Menu

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 6

31)The Candidate

డెన్మార్క్ సినిమా. చాలా బావుందీ సినిమా.

సినిమాలో హీరో ఒక లాయర్. అతని తండ్రి కూడా ఒక పేరు మోసిన లాయర్. ఏడాది క్రితం తన తండ్రి ఒక కేసులో ఓడిపోయి ఇంటికెళ్తుండగా ఒక కారు యాక్సిడెంట్లో మరణిస్తాడు. కానీ అది యాక్సిడెంట్ కాదనీ మర్డర్ అనీ అతని నమ్మకం. అది ఎలా నిరూపించాలో తెలియక అటు తన వృత్తి లోనూ ఇటు తన వ్యక్తిగత జీవితంలోనూ చాలా కష్టాలు ఎదుర్కొంటుంటాడు. ఒక సాయంత్రం తన గర్ల్ ఫ్రెండ్ తో గొడవ జరుగుతుంది. కోపంగా ఇంట్లోనుంచి బయటకు వచ్చి తన మిత్రునితో కలిసి ఒక బార్ కి వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయి పరిచయం అవుతుంది. అతనికి అంత వరకే గుర్తుంటుంది. ఆ తర్వాత ఉదయం ఒక హోటల్లో నిద్రలేచి చూసేసరికి బాత్ రూమ్ లో ఆ అమ్మాయి శవం వుంటుంది. అసలేం జరిగిందో అతనికి గుర్తుండదు. ఇది సినిమా ఎత్తుగడ. అక్కడ్నుంచి మరో గంట సేపు ఉత్కంఠంగా సాగే ఈ సినిమా edge of the seat thriller అని చెప్పొచ్చు. థ్రిల్లర్ లో ఉండాల్సిన ట్విస్ట్స్ మరియు టర్న్స్ అన్నీ ఉన్నాయి.

32)Salt of the Sea

ఇజ్రాయల్/పాలస్తీనా ల మధ్య జరుగుతున్న గొడవల నేపధ్యంలో ఈ చిత్రోత్సవంలో దాదాపు నాలుగు సినిమాలు చూశాను. అన్నీ చాలా బాగా నచ్చాయి. అన్ని సినిమాల్లోనూ సామాన్య ప్రజానీకానికి ఈ గొడవల్లో ఏ మాత్రమూ ఆసక్తి ఉన్నట్టు కనిపించకపోగా ఆయా దేశాల నేతల స్వార్థపూరిత రాజకీయాల మూలంగానే ఈ గొడవలూ యుద్ధాలూ అని ఈ సినిమాల ద్వారా చలనచిత్ర దర్శకులు ప్రపంచానికి తెలియచేయదలిచారని అనిపించింది.

సొరయా అమెరికా నుంచి పాలస్తీనా కి వస్తుంది. సొరయా కుటుంబం ఎన్నో ఏళ్ళక్రితం శరణార్థులుగా అమెరికా చేరుతారు. ఇప్పుడామె పాలస్తీనాకి రావడానికి కారణం-యాభై ఏళ్ల క్రితం తమ తాతగారు ఒక బ్యాంకులో దాచిన సొమ్ము విడిపించుకోవడం. కానీ ఆమె అనుకున్నంత సులభంగా ఆ సొమ్ము వెనక్కి రాదు. బ్యాంకు వాళ్ళు అప్పటి అకౌంట్లు ఎప్పుడో మూతబడిపోయాయని ఇప్పుడా సొమ్ము ఇవ్వడం కుదరదని చెప్తారు. సొరయా ఊరుకోదు. తన మిత్రునితో కలిసి బ్యాంకు దోపిడీ చేసి జెరుసలేం కి పారిపోతారు. అక్కడ్నుంచి ఒకప్పుడు తమ స్వంత ఊర్లయిన ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తారు.

బ్యాంకు దోపిడి సినిమా అంటే యాక్షన్ థ్రిల్లర్ అనుకుని వెళ్తే  నిరాశ ఎదురవుతుంది. పాలస్తీనాలో బ్యాంకు దోపిడి అనేది రోడ్డులో వెళ్తూ సైకిలు దొంగలించినంత సులభంగా చేయొచ్చు అనే విషయం చూపించడం ఒక ముఖ్య ఉద్దేశమైతే ఒకప్పటి పాలస్తీనా నుంచి శరణార్థులుగా తరలివెళ్ళిన ప్రజల భావాలను కూడా ఈ సినిమాలో చాలా నైపుణ్యంగా తెరకెక్కించారు.

