఠాత్తుగా గుర్తువచ్చి చూస్తే, అప్పటికే అది వాడిపోయి ఉంటుంది. చేసేదేమిలేక, ఎవరూ చూడకుండా, దాన్ని తీసుకువెళ్ళి, ఇంటి ముందున్న చెత్తకుండీలో వేసి వస్తాడు. ఆ దొమ్మరివాళ్ళ పిల్లలు, ఆ చెత్తకుండీలో వెదుకుతూ ఉంటే, అది దొరుకుతుంది. అది తీసుకుని వచ్చి, తలకు పెట్టుకుని చూసి, మురిసిపోతూ ఉంటారు. వాళ్ల దగ్గర పూలజడ చూసి ప్రియ ఆ వాడిపోయిన జడనే తానూ తలకు పెట్టుకుని చూసి ఆనందపడుతుంది. ఇంతలొ తల్లి ఆ సన్నివేశం చూసి, ప్రియనూ, నాగరత్ననూ చడామడా తిడుతుంది. వీటన్నిటితో విసిగిపోయి, ఇంట్లో ఒంటరితనం భరించలేని ప్రియ తన బామ్మ, తాతయ్యలను కలవడానికి బయలుదేరుతుంది. ఇంట్లో ప్రియ కనబడక రాఘవేంద్ర, రేఖ కంగారు పడతారు. ప్రియ ఆ దొమ్మరివాళ్ళ పిల్లలతో చనువుగా ఉండటం చూసి ఉన్న రేఖ, వాళ్ళే ఏమైనా చేసి ఉంటారని అనుమానపడుతుంది. రాఘవేంద్ర వెళ్లి, వాళ్ళను బెదిరిస్తాడు. వాళ్లు మాకేమీ తెలియదు బాబూ అని కాళ్ళు పట్టుకుంటారు. మీరిక ఇక్కడ ఉండటానికి వీల్లేదని వాళ్ళను అక్కడినుంచి వెళ్ళగోడతాడు. దారి తప్పిన ప్రియను, ఒక వాచ్మన్ వాళ్ల బామ్మ, తాతయ్యల దగ్గిరకు చేరుస్తాడు. రాఘవేంద్ర, రేఖ కూడా కూతురు అక్కడ ఉన్న సంగతి తెలుసుకుని అక్కడికి వస్తారు. పిల్లల చిన్న, చిన్న కోరికలు తీర్చడం కూడా ముఖ్యమని రేఖ గుర్తిస్తుంది. చివరికి ఆ అమ్మాయి పూలజడ వేయించుకుని తన కోరిక తీర్చుకుంటుంది. అందరూ కలిసి ఒక్కచోటే ఉండటంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రానికి దర్శకుడు పి.ఆర్. రామదాసనాయుడు. ప్రియగా బేబి శిరీష, రాఘవేంద్రగా పాపులర్ కన్నడ టివి నటుడు రాజేష్, మోడ్రన్ తల్లి రేఖగా పవిత్రాలోకేష్, పనిపిల్ల నాగరత్నగా హర్షిత మొదలైనవారు నటించారు. ఎల్. వైద్యనాథన్ చక్కని సంగీతాన్ని అందించారు. సినిమాలో ఎక్కడా కృతిమత్వం లేదు. బాలనటులు, ప్రౌఢనటులు చాలా సహజంగా చేశారు. ఎంతో హాయైన సినిమాను చూసిన అనుభూతిని పొందుతాము. ఈ కాలంలో పిల్లలకు అంటూ ప్రత్యేకించి సినిమాలు లేకపోవటంతో, ‘పిల్లలు చూస్తే బాగుండదు’ అనే ఇంగితజ్ఞానం కాస్తంతైనా లేకుండా బాధ్యతారహితంగా తీసే మసాలా సినిమాలే వాళ్ళకూ దిక్కవుతున్నాయి. వాటిల్లో కామెడీ అనే పేరుతో ఉండే వెకిలి డైలాగులే పిల్లలు నేర్చుకుని వచ్చి ఇంటిదగ్గిర కూడా మాట్లాడుతున్నారు. పిల్లలకోసమైనా, ఇలాంటి సలక్షణమైన చిత్రాలు ఇంకా రావాలి.

– మేడేపల్లి శేషు, కొత్త డిల్లీ

5 Comments
  1. మురళి November 26, 2008 /
  2. afsar November 26, 2008 /
  3. మేడేపల్లి శేషు November 27, 2008 /
  4. venkat November 28, 2008 /