Menu

‘మరో చరిత్ర’ కు ముప్ఫైయ్యేళ్ళు

గత ముప్పైసంవత్సరాలుగా తెలుగు జీవితాలలో, తెలుగు సినిమాలలో ప్రేమకథల్ని ప్రభావితం చేసిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరో చరిత్ర’. 1978 లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన సంచలనం ఇంతా అంతాకాదు. ఈ ఏటితో ఈ చిత్రానికి ముప్ఫైఏళ్ళూ నిండుతాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొంత తలుచుకుందాం.

నటుడిగా అభివృద్ధి చెందుతున్న దశలోవున్న కమల్ హాసన్, ఆ సినిమాతో పరిచయమైన ‘నల్లపిల్ల’ సరిత, మాధవి, జయవిజయ, శ్యామల, పి.ఎల్.నారాయణ, రమణ మూర్తి ఇందులో ముఖ్యతారాగణం. ఒక తమిళ-తెలుగు కుటుంబాల అబ్బాయీ,అమ్మాయిల ప్రేమకథే ఈ చిత్రం. ఈ ఇద్దరి కుటుంబాలకూ సంబంధించిన శాఖాహార- మాంసాహార సాంప్రదాయాల ఘర్షణ మధ్య, ఈ ప్రాపంచిక కలహాలకు,భాషాభేధాలకూ అతీతంగా ఈ యవ్వనస్తుల ప్రేమ అంకురిస్తుంది. పెద్దల వ్యతిరేకత, ఆంక్షల నడుమ, తమ ప్రేమకు పరీక్షగా ఒక సంవత్సర కాలపు ఎడబాటుకు ఈ జంట తయారవుతుంది. ఆ సంవత్సరకాలంలో కలిగే విరహాలు,అనుమానాలు,అపార్థాలూ కథాగమనంలో కావలసినంత వైవిధ్యాన్నిస్తాయి. అన్నింటినీ అధిగమించిన ప్రేమ ఒకటయ్యో సమయంలో విషాదాంతం అవ్వటం ఈ సినిమా ఒక ‘క్లాసిక్’గా నిలిపిందనుకోవచ్చు. తమ సంయమనంతో ప్రేమను గెలిపించి చరిత్ర సృష్టించాలనుకున్న ఈ జంటకథకూడా, తుదకు చావుతో ముగుస్తుంది. మన చరిత్రలోని గొప్ప ప్రేమలన్నీ విషాందాంతాలే కాబట్టి, ఈ చిత్రం మరో చరిత్రయ్యింది.

ఈ సినిమాతో నూనూగు మీసాల (బాలుగా)కమల్ హాసన్  నటన  ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఈ చిత్ర హిందీ రీమేక్ తో భారతదేశమంతా అభిమానుల్ని సంపాదించిపెట్టింది. తెలుగుదనం ఉట్టిపడే (స్వప్న గా)సరిత ముఖం, స్వచ్చంగా తెలుగు పలికే ఆకర్షనీయమైన గొంతు (ఆ తరువాత కాలంలో డబ్బింగ్ కళాకారిణిగా బాగా రాణించింది).టీనేజి పిల్లలా తన బాల్యచాపల్యం కలిపిన చిలిపిదనం అంత అందంగా కలబోసిన నాయిక తరువాత తెలుగుతెరపై రాలేదనుకుంటాను.  యువవితంతువుగా గంభీరమైన ప్రేమను చూపించిన మాధవి. ఎప్పుడూ పోట్లాడుకునే పొరుగింటోళ్ళు, నాయికా నాయకుల తల్లిదండ్రులుగా జయవిజయ, శ్యామల, పి.ఎల్.నారాయణ, రమణ మూర్తుల నటన పాత్రోచితం. ఒక చిరుపాత్రలో దేవదాస్ కనకాల ప్రతిభ మరో ఆకర్షణ.

ఈ సినిమాని హిందీలో ‘ఏక్ దూజే కేలియే'(1981) గా తియ్యడం జరిగింది.  దాదాపు ఫ్రేం-టు-ఫ్రేం రెండుసినిమాలూ ఒక్కటే అయినా, నలుపు-తెలుపుల తెలుగు సినిమాలోనే ఏదో తెలియని అందం వుందనిపిస్తుంది. సినిమా శీర్షికలోని ‘చరిత్ర’ పదానికి మరోభాష్యంలాగా బ్లాక్ అండ్ వైట్ అమరిందనిపిస్తుంది. ఈ చిత్రంలో బి.ఎస్. లోకనాధన్ సినెమాటోగ్రఫీ, మొదటిఫ్రేమునుంచీ చివరి ఫ్రేమువరకూ ఈ చిత్రం యొక్క చిత్తవృత్తి(mood) ని అందిపుచ్చుకుని, ప్రేక్షకుడికి అందించింది. వైజాగ్ అందాలను ఇంతహృద్యంగా చిత్రీకరించిన సినిమా మరోటి లేదనుకుంటాను. ప్రేక్షకుడి కళ్ళకి శ్రమలేకుండా, కథలో ఇమిడిపోయేలా చెయ్యగలగటంలో సినెమాటోగ్రఫీ, ఎడిటింగ్ లు ప్రముఖపాత్ర వహిస్తాయని చెప్పడానికి అత్యుత్తమ ఉదాహరణ ఈ చిత్రం.