33)Silence of Lorna

ఈ చిత్రోత్సవంలో చూసిన మరో అత్యుత్తమ సినిమా. లోర్నా అల్బేనియా దేశస్థురాలు. బెల్జియంలో ని ఒక డ్రగ్ ఎడిక్ట్ ని పెళ్ళి చేసుకుని బెల్జియం పౌరసత్వం పొందుతుంది. వారిద్దరి మధ్య పెళ్ళి కేవలం ఒక ఒప్పందం మాత్రమే. ఆమెకు బెల్జియం పౌరసత్వం రాగానే విడాకులు తీసుకోవాలన్నది ఆమె పథకం. అలా విడాకులు పొందగానే మరో రష్యన్ ని పెళ్ళి చేసుకుని అతని వద్దనుంచి వచ్చిన డబ్బుతో అల్బేనియాలోని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బెల్జియంలో ఒక హోటల్ తెరిచి హాయిగా జీవించాలని ఆమె ప్లాను. అంతా అనుకున్నట్టుగా జరిగితే కథేముంటుంది. మొదటి భర్తతో విడాకులు పొందడంలోనూ, రష్యన్ ని పెళ్ళిచేసుకోవడంలోనూ , తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డబ్బులు కూడబెట్టి హోటల్ కోసం స్థలం అద్దెకు తీసుకోవడంలోనూ లోర్నా అనుభవించిన కష్టాలు ఈ సినిమా మూల కథ.

Dardenne బ్రదర్స్ నుంచి వచ్చిన మరో మంచి సినిమా. తప్పక చూడండి.

34)Hansel and Gretel

కొరియన్ సినిమా. ఒక వ్యక్తి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని కార్లో హడావుడిగా బయల్దేరుతాడు. మార్గమధ్యంలో అనుకోకుండా కారు ఒక లోయలో పడిపోతుంది. ఆ వ్యక్తి స్పృహ తప్పుతాడు. మెలుకువ వచ్చేసరికి ఒక అమ్మాయి లాంతరు పట్టుకుని అతని వద్ద నిల్చుని వుంటుంది. అంత రాత్రి వేళ ఈ అడవి నుంచి వెళ్లడం సాధ్యం కాదనీ ఈ రాత్రికి తమ ఇంట్లో వుండమని ఆ అడవి మధ్యలో ఉన్న తమ ఇంటికి తీసుకెడ్తుంది. ఆ ఇంట్లో ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి అన్న, చెల్లెలు, తల్లీ తండ్రీ ఉంటారు. ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచీ అక్కడి వాతావరణం మరియు ఆ కుటుంబ సభ్య్లల ప్రవర్తన తేడాగా ఉండడం గమనిస్తాడు. ఆ రాత్రికి అక్కడ వుండి ఉదయాన్నే తన కారున్న ప్రదేశం వెతుక్కుంటూ బయల్దేరుతాడు. అంతా తిరిగి తిరిగి మళ్ళీ ఆ ఇంటికే వస్తాడు. ఇలా ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆ అడవిలోనుంచి బయటపడకపోగా ఆ ఇంటికే తిరిగివస్తుంటాడు. దానికి తోడు అనుకోకుండా ఆ ఇంట్లోని తల్లి దండ్రులిద్దరూ కనిపించకుండా పోవడంతో ఆ వ్యక్తి అక్కడే కొన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది.

సినిమా మొదలవడం మిస్టరీ గా మొదలయ్యి సగం సినిమా అయ్యేసరికి హారర్ సినిమా అనిపించి ఆ తర్వాత సగం ఫాంటసీ సినిమాగా ఉంటుంది. కానీ గంటన్నర లో ముగించాల్సిన సినిమా రెండు గంటల పైగా పొడిగించడంతో చాలా బోరు కొడ్తుంది.

