కోకిల (1989) : అమాయకత్వం vs discretion.

kokila-lead

Kokila
కోకిల – అర్థరాత్రి అంతర్గతంగా ఉన్న ఏ కోరిక వల్లో ఈ సినిమా చూశాను. చిన్నప్పుడు ఈ సినిమా అంటే ఇష్టంగా ఉండేదన్న విషయం ఐతే గుర్తు ఉంది కానీ, డిటైల్స్ గుర్తు లేవు – కథ విషయం తప్ప. ఈరోజు ఆ సినిమా చూశాక నా పాత అభిప్రాయం ఎంత మారిపోయిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఈ టపా.

కథ విషయానికొస్తే, కోకిల ఓ టీవీ గాయని. సిద్ధార్థ ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. తరువాత ఓ ప్రమాదంలో సిద్ధార్థ కళ్ళు పోతాయి. అతనికి ఆరోజే హత్య వల్ల మరణించిన రిషీకేశ స్వామీజీ కళ్ళని అమరుస్తారు. కానీ, అప్పట్నుంచి సిద్ధార్థ కళ్ళు తెరిచినప్పుడల్లా అతనికి ఎవరో తనని హత్య చేయడానికి ప్రయత్నించే దృశ్యం కనబడుతూ ఉంటుంది. అవి ఆ స్వామీజీ కళ్ళు కనుక, ఇతని ద్వారా హంతకుణ్ణి పట్టుకోవచ్చు అన్నది పోలీసుల ఆలోచన. కానీ, కళ్ళు తెరిచిన ప్రతిసారీ సిద్ధార్థ అలజడికి గురవడం చూసి అతన్ని కళ్ళకి గంతల్లోనే ఉండమంటారు డాక్టర్లు. మధ్యలో ప్రకృతి చికిత్సకి వెళ్ళినప్పుడు అతనికి చూపు వస్తుంది కానీ, హంతకుల్ని పట్టుకోడం కోసం సీబీఐ ఆఫీసర్ ఈశ్వర్ అతన్ని గుడ్డివాడుగానే నటించమంటాడు. ఇక కథ అంతా హంతకులని పట్టుకునే ప్రయత్నాలలో నడుస్తుంది. అసలు హంతకులెవరు? ఎందుకా హత్య చేసారు? చివరికి వారికి శిక్షపడిందా అన్నది క్లైమాక్స్ అనమాట.

ఇలా నేను చెబితే – “బానే ఉందిగా, దీనికేమొచ్చింది?” అంటారు ఎవరైనా. మరి చిన్నప్పుడు చూసిన తరువాత నాకు కూడా ఇది మాత్రమే గుర్తు ఉండే నేను కూడా సినిమా బాగుంటుంది అనే భావనలోనే ఉన్నాను ఇన్నాళ్ళూ. అరే! ఒక మోస్తరుగా ఉన్న కథని తీయడంలోనైనా కాస్త శ్రద్ధ చూపొచ్చు కదా అనిపించింది ఇప్పుడు చూసాక. నాకు అర్థమైనంతలో, ఈ కథని ఇంతకంటే మంచి సినిమాగానే తీయొచ్చు. ఏ హాలీవుడ్ వాడికో ఈ కథ చెప్పి ఉంటే, ఒక రేంజిలో తీసినా తీసి ఉండేవాడు. మన గీతా కృష్ణ గారు మాత్రం అలా కాదు. కథ ఎలా ఉన్నా కూడా దానిలో సంబంధం ఉన్నా, లేకున్నా కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఉండాలి అన్నట్లు ఉండింది ఈ కథనం. పాటలెందుకొస్తాయో, ఎందుకు పోతాయో అర్థం కాదు – చిత్రీకరణ గొప్పగా ఏమీ లేదు. వినడానికి బానే ఉన్నాయనుకోండి, ఇళయరాజా కనుక.