సంగీత సాహిత్యాల పరంగా ఎమ్.ఎస్.విశ్వనాధన్ బాణీలకు ఆత్రేయ రాసిన పాటలు ఇప్పటికీ జనంనోళ్ళలో నానుతున్నవే. “ఏ తీగపువ్వువో” పాట వినబడని కాంపిటీషన్ వుండదు.అందులో “తెలిసీ తెలియని అభిమానమౌనో..మనసు మూగది మాటలు రానిది” అంటూ కన్నెమనసులోని ప్రేమను ఆవిష్కరించి విధానం నభూతోనభవిష్యతి. అలాగే, “పదహారేళ్ళకూ నీలోనాలో ఈ ప్రాయంచేసే చిలిపి పనులకూ కోటిదండాలూ..శతకోటి దండాలు” అంటూ, చిలిపివయసు అనుభూతులకు ఉచితాసనంవేసి పట్టంకట్టిన పాటలో తెలుగులో మరోటి లేదు. “భలెభలే మగాడివోయ్ బంగారు నాసామిరో” అంటూ ఎల్.ఆర్.ఈశ్వరి గొంతులోపలికిన భావాలూ ఆ పాటకు సరితచూపిన నటనా, అంతసులువుగా ఎవరైనా మరువగలమా! “కలసి వుంటే కలదు సుఖము” అంటూ తెలుగు సినిమా పెర్లన్నీకుట్టి ఒక సంగీతమాలని చెయ్యటం మరొ అత్యద్భుతమైన ప్రయోగం.

బాలచందర్ కథకు సందర్భోచితంగా సాగిన గణేష్ పాత్రో సంభాషణలు ఈ సినిమాలో మరో మచ్చుతునక. డైరెక్టుగా తెలుగులో బాలచందర్ తీసిన మొదటి సినిమా ఇది. అంతకు మునుపు ‘అంతులేని కథ’ తీసినా, మొదట తమిళ్ లో తీసిన తరువాతే తెలుగులో పునర్నిర్మించడం జరిగింది. కాని, ‘మరొ చరిత్ర’ సినిమా అటు డబ్బింగ్ చెయ్యకుండా ఇటు రీమేక్ చెయ్యకుండా తెలుగులోనే తమిళనాట విడుదల చెయ్యబడింది.

భారతీరాజా ‘సీతాకోకచిలుక’ కి ముందే, టీనేజి ప్రేమథలకు శ్రీకారం చుట్టిన సినిమా ఇదేకావచ్చు. ఈమధ్యకాలంలో ‘కొత్తబంగారు లోకం’ అంటూ మరో టీనేజి ప్రేమకథను అందించిన ‘దిల్’రాజు, తన నిర్మాణ సారధ్యంలో మరొచరిత్రను పునర్నిర్మించే ఆలోచనలో వున్నట్లు పరిశ్రమవర్గాల వినికిడి. ఈ క్లాసిక్ సినిమాను మళ్ళీ తియ్యడం అవసరమా అనేది ఒక ప్రశ్నైతే, తీస్తే ఎలా తియ్యొచ్చనేదికూడా మరో ఆసక్తికరమైన విషయం.  ఏంజరుగుతుందో చూద్ధాం!

15 Comments
 1. సుత్తి కత్తి November 8, 2008 /
 2. మురళి November 8, 2008 /
 3. john November 8, 2008 /
 4. veebee November 8, 2008 /
 5. సుత్తి కత్తి November 8, 2008 /
 6. అబ్రకదబ్ర November 8, 2008 /
 7. Sharada November 9, 2008 /
 8. శ్రీ లక్ష్మి కళ November 9, 2008 /
 9. శ్రీ లక్ష్మి కళ November 9, 2008 /
 10. bollojubaba November 9, 2008 /
 11. batchalimurali November 11, 2008 /
 12. Venkat November 20, 2008 /
 13. jaya January 2, 2009 /