35)24 City

Jia Zhangke దర్శకత్వంలో వచ్చిన చైనీస్ సినిమా. Jia Zhangke సినిమాలు నాకు చాలా ఇష్టం. గతంలో Still Life అనే సినిమా చూసి ఆయనకి అభిమాని అయ్యాను. Still Life లో ఒక డ్యాం నిర్మాణం కారణంగా ఒక చిన్న పట్టణంలోని ప్రజల జీవితాలు ఎలా మార్పు చెందాయో చూపించినట్టే ఈ సినిమా (24 City) లో కూడా Chengdu అనే పట్టణంలో ఉన్న ఒక భారీ ప్రభుత్వ ఫ్యాక్టరీ ని కూలదోసి ఆ స్థానంలో ఒక అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న సందర్భంగా ఆ ఫ్యాక్టరీ కార్మికుల జీవితాల్లో ఏర్పడిన పరిస్థుతులను ఈ చిత్రం ద్వారా తెరకెక్కించారు. డాక్యుమెంటరీ అయినప్పటికీ తప్పకచూడాల్సిన సినిమా.

36)Lazy Days

స్పైన్ సినిమా. కొంచెం కామెడి కొంచెం సెటైర్. నాకు మరీ అంతగా నచ్చలేదు.

37)Tahaan

ఈ సినిమా ఎందుకు ఫ్లాపయిందో?

38)Quantum of Solace

డానియెల్ క్రెగ్ బాండ్ గా నటించిన రెండో సినిమా. మొదటి సినిమా నేను చూడలేదు కాబట్టి రెండింటిలో ఏది బెస్టో నేను చెప్పలేను కానీ ఇది మాత్రం యావరేజ్ జేమ్స్ బాండ్ సినిమా.

39)A Christmas Tale

సినిమా పేరు చూస్తే ఎందుకో క్రిస్ మస్ సమయంలో చిన్నపిల్లలు ప్రధాన పాత్రలుగా నడిచే ఫ్యామిలీ డ్రామానేమో అనిపించి చివరి రోజువరకూ ఈ సినిమా చూడలేదు. ఒక క్రిటిక్ ఫ్రెండ్ చెప్పడంతో చూశాను. ఈ చలనచొత్రోత్సవంలో నేను చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఒకటి. ఫ్యామిలీ డ్రామానే కానీ ఈ మధ్య కాలంలో నేను చూసిన అత్యుత్తమ ఫ్రెంచ్ సినిమాల్లో ఒకటి ఈ సినిమా.

ఫ్రాన్స్ లో ఇద్దరు దంపతులున్న ఒక కుటుంబం.భార్యకు క్యాన్సర్. ఇంకా ఎన్నో రోజులు బతకదని తెలుస్తుంది. అందుకే రాబోయే క్రిస్ మస్ పండగ కోసం ఆ ఇంటికి తమ పిల్లలు వారి కుటుంబాల్ని ఆహ్వానిస్తారు.వారందరి మధ్య గతకాలానికి సంబంధించిన జ్ఞాపకాలు, పగలు, ప్రతీకారాలు, ప్రేమలు, స్నేహాలు ఇలా ఎన్నో మరో సారి ప్రస్తావనకోస్తాయి. చాలా కాంప్లెక్స్ ప్లాట్. తప్పక చూడాల్సిన సినిమా.

40) Slum dog Millionaire

ఈ చలనచిత్రోత్సవంలో అన్ని సినిమాలకంటే ఎక్కువ Entertainement Quotient ఉన్న సినిమా ఇదే. సినిమా మొత్తం మన ముంబాయిలో చిత్రీకరించారు. అనిల్ కపూర్, సౌరభ్ శుక్లా, ఇర్ఫాన్ ఖాన్ తో పాటు ఇంకా చాలామంది భారతీయ నటీనటులు ఈ సినిమాలో పాత్రలు పోషించారు. వికాస్ స్వరూప్ రచించిన Q and A అనే నవల అధారంగా ఈ సినిమా రూపొందించబడింది.స్లమ్ ఏరియాలో నివసించే ఒక యువకుడు Who Wants to be a millionaire? (కౌన్ బనేగా కరోడ్ పతి) లో పాల్గొని రెండు కోట్ల రూపాయలు గెల్చుకుంటాడు. కానీ చదువు రాని ఆ యువకుడు ఎలా ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పగలిగాడనేది ఈ సినిమా ముఖ్య కథ. ఒక్కో ప్రశ్నకు సమాధానంగా ఆ యువకుడు తన జీవితంలోని ఒక సంఘటన చెప్తాడు. ఆ సంఘటనల్లో ఆయా ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి. ఈ సంవత్సరం వచ్చిన సినిమాలన్నింటిలోకెల్లా వినోదాత్మకమైన సినిమా ఇది. Please don’t miss!