అసలు నరేష్ తో పాటున్న ఆ పిల్లవాడెందుకున్నాడో తెలీదు. శోభన సింగరని మొదట్లో ఓ పాట పెట్టి చెబుతారు తప్పితే, కథకి ఆ విషయం ఎందుకు అవసరం? అన్న ప్రశ్న రాదు. ఎక్కడా నరేశ్ “ఉద్యోగం” చేస్తున్నట్లు ఉండదు. “మా ఆయన ఉద్యోగం జోక్స్ చెప్పడం” అన్న శోభన డైలాగులో. వీళ్ళని ఉంచిన “రక్షణా గృహం” లో ఉన్న పని వాళ్ళకి ముగ్గురికి కలిపి మూడు డైలాగులన్నా ఉన్నట్లు లేవు – మనకి వాళ్ళ మొహాలు చూపిస్తున్నప్పుడు వెనుక అనుమానాస్పద మ్యూజిక్ ఒకటి దానికి! సినిమా మొదట్లో జరిగిన హత్యకి నాకు అసలు వాళ్ళిచ్చిన జస్టిఫికేషన్ ఇప్పటికీ నచ్చలేదు, ఇన్నేళ్ళైనా! ప్రతి రెండు దృశ్యాలకీ ఒకటి అనవసరం అన్న భావన కలుగుతూ ఉంటుంది. నాజర్ కి సాయికుమార్ అదొక తరహాలో – డబ్బింగ్ చెప్పడం..భయమేమో కానీ, నవ్వు మాత్రం పుట్టించింది. చివర్లో కోట రావడం, ఆ హెయిర్ స్టైల్ – కేవలం డెస్పరేట్ ఐపోవడం మాత్రమే! గీత పాత్ర కి శరత్ బాబు పాత్రకి మధ్య పాట ఎందుకో కూడా అర్థం కాలేదు నాకు. సర్లెండి – తెలుగు సినిమా! కానీ, ఏదో కథలో కాస్త భిన్నమైన ఆలోచన చేసేసరికి కథనంలో కూడా చేస్తారనుకున్నాను – ప్చ్!

మొత్తానికి, నాకు ఇలా ఇంతసేపు దేన్నీ తిట్టడం నచ్చదు కనుక ఆపుతున్నా. పెద్దయ్యాక చిన్నప్పుడు నచ్చినవి చూస్తే ఇలాంటి అనుభవాలు ఎదురౌతాయా! ఇదే మొదటిసారి చిన్నప్పుడు సుమారుగా నచ్చినది పెద్దయ్యాక ఇంత నిరాశపరచడం. బహుశా ఆ వయసులో నాకు కథలో సస్పెన్స్ తప్ప ఇంకేదీ అర్థమై ఉండదు. నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు చూసి ఉంటాను. అంటే, ఒకప్పుడు ఈ సినిమాని నేను ఇష్టపడ్డానా! అని ఫీలవ్వాలో…. అనవసరంగా పెద్దైపోయి ఏదో నోర్మూస్కుని వచ్చింది చూడక సెటైర్లెక్కువయ్యాయని బాధపడాలో అర్థం కావట్లేదు ఈ సినిమా చూశాక! మరొక వేస్టెడ్ కథ అని మాత్రం చెప్పగలను. ఇంతకాలం కథలకి కొరతేమో తెలుగువారికి అనుకుంటూ ఉండేదాన్ని – కథని చెప్పేవారి కొరత ఏమో అనిపిస్తోంది ఇప్పుడు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

సౌమ్య

రచయిత:

5 Comments to “కోకిల (1989) : అమాయకత్వం vs discretion.”

  • నేనీ సినిమాతో పాటు జగదేకవీరుడూ అతిలోకసుందరి వరుసగా చూసాను. అప్పుడు నాతోపాటు సినిమా చూసిన వాళ్ళందరికీ జవీ-అసో నచ్చితే నాకు మాత్రం కోకిలే నచ్చింది. చిన్నప్పుడినుంచే నేనదో టైపన్నామాట. నేనీ మధ్య ఏదో సినిమా చూస్తూ అసిస్టేంట్ డైరెక్టర్ గా గీతా కృష్ణ పేరు చూసి కోకిల గుర్తొచ్చి మళ్ళీ చూద్దామని ట్రై చేశాను. కానీ సౌమ్య గారిలాగానే నాకూ సినిమా నచ్చలేదు.

    సంకీర్తన , కోకిల చూసి గీతాకృష్ణ మీద ఆరోజుల్లో నాకు మంచి హోప్స్ ఉండేవి. కానీ కీచురాళ్ళు, సర్వర్ సుందరంగారబ్బాయి సినిమాల పరాజయంతో సినీరంగం నుంచే మాయమైపోయారు.ఇప్పుడెక్కడున్నారో?

  • కోకిల నాకు చిన్నప్పుడు బాగా నచ్చిన సినిమా. అప్పటి టెక్నాలజీకి, అప్పుడున్న మిగతా సినిమాలకి అంతకంటే బయటకొచ్చి ఒక సినిమా తీయడం కష్టమేమో. నేనైతే ఈమధ్య చూడలేదు. ఒకవేళ అభిప్రాయం మారొచ్చేమో మీరు చెప్పినట్టు. గీతా క్రిష్ణగారి చివరి సినిమా నాకు తెలిసి టైం . ప్రభుదేవా, సిమ్రాన్ నటించారు. నేను కోకిల సినిమా రిలీజ్ అయ్యిన చానాళ్ళకు చూసాను. అప్పటికి టైం సినిమా అనౌన్స్ కూడా అయిపోయింది. అందరూ చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తుంటే సరిగ్గా పబ్లిసిటీ కూడా లేని టైం గురించి నేను ఎదురు చూడడం ఒకరకమైన అనుభూతి ;) … విషయం ఏంటంటే అంతలా ఎదురు చూసి కూడా నేను ఇప్పటికీ ఆ సినిమా చూడలేదు. రాజమండ్రి లాంటి చోటే మూడోరోజునే బాక్సులు వెనక్కి వెళ్ళిపోయాయంటే ఈ సినిమా గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారనుకుంట. సంకీర్తన సినిమా ఆనంధ భైరవిని తిరగేసి తీసినట్టుంటుంది నాకు.

  • తొమ్మిదో క్లాసులో, అనుకుంటా ఈ సినిమా చూసాను. పిచ్చెక్కింది. తను చెప్పాలనుకున్నదేమిటో తనకే తెలీకపోతే సినిమాలెలా తయారవుతాయో, గీతా కృష్ణకి ఈ సినిమాతో, మరియు కీచురాళ్ళు సినిమాతో అర్థమయి ఉంటుంది. అందుకే ఇహ మానేశాడు తీయడం.

    అసలు కళ్ళకి retaining power ఉండటమేంటో ఇప్పటికీ అర్థ కాదు నాకు.

    పాటలొక్కటే ప్లస్ పాయింటు.

  • మొత్తానికీ ‘ఖో’కిల గురించి చెప్పారన్నమాట. నాకైతే అప్పుడే నచ్చలేదు. మరీ డార్క్ ఫిల్మ్.

    మనోళ్ళకి కళ్ళకి ritaining పవర్, గుండెకి rememembrance ఉండటం, అన్నీ పిచ్చి ఆలోచనలే. ఇక హాలీవుడ్ వాళ్ళైతే ఆఖరికి చీమలోచ్చినా గన్నే. కాల్చటానికి.

  • Same andi.. nenu kokila ni chinnappudu choosanu AHO Adbhutam anukuntunnanu .. EE blog choosaka review chadivaka malli inko sari aa movie choodakoodadu anukunnanu.. enduku cheppandi manchi movie ani decide aina opinion ni kasta padi movie choosi cheripivesukovadam.. :D

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories